Saturday, February 7, 2009

షోడశోధ్యాయము

శౌనకాదులు మరల సూతునిట్లు కోరిరి. రోమహర్షణుని పుత్రులు, శివజ్ఞాన సముద్రులు యగు మహాత్మా దివోదాస చక్రవర్తి యశస్సు దేవ సభలో ప్రశంసా పాత్రమయినది. శివుని కృపచే కాశీ రాజయి పృధ్విని ఏకచ్ఛత్రాధిపత్యముగ పాలించిన దివోదసు శివాపరాధమెట్లు చేసెను?దయతో వినిపిమపుడని కోరిరి. అపుడు సూతుడిట్లు చెప్ప దొడగెను.

శివభక్తాగ్రగణ్యులగు బ్రాహ్మణులారా వినుడు. దివోదాసు బ్రహ్మను గురించి ఘోరతపస్సు చేసి వరములు పొంది కాశీ రాజయ్యెను. బ్రహ్మ అతనిపై ఏ దేవతల ప్రభావము లేకుండ తాను పృధ్విని తన స్వయంశక్తిచే రక్షించ గల్గునట్లు వరమొసంగెను. తర్వాత బ్రహ్మ దేవుడు దివోదాసుకు తానిచ్చిన వరమును తెల్పి, ప్రార్థించి శివుని మందరాచలము వెళ్ళవలసినదికా కోరెను. శివుడు తన భక్తుడగు బ్రహ్మ వరమును కాపాడుటకై సర్వదేవతలతో కూడ మందరాచలము చేరెను.

దివోదాసు పంచ భూతముల శక్తులను తాను కైవశము జేసికొని వేరు దేవతల ప్రభావము లేకుండ, తన తపోబలమున నిరాటంకముగ రాజ్యమేలుట సహించలేని పంచభూతములు అతనిచే ఎట్లయినను ధర్మలోపము జేయించుటకై ఈర్ష్యజెందిరి. పంచభూతములు వారి పనులను నిర్వర్తించకుండుట యోగముద్వారా గ్రహించిన దివోదాసు తన తపో, యోగ ప్రభావమున అందరు దేవతల కార్యములను తానే నిర్వర్తించుచు రాజ్య మేలెను. ఇది తెలిసికొనిన పురోహితులు, భృగుమహర్షి బ్రహ్మాండమున శి శక్తిలేని ప్రదేశముండదు. కాని కాశిలో దివోదాసు అట్టి శక్తిని నిరోధించుట అపరాధమని ఎంచి, అతనికి శుభము గల్గుటకై మంచి మాటలతో శివశక్తిలేనిచో నీవు ఎంతోకాలము రాజ్యము చేయలేవని తెల్పెను.

దివోదాసు నవ్వుచూ ఏదియునూ శాశ్వతము గాదు. పూర్వ జన్మమున నేను తపస్సు జేసి శివుని మెప్పిమచి అపూర్వ వరములచే భోగములందు విరక్తి జెందితిని. తపోబలమున పొందిన శక్తి వ్యర్ధము కానిదే జన్మ అంతము కాదు. కనుక నేను శివాపరాధముచే శక్తిహీనుడనై శివుని చేతరింపబడుటకై నా రాజ్య భంగమునకు శివుడెట్టి ప్రయత్నములు జేయునో తెలిసికొనుటకు ఇట్లు ప్రవర్తించుచుంటిననెను. శివునికి ప్రీతకరమైనది, విహారభూమి, ఆత్మ భూతమైనది అట్టి కాశీ వియోగమును భరించలేని శంకరుడు బ్రహ్మాది దేవతలతో చేరి మరల కాశీ చేరుటకు ఎట్టి ప్రయత్నములు చేయునో చూతమను కొనెను. శివుడు పరాశక్తితో ఆలోచన సాగించి, దివోదాసు స్వధర్మచారి, బ్రహ్మ వరము పొందిన బ్రాహ్మణ భక్తుడు. పూర్వ జన్మలో ఏకాంత భక్తితో నాపూజ సల్పి మహాయోగ విభూతి పొందినవాడు. అట్టివాడు నేను కాశీ వియోగము భరించలేనని తలిసియూ నన్ను కాశీనుండి దూరము చేసెనని విచారించగా, పరాశక్తి, నాథా! తెలియక చేసిననూ శివాపరాధము దావానలము వంటిది. ఇక తెలిసి చేయు యీదివోదాస శివాపరాధమున ఇతని శక్తి త్వరితముగ నశించి రాజ్య భ్రష్టుని చేయును. కనుక యోగినీ గణములు, ఆదిత్య, గణేశ, విఘ్నేశ,బ్రహ్మ, విష్ణు మూర్తుల ద్వారా కాశీలో ధర్మ విచ్ఛేదము చేయించి అతని శక్తిని హరింతు మనెను. శివుడు దేవి చెప్పిన విధముగ వారిని నియమించగా, శివుని హృదయమున తాపముద్భవించిన కారణమున దివోదాసు భోగము లన్నియూ క్షణకాలమున నశించెను.

మహావిష్ణువు బుద్ధరూపమున, ధర్మపురమయిన కాశీలో అధర్మమునకు చోటు కల్పించుటచే దివోదాసు ధర్మచ్యుతుడై రాజ్యమును వదలివేసెను. అతని గురువు భృగుమహర్షి అతనిచే ప్రాచీన మణి కర్ణికలో స్నానము చేయించి, కేదారనాధును పూజింపజేసి పాపరహితుడై శివధామము చేరునట్లు చేసెను. ఈ వృత్తాంతముంతయు విని, వామదేవుడు బ్రహ్మవేత్త యగు సనత్కుమారునిట్లు ప్రశ్నించిరి. ప్రభో! దివోదాసు క్రింతం జన్మలో ఏవరుగా నుండి అనితర సాధ్యమగు తపమాచరించి గొప్ప వరములు పొందిరో శలవిండనగా సనత్కుమారులిట్లు తెల్పిరి.

పూర్వకాలమున కాంచీ పురములో విప్ర ప్రసాదుడను పేర ఒక వర్తకుడు ధనికుడు, వేదవిజ్ఞుడు, దేవ బ్రాహ్మణ భక్తుడు, నిత్యము ఏకామ్రనాథ కామాక్షీ దేవులను ఉపాసించి గొప్ప పుణ్యము సంపాదించెను. అతడొక వేశ్వద్వార పుత్ర వంతుడాయెను. ఆ వేశ్యకు వేరు సంతానము లేనందున వారీబిడ్డను అతి గారాబముగా పెంచి కాలవశమున గతించిరి. అతని పేరు దుర్దవుడు. తండ్రి గతించిన తర్వాత ధనవంతుడగుటచే దుర్బుద్ధితో మద గర్వముతోడుగా అత్యంతకాముకుడాయెను. దాసీ పుత్రుడగు అతడు స్వభావసిద్ధముగ మదమాంసములు సేవించుచు విచ్చలవిడిగా ధనము ఖర్చు చేయుచు ఛండాల స్త్రీలవరకు చెడ్డ స్త్రీలనందరను అనుభవించుచుండెను. దొంగతనము చేయుచు స్త్రీలకొరకు డబ్బంతయు వ్యయముచేయుచు చివరకు తల్లియగు వైశ్య పత్నిని కూడ బలాత్కరించెను. స్త్రీలను తృప్తిపరచుటకు తోటలో పూలు కోయు వృత్తి నెపమున మంచి పూలను అపహరించుచుండెను. తోటమాలి కి తెలియకుండ రాజు వనములో పూలు మాయమగుట గమనించి తోటమాలి కావలి వారిని నియమించి వానిని పట్టుకొనబోగా అతడు కోసిన పూలతో సహా కంచె దూకి పారిపోవ నుంకించి క్రిందపడిపోయెను. చేతిలోని మంచిపూలు జారి క్రింద పడగా వానినోట అప్రయత్నముగా శివార్పణమస్తు యని పలికెను. ఆ రాత్రి ఒక వేశ్యయింట సుఖించి తెల్లవారిన యడల రాజభటులు గుర్తించి పట్టి శిక్షింతురు, మరణము నిశ్చయమని శంకించి తెల్లవారక ముందుగనే గ్రామము విడిచి పయనించి బిచ్చమెత్తి ఆకలి తీర్చుకొనుచు వెళ్ళి వెళ్ళి వింధ్య పర్వతములను చేరెను. అక్కడ ఎవరి సేవచేసినను తగినంత ఆహారము దొరుకనందున హిమాలయ పర్వతముల వరకు వెళ్ళెను. కొందరు వర్తకులు కేదార పర్వతమునకు వెళ్ళుట గమనించి వారితో కలిసి పగలు ప్రయాణము, రాత్రి సత్రములో నిద్రించుచుండగా ఒక సత్రమునందు ఆరాత్రి కేదారమునుండి కాశీకి వెళ్ళుచున్న ఒక బిక్షువును చూచి ఇతని వద్ద డబ్బు ఉండి ఉండవచ్చును అర్ధరాత్రమున మొత్తము కాజేయ తలచెను. అతనితో అయ్యా రండి మీపాద సేవ చేసెదనని నమ్మించి అతను నిదురించు సమయమున ఒక పామును చంపి దాని విషము ఆ బిక్షువు కమండలమున వేసెను. ఆ బిక్షువు కమండలములోని జలము ఆచమనము చేసి మరణించినచో అనాయాసముగ అతని డబ్బు తనకు చేరునని తలచెను. బిక్షువు అర్ధరాత్రమున లఘుశంకకై లేచి కమండలము తీసుకొను సమయమున నిండుగానున్న జలము కొంత తొణికి ప్రక్కనే యున్న దుర్ధరుని పాత్రలో పడి, అతడు చీకటిలో తెలియక ఒక స్థంభమును తట్టుకొని పడిపోయి కమండలములోని నీరంతయు ఒలికిన కారణమున లఘుశంక విరమించుకొని అతడు మరల నిద్రించెను. కొంతసేపటికి దుర్ధరుడు లేచి బిక్షువు మరణించకుండుచ గమనించి ఇతనిని లేపి నీరు త్రాగించవలెనని తలచి మొదట తన దప్పిక తీర్చుకొనుటకు తన పాత్రలోని నీర కొంత తాగెను. విషపూరతమగు ఆ నీరు త్రాగినందున అతడు వెంటనే మరణించెను. తెల్లవారి బిక్షువు లేచి దుర్ధరుడు మరణించుట తెలిసికొని అతని యోగ ప్రభావము వలన దుర్ధరుని జన్మ ప్రభృతి అతని విషయమంతను తెలిసికొని అతనిని మన్నించి తనకు కొద్ది సవ చేసినందున మానవత్వముతో అతనికి దహన సంస్కారమాచరించి బిక్షువు కాశీకి వెళ్ళిపోయెను.

యమ భటులు దుర్ధరుని కనీవినీ యెఱుగని బాధలకు గురిచేసి బాదుచు, తన్నుచు యమపురికి లాగుకొని వెళ్ళిరి. కోటి అర్బుద కల్పములవరకు వీనిని శిక్షింపతలచిరి. యముడు చిత్రగుప్తుని దుర్ధరుని చరిత్ర వినిపింపమనగా అతనికి లేశమాత్ర పుణ్యమునూ లేదని, ఎన్ని సార్లు చిట్టా నిశితముగా పరిశీలించిననూ అతను చేసిన మంచి కన్పించుట లేదని తెల్పెను. దుర్ధరుడు చివరి కాలమున బిక్షువుకు సేవచేసిన ప్రతిఫలముగా యమధర్మ రాజుకు తానే చిట్టా పరిశీలింప వలయునను తలంపుగల్గి ప్రత్యేక దీక్షతో చూడగా దుర్ధరుడు వేశ్య కిచ్చుటకు తోటలో పూలు దొంగిలించి కావలివారు వెంట బడగా కంచెదూకి పారిపోవుచు క్రిందబడిన సమయమున అతని చేతిలో పూలు జారి క్రింద పడినపుడు అతడు అప్రయత్నముగా "శివార్పణమస్తు" అనుటయు, కాంచీ పట్టణము అంతయూ శివలింగమయమగుటచే అతని చేతిలో నుండి జారిన పూలొక శివలింగముపై పడుటయు గోచరించగా యముడు దుర్ధరునితో, నీ జన్మకాలమున ఒక చిన్న పుణ్యము చేసి యుండుటచేత నీవు చేసిన పాతకములకు కోటి కల్పములు నీవు నరకమున యుండవలసి యున్నను ఆ చిన్న పుణ్య ఫలమును నీవు కోరినచో ముందుగానే అనుభవించుటకు సమ్మతింతుననెను. దానికి దుర్ధరుడు ఆశ్చర్యచకితుడై తను చేసిన పాపములను చింతించుచు మానవ జన్మనెత్తి ఒక్కమారయినను శివపూజ చేయకుంటిని నాకు ప్రారబ్దమెట్లున్న అట్లు ఆజ్ఞాపింపుడనెను. పుణ్య ఫలమెట్లుండునని తెలియగోరెను. దానికి యముడు శివార్పిత ఫలపుణ్యము స్వర్గమున నీకు మేనకతో సౌఖ్యమొసగును. ఆతర్వాత ఏమగునో నిత్యము జగదంబను సేవించు మేనకనడిగి తెలిసికొనమని దుర్ధరుని యముడు స్వర్గమున కంపెను.

మేనక దుర్ధరుని సాదరముగ ఆహ్వానించి అర్ఘ్యపాద్యములిచ్చి, గంధమాల్యాది వస్తు భూషణములతో శయ్యా సౌఖ్యమునిచ్చి ఆలింగనము చేసికొనెను. వీణా, వేణు నాదనములతో గాన నాట్యములతో అలరించెను. కాని దుర్ధనునిలో కలిగిన విచారము వలన నా స్థిరనివాసము నరకమే గనుక ఈ మేనకతో క్షణ భంగురమగు సుఖము వలన ప్రయోజనమేమియని అంతయూ చూచుచు మిన్నకుండెను. దానికి మేనక నాథా! మీదాసిని నేను. మీరు కోరిన విధముగా నా సౌఖ్యము ననుభవించుడు. మీరు సుఖించనిచో యమ ధర్మరాజు నన్ను కోపించును. మీరెందులకు దిగులుగాయున్నారు. మీరు కైలాసము చేరి సుఖించగల భాగ్యమున్నట్లు నా దివ్యదృష్ఠికి తెలియుచున్నది అని మేనక చెప్పిన మాటలకు దుర్ధరుడు, నేను పరమ పాపినైనను అప్రయత్నముగా ఒక్క పర్యాయము నా చేతి నుండి జారిన పుష్పమును శివార్పణమస్తు యని వాక్కుద్వారా ఉచ్ఛరించిన పుణ్యము నీవద్దకు చేర్చినది. నీవు శివ భక్తురాలవు. నాలో ఎట్టి సుఖ వాంఛ గల్గుటలేదు. నేను నీశరణు జొచ్చుచున్నాను. నన్ను తరింపజేయగోరుచున్నానని ప్రార్ధించెను. దుర్ధరుని దీనవచనములు విని మేనక, శరణాగతులను రక్షించుట కర్తవ్యమని శివాజ్ఞ కనుక ఇతనిని కాపాడకున్నచే నా శివ పార్వతుల భక్తి వ్యర్ధమగును. ఇతడు ఎంతటి దుష్టుడయినను, పుణ్యలేశమున సూర్యతనయుడగు యమునిచే పునరాలోచింప జేసి మహానరకానుభవమునకు ముందుగా నావద్దకు పంపబడెను. శివుని యడల చేసిన కొద్ది పుణ్యమయినను మహాపాతకముల నశింప జేయుననుటకు ఇది నిదర్శనము. ఇందు సందేహము లేదు. మేనకలో గల్గిన ఈ సంశయాత్మక శివభక్తి రహస్యమును ఒక్కమారయినను భక్తిపూర్వకముగ వినిన వారికి సకల కల్మష నివృత్తి గల్గి శివపదము ప్రాప్తించును.