Wednesday, March 25, 2009

19 వ అధ్యాయము

వ్యాస శిష్యాగ్రగణ్యా, సూతపౌరాణికా! కేదారేశ్వరుడు ప్రధమ పద్మ కల్పమందు కాశీకి వచ్చినట్లు, విశ్వేశ్వర అనుజ్ఞచే నందీశ్వరుడు హిమాలయ కేదారమునుండి కాశీకి తీసికొని వచ్చినట్లు తెల్పితిరి. ఎకారణమున ఇట్లు సంభవించినదని మునులు ప్రశ్నింపగా మరల సూతుడు చెప్పనారంభించిరి. పరమేశ్వరుడు అవ్యయుడయ అలాజ్ఞవస గోచరుడు. నిత్య శుద్ధ, బుద్ధ, ముక్త, శిరాశ్రయ, నిరంజన, నిర్వికల్ప, నిష్కళంకుడుగా తానొక్కడే వ్యాపించియున్న పరమాత్మ తాను సర్వవ్యాప్తముగావలెనని తలంచిలీలచే శివ శక్త్యాత్మకముగు తాని శివ శక్తులుగా విడిపోయి తాను మహాకైలాసమున అపాకృత సదాశివునిగానే యుండి శక్తిని పాంచభౌతికముగా విభజించి తాను ఈశ్వర నామముతో బ్రహ్మాండ రచన చేసి ఆనందించుటకు గాను సృష్ఠి, స్థితి, లయలు నిర్వహించుటకు తానే బ్రహ్మ, విష్ణు, రుద్రులుగా విభజించుకొని, కాల నిర్ణయముకొరకు పద్మ, వరాహాది కల్పములుగా విభజించి ఒక్కొక్క కల్పము బ్రహ్మ ఆయుః ప్రమాణమున ఒక్క రోజుగా చేసి కల్పాంతమున మహాప్రళయము సృష్టించి లయమొనర్చి మరల సృష్టి చేయుచూ ఇట్లు లీలాకేళీ విలాసము సంకల్పించినాడు.

ఒక పద్మ కల్పమున కాశీకి విచ్చేసిన విశ్వనాథుడు, మంధర పర్వత విహారమునకు వెళ్ళి మరల వచ్చినపుడు మూడులోకములలోని తీర్థ, క్షేత్ర, ప్రతిమ, దేవమూర్తి, లింగమూర్తులలోని శక్తులన్నియూ విశ్వేశ్వర సాన్నిధ్యము కోరి వారి నిజస్థానములలో వారి షోడశ కళలలోని ఒక్క కళను మాత్రము వదని 15 కళలతో కాశీకి చేరిరి. అట్లే కేదారేశ్వరుడు కూడ హిమాలయములనుండి విచ్చేసిరి.

అదే సమయమున హిమాలయములందు మాంధాతయను చక్రవర్తి, సార్వభొముడు, సూర్యవంశజుడు, తన తండ్రి మృతినొందకయే తండ్రి గర్భముచీల్చుకొని బయటకు వచ్చిన మహిమాన్విత శక్తి సంపన్నుడు తన 50 మంది కుమార్తెలను సౌభరియను యోగిపుంగవునకొసగి విరక్తుడై రాజ్యభారమును పుత్రులకు వదలి హిమాలయములకు వెళ్ళి 100 యుగములు తపస్సుచేసి కేదారేశ్వరుని లింగదర్శనము కోరగా ఈశ్వరుడు ఆకోశవాణి రూపమున "భక్త శిరోమణీ నీతపస్సుకు మెచ్చితిని. కాని శివాదపాధమొనరించిన బ్రహ్మకు ఇక్కడ లింగదర్శనమివ్వ ఇచ్ఛగింపక అదృశ్యమయితిని. బ్రహ్మకు శిక్ష ముగిసిన తర్వాత కాశీలో లింగదర్శన భాగ్యమిచ్చితిని. నేనిక్కడ లింగ దర్శనమివ్వనని ప్రతిన బూనిన కారణమున నీవు వెంటనే నా కాశీ నగరమునకు వెళ్లి తపమాచరింపుమని" చెప్పెను. దానికి మాంథాత "స్వామీ మీ దర్శనము లేని రోజు నాకు నిరర్ధకము కనుక నాకు మనోవేగము నిండు. ప్రది దినము గోగర్భ గంగాస్నానము, జ్యావాముఖి దర్శనము, హిమాలయ కేదారేశ్వర దర్శనము, జగత్తునందలి సంపూర్ణ దివ్యక్షేత్రముల దర్శనము మనో వేగమున క్షణకాలమునందు నిర్వర్తించి కాశీలో ఘోర తపమాచరింతును" అనగా స్వామి అనుగ్రహించిరి. అట్లు ప్రాతఃకాలమున సర్వదర్శనముల తర్వాత కాశీ మణికర్ణికా స్నాన, విశ్వేశ్వర అర్చనాదులు ముగించుకొని సంతుష్టలై తపోనిష్టులైరి. కొంతకాలము గడచిన పిదప వృద్ధుడైన మాంథాత నిత్యయాత్రచేయ నశక్తుడాయెను! అపుడు మరల కేదారేశ్వరుడు ఆకాశవాణిగా " భక్త శిఖామణీ! నీవు మయోభారమున శక్తి తగ్గినవాడవగుటచేత మధ్యాహ్న భజనానంతరము నన్ను దర్శింపరమ్ము. నాకు భక్తి ప్రధానము గాని, నియమపాలనగాదు" అని తెల్పగా మాంథాత ఆశ్చరమయముతో శివాజ్ఞ ఉల్లంఘించుటెట్లు యని తలంచి, నియమపాలన ముఖ్య ధర్మము గదా! కాశీలో ఆతిధ్యము ముఖ్య ధర్మమని, దాని మహాత్మ్యమును శివుడు విష్ణుమూర్తికి తెల్పిన విధమును జ్ఞప్తికి తెచ్చుకొనెను.

కొందరు చోరులు కాశీ వెలుపల గ్రామములందు చాలా ధనమపహరించి రాత్రికి రాత్రి పరుగున కాశికి చేరి కేదారవనమందుగల ఒక శివాలయమున ప్రమిదలో గల మిగిలిన నేతితో వారి పైవస్త్రము చివర చించి వత్తిజేసి దీపము వెలిగించి ఆలయములోని స్వామి సన్నిధిన వస్త్రము పరిచి దొంగిలించిన సొమ్ము భాగములు చేసి పంచుకొను సమయమున భేధాభిప్రాయమున కలహించుకొని తెల్లవారకమునుపే వారి గృహములకు చేరిరి. అందు దీపము వెలిగించిన దొంగ తెలియక చేసినప్పటికి శివాలయమున నేతిదీపారాధన ఫలితమున మరు జన్మ కళింగ దేశాధిపతిగా పుట్టెను. క్రిత జన్మ రహస్యము తెలిసికొనిన ఆరాజు తన దేశమున అన్ని శివాలయములలోను దీపమాలిక నిత్యము వెలిగింపజేసి పూజింపదొడగెను. పుత్ర పౌత్రులు సర్వభోగముల ననుభవించి యజ్ఞములు, దానములు సల్పి అంతమున కాశీవాసము జేసిముక్తి బొందెను. అని విష్ణుమూర్తికి శివుడు చెప్పిన కథము సనత్కుమారుడు వామదేవునికిని, నాథశర్మ తన భార్య అనవద్యకును వినిపింపగా, అనవద్య భర్తద్వారా కాశీలో నిత్య నియమములు, వాని మహత్మ్యము, మాంథాత ఆచరించిన విధిని, తెలుసుకొనగోరగా నాథశర్మ ఇట్లు తెల్పెను. కాశీలో నిర్వహించిన కొద్ది ధర్మమయినను మేరుపర్వతమంత పుణ్య ఫలప్రదమగును. ఇందు సందేహము వలదు. బ్రాహ్మణాది చండాలురవరకు, స్త్రీ పురుష, నపుంసకువరకు, అనులోమ విలోమజాతులు, మ్లేచ్ఛ, హూణ, యవనులకయినను తెలిసి, తెలియక కొద్ది ధర్మమాచరించినను అది అమోఘ ఫలదాయకము. శివునకు ఒక్క జలబిందువు, బిల్వపత్రము, తిలమిశ్రిత తండులములు, వారి వైభవముననుసరించి పూలు, గడ్డిపరక అయినను శివార్పణమని విడిచిన వారిక అమోఘఫల మబ్బును. దశదాన, షోడశ దానములును, గంగా తటమున మెట్లు, మఠములు, జనావాసములు కట్టించినవారు స్వర్గాది శివలోకములవరకు అన్నిభోగముల ననుభవించి క్రమశః పునరావృత్తిరహిత మోక్షమును బొందుదురు. దేవతలు, మునులు, రాజన్యులు ప్రతి దినము కాశీలో ధర్మమాచరించు సదవకాశము కొఱకు నిరీక్షింతురు. ఇక శంకరుల ఆజ్ఞవినిము. కాశీలో అన్నదానమొనరించువారి విషయమున అన్నములోని మొదటి మెతుకునకు ధర్మమును, రెండవ మెతుకునకు అర్ధమును మూడు, నాల్గు మెతుకులకు కామ మోక్షములనిత్తును. ఇక మిగిలిన అన్నమునకేమి ఇవ్వవలసియుండనని ఆలోచింతుననెను. కలియుగమున చతుర్విధ ఫల పురుషార్ధముల నొసగు స్థలము కాశీతక్క వేరొండు లేదు. కాశీలో మాంథాత నిత్య వ్రతముగ ప్రాతఃకాల కేదార పూజానంతరము నిత్యయాత్ర చేసి వచ్చి మణికర్ణికా స్నానము, విశ్వేశ్వర నిత్యయాత్ర, తర్వాత ప్రాచీన మణికర్ణికా స్నానము, భిక్షుకులకు ఆతిధ్యము నొసగి అపుడు భోజనము చేయును. నిత్య యాత్రము, మాసయాత్రము, వార్షిక యాత్రలు విధివిధానముగ జేయును. ఆకాశవాణి రూపమున భోజనము చేసి కేదారయాత్రము రమ్మని శివాజ్ఞనెట్లు ఆచరించుట ఏది కర్తవ్యము? సంశయనివారణకు కాశీలోని శివభక్తులు, వేదపండితుల వద్దకు వెళ్ళి నమస్కరించి పరిష్కారమడిగెను. వారు సంతోషించి శివాను ఆకాశవాణి రూపమున విని, నిత్యవ్రతుడైన మాంథాతను ప్రశంసించి నమస్కరించిరి.

Monday, March 23, 2009

అష్టాదశోధ్యాయము

మునులు మరల సూతుని, మహాత్మా దుర్ధరుడు ఎట్లు ఉద్ధరింపబడెను? వినిపింపుడనగా సూతుడిట్లు తెల్పెను. మేలక దుర్ధరుని విమానములో కూర్చుండ బెట్టుకొని స్వర్గమునుండి కాశీకి వచ్చెను. కాశీ విశ్వేశ్వర, కేదారేశ్వరులను పూజించుటకొరకు స్వర్గములోని నందనవనము నుండి పాజాతములు తెచ్చెను. విమానము కాశీ చేరిన వెంటనే ఆకాశమున సంచరించు శివగణములు విమానమును నిల్పివేసి మేనకతో, నీవు తీసికొనివచ్చిన ఈ దుర్ధరుడు పరమ పాతకుడు. ఇతనిని కాశీలోనికి అడుగు పెట్టనివ్వము. వానిని కాశీవెలుపలే వదని నీవు వెళ్లి స్వామిని అర్చించి రమ్మనిరి. కోటి కల్పాంతములవరకు నరకయాతన అనుభవింపపలసిన ఈపాపిని వేరుకారణమున యముడు నీ వద్దకు పంపియుండవచ్చును గాని, వీనికి కాశీ ప్రవేశార్హతలేదనిరి. అపుడు మేనక వారిని ప్రార్ధించి సర్వజ్ఞుడయిన యముడు వానిని ఉద్ధరించుటకు నావద్దకు పంపిరి గనుక మీరు వానిని కరుణించి జ్ఞాన దృష్ఠితో పరికించి వానికి తరుణోపాయము తెల్పుడనగా, శివగణము ఆమె కోరికపై జ్ఞనదృష్ఠితో దుర్ధరుని వృత్తాంతము తెలిసికొని మేనకతో అమ్మా ఈపాపి విషప్రయోగముతో చంపనుంకించిన శివానందుడను యోగిపుంగవుడు నిగ్రహానుగ్రహ సంపన్నుడై యిపుడు కాశీలో నున్నాజు. జ్ఞనదృష్ఠితో ఇతడు చేసిన దుశ్చర్య తెలిసియూ ఇతడు మహాపాపియయినను అతని మనసులో ఇతనికి శుభము కల్గవలెనని తలంచి అతడే ఇతని దహన క్రియలు సల్పినాడు. దుర్ధరుని ఇక్కడ వదలి, నీవు వెళ్ళి ఆమహాత్ముని దర్శించి విషయములను వివరించి అతని ఆదేశానుసారముగ ప్రవర్తించమని శివగణము మేనకతో చెప్పి ఆ శివానందయోగిని తెలిసికొనుట కష్టము. అతడు సాధారణముగా కన్పించు వ్యక్తిగాడు. కాశీలో తపోధనులందరు, శ్రావణ సోమవారమున, విశేషముగ పూర్ణిమతో చేరిన శ్రావణ సోమవారమునను, మూడులోకములలోని వారు శ్రీకాశీకేదారేశ్వరుని సేవించుటకు వచ్చెదరు. కార్తీక పూర్ణిమ, విశేషముగ సోమవారము కలిసినచో, ఆమాస ఆర్ద్రా నక్షత్రమునాడు, పుష్యమాస పుష్యమీ నక్షత్రమునాడు మాఘమాస మఖ నక్షత్రమునాడు, ఫాల్గుణమాస పూర్వ ఫల్గుణి నక్షత్రమునాడు, చైత్రమాస చిత్ర నక్షత్రమునాడు, వైశాఖమాస విశాఖ నక్షత్ర దినమున, జ్యేష్ఠమాస జ్యేష్ఠా నక్షత్రదినమున, ఆషాఢమాస పూర్వాషాఢ నక్షత్రము రోజున, భాద్రపద మాసమున ఉత్తరాభాద్ర నక్షత్రమునాడు, మరియు ఆశ్వీయుజ పౌర్ణమి దినములలో త్రలోకములలోని తపస్వులందరు కాశీని సేవించుటకు వత్తురు. వీరందరు విశ్వేశ్వరాది దేవతల దర్శనానంతరము కేదారేశ్వరుని సేవించుటకు తప్పక వచ్చెదరు. వారిలో నీవు శివానందుని గుర్తించి ప్రార్ధింపగలవు. నీ పుణ్య విశ్షమున ఈరోజే శ్రావణ పూర్ణిమ. విశేష సోమవారమయినది. అందరకూ కన్పించకపోయినను అతడు నీకు దర్శనమిచ్చును. ఎందుకనగా పరోపకారపరాయణులకు దర్శన మిచ్చుట అతని నైజము. అని పలుకగా మేనక దుర్ధరుని, విమానమును అక్కడవదలి మనోవేగముతో కాశీలోనికి ప్రవేశించెను. విశ్వేశ్వర దర్శన మణికర్ణికా స్నానములాచరించి శ్రీ కేదారేశ్వర మందిరముచేరి నమస్కరించి పూజించి వేయికన్నులతో శివానందయోగి దర్శనార్ధము నాల్గుమూలల పరికించుచుండెను. తూర్పు ముఘద్వారము నుండి క్రిందకు చూడగా సహస్ర కిరణ సూర్య ప్రకాశముతో ఒక యోగి ప్రాచీన మణికర్ణిక తీర్థము వద్ద కన్పించెను. అతడే శివానందుడు. విశ్వేశ్వర, మణికర్ణికల నర్చించి శివాపరాధ నివృత్త తీర్థమగు హరంపాప/ రేతోదక/ గౌరీకుండ/ ప్రాచీన మణికర్ణికకు వచ్చి స్నానమొనరించినంతెనే మేనక అతని పాదములపై వ్రాలి మహాత్మా నన్ననుగ్రహింపుడని వేడగా, శివానందులు చిరునగవుతో అప్సర సామణి శుభమేగదా యనగా, మేలక సర్వజ్ఞా! మీ కృపకు పాత్రురాలనగు నాకేమి కొదువ? ఇపుడు నేను వచ్చిన కార్యము సానుకూలమగునట్లు వరమిండనిగా, మరల శివానందులు నవ్వి, మేనకా! నీవు పరోపకార బుద్ధితో బయలుదేరినది మొదలుగా నేను జ్ఞానదృష్టితో తిలకించుచుంటిని, నీవు ఈ తీర్థ జలము, కేదారేశ్వర నిర్మాల్య బిల్వపత్రము తీసికొని వెళ్లి దుర్ధరునిపై వేసిన యడల శివగణము వానినడ్డగించక లోనికి రానిత్తురు. అపుడు నీవతనిని తీసికొని నావద్దకు రమ్మని చెప్పగా, మేనక మహాప్రసాదమని యోగిచెప్పినవిధముగా తీర్థ జలము, బిల్వపత్రములు దుర్ధరునిపై వేయగా మహాశ్చర్యముగా అతని దేహమునుండి కాకులు, గద్దలు, గుడ్లగూబలు, కొంగలు, కుక్కలు, గాడిదలు, పులులు, సింహములు, ఎద్దులు, బఱ్ఱెలు, ఏనుగులు, గుఱ్ఱములు, ఒంటెలు, తోడేళ్ళు, పిల్లులు, జింకలు, పాములు, తేళ్ళు, మల క్రిములతో సహా క్రిమికీటకాదులు మొదట బయటకు వచ్చిన తర్వాత, బ్రహ్మరాక్షస, భేతాళాది కోట్లకొలది పిశాచములు హాహాకారములు చేయుచు నల్లని కాలిన శరీరములతో పర్వతాకారములు గల్గి బయటపడినావారు రోదించుచు ఆకాశమున నిల్చిరి. ఇంకనూ మహాశ్చర్యముగ దుర్ధరుని శరీరమునుండి సూర్యకిరణములవలె మెఱుపులు బయల్వెడలి ఆకాశమునంటి మొదటినుండి అతని శరీరమునుండి బయటకు వచ్చిన అండజ, స్వేదజ, జరాయుజ, పిశాచాదులనన్నిటిని భస్మమొనర్చి మరల అతని శరీరమునకు వచ్చి అదృశ్యమయినవి. అట్లు భస్మమయిన పొగ యంతయూ ఆకాశమును కప్పివేసి ఆకాశము నీలిమయినది. ఈ అద్భుత దృశ్యముచూచి చకితురాలయిన మేనక శివగణమును ప్రార్ధించి ఆవింతను గురించి తెల్పుడనగా, వారు దుర్ధరుడు క్రితము జన్మలలో చేసిన పాపమునకు గాను అతనినుండి బయల్వెడలిన అన్నిరకముల భూత యోనులలోను నూరు, నూరు సంవత్సరములు జీవించవలసి యున్నది గనుక అవన్నియూ వాసనారూపమున ఇతని అంతఃకరణమందు నిల్చియున్నవి. నీవు అతనిపై చిలికిన తీర్థమహాత్మ్యమున, కేదారేశ్వర నిర్మాల్య బిల్వస్పర్శవలనను అవన్నియూ నిల్వలేక బయటపడి రోదించుచుండగా, మరల అవి అతనినాకర్షించకుండుటకు తీర్థమహాత్మ్యమున అతనిలో ప్రవేశించిన శక్తి కిరణములు వచ్చి వానిని భస్మమొనరించి మరల అతనిలో చేరినవని చెప్పి అంతటి మహోపకారము తలపెట్టిన మేనకను ప్రశంసించి ఇప్పుడతనిని కాశీలో ప్రవేశించుటకు అనుమతింతుము, వెంటనే తీసికొనివెళ్ళి శివానందుని పాదములపై పడవేయుమనిరి. ఇదంతయు జ్ఞానదృష్టిచే తెలిసికొనిన శివానందుడు నిన్నిట్లు ఆదేశించెను. ఇదంతయు తెలిసిన మేము నిన్నతనివద్దకు పంపితిమనిరి. మేనక వారికి నమస్కరించి దుర్ధరుని తీసికొనివెళ్ళి శివానందుని పాదములపై పడవేసెను. యోగి ప్రసన్నుడై తన పాదముల చెంతనున్న దుర్ధరుని లేవనెత్తి విధివిధానముగా ప్రాచీన మణికర్ణికా స్నానము చేయించగా మరొక వింత జరిగినది. దుర్ధరుని శరీరమునుండి ఒక స్వచ్ఛ మైన తెల్లని హంస బయటకు వచ్చి యోగికి నమస్కరించి నేను ఇతని అంతఃకరణమును. ఒకనాడు ఈతడొకపుష్పమును శివార్పణమన్న కారణమున శివ పుణ్యమను నేను శ్వేతహంస రూపమున ఇతనియందు చేరితిని. ఇతడు చేసిన మహాపాపములు నన్ను హింసించినవి. ఇపుడు మీదయవలన అన్నియూ ధ్వంసముకాగా నేను సుఘముగా మీ దర్శనమునకు బయటకు వచ్చితిని. ఇతడు చపల చిత్తుడు. మరల నేనితనిలో ప్రవేశించిన యడల మరల పాపములు చేసి నన్ను బాధించును గనుక మీ ఆజ్ఞ ప్రకారము నేను ప్రవర్తింతును. ఇతనిలో చేరుటయా లేక మిమ్ము సేవించుటయా అని ఆ హంస శివయోగిని ప్రశ్నింపగా యోగి ఆ హంసతో ఇట్లనెను. ఈతడు పూర్వజన్మమున బ్రాహ్మణుడు. ధర్మభ్రష్టుడే అత్యంత పాపి అయినాడు. సర్వభక్షకుడై అగామగామియై నీచజాతి స్త్రీలోలుడై దశార్ణదేశమున మ్లేచ్ఛుల సహవాసమున మ్లేచ్ఛ స్త్రీలంపటుడై ఒకనాటి రాత్రి గ్రామము వెలుపల ఒక వనములో శిధిలమైన ఒక సోమేశ్వర దేవాలయమున ఆ స్త్రీ సంగమము కొరకు తీసికొని వెళ్లి, తన వస్త్రముతో గర్భాలయమును శుభ్రముచేసి ఆ వస్త్రమును వెలుపలకు విసిరివేసి, ఆ స్త్రీకొరకు తెచ్చిన మాలలు, తాంబూలము ఆ చీకటిలో తడుముకొనుచి ఎదో రాతి దిమ్మయని తలచిన శివలింగము పైనుంచి, ఆ స్త్రీని చేయిపట్టుకొని లోనికి తీసికొనివచ్చి అనుభవించు సమయమున ఆ మాలలు, వగైరా తీసి ఆ స్త్రీకి సమర్పించెను. తెలియక చేసిననూ ఆ పుష్పమాలలు, విడియము, శివార్పితమయిన పుణ్యమున ఇతడు కాంచీ క్షేత్రమున ఒక వెశ్య పుత్రుడుగా జన్మించెను. ఇతని తల్లి వేశ్యయై వర్ణ సంకరమయిన కారణమున, అట్టి గర్భజనితుడు ఇతని బుద్ధి భ్రష్టమయినది. పరమ పాపి అయినను, మాలలు విడియము క్రితజన్మ యందు శివుని కర్పించిన కారణమున, తన చేతినుండి జారిపడిన పుష్పమును తనకు తెలియకనే శివార్పణమను పదము తన నోటిద్వారా ఉచ్ఛరించిన కారణమున శివాజ్ఞచే శివపుణ్యమము నీవు హంసరూపమున ఇతనిలో ప్రవేశించితిని. నీమహిమయే యమధర్మరాజు చే మరల ఆలోచింపజేసి, తెలియక చేసిననూ ఆ ఒక్క పుణ్య ఫలము ఇతనిని స్వర్గమందు మేనకవద్దకు పంపినది. ఆమెకు ఇతనిని ఉద్ధరించి ఉద్దేశ్యము కల్గినది. కాశీ ప్రాచీన మణికర్ణిక జలము, కేదారేశుని నిర్మాల్య పుష్పములు తాకినంతనే అతనిలోని పాప సముచ్ఛయమంతయూ నిర్గమించి భస్మమయినదు. ఇతని కింకనూ మంచి జరుగనున్నదని శివయోగి వచించెను. అపుడు శివపుణ్యమను హంస మరల దుర్ధరుని అంతరాత్మను చేరినది. ఈ సంవాదమంతయు మేనకకు అవగతమయినది. కాని దుర్ధరునికి తెలియదు. శివానందులు మేలక, దుర్ధరులను కేదారేశ్వరుని వద్దకు తీసికొని వెళ్లి, నందన వనము నుండి మేనక చే తేబడిన పుష్పములచే కేదారేశ్వరుని వారిద్దరిచే పూజింపజేసెను. ప్రదక్షిణ నమస్కారముల తర్వాత కేదారేశ్వరుని స్తుతింపగా పరమేశ్వరుడు వృషభ వాహనుడై పార్వీ సమేతుడై, వినాయక, షణ్ముఖ, శివగణ సమేతుడై శివానందులకు దర్శనమిచ్చి, నాకు అత్యంత ప్రీతిపాత్రుడవగు నీ కృపకు పాత్రుడైన ఈ దుర్ధరుడు ప్రతిష్ఠానపురమున రాజ కుమారుడుగా జన్మించును. అక్కడ రాజు తపమాచరించి నన్ను కుమారునిగా పొందగోలెను. అతనికి నా అనుగ్రహమున ఈ దుర్ధరుడు కుమారుడు కాగలడు. శివభక్తి పరాయణుడై కాశీకి వచ్చి విశ్వేశ్వర, మణికర్ణిక, కేదారేశ్వరాదుల నర్చించి అధిక సంపన్నుడైనందున బ్రాహ్మణులను సత్కరించి, తపో యోగమార్గముల నవలంబించి సార్వభౌముడై, నా అనుజ్ఞచే బ్రహ్మద్వారా వరములు పొంది ఈ కాశీ పట్టణమునకు దివోదాసను పేర రాజగును. దేవతలను మించిన శక్తి సంపన్నుడై తపోబలముచే పంచ భూతములను తిరస్కరించి తానే వారి కృత్యములు చేయుచు, నా మాయామొహమున కాశీలోని దేవతలనందరనూ నాతో సహా కాశీనుండి బయటకు పంపివేసి, తుదకు విరక్తుడై మాయ వదలగనే నా పదము పొందును. కనుక ఇతనిని మేనకతో స్వర్గమునకు పంపి తృప్తి తీరునంతవరకు స్వర్గసౌఖ్యమనుభవించి తదుపరి భూలోకమున ప్రతిష్ఠానపుర రాజకుమారునిగా జన్మింప నిమ్మని పరమేశ్వరుడు శివయోగికి చెప్పి అంతర్ధానమయ్యెను. శివానందులు ఆనందపారవశ్యమున శివుని స్తుతించి మేనకా దుర్ధరులను స్వర్గమునకు పంపెను. దేవతలెట్లు సద్యఃఫల సిద్ధి బొందుదురో అట్లే మనుష్య దేహధారులును శివభక్తి పరాయణులగుచో సర్వసౌఖ్యమున ననుభవించి తుదకు ముక్తి బొందుదురు. అట్లు శివానందుని అనుగ్రహ పాత్రుడయిన పరమపాపియు దురాత్ముడగు దుర్ధరుడే దివోదాసుగా కాశీని పరిపాలించి దేవతలనేధిక్కరించి, చివరకు పరమాత్మనే మందరాచలమునకు పంపివేయగల సమర్ధుడాయెను. తన భక్తుల కీర్తి ప్రబలుటకై శంకరుడునూ లీలా విలాసము చేయుచుండును. ముల్లోకములయందు కాశీ క్షేత్రము, విశ్వేశ్వర, మణికర్ణికాది సేవనము ప్రబల పాపహరములు. శివాపరాధమను ఘోరపాపము మాత్రము ప్రాచీన మణికర్ణికా స్నానము, కేదారేశ్వర సేవనమున మాత్రమే విముక్తమగును.

ఇట్టి కాశీమూల రహస్యమగునది శివాజ్ఞచే నాకు స్ఫురించి మీకు తెల్పితినని సూతుడు వచించెను. కాశీలో అడుగడుగుననూ గల తీర్థములు, లింగముల మహిమ ఆ శివునికే తెలియును గాని అన్యులెరుగరు. కేదారేశ్వర, ప్రాచీన మణికర్ణికల మహిమ తెలియుట దుర్లభము. దేశాంతరమందు, కాశీ తక్క మరెక్కడ నయిననూ చేసిన పాపములకు సూర్యపుత్రుడు యముడు దండనాయకుడు. కాని కాశీలో అతనికి స్థానము లేనందున కాశీలో పాపులను శిక్షించునది కాలభైరవుడు. కాశీలో శివాపరాధులకు నిష్కృతి లేనేలేదు. కాశీలో మరణించువారు ముక్తులగుదురు. కాశీలో కొద్ది ధర్మమయిననూ అమోఘ ఫలమొసంగును. ఒక్క పర్యాయమైనను కాశీ దర్శించి వెళ్ళి వేరెక్కడ మృతిచెందినను వారికి మరుజన్మగాని తదుపరి జన్మగాని కాశీలో తథ్యము. కాశీ మృతి వెంటనే జన్మరాహిత్యకారకము. కృత, త్రేతా, ద్వాపరయుగముల కంటె కలియుగమున కలిదోషముచే జీవులు శివాపరాధులగుదురు. అట్టివారికి తరుణోపాయము కాశీలో ప్రాచీన మణికర్ణిక, కేదారనాథ సేవనము తక్క వెరొండులేదు. ప్రేమపాత్రులగు సతి, గౌరి, రావణాసులులకే మోహవసమున శివాపరాధ దోషము ప్రాప్తించి వారికిని కాశీ ప్రాచీన గంగ, కేదారసేవనముల వలననే తద్దోష నివారణ జరిగినదన సాధారణ జీవుల గతి చెప్పవలెనా! యని సూతముని చెప్పగా శౌనకాదులు సంతసించిరి.

సప్తదశోధ్యాయము

మునులు సూతునితో, మహాత్మా! మీరు శివరహస్యకోవిదులు. లేశమాత్ర శివ నామస్మరణ మహాపాపియగు దుర్ధరునికి స్వర్గప్రాప్తి కల్గించినది. శివజ్ఞానికి అతనిపై గల్గిన కృపాలేశము యమధర్మరాజుకు అతనిపై దయ గల్గునట్లు చేసినది గనుక జీవతమున శివభక్తి రహస్యమును గురించి వినని జన్మ వ్యర్థము. దయచేసి మేనక అతని నెట్లు ఉద్ధరించినది తెల్పుడని కోరిరి. సూతుడిట్లు వచించిరి.

దేవకన్య మేనక దుర్ధనునెట్లు ఉద్ధరించుటాయని ఆలోచించి అతనినోదార్చి తను కైలాసమందు పరాశక్తి దర్శనము చేసికొనివచ్చువరకు అతనినక్కడే ఉండమని చెప్పి వెళ్ళెను. కైలాసమందు శివభక్తులు దేవిసేవకై దుర్వాస, గౌతమ, కణ్య, దధీచి, అంగిరస, భృగు, నారద, ఉపమన్యులు బ్రహ్మవాద శ్రేష్ఠులు ఎనమండుగురు మొదట శైలాదు గణేశ, కార్తికేయులను సేవించి తదుపరి పరమేశ్వరుని అర్చించి పరాశక్తిని పూజించుటకై అమ్మవారి వద్ద చేరిరి. అమ్మవారిని అనేక విధముల స్తుతించి తల్లి ఆజ్ఞమేరకు అక్కడ వేచియున్న సమయమున మేనక అక్కడకు చేరి వారందరకు నమస్కరించి అమ్మవారిని ఆనందపరచుటకై నాట్యము చేయనారంభించెను. పరాశక్తి చాలాకాలము నాట్యము చూచి ఆనందించి శివభక్తులనుద్దేశించి బ్రాహ్మణోత్తములారా ఎక్కడనుండి వచ్చినారు? ప్రపంచమున మీరు చూచిన గొప్ప ఆశ్చర్యకరమైన వింతలేమని ప్రశ్నించిరి. దానికి ముందుగా నారదమహర్షి తల్లీ! శివపార్వతులకు అపరాధము చేసినవారికైనను మంచి జరుగవచ్చును కాని మీభక్తులకపరాధము జేసినవారు నిశ్చయముగ శిక్షార్హులు. రావణాసురుడు బ్రహ్మవరములు పొందిన గర్వముచే కైలాసమునెత్తుటకు ప్రయత్నించి మీకపరాధముసల్పెను. అట్టిపాపోపశమనమునకు మిమ్ములను స్తుతించి తనగానముచే మిమ్ము మెప్పించి మీవద్ద రహస్య ఉపదేశము పొంది కాశీ వెళ్ళి గౌరీకుండస్నానము, కేదారేశ్వర దర్శన అర్చనలతో పాపనివృత్తి పొందెను. ఆ శాపమును మీరునూ తొలగించలేని కారణమున మీకత్యంతభక్తుడయిననూ కులముతో సహానాశము పొందెను.

మీభక్తసిఱోమణి ఈ దూర్వాసుడు మీచే ప్రసాదింపబడిన మాలను ఇంద్రునకు ఇవ్వగా అతడు దానిని భక్తితో స్వీకరింపక గర్వముతో ఐరావతము తలపై వేసెను. ఆ ఏనుగు మదముతో దానిని వేలపై విసిరి తొక్కివేసెను. ఇంద్రుడీ సంయమీంద్రుని వాక్కుతోనైననూ స్తుతింపక శాపగ్రస్తుడై రాజ్యభ్రష్ఠుడై, దుఃఖితుడై, రాక్షస భయముచే మందర పర్వత గుహలో తలదాచుకొని కడకు మునీంద్రుని శరణుజొచ్చి, ఇతడు దచతలచి ఉపదేశము చేయగా కాశీవెళ్ళి గౌరీకుండ క్నానము, కేదారేశ్వరుని అర్చనతో మీభక్తులకొనర్చిన అపరాధమునుండి ముక్తుడాయెను. మహాయోగిపుంగవుడు గౌతముడు మీభక్తాగ్రగణ్యుడు. ఇతనికి అపరాధము చేసి ఇంద్రుడు సహస్రయోనిజుడై నపుంసకుడాయెను గదా! దేవతల ఎగతాఱికి గురై బుధ్ధిగల్గి ఇతని ఏకాంతమున శరణుజొచ్చి క్షమింపవేడగా గౌతముడు కరుణించి కాశీలో గౌరీకుండ స్నానము, కేదారేశ్వర అర్చనము వలన మరల పుంసత్వము గల్గునని శుభము గల్గునని ఉపదేశింపగా అతడట్లేచేసి మరల అసురులను గెల్చి స్వర్గాధిపత్యము పొందెను. బాణుడు మీభక్తుడయినను కణ్వమహామునిని అనాదరించి సర్వమును కోల్పోయెను. యదువంశజులు కృష్ణుని ద్వేషించి యుద్ధమునకు వెళ్ళబోవగా వారికి కృష్ణుడు పాశుపతుడని తెలియజెప్పి అతని మనుమని వదలివేయమని బోధించితిరి. భక్తుని ద్వేషించువారిని శంకరుడునూ రక్షింపడు. కణ్వుడు ఏకాంతమున బాణునకు మంచి బోధించిననూ వినక మదగర్వముతో గురుధిక్కారము జేసి ఎదిరించి తనసహస్రబాహువులను గోల్పోయి రెండు భుజములవాడాయెను. అపుడు శుక్రాచార్యుడు బుద్ధిచెప్పి కణ్వమహర్షి శరణుజొచ్చి శివభక్తులకు అపరాధమొనరించి ఈ అనర్ధము తెచ్చికొంటినని చెప్పి ప్రార్ధించమని హితవుపలుకగా యుద్ధ భూమియందున్న బాణుడు మానసికముగ కణ్వమహర్షిని ప్రార్ధించెను. మహర్షి దానిని స్వీకరించి ప్రసన్నుడై అతనిని కాపాడమని శంకరుని వేడెను. తనభక్తుని అనాదరణకు కోపించిన శంకరుడు మహర్షి ప్రార్ధనకు శాంతించి వానినట్లు రెండు భుజములతో వదలి కాశీకి వెళ్ళి కేదారేశ్వరుని ఎదుట గౌరీకుండమున స్నానమాడి కేదారేశ్వరుని అర్చించి పాపవిముక్తుడవైనన్ను చేరగలవని కరుణించెను. బాణుడట్లేచేసి తనపేర శివలింగ స్థాపన జేసి శివపదము జేరి గణములలో ముఖ్యుడాయెను.

ఇంకనూ ఈ ఉపమన్యుమహాత్ముని చంద్రుడు పరిహసించి క్షీణబలుడయ్యెను. శివప్రసాద బలమున ఇతడు క్షీరసాగర మానము జేయబోగా చంద్రుడు నవ్వి పరిహాసముగా, ఎంతత్రాగగలవు?బ్రాహ్మణుని ఆశకు హద్దులేదు. సముద్రమెంత! నీవెంత! సముద్రమును పానము జేయగలవా? శివునికి కూడ బుద్ధి చాంచల్యము చేనీకు సముద్రునిచ్చెను. అని హేళనచేయగా ఉపమన్యు కోపించి మూఢుడా, శివభక్తుల ప్రతాపను నీవెరుంగవు. శివ భక్తాగ్రగణ్యుడు, యోగిపుంగవుడు, ఘటమున అంగుష్ఠమాత్రమూగా ఉద్భవించిన అగస్త్యమహర్షి ఈ సముద్రమును జలబిందువుగా కరమున గ్రహించి ఆచమనము చేసెను, మరల అల్పాచమనముగా విడిచినందున సముద్రము అపవిత్రమైనది. మహోన్నతుడయిన వింధ్యపర్వతమేమైనది? ఉత్వలుడు, వాతాపి ఎమైరి? ఒక్క వాక్కుతో మరణించిరి. నీవు అత్రిపుత్రుడవై, శివుని తలనెక్కి, క్షీరసాగరమున ఉద్భవించి, మూడులోకములను ఆనందపరచుచు నక్షత్రరాజువైననూ, గురుతల్పదోషమునకు శివుడు కోపించి నిన్ను సమాప్తిగావించతలంచెనుగాని మీమాత అనసూయ పార్వతికి ఇష్టురాలైనందున తల్లి కోరికపై శంకరుడు నిన్ను వదిలివేయగా ఆతల్లి నిన్ను రక్షించుకొనెను. గనుక బ్రాహ్మణుని అవమానించిన ఫలితము నీవిప్పుడే అనుభవింతువని పల్కి ఉపమన్యు వెళ్ళిపోయెను. అదేసమయమున గణపతి తన ఎలుగ వాహమనుపై మేరుపర్వతమున తోటి బాలురతో విహారమునకు వెళ్ళగా చంద్రుడతనిని చూచి పరిహసించెను. ఎలుక వాహనము పర్వతము అంచున పరుగెత్తుచూ జీరి పడిపోగా గణేశుడు నేలపై పడుటచూచి చంద్రుటు వికట్టహాసము జేసెను. గణపతి దానిని సహింపలేక కోపించి మనోదృష్ఠిచే భస్మము చేయనెంచి చంద్రుని చూచి మూఢా! ఈనాటినుండి నీప్రకాశము క్షీణించి దేవతలు నిన్ను మింగివేయుదురు. నిన్ను చూచిన త్రిలోకవాసులు అవమానములు పొందెదరు. అని లోకపాలకులను చంద్రుని కళలను మ్రింగివేయుడని ఆజ్ఞాపించెను. వెంటనే మొదట అగ్ని, తరువాత సూర్యుడు, విశ్వేదేవుడు, సముద్రుడు, వషట్కారుడు, ఇంద్రుడు, దేవర్షులు, అజైకపాదుడు, యముడు, పవనుడు, శక్తి, పితరులు, కుబేరుడు, శివుడు, బ్రహ్మ ఇట్లు 15 కళలు 15మంది లాగవేయగా గణపతి చంద్రుని 16వ కళను విష్ణుమూర్తికిచ్చెను. కాని విష్ణుమూర్తి దానిని హరింపక, దయతో గణపతిని మహానుభావా త్రైలోక్యవాసులు చంద్రుడు లేక జీవింపలేరు. ఒక్క కళతోనైనను ఇతనిని బ్రతకనిండు. అపరాధులకు మీరేదిక్కు అని వేడగా గణపతి, ఈతడు శివభక్తులనవమానించినాడు. నాభక్తుల అవమానము నా అవమానముకన్న గొప్పది. కనుక నాభక్తుడే అతనికి దిక్కు లేనిచో ఇతని గతికి ఇతనిని వదిలివేయవలసినదే. అనగా చంద్రుడు భయముచే కంపించి విష్ణువును ప్రార్ధించి సముద్ర గర్భమున యున్న ఉపమన్యు చరణములపై వ్రాలి రక్షింపప్రార్ధించెను. అపుడు ఉపమన్యు శాంతించి నవ్వుచు, నీకు శుభమగుగాక! నీవు గణేశుని కూడ అవమానించినందున వెంటనే వెళ్ళి ఆయన శరణు వేడమని పంపెను. చంద్రుడు విష్ణుమూర్తి సహాయమున గణేశుని శరణుజొచ్చి బ్రతికింపగోరెను. అపుడు గణపతి కరుణించి, అల్పుడా! నా అవమానము, మా మాతా పితరుల అవమానము కంటె మాభక్తుల అవమానము సహింపరానిది. నీవు వెంటనే కాశీకి వెళ్ళి అక్కడ కేదారేశ్వరుని ఎదురుగానున్న గౌరీకుండమున స్నానముజేసి కేదారేశ్వరుని పూజించి నీపేర లింగప్రతిష్ఠచేసి నిత్యము పూజించుచున్నయడల క్షీణించిన ఒక్కొక్కకళను క్రమ క్రమముగ మరల పొందగలవు. ఇట్లు 15గురు దేవతలచే భక్షింపబడుచు మరల పొందుచు జీవింతువు. మాభక్తులను అవమానించినందులకు నీకీశాస్తి తప్పదని చంద్రుని విష్ణుమూర్తితో సహా కాశీకి పంపెను. చంద్రుడు గణేశుని ఆజ్ఞనిర్వర్తించి జీవించుచుండెను.

నారదుడికనూ, తల్లీ! నీకు తెలియనిదేమి, నీ పూర్వజన్మ జనకుడు దక్షప్రజాపతి, శ్వభక్తుడయినను సభలో దధీచి నవమీనించి ఎగతి పొందెను! అతనిని నిందించిన కారణమున యజ్ఞము ఒక్క క్షణములో భంగమై అతనికి సహాయము జేయబోయిన సూర్యుడు పండ్లువిరిగిన వాడాయెను. దక్షునకు మేకతల ప్రాప్తించి అట్లే శివాజ్ఞపై కాశీకి వెళ్లి గౌరీకుండ స్నానము, కేదారేశ్వర అర్చన, తనపేర శివలింగస్థాపన పూజల వలన, మేకతలతో తిరిగి వచ్చి "చమక" మన్నపర శివస్తుతి జేసి మరల తనపదవిని పొందెను.

ఇక ఈ భృగుమహర్షి మీ భక్తాగ్రగణ్యుడు. పుణ్యాత్ముడు. విష్ణుమూర్తి మొదట ఇతని భార్యను చంపి పాపమాచరించెను. అట్టి అపరాధమునకు విష్ణుమూర్తి జన్మలనెత్తవలసి వచ్చినది. కాని మీకృపవలన దశావతారములతో పాప పరిహారమైనది. మరల జన్మలేకుండ వరము పొందినను భృగు భార్యా వియోగ దోషమున విష్ణువు రామావతారమున భార్యా వియోగమనుభవింపవలసి వచ్చినది. తదుపరి శివాజ్ఞపై కాశీలో గౌరీకుండస్నానము, కేదారేశ్వర పూజలు, అభిషేకముజేసి, తనపేర లింగప్రతిష్ఠజేసి నివృత్తి పొందెను.

ఇక అంగీరసముని విషయమున, పూర్వము నహుషుడను రాజేంద్రుడు విధివిధానముగ యజ్ఞముచేసి ప్రజారంజకముగ పాలన జేసెను. యజ్ఞమందు ఏనుగు తొంజమంత వశోధారతో 12 వర్షములు అగ్నిదేవుని తృప్తి పరచగా అగ్నికి అజీర్ణరోగము వచ్చెను. సర్వభక్షకుడగు అగ్నియే అజీర్ణరోగవిముక్తికి బ్రహ్మను ప్రార్ధించెను. బ్రహ్మ ఆలోచించి నహుషుని దివ్య యజ్ఞమునకు చకితుడై అగ్నిదేవుని ఆజీర్తి శాంతింపజేయుటకై, పృధ్విపైగల ఇంద్రుని ఖాండవవనమందు అజీర్తి ఉపశాంతికి తగిన ఓషధులు గలవు దానిని భక్షింపుమనిచెప్పి, దానిని చేరుట కష్టమయిననూ ప్రయత్నింపుమనెను. అగ్ని వెంటనే వెళ్ళి దహింపబూనగా ఇంద్రుడు మేఘముల నాదేశించి అగ్నిని ఆర్పివేసెను. ఎన్నిమార్లు ప్రయత్నించిననూ మేఘములతో గెలువలేక అగ్ని మరల బ్రహ్మవద్దకు వెళ్లి మొరపెట్టుకొనెను. బ్రహ్మ మరొక ఉపాయమాలోచించి విష్ణుమూర్తి అంశతో నరనారాయణులు కృష్ణార్జులులుగా పృధ్విపై అవతరించియున్నారు. వారిని శరణుజొచ్చి ప్రార్ధించి ఖాండవ దహనమునకు నీకు సహాయము చేయమని కోరుమని సలహా యిచ్చిరి. అగ్ని అట్లేచేసి తన అజీర్తి ఉపశమింపజేసికొనెను. అంతటి ప్రతిభావంతుడు నహుషుడొకమారు స్వర్గమునకు వెళ్ళగా ఇంద్రుడతనిని పూజించి , తనకు సమానముగా ఆసనమిచ్చి గౌరవించెను.

ఒకమారు ఇంద్రుడు వృతాసురుని చంపి భయముతో అదృశ్యుడైన సమయమున దేవతలు ఇంద్ర సభలో సింహాసనము ఖాళీగా యుండకూడదని ఇంద్రుడు వచ్చువరకు నహుషుని ఇంద్ర సింహాసనమున అభిషేకించిరి. నహుషుడు మదగర్వితుడై శచీదేవిపై మనసుపడి, భర్తజాడ తెలియక దుఃఖించుచున్న శచీదేవిని బలాత్కరించెను. అపుడు బృహస్పతి నహుషునితో, సచీదేవి పతివ్రత, తత్కాల సింహాసనాధిష్టత గర్వముతో శచీదేవినాసింపరాదని హితవు పలికి తన తండ్రిని అంగీరసునితో కూడ నహుషుని హెచ్చరింపమని పంపెను. నహుషుడు ఈ మహా యోగిపుంగవుని మాట నిరాదరించిన కారణమున ఇతడు కోపించి అధోగతి పాలగుదువని శపించి తన ఆశ్రమమునకు వెళ్ళెను. నహుషుడు కొండచిలువగా భూమిపై పడెను. 10 వేల సంవత్సరములు సర్పముగా పడియుండి, హిమాలయ బిలములలో తపమాచరించు భక్తులను భక్షించి ఆకలి తీర్చుకొనుచుండెను. ఒకపరి పాంజు కుమారుడు భీముని మ్రింగివేయగా ధర్మరాజు తెలిసికొని అక్కడకు వచ్చి హేపాపీ! నా చిన్న తమ్ముడు భీముని మ్రింగితివి. నేను ధర్మరాజును. పాపఫలముగా పాము జన్మనెత్తియూ శివభక్తుల జంపుట నీ పూర్వజన్మపు శివభక్తులయడలి అపరాధమై యుండును. ఇపుడు నీవు మ్రింగిన నా తమ్ముడు భీముని వెడల గ్రక్కిన యడల నీకు మంచి జరుగును. శంభుని కృపవలన నీ కష్టములు తీరునని ధర్మరాజు చెప్పగా, అతని నోటినుండి శంభుని పదము చెవిని పడిన వెంటనే, ఆ అజగరమునకు పూర్వ స్మృతి గల్గి, భీముని వెడల గ్రక్కి యుధిష్టిరునితో, కుమారా! నేను మీవంశమునందు ప్రధముడను, నహుష చక్రవర్తిగా కీర్తింపబడినవానిని. అకారణముగా అగస్త్య, అంగీరసులతో ద్వేషము పెంచుకొని, ఆ శివభక్తులను అవమానించి ఈగతి తెచ్చుకొంటిని. వారిని ప్రార్ధించి ప్రసన్నులను జేసి నన్ను ఉద్ధరింపుమని బ్రతిమాలెను.

అపుడు ధర్మరాజు అంగీరసుని ఆదరపూర్వకముగ ప్రార్ధించి, అగస్త్యుని పూజించి నహుషుని అపరాధము మన్నింపుమని వేడగా, వారు ధర్మరాజుకు ఉపదేశము జేసి కాశీలో హరంపాప తీర్థస్నానము, కేదారేశ్వరుని అర్చనలవలన వాంఛితార్ధము సిద్ధించి నహుషుని పేర, ధర్మరాజుపేర లింగప్రతిష్ఠలు చేయుమని ఆదేశించిరి. ధర్మరాజట్లేచేసి నహుషుని ఉద్ధరించి తాను ముక్తుడాయెను. ఇట్లు శూర, పద్మ, కారణ్యాది దేత్యులెందరో బ్రాహ్మణ ద్రోహము జేసి గౌరీకుండ, ప్రాచీన గుప్త తీర్థ స్నానము, కేదారేశ్వర అర్చనల వలన ముక్తులైరి. విశ్వేశ్వర, మణికర్ణికల వలన కూడ అలవికాని పాపహరము, శివాపరాధ దోషనివృత్తి, హరంపాప తీర్థస్నాన, శ్రీకేదారేశ్వరుల అర్చనలవలన మాత్రమే నివృత్తి యగునని తెల్పి, తల్లీ శివుని కర్త, అకర్త, అన్యధాకర్త లీలలు నీ నిగ్రహానుగ్రహ ప్రసాదముల వలన జరుగని దేమున్నది. నేను చెప్పతరమా యని నారదుడు, తక్కిన బ్రాహ్మణులతో చేరి తలయొక్కి నమస్కరించి తల్లి అనుజ్ఞపై వారి స్థానములకు జేరిరి. కాశీక్షేత్ర తీర్థములు, విశ్వేశ్వర కేదారలింగములు దుస్తర దోషనివారకములు. శివభక్తులకు ముక్తిదాయకములు. ఆ సమయమున అక్కడ దేవి సన్నిధిలో నారదునిచే అమ్మవారికి వినిపింపబడిన ఈ వృత్తాంతమంతయు విని మేనక స్వర్గము చేరి దుర్ధరునితో అనునయముగా చింతించవలదనియూ, పాపపరిహారమున్నదనియూ తెల్పిన ఈశివ భక్తాగ్రగణ్యుల విశేష వైచిత్ర్యములను వినినవారు శివలోకము చేరుట తధ్యము. మేనక దుర్ధరునకు తాను దేవ బ్రాహ్మణులతో కూడి పరాంబిక వద్ద వినిన శివభక్తాగ్రగణ్యుల ప్రభావము, శివాపరాధుల పాప పరిహార మార్గములను వివరించి అతనికి ధైర్యము చెప్పి అతనినుద్ధరింప తలంచెను.