Saturday, September 16, 2017

పంచక్రోశీ కాశీ యాత్ర - మహాత్మ్యము - నాలుగవ భాగము

పంచక్రోశ యాత్ర యందు వాహననియమములు

శ్లో॥ పంచక్రోశ్యాశ్చ సీమానం ప్రాప్య దేవో జనార్దనః
వైనతేయా దవరుహ్య కరే ధృత్వా ధ్రువం తతః ॥ (కా. ఖం.)
విష్ణు భగవానుడు ధృవునితో కూడి గరుడ వాహనుడై కాశీ యాత్రకు వచ్చినప్పుడు, కాశీ సీమకు బయట గరుడుని నుండి దిగినాడు. ధ్రువుని చేతితో పట్టుకొని పాదచారియై కాశీ ప్రవేశము చేసెను.
కావున కాశీయందు వాహనారూఢులై యాత్రలు చేయరాదు.

శ్లో॥ బలీవర్దం సమారూఢాః శ్రుణు తస్యాపి యత్ఫలమ్
నరకే వసతే ఘోరే సమాః కల్పశతాయుతమ్ ॥
ఎడ్లబండిపై యాత్రలు గావించువారు పదివేల సంవత్సరములు ఘోర నరకమునందు పడుదురు.

శ్లో॥ సలిలంచ న గృహ్ణంతి పితరస్తస్య దేహినః
ఐశ్వర్య మదలోభ మోహాద్వా గచ్ఛేద్యానే నహియో నరః ॥
ఐశ్వర్య, మద, లోభ, మోహముల వలన వాహనముల నధిష్ఠించి యాత్రలు చేయువారి పితరులు వారి చేతులతో వదలు జలమును కూడ స్వీకరించరు.

శ్లో॥ నిష్ఫలం తస్య తత్తీర్థం తస్మాద్యానం వివర్జయేత్ ॥
వారి పంచక్రోశ యాత్ర నిష్ఫలమగును. కావున వాహనారూఢులై యాత్రలు చేయుట తగదు. (కూ. పు.)

శ్లో॥ నరయానం చాశ్వతరీ హయాది సహితో రథః
తీర్థయాత్రా హ్యశక్తానాం యాన దోష కరీ నహి ॥ (కూ. పు.)
అశక్తులు గుఱ్ఱపుబండిపై గాని, లేక పల్లకీపై(డోలీ) గాని యాత్ర చేయుట వలన దోషముండదు. శక్తి యున్నవారు పై విధముగా చేయుట సముచితము కాదు.

శ్లో॥ గోయానే గోవధః ప్రోక్తో హయ యానే తు నిష్ఫలమ్
నరయానే తదర్ధస్స్యాత్ పద్భ్యాం తచ్చ చతుర్గుణః ॥ (కూ.పు.)
శక్తి యుండి ఎడ్ల బండిపై యాత్ర చేయుట వలన గోహత్యా పాపము కల్గును. గుఱ్ఱపు బండి యాత్ర నిష్ఫలము. పల్లకీలో (డోలీ) యాత్ర వలన అర్ధ ఫలము. పాదయాత్ర వలన నాలుగు రెట్లు ఫలము లభించును.

శ్లో॥ పద్భ్యామ్ పాదుకా శూన్యా భ్యామ్ ॥ (వి.పు.)
పాదయాత్ర చేయువారు పాదరక్షలు (చెప్పులు) ధరింపరాదు.

శ్లో॥ యానమర్ధఫలం హన్తి తదర్థం ఛత్రపాదుకే
వాణిజ్యం త్రీస్తద్భాగాన్ సర్వం హన్తి ప్రతిగ్రహః ॥
వాహనముపై యాత్ర వలన సగము ఫలము నశించును. గొడుగు, పాదరక్షలు ధరించి యాత్ర చేయుట వలన దాని కంటె సగము ఫలము నశించును. యాత్రలో వాణిజ్యము వలన మూడుభాగములు, యాత్రలో ప్రతిగ్రహము వలన ఫలమంతయు నశించును.

గమనిక : పాదరక్షలు లేకుండ నడవలేని వారు పాదములకు వస్త్రములను కట్టుకొని యాత్ర చేయవచ్చును. నడచుటకు శక్తియుండియు మోటరు, ఆటోలు, ఆదిగా గల వాహనములనెక్కి, యాత్రలు చేయుట నిష్ఫలము. శరీరము కష్టపడుట వలననే పాపమునకు ప్రాయశ్చిత్తము. సమర్ధులై యుండియు వాహనములపై యాత్రలు చేయుట వలన తీర్థ మర్యాదకు భంగము కల్గును. ఇతర యాత్రికులు మనలను అనుసరించుట వలన మనకా పాపము సంక్రమించును. మనకు నియమానుసారము యాత్రలు చేయుటకు శక్తిలేనప్పుడు మన గోత్ర నామములతో మనకు ప్రతినిధిగా మఱొకరిని పంపి పంచక్రోశయాత్రను చేయింప వచ్చును. స్వర్గవాసులైన మన పితరుల నిమిత్తముగా సైతము ప్రతినిధిద్వారా యాత్రలు చేయించవచ్చును. అయితే ఆ ప్రతినిధులు యాత్రా నియమములను పాటించవలెను.

పాదయాత్ర చేయలేని అసమర్ధులు యథావిధిగ ఆజ్ఞామంత్ర, సంకల్పాదులు గావించి, అస్సీఘాటు దగ్గర ఆటో మున్నగు వాహనములపై నెక్కి యాత్రను ప్రారంభించవలెను. అనంతరము దుర్గా మందిరమునకు వెళ్లి దుర్గాదేవిని దర్శించవలెను. అక్కడినుండి మరల అస్సీఘాటునకు వచ్చి, పంచక్రోశీ మార్గములోని దేవతాగణములను యధావిధిగా దర్శించుచూ యవ వినాయకుని వరకు వచ్చి, యవ వినాయకుని యవలతో పూజించవలెను. ఆ పిమ్మట అక్కడనుండి గంగానదిలో పడవనెక్కి "విష్ణవేనమః" యని యవలు చల్లుకొనుచు, గంగా తీరమందలి దేవతా మూర్తులను స్మరించుచూ, అస్సీ ఘాటు వరకు రావలెను. అప్పుడు పంచక్రోశీ కాశీ ప్రదక్షిణయగును. పాదయాత్రను చేయలేని వారు మాత్రమే ఈ వాహన యాత్రను చేయవలెను.

పంచక్రోశీ కాశీ యాత్ర - మహాత్మ్యము - మూడవ భాగము

పంచక్రోశీయాత్ర ఎప్పుడు చేయాలి?

మహాదేవ ఉవాచ
శ్లో॥ అశ్విన్యాదిషు మాసేషు త్రిషు పార్వతి సర్వదా
ప్రదక్షిణా కర్తవ్యా క్షేత్ర స్యాపాప కాంక్షిభిః
మాఘాది చతురోమాసాః ప్రోక్తా యాత్రా విధౌ నృణామ్ ॥
ఓ పార్వతి! ఆశ్వయుజ, కార్తీక, మార్గశీర్ష, మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ మాసములందు పంచక్రోశ యాత్రను చేయుట మంచిది. (బ్ర. వై. పు., కాశీ రహస్యం)

శ్లో॥ యథా కథంచిత్ దేవేశి! పంచక్రోశ ప్రదక్షిణమ్
కుర్యాదేవ న మాసాది చింతయేద్ధర్మ కోవిదః
స ఏవ శుభదః కాలో యస్మిన్ శ్రద్ధోదయో భవేత్ ॥
శ్రద్ధ ముఖ్యము. శ్రద్ధావంతులు నెలలతో నిమిత్తము లేకుండ ఎప్పుడైననూ పంచక్రోశ యాత్ర చేయవచ్చును.

గమనిక : కాశీవాసులగు ఆంధ్రులు సామాన్యముగ కార్తీక, ఫాల్గుణ మాసములందు పంచక్రోశ యాత్రను చేయుచున్నారు. అనగా దక్షిణాయణమునందొకసారి, ఉత్తరాయణమునందొకసారి చేయుచున్నారు.

క్షేత్ర సన్యాసుల కర్తవ్యము

శ్లో॥ విధిస్తు పూర్వమేవోక్తో నియమాదియుత స్తవ
ప్రదక్షిణాత్రయం తేషాం అవధారయ సువ్రతే ॥ (. పు.)
ఓ పార్వతీ! క్షేత్రమునందుండు సన్యాసులు అందరివలె విధి నియమములను పాటించుచు కాశీ ప్రదక్షిణను చేయవలెను. వారు మూడు పర్యాయములు ప్రదక్షిణను అవశ్యమాచరింపవలెను. అంతకంటె అధికముగ చేసినచో చాల మంచిది. మూడు సార్లకంటె తక్కువ కాకుండ శ్రద్ధ వహింపవలెను.

Saturday, September 9, 2017

పంచక్రోశీ కాశీ ప్రదక్షిణ యాత్రా మాహాత్మ్యము - రెండవ భాగము

పంచక్రోశీ కాశీ ప్రదక్షిణ యాత్రా మాహాత్మ్యము

శ్లో॥ కాశ్యాం తిష్ఠతి యోనిత్యం స్నాతి భాగీరథీ జలే
కుర్యాత్ సాంవత్సరీ యాత్రాం పంచక్రోశస్య సుందరి ॥
శ్లో॥ వారాణసీం సమాసాద్య ప్రమాదాద్యో బహిర్గతః
స దైవాత్పునరాగత్య ప్రదక్షిణేన శుద్ధ్యతి ॥ (బ్ర.వై.పు.)

ఓ పార్వతీ! కాశీయందు నివసించుచు నిత్యము గంగా స్నానమును చేయువారు కూడ సంవత్సరమునకొకసారి పంచక్రోశ యాత్రను చేయవలెను. ఎందువలననంటే కాశీవాసి ప్రమాదవశమున గాని, ఏదో కారణముచేత గాని కాశీని విడిచి బయటికి వెళ్లును. తిరిగి కాశీ ప్రవేశించినంతనే పంచక్రోశ ప్రదక్షిణ వలన శుద్ధుడగును.
ఒకనాడు జైగీషవ్యముని "ఓ కుమారస్వామీ! కాశీయందు ప్రమాదమువలన చేసిన చిన్న పెద్ద పాపముల నుండి విముక్తిని కల్గించు సులభోపాయమును తెలుపుము" అని అడుగగా కుమారస్వామి యిట్లు పల్కెను-

శ్లో॥ ప్రాయశ్చిత్తవిహీనానాం, న శాన్తిః కుత్రచిద్భవేత్
కింపునః కాశికామధ్యే పాపం కృత్వా సుఖం లభేత్॥
ప్రాయశ్చిత్తములు చేయనివారికి పాపములు శాంతించవు. ముక్తి క్షేత్రమగు కాశియందు పాపములను చేసినవారు ప్రాయశ్చిత్తము సేయక ఎట్టి పరిస్థితులందును సుఖమును పొందరు.

శ్లో॥ బ్రహ్మహత్యాది పాపానాం ప్రాయశ్చిత్తం హి కాశికా
కాశికాయాం కృతే పాపే ప్రాయశ్చిత్తం నవిద్యతే ॥
బ్రహ్మహత్యాది పాపములకు ప్రాయశ్చిత్తము కాసీ నివాసము. కాశీ కృత పాపములకు ప్రాయశ్చిత్తము లేదు.

శ్లో॥ ప్రాయశ్చిత్త విహీనానాం యాతనాస్తి సుదారుణా
జ్ఞాన స్వరూపా కాశీయం, పంచక్రోశే పరిస్థితా ॥
శ్లో॥ తస్యాః ప్రదక్షిణం కృత్వా సర్వపాపైః ప్రముచ్యతే
ప్రాయశ్చిత్తమును చేయనివారు రుద్ర పిశాచ రూపమై సుదారుణమగు భైరవ యాతనలను అనుభవించుదురు. కాని జ్ఞాన స్వరూపయగు కాశీ ప్రదక్షిణము గావించిన వారు సర్వపాపములనుండి విముక్తులగుదురు.

శ్లో॥ మమ బ్రహ్మమయం లింగం ఆపాతాలాత్ సముపస్థితమ్
శివలోకోపరిగతమ్ అత్యతిష్ఠద్దశాంగులమ్ ॥
పాతాళ లోకమునుండి బయటికి వచ్చిన బ్రహ్మమయ మగు విశ్వేశ్వరలింగము శివలోకముపైన పది అంగుళముల వరకు వ్యాపించియున్నది. ఈ పంచక్రోశ పరిమాణముగల కాశియందు సర్వత్రవ్యాప్తమైయున్నది.


శ్లో॥ ఆజన్మ సంచితైః పాపైః ముచ్యతే తత్ప్రదక్షిణాత్
క్షేత్రే కృతానాం పాపానాం ప్రాయశ్చిత్తం న చేతరం ॥
ఒక్క పంచక్రోశీ కాశీ ప్రదక్షిణమువలన జన్మ ప్రభృతి కావించిన పాపములనుండి విముక్తిని పొందుదురు. కాశీ కృత పాపములకు దీనికంటె భిన్నమగు ప్రాయశ్చిత్తము లేదు.

శ్లో॥ దక్షిణే చోత్తరేచైవ హ్యయనే సర్వదా మయా
క్రియతే క్షేత్రదాక్షిణ్యం భైరవస్య భయాదపి ॥ (. సం.)
ఓ పార్వతీ! నేను (శివుడు) భైరవ భయముచే దక్షిణ ఉత్తరాయణములందు సంవత్సరమున రెండు సార్లు పంచక్రోశీ ప్రదక్షిణ యాత్రను చేయుదును.

శ్లో॥ ప్రదక్షిణ ద్వయం కృత్వా దశజన్మ కృతాదఘాత్
ముక్తో భవతి పాపాత్మా సద్యో మోక్ష మవాప్నుయాత్ ॥
రెండు ప్రదక్షిణలు చేయుట వలన దశ జన్మ కృతపాపముల నుండి విముక్తులై వెంటనే ముక్తులగుదురు.

శ్లో॥ ప్రదక్షిణ త్రయం కృత్వా పాపం జన్మశతార్జితమ్
విలయం ప్రాపయతి నో నాత్రకార్యా విచారణా ॥
ప్రదక్షిణ త్రయమొనర్చుటవలన శతజన్మ కృత పాపములనుండి విముక్తులగుదురు. ఏ మాత్రము సందేహము లేదు.

శ్లో॥ యావజ్జీవం వసేత్ కాశ్యాం ప్రత్యబ్దం సుప్రదక్షిణమ్
క్షేత్రం ప్రదక్షిణీ కృత్య భవేత్పాపో హి విజ్వరః ॥
యావజ్జీవము కాశీయందు నివసించవలెను. ప్రతి సంవత్సరము అలసత్వమును వీడి ఆనందవనమగు కాశీకి ప్రదక్షిణమును చేసి పాపరహితులు కావలెను.

శ్లో॥ ప్రత్యబ్దం యే ప్రకుర్వంతి పంచక్రోశ ప్రదక్షిణామ్
జీవన్ముక్తాస్తు తే జ్ఞేయాః నిష్పాపాః కాశి వాసినః ॥
ప్రతి సంవత్సరము పంచక్రోశీ ప్రదక్షిణ గావించు కాశీ వాసులు జీవన్ముక్తులు, పాప రహితులు.

శ్లో॥ కాశీ ప్రదక్షిణా యేన కృతా త్రైలోక్య పావనీ
సప్తద్వీపా సాబ్ధి శైలా భూః పరిక్రామితాఽమునా ॥
ఓ పార్వతీ! త్రైలోక్య పావనియగు కాశీ ప్రదక్షిణను చేసిన వారు సప్తద్వీపములు, సప్త సముద్రములు, పర్వతములతో కూడిన భూమిని ప్రదక్షిణించిన వారితో సమానులు. వారు సర్వపాపవిముక్తులై జన్మరహితులై శివసాయుజ్యమును పొందుదురు.

పంచక్రోశీ కాశీ ప్రదక్షిణ యాత్ర -- మాహాత్మ్యము

శ్లో॥ విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణించ భైరవమ్
వన్దే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికామ్ ॥
శ్లో॥ పంచక్రోశాత్మకాయ మహాలింగాయ
జ్యోతిర్లింగ స్వరూపాయ కాశీవిశ్వేశ్వరాయ
శ్రీ శివాయ నమః

కాశీ పరిమాణము

కాశీ యందు కాలభైరవ సమీపమునందు మధ్యమేశ్వర లింగము కలదు. ఆ మధ్యమేశ్వరుని కేంద్రముగా జేసి అక్కడినుండి పడమటి దిశయందుగల దేహలీ వినాయకునివరకు సూత్రమును పట్టి, దానిని అర్థవ్యాసముగ జేసి, మండలాకారముగ చుట్టినచో, ఆ పరిధిలోపలగల క్షేత్రమును “పంచక్రోశాత్మక కాశి” యని పురాణములు ప్రవచించినవి. ఇచ్చట ముక్తి ప్రతిష్ఠితమైయుండును. ఈ పరమ క్షేత్రము విశేష ఫలసాధనమైనది.

వారణాసీ పరిమాణము

తూర్పు దిక్కున "గంగానది" మధ్యభాగము, దక్షిణమున "అసీ" నది, పడమటి దిశయందు "పాశపాణి వినాయకుడు", ఉత్తరమున "వరణానది" అవధిగా కల్గి, ఆ మధ్యనున్న క్షేత్రము "వారాణసి". ఇది దివ్యమును విశేష ఫలసాధనమునైనది.

అవిముక్త పరిమాణము

విశ్వేశ్వర లింగమునుండి నాల్గు దిక్కులందు రెండువందల ధనుస్సుల పరిధిలోపల నున్న ప్రదేశము "అవిముక్తము". ఈ క్షేత్రమునందు ముక్తి అవశ్యము లభించును. ఏ మాత్రము సందేహము లేదు.

అంతర్గృహ పరిమాణము

తూర్పున "మణికర్ణికేశ్వరుడు", దక్షిణమున "బ్రహ్మేశ్వరుడు", పడమటి దిశ యందు "గోకర్ణేశ్వరుడు", ఉత్తరమున "భారభూతేశ్వరుడు" సరిహద్దులుగాగల క్షేత్రము "విశ్వనాథుని గృహము". ఈ క్షేత్రమునే "అంతర్గృహము" అందురు.

కాశి కంటె వారణాసి, వారణాసి కంటె అవిముక్తము, అవిముక్తము కంటె అంతర్గృహము పరిమాణములో చిన్నవి. అనగా కాశీపరిధి లోపల వారాణసి, వారాణసి పరిధిలోపల అవిముక్తము, అవిముక్తము పరిధిలోపల అంతర్గృహము నున్నవని గ్రహించవలెను.

కాశీకృత పాపముల నుండి ముక్తి

ఓ కాశీనాథ! కాశీయందు చేసిన పాపముల విముక్తికి సులభోపాయ మేమి? యని పార్వతి ప్రార్ధించగా విశ్వనాధుడిట్లు పల్కెను.

శ్లో॥ అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి
పుణ్యక్షేత్రే కృతం పాపం గంగా తీరే వినశ్యతి ॥
శ్లో॥ గంగా తీరే కృతం పాపం కాశీం ప్రాప్య వినశ్యతి
కాశ్యాంతు యత్కృతం పాపం వారాణస్యాం వినశ్యతి ॥
శ్లో॥ వారాణస్యాం కృతం పాపమవిముక్తే వినశ్యతి
అవిముక్తే కృతం పాపం అంతర్గేహే వినశ్యతి ॥
శ్లో॥ అంతర్గేహే కృతం పాపం వజ్రలేపో భవిష్యతి
వజ్రలేపచ్ఛిదం హ్యేతత్ పంచక్రోశ ప్రదక్షిణమ్॥
శ్లో॥ తస్మాత్ సర్వప్రయత్నేన కుర్యాత్ క్షేత్ర ప్రదక్షిణమ్

మనుష్యుడు అన్యక్షేత్రములందు చేసిన పాపములు పుణ్య క్షేత్రములందు నశించును. పుణ్యక్షేత్రములందు చేసిన పాపములు గంగాతీరమున నశించును. గంగాతీరమునందు చేసిన పాపములు కాశీయందు ప్రవేశించిన తోడనే నశించును. కాశీయందు చేసిన పాపములు వారాణసియందు నశించును. వారాణసియందు చేసిన పాపములు అవిముక్తమునందు నశించును. అవిముక్తమునందు చేసిన పాపములు అంతర్గృహమునందు నశించును. అంతర్గృహమునందు చేసిన పాపములు వజ్రలేపము వంటివి. అనగా పాపకర్తను విడిచి వెళ్లవని భావము. ఆ వజ్రలేపము వంటి పాపము పంచక్రోశాత్మక జ్యోతిర్లింగ స్వరూపమగు కాశీ ప్రదక్షిణ యాత్ర వలన మాత్రమే తొలగును. కావున కాశీ వాసులు సర్వవిధముల ప్రయత్నించి, పంచక్రోశీ కాశీ ప్రదక్షిణ యాత్రను అవశ్యమాచరింప వలెను.

Sunday, August 27, 2017

Tuesday, March 4, 2014

కాశీ హిందూ విశ్వవిద్యాలయం లో ఉద్యోగావకాశాలు



కాశీ హిందూ విశ్వవిద్యాలయం లో ఉద్యోగావకాశాలు

కాశీ హిందూ విశ్వవిద్యాలయాన్ని 1916 లో పండిత మదన మోహన మాలవీయా స్థాపించారు. దీనికి ప్రస్తుతం రెండు కాంపస్ లు ఉన్నాయి. వారణాశిలో 1300 ఎకరాలలోను మరియు 80 కి.మీ. దూరంలో మీర్జాపూర్ వద్ద బరకచ్ఛా లో 2600 ఎకరాలలోను. ఈ రెండు కాంపస్ లలోను ఉన్న ఖాళీలను భర్తీచేయడానికి వివిధ వర్గాలలో – టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలకు గాను ప్రకటన వెలువడింది. ఆశక్తి గల అభ్యర్ధులు www.bhu.ac.in కు లాగ్ ఆన్ అయి పూర్తి వివరాలను తెలుసుకొనవచ్చును. ఆఖరు తేదీ మార్చ్ 30, 2014.

కాశీ హిందూ విశ్వవిద్యాలయం - 2014-15 విద్యా సంవత్సరం లో స్నాతక, స్నాతకోత్తర పాఠ్యక్రమాల్లో ప్రవేశానికి ధరఖాస్తులు స్వీకరించబడుతున్నాయి



కాశీ హిందూ విశ్వవిద్యాలయం - 2014-15 విద్యా సంవత్సరం లో స్నాతక, స్నాతకోత్తర పాఠ్యక్రమాల్లో ప్రవేశానికి ధరఖాస్తులు స్వీకరించబడుతున్నాయి

పండిత మదనమోహన మాలవీయా స్థాపించిన కాశీ హిందూ విశ్వవిద్యాలయం లో గ్రాడ్యుయేట్ మరియి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశానికి గాను నోటిఫికేషను జారీ చేయబడినది. అప్లికేషన్లు ఆన్ లైన్ లో జమచేయవలసి ఉంటుంది. అప్లికేషన్లు జమచేయుటకు ఆఖరి తేదీ మార్చి 25, 2014. పూర్తి వివరాలకు మరియు అప్లికేషను జమచేయుటకు ఆన్ లైన్ ఎడ్రస్ www.bhuonline.in.

ప్రవేశపరీక్షలు మే మరియు జూన్ నెలలలో శని మరియు ఆదివారాల్లో ఉంటాయి. పరీక్షాకేంద్రాలు వారణాశి, న్యూ ఢిల్లీ, గోరఖ్ పూర్, చెన్నై, కోల్ కత్తా,  హైదరాబాదు లలో ఉన్నాయి.

కాశీ హిందూ విశ్వవిద్యాలయం 1916 లో స్థాపించబడింది. అందువల్ల 2016 లో 100 సంవత్సరాలు పూర్తిచేసుకుంటుంది. ఈ విద్యాసంవత్సరంలో పీజీ కోర్సులలో చేరిన వారికి డిగ్రీలు విశ్వవిద్యాలయం 100 వ (శతాబ్ది సంవత్సరం) సంవత్సరంలో జరిగే కాన్వోకేషన్ లో ఇవ్వబడతాయి.