Saturday, May 16, 2009

శ్రీ కాశీ కేదారనాథ స్తుతిః

బ్రహ్మ వైవర్త పురాణాంతర్గత శ్రీ కాశీ కేదారనాథ స్తుతిః

శ్లో అన్నానాంపతయే దిశాంచపతయే
మాదృక్పశూనాం పునః
స్తేనానాం పతయే సమస్త జగతాం
క్షేత్రాషధీనాంసతామ్
వృక్షాణాం పతయే శివాయ సుధియాం
దృక్తస్కరాణాం తథా
పుష్ఠానాంపతయే దినాధిపతయే
సర్వాత్మనేతేనమః

శ్లో అస్మానుద్ధరదేవదేవ భవతఃపాదం
శరణ్యాంనతాన్
భక్తాభీష్టదమప్రమేయభగవద్ధామ
ప్రదంచాంతతః
నైవాన్యం వరయామతేపదయుగాత్
కేదారనాథప్రభో
మోక్షైకప్రథిత ప్రభావవిభవా
కేదారభూస్తేప్రభో

శ్లో శివతత్వం నజానామి కీదృశోऽశిమహేశ్వర
యాదృశో ऽశిమహాదేవతాదృశాయ నమోऽస్తుతే


శ్రీ కాశీకేదారమహాత్మ్య అంతర్గత కేదారనాథ స్తుతిః



శ్లో శ్రీమత్పరస్మైః నీజచిత్ఘనాయ
గౌరీతపఃపూర్ణఫలప్రదాయ
కేదారనాథాయ నమశ్శివాయ
నమోనమః కారణకారణాయ

శ్లో కాశ్యాంకృతాఘాఖిలవారణాయ
కారుణ్యసంపూర్ణదృశేవరాయ
ప్రాచీన తీర్థోత్తమ తీరగాయ
నమోనమః కారణకారణాయ

శ్లో గంగా, దివోదాస, సునైగమేయ
మహాఘకృద్బాష్కల తారణాయ
శివాపరోధార్త వృపోద్ధరాయ
నమోనమః కారణకారణాయ

శ్లో మయిప్రసన్నాయచవామదేవ
మునౌప్రసన్నాయ నృపేపితద్వత్
రహస్యదాత్రే త్వముక్త పూర్వా
నమోనమః కారణకారణాయ

శ్లో నమో నమస్తే భజతాం ప్రసన్నం
నమోనమః కాశిజనాఘహంత్రే
హితోపదేష్ట్రే మమధీప్రదాత్రే
నమోనమః కారణకారణాయ


శ్రీ కాశీ కేదారమహాత్మ్యాంతర్గత ప్రాచీన మణికర్ణికా, గుప్తతీర్థ, గౌరీకుండ స్తుతిః

శ్లో ఆద్యాయా మణికర్ణికా విజయతే కేదారనాథాగ్రతః
సానః పాప మనాదిమూల మఖిలం నిర్నాశయత్వద్యవై
భూపేసోమవతీశపాప కలుషే శ్రీవామదేవేమయి
ప్రీతా పూర్ణ కటాక్షపాత్రపదవీమస్మాన్ తదాత్వాదరాత్

శ్లో శ్రీ గౌరీ శ్రుతి భూషణ ప్రవిల సత్తాటంకముక్తామణేః
సంపాతా దపలబ్ధవైభవతయా శంభోరతీవప్రియా
యా స్మానుద్ధరదప్రమేయకలుషాధారాన్ జడాన్ సా సదా
ప్రాచీనమణికర్ణికా భవతునః పాపౌఘవిధ్వంసినీ

శ్లో యా సా పార్షద నైగమేయ గణపే శంభోః ప్రసాదం కరీ
యాపాపాధమబాషలదివజ మపిస్థానం పరం ప్రాపితా
యా భూలోక కతాపరాధ జనతాం సాంబా సముత్తారిణీ
ప్రాచీనామణికర్ణికా భవతునః పాపౌఘవిధ్వంసినీ

శ్లో యా కేదారపురః సదావిలసతే కాశ్యాం ప్రజాస్తారయన్
యానిత్యం త్రిజగ్పవిత్ర తటినీం సంయజ్య తత్తుష్ఠిదా
యాకాశీజనతాఘ సంఘశమనీ సందర్శనాత్ మజ్జనాత్
ప్రాచీనామణికర్ణికా భవతునః పాపౌఘ విధ్వంశినీ


కాశీ ఖండాతర్గత శ్రీకాశీకేదారనాథ మహాత్మ్యం

శ్లో జన్మద్వయార్జితం పాపం శరీరాదపి నిర్వ్రజేత్
దృష్ట్వాకేదారశిఖరంపీత్వా తత్రామృతతవచ
సప్తజన్మకృతాంత్పాపాన్ముచ్యతేనాత్రసంశయః
హరపాపహ్రదేస్నాత్వాకేదారేశాల్ప్రపూజ్యచ
కోటిజన్మార్జితైనోభిర్ముచ్యతేనాత్ర సంశయః
సకృత్ప్రణమ్య కేదారం హరపాపకృతోరతః

శ్లో ధర్మార్ధకామమోక్షాణాం కాశ్యాం కేదారభూమికా
యాస్యవృద్ధికరీజాతా విశ్వేశానగరీబలాత్
శివలోకమవాప్నోతి నిష్పాపోజాయతేక్షణాత్

శ్లో కాశ్యాం కేదారభూమౌతు నతథా దేహయాతనా
అనాయాసేనదేహస్యత్యాగమాత్రేణతారకం
ఉపదిశ్యమహాదేవః కరోతి స్వాత్మవత్ క్షణాత్
శ్రీకాలబైరవాద్యాస్తు కాశీస్థాదేవతాగణాః
కేదారాంతర్గ్రుహే స్మాకంనైవా జ్ఞాసంప్రవర్తతే
శివప్రసాదోబలవాన్ కేనశక్యోవివారితుమ్
కేదారేశం మహాలింగం దేహకేదారనాశనం
కేదారాణిక్త పుత్రాద్యాభవన్తి ధ్యానభూమయః


శ్రీ కాశీకేదార మహాత్మ్యాంతర్గత కేదారఖండ అవధి

శ్లో పురాకేదారనాథ స్వక్షేత్రమంతర్గ్రుహంస్థితం
పూర్వశ్యాందిశి గంగార్ధభాగం తీర్థసమన్వితమ్
అర్ధక్రోశంచాగ్నిదిశి లోలార్కేశాంతదక్షిణం
సర్వపాపప్రశమనం శంఖోధారాంతవైరతమ్
పశ్చిమే వైద్యనాధాన్తం రమాతీర్ధాంతువాయుదిక్
ఉత్తరే శూలటంకాంతమీశాన్యాం క్రోశమర్ధకమ్
ఏతన్మధ్యే శుభంలింగం సర్వపాప వినాశకం
శ్రీ విశ్వనాథకేదారకాశ్యాం కేదారనామతః
సద్యస్తారయతేలోకాన్ భైరవాయాతనం వినా


స్కందపురాణాంతర్గత శివ అభయం

శ్లో మమకేదారలింగేయః, పత్రంవాపుష్పమేవవా
ఏకద్వత్రిచతుర్వాపిచులుకోదకేమేవవా
అర్పయేత్తత్సమాసాద్యముక్త సర్వాధిపోభవేత్

శ్లో తుషారాద్రిం సమారూహ్యకేదారం వీక్ష్య యత్ఫలం
తత్ఫలం సప్తగుణితం కాశ్యాం కేదారదర్శనే

Saturday, May 9, 2009

రికార్డ్ స్థాయిలో తక్కువ కామెంట్లు వచ్చిన బ్లాగు -- ఓవిన్నపం

అయ్యలారా , అమ్మలారా

గత కొద్ది రోజులుగా నేను పోస్ట్ చేస్తున్న కాశీ కేదారం అనబడు కేదార ఖండ మహాత్మ్యం ఒక కొలిక్కి వచ్చింది. మధ్య మధ్య ఒకటి రెండు అధ్యాయాలు పొస్ట్ చెయ్యలేదు కూడా? దీనిని త్వరలో ప్రింటు వెయ్యబోతున్నాము. ఎవరికైనా దీనిని చదివి అందులోని పుచ్చు తప్పులు ... అచ్చు తప్పులు ... భాషాదోషాలు మాకు తెలియచేయాలని ఉంటే మాకు ఒక వేగు పంపిన వారికి పూర్తి బ్లాగు యెక్క పి.డి.యఫ్ ప్రతి పంపగలము.

అట్లే కాశీ గురించి ఏమయినా సమాచారం తెలుసు కోవాలన్న జిజ్ఞాస ఉన్న మా బ్లాగులో కామెంటినా సరే లేక వేగుపంపినా ఆ సమాచారాన్ని మా బ్లాగులో పొందు పరుస్తాం. అట్లే ఇక ముందు మా బ్లాగులో ఆధ్యాత్మిక విషయాలు పోస్ట్ చేస్తాం. ఇలాగే ఆదరిస్తారని తలుస్తున్నాం.

మరొక విషయం నాబ్లాగులో ఇంతవరకు వచ్చిన కామెంట్లు 2. ఇన్ని తక్కువ కామెంట్లు ఇంతవరకూ ఏ బ్లాగుకు రాలేదని, మాదే రికార్డని మేము భావిస్తున్నాం.

జయ్ హో

Wednesday, May 6, 2009

31 వ (ఆఖరి) అధ్యాయము

మహర్షులు సూతుని, గురుదేవా! మంగళకరమగు శివకళ్యాణ రహస్యము శలవిండని వేడిరి. సూతుడిట్లు వివరించిరి.

జడుడు, స్థావరుడగు హిమాచలము పర్వతముల రాజుగా రాణించి కృతార్ధుడగుట, శివ పార్వతుల కళ్యాణ గాథ సర్వ సిద్ధి ప్రదము. శివుని ఆజ్ఞానుసారము దాక్షాయణి సృష్ఠి నిమిత్తము, దానవ సంహారము కొరకు కుమారస్వామిని ప్రసాదించుటకుగాను పర్వతరాజుకు తనయగా ఉద్భవించెను. కశ్యపాదులు శివాంశతో సృష్ఠి నిమిత్తమై ఉద్భవించిరి. వారికి శక్తి అంశతో భార్యగా పార్వతి సృష్ఠికి కారణమైనది. దేవ, మానవ, పశు, పక్ష్యాది సృషఠికి పూర్వమే పరాశక్తి మూడులోకములను సృష్ఠింటినది. బ్రహ్మ, శివ పరాశక్తుల ఆజ్ఞచే ప్రతి కల్పమందును సృష్ఠి జేయును. లీలా వినోదముగా శివుడు మహాకైలాసమున రుద్రరూపముతో నున్నపుడు పరాశక్తి సతి రూపము శివుని వరించెను. దక్షుని కుమార్తెగా అవతరించి శివుని పరిణయ మాడగా దక్షుడు శివునికి మామగారైన గర్వమున దేవతలను లెక్కజేయక తిరస్కరించనను వారు శివుని ధ్యానించుచు దక్షుని ఉపేక్షించిరి. శివుని ద్వారానే దక్షుని గర్వమడగింపనెంచి వాని ఆజ్ఞావర్తులుగా దక్షునిచే ఒక యజ్ఞమారంభింపజేసిరి. దక్షుని మోహింపజేసి మామగారిగా శివునికన్న నీదే పైచేయిగా నుండవలెను అని నమ్మించి సలహా నిమిత్తము దేవతలు దక్షుని శివుని వద్దకు తీసుకొనివెళ్లి వారందరునూ శివునికి నమస్కరించి కూర్చొనిరి. శివుని కేవలము అల్లునిగా తలచిన దక్షుడు శివునికి నమస్కరించకయే ద్వతల మధ్య ఆశీనుడాయెను. అందరు దేవతలతో సహా దక్షుని కూడ శివుడు కుశలము విచారించిరి. కాని దక్షుడు కోపించి, మామగారినగు నాకు నమస్కరింపకయే మూర్ఖుడై, శివుడు దుష్ట స్వభావముతో నన్ను అందరితో సమానముగా చూచెనని కోపించి, శివుని దూషించి సభనుండి వెళ్లిపోయెను. దేవతలందరునూ దక్షుని పతనమారంభమైనదని తలచి శివునికి నమస్కరించి నిష్క్రించిరి.

దక్షుడు యజ్ఞమందు పూర్ణ ఫలదాత యగు శివుని ఆహ్వానింపకయే యజ్ఞమారంభించి హవిర్భాగము రుద్రునికివ్వనందున కోపించిన సతీదేవి, శివుడు వారించిననూ వినక దక్షయమునకు వెళ్లి బంధువర్గముతో సహా దక్షుని నిందించి, నీపేరుతో దాక్షాయణిగా నున్న ఈ దేహము త్యజించుచున్నానని యజ్ఞవాటిక యందు దుమికి అంతర్ధానమయినది. ఈ విషయము నారదుని ద్వారా తెలిసిన పరమాత్మ వీరభద్రుని సృష్ఠించి పంపి దక్షయజ్ఞము ఛిన్నాభిన్నము చేసి దేవతలను దండించి దక్షుని గర్వమడగించెను.

ఆ సతియే శివాజ్ఞచే పర్వత రాజ దంపతులకు తనయగా, బాలగా వారినానందింపజేసెను. కుమారిగా పరమేశ్వరుని పతిగా పొందునిమిత్తము తపమాచరించెను. శివుడు లీలగా ఎన్ని పరీక్షలు పెట్టిననూ సడలనీయని దీక్షతో అపర్ణగా ధృడముగ నిల్చి శివుని అభిమానములకు పాత్రురాలై, తన తలిదండ్రులను ఒప్పించి తనవద్దకు వరాన్వేషణకు పంపునట్లు శివునిచే అనుజ్ఞపొంది, తన మనోభీష్టమును తలిదండ్రులకు తెల్పెను. పర్వతరాజ దంపతులు సాక్షాత్ పరమేశ్వరుని తమ అల్లునిగా తలంచి ఆనందముతో తమ పూర్వజన్మముల పుణ్యము ఫలించి తమకీ అదృష్టము కల్గినట్లు భావించిరి. శివుడు హిమవంతుని వద్దకు జ్యోతిష బ్రాహ్మణులు, బృహస్పతి, శుక్ర, వశిష్ఠ, అత్రి, భృగు, కుత్స మహర్షుల ద్వారా కన్యావరణము నిమిత్తము పంపిరి. హిమవంతునికి అనుకూలమగు ముహూర్తము వారిద్వారా తెలిసికొని కన్యను చూచు నిమిత్తము శివుడు హిమవంతునింటికి వెళ్లెను. విశ్వకర్మను నియమించి అతని మనస్సంకల్పముద్వారా మనోహరమగు మండపమును, గృహమును, కళ్యాణ వేదికను, శిబిరములను నిర్మింపజేసిరి. నవరత్న ఖచిత స్వర్ణ రజిత మండపములు, రత్నములు పొదిగిన కుశ వనములు, ముత్యములు, రత్నములు నింపిన ఊయలలు, వీధులలో పతాకములు రెపరెపలాడుచు, చింతామణి, కల్పవృత్రము, కామధేనువు, అక్కడకు వచ్చినవి. షడ్రసముల పిండివంటలతో భోజనములు సమకూర్చుటకు కామధేనువు సిద్ధమయినది. వస్తు, గంధ మాల్యాది లేపనములు సమకూర్చుటకు కల్పవృక్షము సిద్ధమయినది. రత్నభూషణములు సమకూర్చుటకు చింతామణి వచ్చినది. సంగీత, వాద్య ఘోషలు మిన్ను ముట్టించుటకు నారదాదులు వచ్చిరి. ఆవాహితులను స్వాగతించుటకు లోకపాలురు వచ్చిరి. సర్వకార్యములు సమకూర్చు బాధ్యత స్వయముగ బ్రహ్మ తన భుజస్కందములపై ధరించెను. వివాహవిషయముల సంప్రతింపులకు విష్ణుమూర్తి సిద్ధమాయెను. హిమవంతుని ఇంట అన్నియు సమకూర్చి, దేవతలందరునూ వరుని ఆహ్వానించి తీసికొని వచ్చుటకు కైలాసము వెళ్లి శివునికు సాష్టాంగ నమస్కారము చేసి హిమవంతుని ఆహ్వానము విన్నవించిరి. పరమేశ్వరుడు వృషభ వాహనుడై నంది, భృంగి, గణ పరివార సమేతుడై, దేవతలు స్తుతి స్తోత్రములు చేయుచు ముందు నడువగా, యక్ష, గంధర్వ, కిన్నెర, అప్సరసలు సేవింపగా హిమవంతుని ఇంటికి చేరిరి. హిమవంత దంపతులు స్వామివారికి పాలతో పాద ప్రక్షాళన చేసి, రత్న నీరాజనమిచ్చి స్వాగతించిరి. మామగారిచ్చిన ఫలములు చేతగైకొని బ్రాహ్మణులు స్వస్తివాచకము పల్కగా శివుడు హిమవంతుని మందిరము జొచ్చిరి. హైమవతి సర్వాలంకార భుషితయై రత్న సింహాసనమున ఆశీనురాలాయెను. స్వామి హిమవంతునితో, బ్రహ్మ, విష్ణు, ఋషిగణములతో అంతర్వేది మండపమున ప్రవేశించిరి. మామగారు అల్లుని రత్నపీఠమున అధివసింపజేసిరి. బ్రహ్మగారు పురోహితులు కాగా, బాజా భజంత్రీలు, బ్రాహ్మణుల స్వస్తి వాచకములు, గణముల జయజయధ్వానములు, మిన్ను ముట్టగా, హిమవంత దంపతులు స్వామివారికి కన్యాదానము జేసి కృతార్ధులైరి. అగ్నౌకరణ, లాజహోమ, సదస్య, భూరి భోజనాదుల అనంతరము స్వామి అమ్మవారిని తీసికొని కైలాసము బయలుదేరగా, దేవతలు పుష్ప వృష్టి కురిపించిరి. దేవతల ఢంకా, భేరి, మృదంగముల మధ్య గంధర్వులు గానము, అప్సరసలు నాట్యము జేసిరి. అందరి మనములు ప్రపుల్లములై ఆనంద డోలికలలో ఊగినవి. శంకరుడు బ్రహ్మ, విష్ణులను సత్కరించి బ్రాహ్మణులకు యధోచిత దానములొసంగి దేవితో సహా వృషభారూఢుడై కైలాసమేగిరి. ఆహూతులు ఆనందముగ తమలోకముల కేగిరి. లీలావినోదభరిత శివ పార్వతుల కళ్యణమట్లు వైభవోపేతముగ జరిగినది. తోడబుట్టిన అన్నదమ్ములు లేని కన్యను వివాహమాడుట ధర్మ విరుద్ధము గనుక శంకరులు హిమవంతునకు మైనాకుడను కుమారుని అనుగ్రహించిరి. కాని మైనాకుడు అమ్మవారికి సహోదరుడనిపించుకొనుటకు భయపడి ఇప్పటికిని సముద్రమున దాగియున్నాడు. కేదారేశ్వరుడు 15 కళలతో కాశీకి చేరి ఒక్క కళను మాత్రము హిమాలయకేదారమున వదలినాడు. విశ్వనాధుడు కేదార క్షేత్రమున కాలభైరవదండన లేకయే తారకమంత్రముపదేశించి ముక్తినిచ్చును. ఈ శివకళ్యాణ కథా శ్రవణము సర్వ మంగళ ప్రదము. ఏ కోరికతో శివ కళ్యాణ పఠన, శ్రవణములు జరుపుదులో అవి నిశ్చయముగా ఫలించును.

ఈ పురాణము విని మునిశ్రేష్ఠులు ఈశ్వరుని స్తుతించిరి. అన్నానాం పతయే, దిశాంచ పతయే, మాదృక్పపశూం పతయే నమః. తస్కరానాం పతయే, జగత్ సమస్త క్షేత్రౌషధీనాం పతయే నమః. వృక్షాణాం పతయే పుష్ఠానాం పతయే. బుద్ధానాం పతయే, దుష్ఠానాం పతయే, దినాంచ పతయే నమః. స్వామీ అనంత కోటి నమస్కారములు. అప్రమేయా! అభీష్ట వరదా! మీ ధామము ప్రసాదింపుడు. మాకు మరి ఏదియునూ వలదు. కేదార క్షేత్ర మహిమ కేవలము ముక్తి ప్రదము. అందువలన మాకు నిరంతరు, ఆజన్మ కేదార వాసమనుగ్రహింపుడు. ఋషుల ధ్యానమునకు సంతుష్టుడై పరమాత్మ పార్వతీ సమేతుడై, వృషభవాహనుడై, సూతునితో సహా ఋషులకు దర్శనమొసంగెను. గణేశ, కుమార, గణ సహితుడై దర్శన మొసగి ప్రఫుల్ల సుస్వరమున సద్భక్తముని శ్రేష్ఠులారా! మీ స్తుతికి ప్రసన్నుడనయితిని. మీకు పునరావృత్తి రహిత మొక్షమొసంగితిని. కేదార క్షేత్రములో నున్నను, ఇతర దేశముల కరిగినను, ప్రసాదమెక్కడ భుజించినను ఫలించినట్లు, మీ దేహత్యాగమెక్కడ జరిగినను, నా రహస్య వృత్తాంతము లన్నియూ అవగతము చేసికొనిన మీరు ధన్యులు. ముక్తులని పలికి లింగముల అంతర్ధానము జెందిరి. కోటి సూర్య ప్రభాభాసితమగు స్వామిని దర్శించిన సూతుడు, మునులారా! మనము ధన్యులము, కాశీ కేదార మూల రహస్యము వేదసారము. శంకర ప్రతిపాదితముగనుక జనన మరణచ్ఛేదము. పూర్వ జన్మల పుణ్య సంచయముచే మాత్రమే దీనిని వినుట, వినిపించుట, చదువుచ, చదివించుట యనునవి సంభవించును. లేనిచో నేను నా గురుదేవులు వ్యాసమహానుభావుని ముఖకమలము నుండి వినుట, ఇక్కడకు వచ్చుట, మీకు వినిపించుట ఎట్లు జరుగును? మీరు విశ్వశించుడు, కేదారేశ్వరుని ఎదుట శివజ్ఞాన రహస్యము పూర్తిగనో, సగమో, ఒకభాగమో, కేవలమొక శ్లోకము గాని చదవుట, వినుట, వినిపించుట వలన ఇష్ట సౌఖ్యములనుభవించిన తర్వాత అంతమున శివపదము ప్రాప్తించుట నిశ్చయము. శివునికి ప్రీతికరమగు శ్రావణ, కార్తీక, మాఘమాసములు గాని అథవా వైశాఖమున కాని ప్రతి దినము ఈ పురాణము చదివిననూ, వినిపించిననూ, వినిననూ వారు శివునికి ప్రీతులై ముక్తి పొందుదురు. వక్తకు వస్త్ర భూషణములనొసగి సంతృప్తి పొందించిన వారిని కేదారేశ్వరుడు అనుగ్రహించి ముక్తినొసగును.

సూతుని ద్వారా ఇట్లు వినిన మునులు ఆనందముగ మున్ముందు సూతుని పూజించి, సుగంధ పూరిత వస్త్రములు, అసంఖ్యాక రత్న, సువర్ణ ద్రవ్యములచే సంతృప్తుని జేసి, విశ్వనాథ, మణికర్ణిక, పంచక్రోశ దేవతలు, కాశీలోని సర్వదేవతలను పూజించి, చివరగా కేదారేశ్వరుని శరణు జొచ్చి విధి విధాయకముగ పూజించిన వెంటనే ఆకాశవాణి రూపమున కేదారేశ్వరుడు ఆజ్ఞాపించిన విధముగా శివుని హృదయమున నిల్పి ధ్యానమగ్నులై ఇచ్ఛాను సారము భోగములనుభవించి సద్యః ముక్తులై దేహపతనానంతరము విదేహముక్తులైరి.

ఇది బ్రహ్మవైవర్త పూరాణాంతర్గత,
కాశీమూల రహస్యాంతర్గత
కాశీ కేదార ఖండ మహాత్మ్యము
సంపూర్ణము

ఇతీశమ్

Monday, May 4, 2009

30 వ అధ్యాయము

ఋషి గణము మరల సూతునిట్లడిగిరి. శివజ్ఞాన రహస్య తత్వజ్ఞుడవగు గురువర్యా! మీ ద్వారా తెలిసికొనదలచిన ముఖ్యవిషయము ఒకటి కలదు. శివుడు గౌరీదేవిని వినిపించిన నూరు కథలలో మీకు ఎవైన తెలిసియున్నచో సెలవిండు. శివుడు ఏకాంతమందిరమున, తనకు మాత్రమే తెలిసిన కథలు గౌరికి వినిపింపగా వానిని నౌగమేయుడు విని రహస్యముగ లక్ష్మికి వినిపించెనని తెల్పితిరి గదా! ఆ కథలలో కొన్ని మీకు తెలిసియుండిన దయచేసి మాకు వినిపింపుడని కోరిరి. సూతుడు, మునులారా ఆ కథలను సంత్రేపముగా తెల్పుదును వినుడు. మాగురువు వ్యాసుని ద్వారా నేను తెలిసికొనిన వానిలో కాశీకి సంబంధించిన వానిని తెల్పుదును.

కల్పభేదముచే సృష్ఠిలో కూడ భేదముండును. శివలీలలు అద్భుదము. శివునిచే గౌరికి చెప్పబడిన కథలు అనేక కల్పములలో, విచిత్రముగా ఎందరు శివుని సేవించి బ్రహ్మపదము, దేవాంగనా పదములను బొందిరో లెక్కకందవు. శివ మహిమ తెల్పు కాశీని గురించిన కథలు వినుడు.

పరమేశ్వరుడిట్లు చెప్పుచున్నాడు. దేవీ భూమండలమున ప్రత్యేక ప్రధానమగు కాశీ నా శరీరము. కాశీ నా త్రిశూలాగ్రమున నిర్భయముగ నుండును. ప్రళయకాలమున కాశీని మహాకైలాశమునకు ఎత్తి పట్టుకొని మరల సృష్ఠి జరిగిన వెంటనే క్రిందకు దించి భూమిలో చేరునట్లు చేసెదను. కాశీ లౌకిక దృష్టికి పృధ్విలో చేరినట్లుండును కాని జ్ఞాన దృష్టికలవారికి కాశి నేనుగానే తెలియును. అందున విశ్వేశ్వర,ఓంకారేశ్వర, కేదారేశ్వర లింగముల మహిమ చాలా గొప్పది.

1) కశ్యపుని కథ
ఒకప్పుడు దశార్ణవదేశమున కక్షివంతుడను బ్రాహ్ణుడు శ్రద్ధాళువై తన కుమారునితో సహా కాశీయాత్రకు వచ్చెను. తన ఇద్దరు భార్యలతో కేదార క్షేత్రమున వశించి, నిత్యము కేదారేశ్వరుని సంవత్సరకాలము సేవించెను. సోమవార వ్రతములు విధిగా సల్పుచుండెను. శాస్త్రోక్తముగా గౌరీ కుండమున స్నానమాడి భస్మరుద్రాక్షధారియై పగలు శివుని పూజించి రాత్రికి భుజించెడివారు. హవిష్యాన్నము, పాలు, పండ్లు స్వామికి నివేదించిన వానినే అందరూ స్వీకరించెడివారు. ఒక సంవత్సరకాలమిట్లు సేవించి మరల వారి స్థానమును చేరిరి. కాలమాసన్నమై భార్యలతో సహా మరణించి మరు జన్మలో బ్రహ్మపుత్రుడు కశ్యపుడుగా జన్మించి భార్యలు దితి, అదితులై అతనినే పరిణయమాడిరి. కేదారేశ్వరుని ప్రసాదమున వారికుమారుడు ఇంద్రపదవి పొందెను. అంతమున శివజ్ఞానము పొంది నాలో చేరిరి.

2) స్వాయంభువ మనువు కథ

కౌశల దేశమున సుదాసుడను పేరు గల రాజు కలడు. అతడు, భార్య, కుమారులు చాలా ధార్మికులు. ధర్మాత్ములు. చిన్నకుమారునకు రాజ్యమప్పగించి కాశీని సేవించుటకు వచ్చిరి. కేదాల క్షేత్రమున వసించి ప్రతి పక్ష ప్రదోషము దినముననూ కేదార గౌరి కుండమున స్నానమాడి భస్మ రుద్రాక్షలు ధరించి కేదారేశ్వరుని పూజించి బ్రాహ్మణ సమారాధన తర్వాతనే వారు భుజించెడ్వారు. అట్లు సంవత్సరకాలము వ్రతమాచరించి వారి రాజ్యమునకు వెళ్ళిరి. వారు గతించి మరు జన్మమున కేదారేశ్వరుని కృపచే స్వాయంభువమనువుగను, భార్య శతరూపగను పుత్రుడు సూర్యుడుగను భాసించిరి. క్రమముగ శివజ్ఞానముపొంది నా పదమును చేరిరి.

3) చంద్రుని కథ

పాండ్య దేశమున సుధనుడను వ్యాపారి ధనికుడు, శివధర్మపరాయణుడు. స్త్రీ పుత్రులతో కాశీయాత్రకు వచ్చిరి. యధావిధిగా కేదార క్షేత్రమున శివపూజా ధురంధరులై రెండు సంవత్సరములు గడిపిరి. నిత్య గౌరీకుండ స్నానము కేదార సేవనము సల్పిరి. శివరాత్రి వ్రతమునందాసక్తులై రెండు శివరాత్రులు గౌరీకుండ స్నానము భస్మ రుద్రాక్షధారణ అహోరాత్రకేదార అర్చన, రాత్రి జాగరణ, నాల్గు జాముల పూజ, మరుదినము బ్రాహ్మణ సమారాధన తర్వాత అతడు భార్యా పుత్రులతో కలసి భోజనము జేసి మరల వారి దేశము చేరిరి. దేహావసానంతరము వారు చంద్రుడు, రోహిణి, వారి పుత్రుడు బుధుడుగా అవతరించిరి. ఆ భోగమనుభవించిన తర్వాత నాభక్తులై నాలో ఐక్యమయిరి. నేనే కేదారేశ్వరుడను. వారి భక్తికి ప్రసన్నుడనై వారికి శివ పదము అనుగ్రహించితిని.

4) యమ, శనైశ్వరుల కథ

కాశ్మీర దేశమున శ్రీదాసు యను ఒక శూద్రుడు గలడు. వానికైదుగురు కుమారులు. చాలా అన్యోన్యముగా నుండెడివారు. బిడ్డలననాధులను చేసి తలిదండ్రులు గతించిరి. బిడ్డలు వారి చితా భస్మమును గంగలో నిమజ్జనము చేయుటకు కాశీకి వచ్చిరి. విధి పూర్వకముగ ఉత్రర క్రియలు గవించి, కేదార క్షేత్రమున ఒక సంవత్సర కాలము నిత్య నియమిత యాత్రలు చేయుచు, నిత్యము గౌరీకుండ స్నానము, కేదార సేవనము చేసిరి. ఆ సంవత్సర కాలములో మూడు శని ప్రదోషములు రాగా వారు ఉపవాసదీక్షతో భస్మ రుద్రాత్రధారులై కేదారేశ్వరుని పూజించిరి. వారి దేశము చేరిన తర్వాత కాలమాసన్నమై వారు మరణించిరి. వారు కేదారేశ్వరుని అనుగ్రహమున యముడు, శనైశ్చరుడు, సావర్ణిమను, మరియు అశ్వనీ కుమార దేవతలైరి. భోగానంతరము శివ జ్ఞానులై నాపదమును బొందిరి.

5) రాహువు కథ

మార్వాడ దేశ శమీపురమను గ్రామమున దుర్ఘటుడను పేర ఒక చండాలుడుండెను. అతడు చాలా పాపి. మ్లేచ్ఛ వర్తకునితో అతడు కాశీకి వచ్చెను. మ్లేచ్ఛుడు వర్తకము ముగించుకొని వెళ్లిపోయెను. దుర్ఘటుడు అనారోగ్య కారణమున వానితో వెళ్ళలేక కేదారక్షేత్రమున బిచ్చగాడుగా పడియుండెను. అట్లు ఆరునెలలు గడిచి పోయినవి. ప్రతినెల కృష్ణపక్ష చతుర్దశి కేదారేశ్వరునికి మాస శివరాత్రి ఉత్సవమునకు భక్త జనసందోహము వచ్చును. దుర్ఘటుడు అందరివద్ద బిచ్చమెత్తి అందరిని భగవంతుడు మీకు మేలు చేయునని చెప్పెడివాడు. అట్లే రాత్రి గడచి పొయెడిది. ఆరు మాసములలో ఆరు మాస శివరాత్రులట్లు జాగరణ చేసెను. అట్లు దైవికముగ చండాలుడైనను కేదార నామోచ్ఛారణ, రాత్రి జాగరణల ఫలితముగ అనారోగ్యము మటుమాయమై తన గ్రామమునకు తిరిగి వెళ్లి, కాలవశమున మృతి జెందెను. కేదార అనుగ్రహమున అతడు రాహువుగా సింహికకు జన్మించి, మోహిని అమృతము పంచునపుడు రాక్షసుడైనను మోసపూరితముగ అమృతపానము చేసిన కారణముగా రెండుగా ఖండింపబడినను, కేదారేశ్వరుని కృపవలన నవగ్రహములలో ఒకనిగా పూజలందుకొనుచు భోగాంతమున నాపదము పొందెను.

6) పార్వతి, లక్ష్మి, సరస్వతి, ఇంద్రాణుల కథ

దేవీ మరొక కథ వినిపించెదను. కర్ణాటక దేశమున కళావతి యను ఒక బ్రాహ్మణ యువతి గలదు. అంగదేశమున విలాసినియగు ఒక రాణి గలదు. ఘూర్జర దేశమున సుమతి యను ఒక వైశ్య స్త్రీ గలదు. విదర్భ దేశమున పుష్ప నామముతో ఒక శూద్ర స్త్రీ గలదు. వీరు నల్గురు వైధవ్యమును పొంది పతిలేకపోగా పుత్రులుకూడ లేనివారై విడివిడిగా కాశీకి చేరిరి. నిత్యము గంగాస్నాన, విశ్వేశ్వర అర్చనలు యధాశక్తి బ్రాహ్మణులకు దానములు చేయుచు ఒకరోజు వారు నల్గురు కేదారేశ్వర ఆలయమున కలిసి ముచ్చటించు కొనుచు, వారి వారి కష్టసుఖములు, పూప్వ వృత్తాంతములు చెప్పుకొనిరి. వారివద్దనున్న ధనము పూర్తిగా వ్యయమగువరకు నల్గురునూ ఒకచోట కలిసి యుండునట్లు నిశ్చయించుకొనిరి. నిత్యము గౌరీకుండములో స్నానము, కేదారేశ్వర పూడ, ఇష్ట దేవతలైన పతులను మనసా ధ్యానించుకొనుచు 12 సంవత్సరములు కాశీ కేదారేశ్వరుని సమీపముల వశించిరి. సోమవారములు, ప్రదోషములు మాస శివరాత్రులు, మహాశివరాత్రులు, ఉపవాస ప్రతముతో భక్తి ప్రపత్తులతో బ్రాహ్మణ సమారాధనలు చేసి తర్వాత వారు భుజించెడివారు. శరీర కష్ముల కోర్చి ఈ విధముగ వారి వద్ద ధనము పూర్తిగా వ్యయమగువరకు కాశీవాసము చేసి తర్వాత వారి వారి గ్రామములకరిగిరి. కాలవశమున నల్గురును మరణించిరి. కేదార క్షేత్రమున వారు అన్నలింగమునకు గంధపుష్పాక్షతలతో నిత్యపూజ చేసిన కారణమున కాశీ అన్నపూర్ణ ప్రసన్నురాలై వారికి నా శివపద మబ్బునట్లు చేసినది. హే గౌరీ వినుము, నీవు ఆ కల్పమందు ఆ బ్రాహ్మణ స్త్రీ కళావతి, లక్ష్మి రాణియగు విలాసిని, సరస్వతి వైశ్య స్త్రీ సుమతి, మరియు ఇంద్రాణి పుష్పయను శూద్ర స్త్రీ. వారు ఒక కల్పకాలము మీ పదవులలో యుండి నా భక్తిచే నా జ్ఞానమును పొంది శివపదమలంకరించిరి.

7) దూర్వాసుని కథ

మరొక కథ వినుడు. కాంచీ పురమందు ధర్మ శర్మ యను పుణ్యాత్ముడు ఒక బ్రాహ్మణ బ్రహ్మచారి గలడు. వేద విద్యాభిమాని. యధావిధి కాశీ యాత్రకు వచ్చి కాశీ కేదార నాథుని దగ్గర మూడు సంవత్కరములు నిత్యము గౌరీకుండమందు స్నానము, కేదారేశ్వరుని పూడ చేసి మధూకర వృత్తితో భుజించెడివాడు. ఆర్ద్రా నక్షత్ర దినమున ప్రతిమాసము అరుణోదయకాలమున, ముఖ్యముగ ధనుర్మాస ఆర్ద్రాదినమున విశేషముగ నా మహాలింగ అర్చన చేసెడివాడు. స్వామీ నా పూజలతో ప్రసన్నుడవయి నాకు నీ కల్మష రహిత సుజ్ఞానము ప్రసాదింపుమని రోజునూ ప్రార్ధించెడివాడు. అట్లు 3 సంవత్సరములు గడచిన తర్వాత మరల కాంచీపురము వెళ్లుచు త్రోవలోనే మరణించెను. కేదారేశ్వరుని అనుగ్రహమున అతడు మరుజన్మలో అత్రి మహర్షి కుమారుడు దూర్వాసుడుగా జన్మించెను. శివమానసుడు, శివరహస్య జ్ఞానిగా ఒక కల్పము భోగమనుభవించి కల్పాంతమున శివపద ప్రాప్తి బొందెను. అత్రి మహర్షి భార్య అనసూయాదేవి కేదారలింగమునకు అన్నలింగ జ్ఞానముతో పూజలు సలిపి త్రిమూర్తులకు మాత అయినది.

8) అగస్త్య, లోపాముద్రల కథ

మరియొక కథ వినుడు. ఒకప్పుడు శ్రీశైల పర్వతము ధృతియను పేరుగల బ్రాహ్మణుడు శ్రీమల్లిఖార్జున లింగమును భక్తితో పూజించెడివాడు. అతడు భార్యా సమేతుడై కాశీ యాత్రకు వచ్చి కేదార క్షేత్రమున వసించి, ఆరు సంవత్సరములు నియమ నిష్ఠలతో షణ్ముఖ స్వామి కార్తికేయుని పూజించెడివారు. ప్రతిమాసము కృత్తికా నక్షత్రమున, శుక్ల పక్ష షష్ఠీ దినమునను, విశేషముగ కార్తీక మాస శుక్ల పక్షమున, చంపా షష్ఠీ, స్కంద షష్ఠీ దినములందు విధిపూర్వకముగ ఉపవాస వ్రతమాచరించుచు పూజలు సల్పిరి. నిత్యము గౌరీ కుండమున స్నానము చేసి కేదారేశ్వరుని పూజించుట వారి నిత్య కృత్యము. అన్నపూర్ణా సమేత కేదారేశ్వరునిగా ధ్యానించెడివారు. యధాశక్తి బ్రాహ్మణులకు బిక్షులకు అన్నమిడెడివారు. ఆ తర్వాత వారు భుజించెడివారు. ఆరు సంవత్సరముల తర్వాత వారికి పృధ్వీ ప్రదక్షణము చేయు సంకల్పము కల్గి కాశీని వదలి మార్గ మధ్యమున దేహ త్యాగము చేసిరి. అతని భార్య అతనితో సహగమనము చేసినది. వారు మరు జన్మమున అగస్త్య, లోపాముద్రలై గొప్ప కీర్తి గడించిరి. కార్తికేయుని ద్వారా శివ రహస్య జ్ఞానముపదేశింపబడి కల్పాంతమున నా సన్నిధికి చేరి శివపదము బొందిరి.

9) పృధి చక్రవర్తి తండ్రి వేణు కథ

మరియొక కథ. వింధ్య పర్వత శ్రేణిలోని ఒక వనమందు దుర్నయుడను పేరు గల ఒక మహాపాపి, కిరాతకుడుండెడివాడు. పథికులను దారిదోపిడి చేయుచు బ్రతికెడివాడు. ఒకనాడు అతడు ఒక కార్పణికుని చంపుటకు కత్తి ఎత్తగా అతడు భయపడి హే ఢుంఢి గణపతీ, హే కేదారనాథా నన్ను కాపాడుడని దీనుడై పెద్దగా ప్రార్థించెను. వెంటనే కత్తి ఎత్తిన కిరాతుని చేయి పైన స్తంభించిపోయెను. అతడు ఎంత ప్రయత్నించినను కత్తి పట్టిన చేయి దింపజాలనందున అతి దుఃఖితుడై ఆ బ్రాహ్మణుని ప్రార్ధించి, స్వామీ నన్ను దయతలచి మరల నా చేయి సరియగునట్లు చేయుడు. మీ ఇష్టదైవమును ప్రార్థించి నన్ను కాపాడుడని బిగ్గరగా ఏడ్వగా బ్రాహ్మణుడు దయాళువై మరల ఢుండి రాజ కేదారేశ్వరులను ప్రార్ధించి కిరాతుని చేయి దిగునట్లు చేసెను. కిరాతుడతని కాళ్లపై బడి, కాధూ నా అపరాధమును మన్నించి నాకు తరుణోపాయముపదేశింపుడని పేడగా, బ్రాహ్మణుడతనిని ఆదరముగ లేవనెత్తి నీవు కాశీయాత్ర చేసి ముందుగా గణేశుని, ఆపై శంకరుని విధాయకముగా పూజించినచో నీవు కృతార్ధుడవగుదువని తెల్పెను. దుర్నయుడు వెంటనే కాశీ యాత్ర జేసి విధిపూర్వకముగ గణేశుని, ఢుండిరాజును, విశ్వేశ్వరుని పూజించి, కేదార క్షేత్రమున ఒక సంవత్కర కాలము కేదారేశ్వరుని పూజించుచు నిత్యము గౌరీకుండ స్నానము, చతుర్ధి దినములలో గణపతి పూజ, మహాచతుర్ధియందు విశేషార్చన, బ్రాహ్మణ, యతి, భిక్షుల ఆతిధ్యము తర్వాత తాను భుజించును గడిపి ఉపవాస జాగరణలతో శివుని తృప్తిపరచెడివాడు. తర్వాత ఒకనాడు తనదేశము చేరుటకు కేదారుని అనుమతి కోరగా, ఆకాశవాణిరూపమున నీకు మంచి జరుగును, వెళ్లి భక్తితో నన్ను ప్రార్ధించుచుండుమని అతనికి వినిపించెను. అతడు తనదేశము తిరిగి వచ్చి కలమాసన్నమై మరణించి, మరుజన్మమున పృధుచక్రవర్తి తండ్రి వేణు యను రాజుగా జన్మించి కీర్తి గడించెను. గణపతిని గురించిన పూర్తి జ్ఞానముపదేశము పొంది మరుజన్మ ఇంద్రుడై, శివజ్ఞాన ప్రాప్తిపొంది అంతమున నాపదము చేరెనని శివుడు గౌరికి రహస్య కథ వినిపించెను.

10) నారద, తుంబురుల కథ

పూర్వము కళింగదేశమున ముగ్గురు భిల్లులుండెడివారు. వారి పూర్వపుణ్య వశమున వారికి కాశీయాత్ర చేయు సంకల్పముదయించి కాశీచేరి కేదార క్షేత్రమున ప్రతి శుక్ర, శని, మంగళవారములందు, దండపాణి, బిందుమాధవ, కాలభైరవులను విధిపూర్వకముగ పూజించి మరుజన్మలలో వారు విశ్వవసు, నారద, తుంబురులుగా జన్మించి, నాగానమందు రతులై ఒక కల్పకాలము భోగమనుభవించి, కేదారేశ్వరుని కృపవలన ముక్తులై నాలోని శివపదము జేరిరి.

ఇట్లు వివిధ కల్పములందు ఎందరో విశ్వేశ్వర, ఓంకారేశ్వర, కేదారేశ్వర లింగములను పూజించి కాశీ వదలి మరల వారి స్థానములకు చేరినను వారికి దేవత్వమబ్బి భోగములననుభవించి నాజ్ఞానము కల్గి నన్ను చేరినవారనేకులు ఋషులు, మునులు, సాధ్యులు, విశ్వేదేవతలు, మరుద్గణములు, ఆదిత్య, వసు, రుద్ర, దిక్పాలకులు, వారి స్త్రీలు, పాతాళవాసులు, గంధర్వ, యక్ష, కిన్నెరలు, నాగ కన్యలు, అప్సరసలు, మహాలోక, తపోలోక, జనాలోకవాసులు, బ్రహ్మ, విష్ణు, రుద్ర లోక పాసులు, ప్రఖ్యాత చక్రవర్తులు, ఇట్లు ఎందరో కల్పి కల్పములలో కాశీలో నా పూడచేసిన వారలు కాశీవదలి వెళ్లిననూ దేవయోనులయందు జన్మించినవారనేకులు గలరు. నా ఇతర క్షేత్రములందు నన్ను సేవించిన వారునూ అట్లే ఉత్తమోత్తమగతులు పొందినారు. ఇట్లు అనేక గుహ్యతమ చరిత్రలు ఎన్ని చెప్పగలను. నా ఆనందమయ మీలలు చిత్రాతి చిత్రములు. అని శంకరులు గౌరికి ఇట్టి ఎన్నో కథలను వినిపించిరి. ఈ విధముగనే కాశీలో ఓంకారేశ్వర, విశ్వేశ్వర లింగములను పూజించి కృతార్ధులై దేవత్వమబ్బినవారెందరి కథలో గలవు. అవియునూ వినిపించిరి.

సూతుడు శౌనకాదులతో పుణ్యాత్ములారా! శివునికి మాత్రమే తెలిసి గౌరీదేవి కి వినిపించిన ఇట్టి పరమ రహస్యములు, నా గురువులు వ్యాస భగవానులు, శివభక్తి పరాయణులై దివ్య జ్ఞానముచే కొన్ని తెలిసికొని నాకు వినిపించిరి. నేను మీకు వినిపించితిని. మీరు ధన్యులు. కాశీ విశ్వేశ్వర మందిరమునందును, వివిధ దేవతల మందిరములందుని శివ, శక్తి, గణేశ, కార్తికేయ, నంది, భృంగి, మరియు అన్ని దేవతల పుణ్య దినములందును విశేషమూజలు సల్పిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, భిల్ల, చండాలాదులు కూడ మరుజన్మమున దేవతలలో ముఖ్యులైనవారి కథలు వింటిరిగదా! పరమేశ్వరుని ఒక్కొక్క అంశ ఒక్కొక్క లింగరూపమున భుతలమందనేక ప్రదేశములందు నెలకొని ఎందరినో ముక్తులను చేసినది. అనన్య భక్తులకు మాత్రమే అవి ప్రాప్తించును. పుర్వ జన్మల పుణ్యవిశేషమున మాత్రమే అపవిత్ర వాసనా క్షయము, పవిత్ర కర్మలపై ఆపేక్ష జనించి శివారాధన ద్వారా ముక్తులగుదురు.

Saturday, May 2, 2009

29 వ అధ్యాయము

ఋషులు సూత పౌరాణికునికి నమస్కరించి, బాదరాయణ శిష్యులు, శివరహస్య నిధియగు మహాత్మా! మీ ద్వారా శ్రీ కాశీ కేదారనాథ మహాత్మ్యము విని తరించితిమి. ఈ కేదారనామము శివునికెట్లు క్లగినది? సాకల్యముగా తెలియజేయుడని కోరిరి. సూతుడు వారడిగిన రహస్య కథతెలియజేయుదునని ఇట్లు తెల్పెను.

పూర్వము హిమవంతుడు భార్యా సమేతముగా శంకరుని ప్రసన్నుని చేసికొనుటకై పదివేల సంవత్సరములు తపస్సుచేసెను. నా యశస్సు పర్వతరాజులందరను మించి పోవలెనన్న, జడుడనగు నాకు శంకరుడు తప్ప వేరు గతి లేదు. గనుక నా మనోరధము నెరవేర్చువరకు తపమాచరింతునను ధృఢసంకల్పముతో వాయు త్రక్షకుడుగా ఇరువదివేల సంవత్సరముల తపస్సు తర్వాత శంకరుడు ప్రీతుడై ప్రత్యక్షమై హే పర్వతరాజా! నీవు భార్యా సహితముగా ఉగ్రతపమాచరించి నన్ను తృప్తుని జేసితివి గనుక నీ అభీష్టము కోరుకొమ్మనగా, వారు పరమానందముతో స్వామిని స్తుతించిరి. జగదాధారా! భక్తాభీష్టవరదా! భక్తుల సర్వస్వమయినా ప్రభో నీకు జయము. హే కరుణాసింధో, త్రిగుణాతీత, సగుణ సర్వజ్ఞ నీకు జయము. స్వామీ మేము ఆపదలలో నున్నపుడు ఎవరిని భజించవలయును? ఈశ్వర చరణారవిందములను భజింతుము. అందువలన ఏమగును? విష్ణువు మొదలుగాగల సర్వ దేవతలు ఆజ్ఞావర్తులగుదురు. ఉపనిషద్వాచకుడగు చంద్రమౌళి నా మనోవాంఛ నెఱవేఱ్చుటకు నా హృదయ గుహయందు నివశించుగాక. సత్య, జ్ఞాన, అనంత, బ్రహ్మరూపుడగు వాని వలన పంచభూతములు, అన్నము సృజింపబడి మరల వానిలోలయమగుచున్నవి. అట్టి త్రిగుణాతీతుడు నా ముందు కన్పించుచున్నాడు. నా పూర్వపుణ్యముచే నా తపము ఫలించినది. ప్రభో నన్ను కరుణించుమని ఆనంద పారవశ్యమున హిమవంతుడు దేహభావన మరచి నాట్యముచేసి సర్వప్రాణుల అంతర్గతుడవైన నిన్ను నేనేమి వరము కోరగలను. నా మనమున గల కోరిక నీవెరుంగనిది కాదు. గాన దనిని నెరవేర్చుమని వేడెను.

పరమశివుడు సంతుష్టుడై హే పర్వత రాజా నీ కోరిక నేనెరుంగుదును. నీవు పర్వత రాజులలో శ్రేష్టుడవగుదువు. దినిని అందరునూ అంగీకరింతురు. నీవు నాకునూ పుజ్యుడవగునట్లు చేయుదును. నా భక్తాగ్రగణ్యులే నాకిష్ఠులు కనుక నీ శిఖరములలో బదరీనామ శిఖరమును నా ఆశ్రమముగా చేసికొందును. కలగతిన జగదంబ నీకు పుత్రిక కాగలదు. తన పూర్వ తండ్రిని నిరశించి వదలివేయుటచే నీకు పుత్రికగా జన్మించగలదు. ఆమెను నాకు వివాహము చేయుటచే నాకు పూజ్యుడవగుదువు. బ్రహ్మాది దేవతలందరును నిన్ను కీర్తింతురు. ఈ బ్రహ్మ కల్పము తర్వాత నీవు ముక్తుడవై నా పదము పొందుదువని వరమొసగి వెంటనే హిమాలయ బదరీ శిఖరమున వసించెను. వెంటనే విష్ణుమూర్తి నర, నారాయణ రూపములు ధరించి, శివును సేవించుటకు ప్రతి దినమునూ ఆ శిఖరమునే తన నెలవుగా చేసికొనెను. ఈ శివలింగ దర్శనమున జీవులకు విదేహముక్తి గల్గి యోగులకునూ దుర్లభమగు శివపద ప్రాప్తిగల్గును. ఇది గ్రహించిన ముముక్షువులందరునూ తండోప తండములుగా ఈ పర్వత శిఖరము దర్శించి ముక్తులగుచుండిరి. ఈ పర్వత దర్శనమున ధర్మార్ధకామమోక్షబీజములు వెంటనే ఫలించుటచే ఈ క్షేత్రము కేదారము అనగా శీఘ్రఫలదాయక భూమియని ప్రశిద్ధిగాంచినది. జగద్వఖ్యాతమయిన కేదార పర్వత దర్శన కేదార లింగార్చనవలన పునరావృత్తి రహిత మోక్షము ప్రాప్తించినది.

మహాకైలాసమున ఒకపరి బ్రహ్మ కేదారము దర్శించి ముక్తులై కైలాసము చేరినవారి హృదయకమలమున మహాలింగ దర్శనము చూచి పరమానందముతో తానునూ కేదార దర్శనమునకు రాగా అక్కడ లింగమున శివదర్శనము కాలేదు. ఆశ్చర్యముతో అటునిటు పరుగెత్తి వెతుకదా అక్కడ ఆవులమందులో దాగి శంకరుడు వృషభరూపమున దర్శనమొసగెను. అప్పటినుండి కేదారలింగమున శివదర్శనము నిల్చిపోయినది. దానితో కేదార దర్శకులకు సద్యఃముక్తియు నిల్చిపోయినది. కాని అక్కడ ప్రాణత్యాగము చేసినవారు, రేతోదక జలపానము చేసినవారు మాత్రము ముక్తులగుచుండిరి.

శివుడు కేదార పర్వతమునుండి కాశీచేరినందున విశ్వేశ్వర నగరమగుటచే కాశీ ద్విగుణీకృతముగ ధర్మార్థ కామమోక్ష ఫలదాయినియు సద్యోముక్తి దాయినియు మాత్రమే గాక, కేదార పర్వతమునకంటె మిక్కుటమగు ఫలప్రదాయిని అయినది. కేదార పర్వత యాత్ర మోక్షదాయిని. కాశీ కేదార దర్శన, స్పర్శన, అర్చనములు అనాయాస ముక్తిదాయకములు. మహాదేవుని తారక మంత్రోపదేశముతో క్షణములో జీవి కాలభైరవ దండన లేకనే ముక్తిపొందును. 50 కోట్లయోజనముల విస్తీర్ణముగల భూమండలమున కాశీ విలక్షణమయినది. శివానుగ్రహముగలవారు కాశీలో మరణించి శివపదము పొందుదురు. శివజ్ఞాన రహస్యము కేవలము శివునికి మాత్రమే తెలియును. ప్రియసతి గౌరీమాతకు తెలియును. కుమారస్వామి ద్వారా సనత్కుమారులు తెలిసికొన గల్గిరి. కేదారనామోచ్ఛారణయు శివప్రీతికరమై కాశీవాసఫలితమొసంగును. కాశీవిశ్వేశ్వరునికిని, కేదారేశ్వరునికిని భేదములేదు. ఇట్టి కాశీ కేదార మహిమను వినినఋషిపుంగవులు పులకాంకితులై నిశ్చల ధ్యాన నిమగ్నులైరి.