విన్నపము
పూర్వజన్మల పుణ్య ఫలముగా భగవద్దత్తమయిన మానవజన్మను సఫలంచేసికొని, పతనం కాకుండా భక్తి, జ్ఞాన వైరాగ్యములను పొంది, పరమాత్మ కృపకు పాత్రులమగుటకు సనాతన ఆర్ష ధర్మానువర్తనమే పరమావధి. “ధర్మో రక్షతి రక్షితః" ధర్మ బద్ధులమయి జీవించి ధర్మముచే నుద్ధరింపబడవలసి యున్నది.
వేదాంతపరంగా మానవుడు త్రిదోషాలను ప్రయత్నపూర్వకముగా నిర్మూలించుకొని భగవత్కృపాపాత్రులు గావలసియున్నది. అవి మల, విక్షేపణ, ఆవరణ దోషాలు. మలదోషం శౌచం ద్వారాను, విక్షేపదోషం సద్గ్రంథ పఠన, శ్రవణముల ద్వారాను, ఆవరణ దోషం జప, తపాద్యనుష్ఠానముల ద్వారా నిర్మూలనమగునని శాస్త్ర ప్రమాణముగాన మొదటి మెట్టు శౌచము. నవసమాజములో మానవులు శరీర బాహ్య శౌచము ద్వారా ప్రజలను ఆకట్టుకొనగల్గుచున్నారు గాని, అంతః శౌచం తెలియక, పాటించలేనందు వలన భగవత్కృపకు పాత్రులుగాలేక పోవుచున్నారు.
గురు, బుధ, పండిత, ఆచార్యవర్యులు, ధర్మ ప్రచారముకన్న భక్తి ప్రచారమునకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. మనోనైర్మల్యం లేని భక్తితో ఏకాగ్రత సాధించలేమనునది సత్యము. భారతీయ మానవులలో నరనరములందు రక్తంలోనే భక్తి ఇమిడియుంటుంది. కాని ధర్మాచరణ లేని భక్తి ఫలితం అత్యల్పము. జన్మాంతర సుకృతం వలన చరాచర జీవరాశిలో నాల్గవది, ఉత్తమమగు మానవ జన్మను, సనాతన ఆర్షధర్మ ఆచరణద్వారా సార్ధకం చేసికొనాలి.
మానవలక్షణాలున్నంతమాత్రాన మానవులముగాము. అజ్ఞాన, జ్ఞాన, విజ్ఞాన, సుజ్ఞానముల తారతమ్యములు తెలిసికొని సద్ధర్మాచరణ గావించాలి. వేద, శాస్త్ర, ఇతిహాస, పురాణములన్నియూ మానవ అభ్యుదయానికీ, భక్తి, జ్ఞాన, వైరాగ్య సాధనకూ మూలము స్వధర్మాచరణయేనని ప్రబోధిస్తున్నవి.
కనీసము మన నిత్యకృత్యములలో ఆచరించగల్గిన ధర్మాలను తెలిసికొని ఇంతవరకు తెలియక చేసిన తప్పులను సరిదిద్దుకొని మానవార్హతబొంది సద్గతిని బొందపలసియున్నది. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి పాకులాడినట్లు, ఇంట గెలవకయే రచ్చ గెలవాలనే తాపత్రయంలా, ధర్మాచరణలేని మానవుల పూజలూ, పుస్కారములు, పురాణ భాష్య శ్రవణములు, తీర్థయాత్రలు, సత్సంగములు అత్యల్ప ఫలదాయకము మాత్రమే.
మానవునకసాధ్యములేదు. మనసుంటే మార్గంముంటుంది. మాట్లాడే ప్రతిమాట భావాన్ని మనసుకు పట్టించుకుంటే చాలు. “భవానీ భావనాగమ్యా" మనం రోజూ నిద్రలేచినది మొదలు మరల పరుండేవరకు ఆచరించగలిగే కొన్ని ధర్మాలను తెలిసికొనవలయునను కుతూహలంతో, నా అల్ప పరిజ్ఞానానికందినంత సేకరించి తోటివారికందించి ఉడుతాభక్తిగా మానవసేవ రూపంలో మాధవసేవకు ప్రయత్నించాను.
ప్రయత్నం నాది, ఫలితం చదువరులది.
బుధజన విధేయుడు
బాలనరస అప్పేశ్వర శాస్త్రి
కాశీవాసి
mIprayatnaaniki hRudayapoorvaka abhinamdanalu.
ReplyDelete