Showing posts with label పంచక్రోశీ యాత్ర. Show all posts
Showing posts with label పంచక్రోశీ యాత్ర. Show all posts

Wednesday, September 20, 2017

పంచక్రోశీ కాశీ యాత్ర - మహాత్మ్యము - ఆరవ భాగము

యాత్రానియమములు
  1. పాదరక్షలు ఉపయోగించకుండ పాదయాత్రతో పంచ క్రోశీ యాత్రను చేయుట సర్వోత్తమము.
  2. మార్గమధ్యమందుగాని, మజిలీలయందుగాని మల, మూత్ర విసర్జన, తినుట, జలాదుల పానము మున్నగు పనులన్నియు పంచక్రోశ మార్గపు రోడ్డునకు ఎడమ వైపుననే చేసికొని, పాద ప్రక్షాళన ఆచమనములు చేయవలెను. మజిలీకి తరువాతి మజిలీకి మధ్య కూర్చుండరాదు. ఒక వేళ కూర్చున్నచో ఆ దోష పరిహారముగ కనీసము ఒక రూపాయిని ఆ కూర్చున్న ప్రదేశమునందుంచుట ఆచారముగ నున్నది.
  3. యాత్రా ప్రారంభమునకు ముందురోజునందును, యాత్రాదినములలో మజిలీలందును హవిషాన్నమును గాని ఫలాదికములను గాని తినవలెను. ఉల్లి, పప్పులు, నూనె, ఉప్పు, కారము, దుష్టాహారము భుజింపరాదు. ఉప్పునకు బదులు సైంధవ లవణము, కారమునకు బదులు మిరియముల పొడి వాడుకొనవలెను.
  4. పరాన్నమును భుజింపరాదు. ప్రతిగ్రహము నిషిద్ధము. ఇతరుల వస్తువులను తీసికొనరాదు. పరభార్యా సల్లాపములు చేయరాదు. బ్రహ్మ చర్యమును పాటింపవలెను. దుష్ట సాంగత్యమును వీడి సత్సంగముతో కాలమును గడుపవలెను. నేలపై శయనించవలెను.
  5. విశ్రాంతి సమయములందు పురాణ పఠన, భజన, స్తోత్ర పారాయణాదులతో సత్కాలక్షేపము చేయ వలెను.
  6. యథాశక్తిగా దానముల నీయవలెను.
  7. మజిలీలయందు అక్కడి తీర్థములందు స్నానమును చేసి, పితృతర్పణములు వీలున్నచో పిండప్రదానములు, అభిషేకాది అర్చనలు యధానుకూలముగ అవశ్యము ఆచరింపవలెను.
  8. పంచక్రోశీ మార్గమందు రోడ్డునకు కుడివైపున దేవతా గణములుందురు. యాత్రికులు రోడ్డునకు ఎడమ వైపున నడచుచూ, రోడ్డును దాటి, కుడివైపున గల దేవతా గణములను దర్శించి, ఆర్ద్రాక్షతలు, గంగాజలము, బిల్వదళములు దక్షిణలు, నివేదనలు (పంచదార గుండ్లు మున్నగునవి) సమర్పించవలెను. దేవతా గణములను దర్శించిన పిమ్మట మరల ఎడమవైపున తాము విడిచిన ప్రదేశమును కలుపుకొనుచు యాత్రను కొనసాగించవలెను. యాత్రా మార్గమును కొంచెము కూడ విడువ రాదు. వ్యర్థ సంభాషణలు చేయరాదు.
      పంచక్రోశాత్మకాయ, మహాలింగాయ, జ్యోతిర్లింగ స్వరూపాయ, కాశీ విశ్వేశ్వరాయ, శ్రీ శివాయనమః
అని పల్కుచు యాత్రను కొనసాగించవలెను. మజిలీలయందు పంచక్రోశీ రోడ్డునకు ఎడమవైపునందున్న ధర్మశాలలందు మాత్రమే బస చేయవలెను.

Saturday, September 16, 2017

పంచక్రోశీ కాశీ యాత్ర - మహాత్మ్యము - ఐదవ భాగము

యాత్రయందు వాస విచారము

శివుడు పార్వతికి తెలిపిన విధి ఉత్తమమైనదిగా పురాణములందు పేర్కొనబడినది.
ఒకరోజు నుండి ఏడు రోజులవరకు పంచ క్రోశీ దర్శన యాత్ర చేయు విధానము కలదు.
  1. ఒకరోజు పంచక్రోశీ దర్శన యాత్రను శివరాత్రినాడు అనేకులు చేయుచున్నారు. ఈ యాత్రయందు రామేశ్వరము విశ్రామస్థానము.
  2. రెండు రాత్రుల పంచక్రోశయాత్రయందు భీమచండీ, రామేశ్వరములు విశ్రామ స్థానములు.
  3. మూడు రాత్రుల యాత్రయందు భీమచండీ, రామేశ్వరము, కపిలధారలు విశ్రామ స్థానములు.
  4. నాల్గు రాత్రుల యాత్రయందు కర్దమేశ్వర, భీమచండీ, రామేశ్వరము, కపిలధారలు విశ్రామ స్థానములు.
  5. ఐదు రాత్రుల యాత్రయందు కర్దమేశ్వర, భీమచండీ, రామేశ్వరము, శివపురము, కపిలధారలు విశ్రామ స్థానములు. ఆంధ్రులు ఈ పంచదిన యాత్రను చేయుచున్నారు.
  6. ఆరు రాత్రుల యాత్రయందు కర్దమేశ్వర, భీమచండీ, సోమనాధ (లంగోటియా హనుమాన్), రామేశ్వరము, శివపురము, కపిలధారలు విశ్రామ స్థలములు.
  7. ఏడు రాత్రుల యాత్రయందు దుర్గాకుండ్, కర్దమేశ్వర, భీమచండీ, దేహలీ వినాయక, రామేశ్వరము, పాశపాణి వినాయక, కపిలధారలు విశ్రామ స్థానమలు.
గమనిక : వరుణా నదిని ఎట్టిపరిస్థితులందును దాటరాదు. రాజులు, వృద్ధులు, సుకుమారులగు బాలకులు వారికి అనుకూలమగు చోటులే విశ్రామ స్థానములు. క్షేత్ర సన్యాసులు సంకల్పించి పంచక్రోశీ దర్శనయాత్రను చేయరాదు. వారు నగర, వారాణసీ, మరియు వారాణసీ అంతర్గత యాత్రలన్నియు చేయవచ్చును.

పంచక్రోశీ కాశీ యాత్ర - మహాత్మ్యము - నాలుగవ భాగము

పంచక్రోశ యాత్ర యందు వాహననియమములు

శ్లో॥ పంచక్రోశ్యాశ్చ సీమానం ప్రాప్య దేవో జనార్దనః
వైనతేయా దవరుహ్య కరే ధృత్వా ధ్రువం తతః ॥ (కా. ఖం.)
విష్ణు భగవానుడు ధృవునితో కూడి గరుడ వాహనుడై కాశీ యాత్రకు వచ్చినప్పుడు, కాశీ సీమకు బయట గరుడుని నుండి దిగినాడు. ధ్రువుని చేతితో పట్టుకొని పాదచారియై కాశీ ప్రవేశము చేసెను.
కావున కాశీయందు వాహనారూఢులై యాత్రలు చేయరాదు.

శ్లో॥ బలీవర్దం సమారూఢాః శ్రుణు తస్యాపి యత్ఫలమ్
నరకే వసతే ఘోరే సమాః కల్పశతాయుతమ్ ॥
ఎడ్లబండిపై యాత్రలు గావించువారు పదివేల సంవత్సరములు ఘోర నరకమునందు పడుదురు.

శ్లో॥ సలిలంచ న గృహ్ణంతి పితరస్తస్య దేహినః
ఐశ్వర్య మదలోభ మోహాద్వా గచ్ఛేద్యానే నహియో నరః ॥
ఐశ్వర్య, మద, లోభ, మోహముల వలన వాహనముల నధిష్ఠించి యాత్రలు చేయువారి పితరులు వారి చేతులతో వదలు జలమును కూడ స్వీకరించరు.

శ్లో॥ నిష్ఫలం తస్య తత్తీర్థం తస్మాద్యానం వివర్జయేత్ ॥
వారి పంచక్రోశ యాత్ర నిష్ఫలమగును. కావున వాహనారూఢులై యాత్రలు చేయుట తగదు. (కూ. పు.)

శ్లో॥ నరయానం చాశ్వతరీ హయాది సహితో రథః
తీర్థయాత్రా హ్యశక్తానాం యాన దోష కరీ నహి ॥ (కూ. పు.)
అశక్తులు గుఱ్ఱపుబండిపై గాని, లేక పల్లకీపై(డోలీ) గాని యాత్ర చేయుట వలన దోషముండదు. శక్తి యున్నవారు పై విధముగా చేయుట సముచితము కాదు.

శ్లో॥ గోయానే గోవధః ప్రోక్తో హయ యానే తు నిష్ఫలమ్
నరయానే తదర్ధస్స్యాత్ పద్భ్యాం తచ్చ చతుర్గుణః ॥ (కూ.పు.)
శక్తి యుండి ఎడ్ల బండిపై యాత్ర చేయుట వలన గోహత్యా పాపము కల్గును. గుఱ్ఱపు బండి యాత్ర నిష్ఫలము. పల్లకీలో (డోలీ) యాత్ర వలన అర్ధ ఫలము. పాదయాత్ర వలన నాలుగు రెట్లు ఫలము లభించును.

శ్లో॥ పద్భ్యామ్ పాదుకా శూన్యా భ్యామ్ ॥ (వి.పు.)
పాదయాత్ర చేయువారు పాదరక్షలు (చెప్పులు) ధరింపరాదు.

శ్లో॥ యానమర్ధఫలం హన్తి తదర్థం ఛత్రపాదుకే
వాణిజ్యం త్రీస్తద్భాగాన్ సర్వం హన్తి ప్రతిగ్రహః ॥
వాహనముపై యాత్ర వలన సగము ఫలము నశించును. గొడుగు, పాదరక్షలు ధరించి యాత్ర చేయుట వలన దాని కంటె సగము ఫలము నశించును. యాత్రలో వాణిజ్యము వలన మూడుభాగములు, యాత్రలో ప్రతిగ్రహము వలన ఫలమంతయు నశించును.

గమనిక : పాదరక్షలు లేకుండ నడవలేని వారు పాదములకు వస్త్రములను కట్టుకొని యాత్ర చేయవచ్చును. నడచుటకు శక్తియుండియు మోటరు, ఆటోలు, ఆదిగా గల వాహనములనెక్కి, యాత్రలు చేయుట నిష్ఫలము. శరీరము కష్టపడుట వలననే పాపమునకు ప్రాయశ్చిత్తము. సమర్ధులై యుండియు వాహనములపై యాత్రలు చేయుట వలన తీర్థ మర్యాదకు భంగము కల్గును. ఇతర యాత్రికులు మనలను అనుసరించుట వలన మనకా పాపము సంక్రమించును. మనకు నియమానుసారము యాత్రలు చేయుటకు శక్తిలేనప్పుడు మన గోత్ర నామములతో మనకు ప్రతినిధిగా మఱొకరిని పంపి పంచక్రోశయాత్రను చేయింప వచ్చును. స్వర్గవాసులైన మన పితరుల నిమిత్తముగా సైతము ప్రతినిధిద్వారా యాత్రలు చేయించవచ్చును. అయితే ఆ ప్రతినిధులు యాత్రా నియమములను పాటించవలెను.

పాదయాత్ర చేయలేని అసమర్ధులు యథావిధిగ ఆజ్ఞామంత్ర, సంకల్పాదులు గావించి, అస్సీఘాటు దగ్గర ఆటో మున్నగు వాహనములపై నెక్కి యాత్రను ప్రారంభించవలెను. అనంతరము దుర్గా మందిరమునకు వెళ్లి దుర్గాదేవిని దర్శించవలెను. అక్కడినుండి మరల అస్సీఘాటునకు వచ్చి, పంచక్రోశీ మార్గములోని దేవతాగణములను యధావిధిగా దర్శించుచూ యవ వినాయకుని వరకు వచ్చి, యవ వినాయకుని యవలతో పూజించవలెను. ఆ పిమ్మట అక్కడనుండి గంగానదిలో పడవనెక్కి "విష్ణవేనమః" యని యవలు చల్లుకొనుచు, గంగా తీరమందలి దేవతా మూర్తులను స్మరించుచూ, అస్సీ ఘాటు వరకు రావలెను. అప్పుడు పంచక్రోశీ కాశీ ప్రదక్షిణయగును. పాదయాత్రను చేయలేని వారు మాత్రమే ఈ వాహన యాత్రను చేయవలెను.