Thursday, January 22, 2009

పంచదశోధ్యాయము

ఋషులు సూతుని మహాత్మా శ్రీ మహావిష్ణువు నరనారాయణులుగా విభాగమయి శ్రీకేదారేశ్వరుని పూజించుటకు, తపమాచరించుటకు ఎపుడు వచ్చిరి? ఆకాల భేదము సెలవిండని కోరిరి. దానికి సూతుడు నవ్వుచూ బ్రాహ్మణోత్తములారా వేద, శాస్త్ర, పురాణములన్నియు అనాదిగా యున్నవి. పరమేశ్వరుని సహచ ఉచ్ఛావస, నిశ్వాస నుండి ఉదయించినవి వేదములు. కనుక వీనికి కాల భేదముయొక్క మలినమంటదు. పరమాత్మ లీలా రూపమగు ఈ ప్రపంచ సృష్ఠి, స్థితి, లయలు కాలమునకు అతీతుము. ఊహకందునవి కావు. కనుక గంగాదేవి వృత్తాంతము సాకల్యముగా వినుడని చెప్పదొడగెను.

విష్ణుమూర్తి తపమాచరించు సమయమున నేను అలకనంద నామముతో అక్కడకు చేరి, అతనికి శీతలబాధ కలుగకుండ అనుష్టానమునకు గాను అతని ఎదుట సమశీతోష్ణగుండముగా నిలచితిని. తర్వాత మందాకిని నామముతో కేదారేశ్వరుని సేవించు కొనుటకు వెళ్ళి కొత్త పెండ్లి కుమార్తెగా ఒక అంశతో పతి సమక్షమున నుంటుని. ఆయన నాలో స్నానము చేయుటచే నేను ఉష్ణ గుండనునే ఆయన కుండల మణి ప్రభావమున మణికర్ణికనైతిని. అక్కడనుండి భగీరధుని వెంబడించి కుశావర్తమును గంగా ద్వారము/ హరిద్వారము/మాయాపురి యందు భూమిని తాకి, జహ్నుముని పుత్రికగా స్వీకరింపబడి మీతో కలిసి కాశీకి చేరి కేదారనాధుని ఎదుట ప్రాచీన మణికర్ణికతో కలసి ఖివాపరాధ ప్రాయశ్చిత్తము పొంది యమున, సరస్వతి, మరియు ఇతర నదులతో కలసి, విశ్వేశ్వర, మణికర్ణికాది దేవతలనందరను పదే పదే ప్రార్ధించి సగర పుత్రులనుద్ధరించుటకు … ప్రవహించితినని గంగ తన వృత్తాంతము సవిస్తరముగా వినిపించెను. కేదారేశ్వరుడు పరమ ప్రీతితో, సఖీ! మన సంగమ స్థలమగు నిచట స్నానమాచరించిన వారు ముక్తులగుదురు. జన్మ జన్మాంతరములలో చేసిన వివిధ పాపములన్నియు కాశీ దర్శన భాగ్యమున ముక్తమగును. కాశీలో చేసిన శివాపరాధములన్నియూ ప్రాచీన మణికర్ణికా స్నానమున ముక్తమగును. ఈనాటి మన సంగమదినము శ్రావణ సోమవారము, పూర్ణిమ యగుటచే విశేషము. ఇది దుర్లభము. ఏ ప్రాణియయినను ఇట్టి మహత్తర యోగ దినమున ఈ గౌరీ కుండమందు స్నానమాడినచో వారు నా రూపము ధరించి నన్ను చేరుదురు. నా ఎదుట గల గౌరీకుండ స్నానమున నీవు ధన్యత జెందితివి. గౌరీ దేవి నాయడల చేసిన అపరాధము ఇక్కడ 12 సంవత్సరములు తపమాచరించి, హరంపాప/రేతోదక తీర్థ స్నానమున ముక్తమయినది. అటులనే సరస్వతి బ్రహ్మదేవుని గోరిన పాపమునుండి ముక్తమయినది. కనుక ఇట్టి మహత్తర రహస్యమగు కాశీ కేదార కథను వినినవారు నిశ్చయముగ మరల తల్లి గర్భవాసము లేకయే ముక్తులగుదురు. ఈ వృత్తాంతము సాకల్యముగ తెలసికొనిన సనత్కుమార వామదేవులు, నాధశర్మ, అనవద్యలు, నా గురువర్యులు వ్యాస భగవానులు, వారిద్వారా విన్న నేను, నాద్వారా వినిన మీరందరునూ ధన్యులయితిరని సూత పౌరాణికుడు నైమిశారణ్యమున మునులకు వినిపించిరి.

Saturday, January 10, 2009

చతుర్దశోధ్యాయము

శౌనకాదులు సూతుని మహాత్మా! యముల, సరస్వతుల వృత్తాంతములను వినిన గంగ తన విషయము వారతో ఏమి చెప్పినది. గంగ శంకరునెట్లు వివాహమాడినది తెలుపుడని ప్రార్థించగా వారికి సూతపౌరాణికులిట్లు తెల్పిరి. గంగ, యమున సరస్వతులతో చెలులారా! నేను పరాశక్తి అంశను. బ్రహ్మకు శివుడు, దేవతలకు బ్రహ్మ, తర్వాత భగీరధుని తపస్సుకు మెచ్చి బ్రహ్మ వదలిన నన్ను భరించుటకు భగీరధుడు శివుని ప్రార్థించగా శివుడంగీకరించినపుడు నేను చపల బుద్ధితో, స్త్రీ సహజ అహంభావముచే, శివుని మహత్తు తక్కువగా ఎంచి అతని శిరముపై దూకి పాతాళమునకు త్రొక్కదలచితిని. శివుడు అతివాగముగా దూకిన నన్ను ఒక సాధారణ జలబిందువు పగిది తన జటా జూటమున బంధించివేసెను. ఎంత ప్రయత్నించినను బయల్పడవీలులేని నేను నిస్సహాయురాలనై శివుని గురించి తపస్సు చేయగా ఆయన సంతోషించి నీ కోరిక ఏమని అడిగిరి. మీరు నానాథులు కావలయునంటిని. శివుడు నవ్వి నీవు పరాశక్తి అంశతో ఉద్భవించితివి, కనుక నీవు నాసతివే. నీవు గర్వముతో నాతలపై దూకి నన్ను చులకనగా తలంచి శివాపరాధమునకు పాలపడితివి గనుక నిన్ను నా జటలో బంధించితిని. అట్లుకూడ నిన్ను తలపై ధరించి సతిగా స్థానమిచ్చితిని. నీపాప పరిహారము కొఱకు నీవు హిమవంతునిపై దిగి అతని పుత్రికగా గుర్తింపబడి, తపస్సుచేసి ఉమాదేవిచే చెల్లెలిగా గుర్తింపబడి ఆమెద్వారా నన్ను జేరుదువు అని శంకరులు పల్కగా సంతసించి అచంచల మనస్సుతో తపమాచరించుచుంటిని.

భగీరధుని కోరికపై శంకరులు నన్ను భూమికి వెళ్ళమనగా నేను భయముచే నన్ను విడువవద్దని శంకరుని ప్రార్ధించితిని. దానికి శంకరులు భయపడవలదని, హిమవంతుని పుత్రిగా, గిరిజ చెలిగా నీవు గుర్తింపబడి గిరిజ ద్వారానే నన్ను పొందగలవు. భక్తరక్షణ నా కర్తవ్యము. కనుక ఒక అంశగా హిమాలయముచేరి అక్కడ నుండి 7 పాయలుగా విడివడి 3 పాయలు తూర్పు సముద్రము, 3 పాయలు పశ్చిమ సముద్రములో కలిసి ఒకపాయ భగీరధుని రధము వెంట నడిచి జహ్నుముని ఆశ్రమముమీదుగా ప్రవహించి జహ్నుముని కోపకారణంగా అతని గర్భమును ప్రవేశించి, పుత్రికవై మరల భగీరధుని ప్రార్ధనపై జహ్నుముని కుడిచెవి నుండి బయల్పడి ప్రవహించుచు కాశీచేరి అచట కేదారేశ్వరుని ఎదుటనున్న హరంపాప/రేతోదక తీర్థముతో కలసి గౌరీదేవిని పూజించి, కేదార, విశ్వేశలింగములను పూజించి, మణికర్ణికను కలసి చివరగా సగర పుత్రులను తరింపజేసి సముద్రమును జేరుదువు. ఇపుడు త్రేతాయుగము జరుగుచున్నది, తరువాత ద్వాపర, కలియుగములు గడిచి మరల కృతయుగము వరకు షోడశ కళలతో సాశీలో నుందువు. ఒక అంశ మాత్రమే సముద్రమును జేరును. ఈ నాల్గు యుగములలోను పృధ్విపై జీవులను ఉద్ధరింతువు. త్రేతా, ద్వాపర, కలియుగములలో ధర్మము క్రమముగా 3, 2, 1 పాదము మాత్రమే మిగులును. మరల సత్యయుగమునకు ధర్మము నాల్గుపదములు ప్రవర్తించును. త్రేతాయుగ, ద్వాపరయుగములలో నీసేవనము ద్వారా కర్మబంధములనుండి ముక్తులగుదురు. కలియుగమున మానవులు కర్మ భ్రష్ఠులై దుర్బుద్ధులగుదురు. చాతుర్వర్ణములలో వర్ణ సంకరము జరిగి పాపులగుదురు. వేదనింద, బ్రాహ్మణ నింద జరుగును. అగ్రజాతులు నీచులై,నీచులు అగ్రజాతులై, మ్లేచ్ఛులు, చండాలురు, పుల్కసులు రాజులగుదురు. పరస్త్రీల సతీత్వము భంగపరచి శతవిధ ప్రయత్నములచే ద్రవ్యాపహరణ, యథారాజా, తథా ప్రజా! గా ధర్మలుప్తమై అల్పుల మాటలు వేదవాక్కులై శాస్త్ర విరుద్ధ కర్మలాచరించి, ధర్మా ధర్మములు తెలిసికొనక, మూఢులే ప్రబలి సనాతన ధర్మము అవహేళనకు గురికాబడి అధర్మములే ఉపదేశములై నాచే నిర్దేశింపబడిన వేదశాస్త్రములు తెలియజాలక బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అనేక తెగలై, కర్మభ్రరష్టులగుదురు. దేవ, ఋషి, ద్విజ, రాజన్య, వైశ్య , శూద్ర, బిడాల (మోసగాండ్రు), పశు, మ్లేచ్ఛ, చండాలురుగా 10 తెగలుగా బ్రాహ్మణులు దిగజారుదురు. కృత, త్రేత, ద్వాపర యుగములలో దేవ. ఋుషి, ద్విజ, రాజన్యులు నాల్గు తెగల బ్రాహ్మణులుందురు. మిగిలిన 6 తెగలవారును కర్మానుసారముగా కలియుగ బ్రాహ్మణులు. నిత్యము షట్కర్మలాచరించు అష్టాంగ యోగనిరతులు, నా రహస్యములను తెలిసినవారు గేవబ్రాహ్మణులు. షట్కర్మ నిరతులు, యోగయుక్తులు, వేదశాస్త్ర పద్ధతిగా యజ్ఞములాచరించువారు ఋషి బ్రాహ్మణులు. షట్కర్మలాచరించుచు, శాస్త్రవిధిన నా పూజలు సల్పువారు వేదములనెఱిగినవారు ద్విజ బ్రాహ్మణులు. వీరు సత్య, త్రేతా యుగములలో మాత్రమే యుందురు. అస్త్ర, శస్త్ర శాస్త్రములనెఱిగి, నా పూజావిధి నెఱిగి భజించువారు రాజన్య బ్రాహ్మణులు. వీరు ద్వాపర యుగమున నుందురు. కర్మభేదములచే కలియుగమున మిగిలిన 6 తెగలవారును జీవింతులు. వ్యవసాయము, గోసంరక్షణ, వాణిజ్యము చేయువారు వైశ్యబ్రాహ్మణులు. శూద్రాది నీచ జనుల సేవచేయుచు, సత్కర్మలో శ్రద్ధలేక, నియమపాలనలేక, వేదాధ్యయనము చేయక, స్వార్ధబుద్ధితో దేవ, ఋషి, పితృ సేవ చేయకయుండువారు శూద్రులు. ఇతరులను భ్రమింపజేసి, శాస్త్రములను నిర్వర్తించక యోగులవలె నటించుచు, స్వార్ధపరులై, ధనాపేక్షతో మునులవలె, ఉపదేష్ఠల వలె, అన్నపానాదుల విచక్షణారహితులై కౄరచిత్తులు, బిడాలురను మోసగాండ్రు.

ధర్మాధర్మములు, పుణ్యపాపములు, కృత్యాకృత్యములు తెలియక స్వధర్మ భ్రష్ఠులై, మాతా పితృ, గురువులను గౌరవించక కేవలము పొట్టనింపుకొనువారు నామ మాత్ర బ్రాహ్మణులు, అధమాధములు. బ్రాహ్మణోచిత సంస్కారములు లేనివారు పశువులు. బ్రాహ్మణకలమందు జన్మించి మ్లేచ్ఛ కర్మలయందు ఇష్టులై ప్రవర్తించుచు గడ్డము, మీసములు పెంచి మద్య మాంసములు సేవించుచు అన్ని జాతుల స్త్రీలను సంగమించుచు, పవిత్ర కర్మలను నిందించుచు, దయా ధర్మములు లేక, ప్రాణహింస చేయుచు బ్రతుకువారు మ్లేచ్ఛులు. ఇతర ప్రాణి హింసతో తృప్తిపడువారు, నీచులను సేవించుట సుఖమని భావించువారు, స్వకర్మలను వదలినవారు, నీచకుల స్త్రీలను కోరువారు, మద్య మాంసములందు ఇష్టులు, బ్రాహ్మణులుగా పుట్టినందుకు నిందించుకొనువారు, నీచ సహవాసము ప్రియమయినవారు, సజ్జనులను నిందించి, అవమానించువారు చండాలురు. నా భక్తులు లక్షలు, కోట్లుగా యుందురు. నా భక్తుడైన శూద్రుడు బ్రాహ్మణుని కంటె ఉత్తముడు. అన్ని వర్గములలోని నా భక్తిలేనివారు నీచులు. కలియుగమున ఇట్టివారిని నీవు తప్ప వేరెవరును ఉద్ధరించలేరు. కనియుగము పాప యుక్తము. రాజులు, బ్రాహ్మణులు పాపులగుదురు. శృతి, స్మృతి, పూరాణములందని నా రహస్యముల నెఱిగినవారు బ్రాహ్మణులు గాన వారు నా శరీరధారులు. నన్నెరిగిన బ్రాహ్మణుడు నా స్వరూపమే యగును. కృత, త్రేతా, ద్వాపర యూగములందు పుణ్యాత్ములతో పుణ్యలోకములు నిండిపోవును. కలియుగమున యమలోకముకిటకిటలాడును. స్వర్గాదిలోకములు శూన్యము కాకుండుటకు నీవు పాపులను పవిత్రులను జేసి పంపుదువు. పుణ్యాత్ములు దుర్లభులగుచో దేవలోక అప్సరసల కోరిక తీరదు. నీలో స్నానము చేసి, ఒక బిందువు జలము పానము జేసి, నీ దర్శనముతో జనులు విగతపాపులగుదురు. నీ తీరవాసులు ముక్తులగుదురు. నీ తటమున శరీరత్యాగము జరిగనివారు నా శ్వరూపము ప్రాప్తించి నన్ను చేరుట ధృవము. శంకరును నాకు మరియు వరమొసంగి నా జలము కలుషితమయినను, దుర్గంధమయినను, ఇంకినను, పవిత్రమే యగును. జనులను తరింపజేయును. విదేశములకు తీసికొని వెళ్లబడినను గంగాజలము పవిత్రమే. శివాజ్ఞతీసికొని నేను భగీరధుని వెంబడించితిని. హిమాలయములలోని గంగోత్రి వద్ద జలరూపమున మానవులకు దర్శనమిచ్చితిని. అక్కడనుండి నాల్గు విభాగములై శ్రీవిష్ణుమూర్తి పరమానంద కందులను పేర నరనారాయణులుగా శ్రీశంకరుని గుర్చి ఘోర తపమాచరించన చోటు చేరితిని. పరమేశ్వరుడు కైలాసమునుండి దిగివచ్చి, దర్శనమాత్రమున సద్యః ముక్తినొసగుటకు శ్రీకేదారేశ్వరునిగా లింగరూపమున దర్శనమొసగిన స్థలము హిమాలయ కేదారము. శ్రీ విష్ణుమూర్తి బదరికా క్షేత్రమున నర నారాయణులను పేర విభక్తమయి లింగార్చనలో నిమగ్నమయి, గ్రీష్మమున పంచాగ్ని మధ్యన, వర్ష ఋతువులో ఆచ్ఛాదనలేని మైదానమున, శరదృతువులో నిరాహారులుగ, హేమంతమున జల శాయిలుగ, పర్ణశాయిలుగను, కొద్ది రోజులు పర్ణ భక్షకులుగ, కొద్దిరోజలు తృణ భక్షకులుగ, కొద్దిరోజుల జల భక్షణము, వాయు భక్షణలతో కేదారేశ్వరుని ఆరాధించిరి. పరమాత్మ నరనారాయణుల నిష్ఠాగరిష్ఠ భక్తికి మెచ్చి వాంఛితార్ధముల నొసగి ఆ ప్రదేశమును బదరికా క్షేత్రముగా, దర్శనమాత్రమున ధర్మార్ధకామమొక్ష ప్రదముగ వరమొసగెను. ఈ రహస్య కథనము తెల్సికొనినవారు శివపదము బొందుదురు.

Thursday, January 1, 2009

నూతన సంవత్సర శుభాకాంక్షలు




మా బ్లాగును సందర్శకులందరికీ మా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

కాశీ విశ్వనాథుడు తన దేవేరులు విశాలాక్షి, అన్నపూర్ణలతో మీ అందరకూ

ఆయురారోగ్య అష్టైశ్వర్యములను ప్రసాదించు గాక.

--- దువ్వూరి వేణుగోపాల్