Sunday, June 21, 2009

ఆర్షధర్మము - మొదటి భాగము

1. నిద్ర మేల్కొనుట
“బ్రహ్మీ ముహూర్తే ఉత్థాయ”, “బ్రహ్మీముహూర్తే యానిద్రా సాపుణ్య” అంటుంది ధర్మశాస్త్రం. బ్రహ్మ మూహూర్తం అనగా ఉదయం సూర్యోదయం అక్షాంశ రేఖను బట్టి ఏ ప్రదేశములో ఎన్ని గంటలకు జరుగుతుందో ఖచ్చితంగా తెలిసికొని దానికి ఒక మూహూర్తం అనగా రెండు ఘడియల కాలం అనగా 48 నిమిషముల ముందు కాలం ఆసురీ ముహూర్తం, దానికి 48 నిమిషములు ముందు కాలం బ్రహ్మ ముహూర్తం. ఆ సమయములో భగవచ్చింతన జేయువారిని దేవతలు ప్రీతిగా ఆశీర్వదిస్తారని, మానవ మేథస్సునకు బ్రహ్మ సంకేతములు అందు కాలము ఆ ముహూర్తమనియు, ఆ సమయమున నిద్రించువారి పూర్వ జన్మల మరియు ఈ జన్మన ఆర్జించిన పుణ్యము కూడ క్షయమగుననియు వేద ప్రమాణము. బ్రహ్మ మూహూర్తమున ధ్యానం సత్ఫల దాయకము.

2. నిద్రనుండి మేల్కొని కనులు తెరుస్తూనే తమ అరచేతులను చూచుకొనుచు “కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గౌరీం తాం ప్రభాతే కర దర్శనం” అనే శ్లోకాన్ని మననం చేసికొని ముగ్గురు దేవేరిలను కుడి అరచేతిలో ఆవాహన జేసికొని కనులకద్దకొనవలెను. దీనివలన, మానవ సహజముగా కష్టం కలిగినపుడు ఈ రోజు లేస్తూనే ఎవరి ముఖం చూచామో యిలాజరిగినదని పరనింద జేసి పాపం మూటగట్టుకొనుట నివారింప వచ్చును.

3. భూమాత, భూదేవియని, భూమిని పంచ భూతములలోనొకటిగా ఆరాధించుట హైందవ సంస్కృతి. గనుక ప్రతి దినం “సముద్ర వసనే దేవి పర్వతస్థనమండలే, విష్ణుపత్ని నమస్తుభ్యం, పాద స్వర్శం క్షమస్వమే” యను శ్లోకాన్ని మననం చేసుకొని భూమికి నమస్కరించిన తర్వాత పాదాలు భూమిపై మోపాలి. ప్రతి యుగాంతం తర్వాత జలప్రళయం నుండి మరల భూమి ఉద్భవించి, దానిపై జీవరాసులు సృష్టింపబడి, ఆ భూమి నుండి వచ్చే ఆహారం ద్వారానే జీవులు బ్రతుకుచున్నప్పుడు, అలాంటి భూమిపై నడుస్తూ, ఉమ్ముతూ, మలమూత్ర విసర్జన చేస్తున్నాము. భూమాత కోపిస్తే భూకంపము, క్షామము ద్వారా వినాశము తథ్యము కనుక మన అపరాధములను క్షమింపవేడి నమస్కరించి భూమిపై కాళ్ళు పెట్ట వలెను.

4. పండ్లు తోముట, మలమూత్ర విసర్జన :
సూర్య చంద్ర గమనదిశలగు తూర్పు, పజమరలకు ఎదురుగా చేయరాదు. దంతధావనము ద్వారా, నోటిలో నురగలోనుండు సూక్ష్మ క్రిములు వేరుచోట్ల ప్రబలకుండునట్లు అటునిటు తిరుగకుండ ఒకేచోట చేయుట ఆరోగ్యదాయకము. మూత్ర విసర్జన నిలుచొని చేసినందున కొన్ని సమయములలో తల తిరుగుట, స్పృహతప్పుట ప్రత్యక్ష ప్రమాణములుగా తెలియుచున్నవి. అతి త్వరగా మూత్ర విసర్జన చేయవలసివచ్చినపుడు, కనులు మూసుకొని కూర్చొని చేయుట క్షేమమని డాక్టర్లు కూడ నిర్ధారించిరి.

5. స్నానము : చన్నీటి స్నానము ఉత్తమము. మొదట తలపైనుండి ఆరంభిచవలెను. క్రొత్తగా చన్నీటి స్నానం చేయుట వలన జలుబు చేయు ప్రమాదం కలదు కాని విడువకుండ అలవాటు చేసికొనినయడల ప్రశాంతత, మనోనిగ్రహం, ఏకాగ్రత, కంటికీ, మెదడుకు చలువజేసి కోపతాపాలనుండి ఉపశమనము పెద్దల అనుభవము. అట్టి ముఖ్యోద్దేశముతో హైందవ సంస్కృతి కార్తీక, మాఘస్నానాలని, దీక్షల పేరుతో మండలము రోజులు అనగా 48 రోజులు మూడువేళలా చన్నీటి తలస్నానం ఆదేశించిరి.

వేడినీటితో చేయునపుడు ముందుగా కాళ్లు తడుపుకొని ఆ తరువాత శరీరం తడుపకోవలెను.

శ్లో ॥ గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదా, సింధు, కావేరి జలే ऽ స్మిన్ సన్నిధిం కురు ॥

శ్లో ॥ గంగా గంగేతి యో బ్రూయంత్ యోజనానే శతైరపి
ముచ్యతే సర్వపాపే భ్యో విష్ణులోకం సగచ్ఛతి ॥

పవిత్ర నదులను స్మరించి మనము స్నానము చేయు నీటియందు ఆవాహన చేయుట వలన, గంగా గంగా యనుచు పుణ్య గంగానదీ స్నానానుభూతి పొందుట ద్వారా మానవులు పాప రహితులై విష్ణులోకమును బొందుదురని ధర్మశాస్త్రము.

స్నానం చేయునపుడు పురుషులు దిగంబరముగా మొలపై వస్త్రము లేకుండగను, స్త్రీలు వెంట్రుకలు విరియబోసుకొని నిలుచుండియూ స్నానము చేయరాదు. ఆ సమయమున భూత, ప్రేత, పిశాచములు ఆవహించు ప్రమాదము గలదు.

ప్రాతఃకాల స్నాన సమయము
తెల్లవారు ఝామున గం. 4 – 5 మధ్య ఋషి స్నానము. మహర్షులాసమయమున స్నానం చేయుదురనుటకు నిదర్శనం రామాయణమున అహల్యా శాప వృత్తాంతము.
గం. 5 – 6 మధ్య దైవ స్నానం. దేవాలయములలో దేవతా విగ్రహములకు ఆ సమయమున అభిషేకము నిర్వహింతురు.
గం. 6 – 7 మధ్య మానవ స్నానం. మానవులు కనీసం ఈ సమయంలోనయినా స్నానం చేయగలిగితే, స్నానానంతరం సూర్యునకు నమస్కారం చేసి ఆరోగ్యముగా నుండుటకు వీలగును. బ్రహ్మమూహూర్తంముందుగనే స్నానం చేసి కూర్యోదయం వరకు జప, తపాది అనుష్ఠానములు చేయువారు నిష్ఠాగరిష్ఠులగు, సనాతన సదాచార సంపన్నులగుదురు.
గం. 7 తరువాత రాక్షస స్నానం. నింద్యము.
స్నానం తరువాత ముందుగా ముఖము, తరువాత వక్షస్థలము, తరువాత శిరస్సు, ఆపై మిగిలిన అంగములు తుడుచుకొనవలెను. ఇట్లు చేయుట వైద్య శాస్త్రం ద్వారా సైనస్, నిమోనియా, జలుబు రాకుండగా కాపాడు కొనుటయే.

మానవ నిత్యాచరణ ధర్మములన్నియూ ఋషి ప్రోక్తములగు సాధారణ, శరీర వైద్య శాస్త్రమే.

పురుషులకు అభ్యంగన స్నానవారదోషములు:
ఆదివారం - తాపము. నివారణకు నూనెలో పుష్పములు.
సోమవారం - కాంతి, మనోల్లాసము.
మంగళవారం - మృతి. నివారణకు నూనెలో మన్ను.
బుధవారం - లక్ష్మీ కటాక్షము.
గురువారం - ధన నాశం. నివారణకు నూనెలో గరిక.
శుక్రవారం - విపత్తు. నివారణకు నూనెలో గోమయం.
శనివారం - భోగము

గమనిక : పండుగ, శుభదినములకు ఈ దోషము వర్తించదు.

స్త్రీలకు మంగళ, గురు, శుక్రవారములు శుభములు.

సముద్ర స్నానము: ముందుగా మంచినీటి స్నానం చేసి వెళ్ళి సముద్ర స్నానము చేసి వచ్చిన వెంటనే మరల మంచినీటి స్నానం చేయవలయును. ఒకే సంవత్సరములో క్రమంగా ఆషాఢ, కార్తీక, మాఘ, వైశాఖ పూర్ణిమ దినములు సముద్రస్నానం మోక్షప్రదమగు వ్రతము. సముద్ర స్నానము ఒక ఘడియ (24 నిముషముల) కు పైగా చేసిన యడల మగవారిలో పుంసత్వము, ఆడవారిలో గర్భధారణ శక్తి తగ్గునని లోకోక్తి.

6. వస్త్ర ధారణ
స్నానానంతరం ఉతికి ఆరవేసిన పొడి వస్త్రములు ధరించి మూఖాలంకరణ చేసికొని దైవ ప్రార్థన చేయవలయును. తడి బట్టలతో శుభకార్యములు దైవ కార్యములు చేయరాదు. సంప్రదాయదుస్తులు ధరించి, అధునాతన అనుకరణలు విసర్జించుట సనాతన ధర్మము. సంప్రదాయ వస్త్రధారణ వలన తమ మనస్సు పవిత్రమై, ఇతరులను ఆకర్షించు పాపము నుండి విముక్తులగుదురు.

7. ముఖాలంకరణ
భస్మధారణ: హిందువులందరునూ విధిగా భస్మ ధారణ చేయవలయునని శివపురాణము వక్కాణించినది. పురుషులు మాత్రమేగాక స్త్రీలును త్రిపుండ్ర ధారణ చేయుట తమిళ సాంప్రదాయము.

శ్లో॥ శ్రీకరం చ పవిత్రం చ శోకరోగ నివారణం
లోకే వశీకరం పుంసాం భస్మం త్రైలోక్య పావనమ్॥
శ్లో॥ వినాభస్మ త్రిపుండ్రేన, వినా రుద్రాక్షమాలయా
పూజితో పి మహాదేవి నస్యాత్ తస్య ఫలం లభేత్॥
శ్లో॥ తత్సర్వం ఫలితం నాస్తి లలాటే తిలకం వినా
లలాటే సతతం దేవ్యాశ్రయ సహవిరాజితం
చతుశ్చక్రం నమస్యామి కేశవం కనకప్రభం॥
శ్లో॥ స్నానం, దానం, జపో, హోమం, సంధ్యా స్వాధ్యాయ కర్మసు
ఊర్ధ్వపుండ్ర విహీనశ్చ తత్సర్వం నిష్పలం భవేత్॥
శ్లో॥ శ్రాద్ధే, యజ్ఞే, జపో, హోమే, వైశ్వదేవే, సురార్చనే
ధృత త్రిపుండ్ర పూతాత్మా మృత్యుంజయతి మానవః॥

భస్మధారణ లేని ముఖమును, శివాలయము లేని గ్రామమును, శివార్చన లేని గృహమును, ఛీ, ఛీ, యనమని శివపురాణము. తాత్పర్యమేమనగా, హిందువులందరు తమ మతానుసారము విభూది, తిలకము, త్రిచూర్ణము, చందనము, మరేదయినను నుదుట ధరించి, ఆజ్ఞా చక్ర స్థానమగు భృకుటియందు పసుపుతో తయారు చేసిన కుంకుమ ధరించి, మెడలో రుద్రాక్ష మాలగాని, మరే మాలనయిననూ ధరించి దైవ ప్రార్ధన చేయుట వలన, పవిత్రతయే గాక దృష్టి దోష నివారణ కూడ జరుగును. శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీరామచంద్రుడు ఒంటినిండా విభూది పూసుకొని త్రిపుండ్రములు ధరించి, పాశుపత దీక్షతో పంచాక్షరి జపించినట్లు పురాణముల గాధలు. నేటి కాలపు ముఖాలంకరణగా రంగుల రేఖలు, రంగుల బిళ్లలు ధరించుట ఆత్మహత్యా సదృశము. దేవతా విగ్రహములకు, పటములకు, మగవారు కూడ స్టిక్కర్లు ధరించుట విచారకరము.

8. మాలాధారణ
వక్షస్థలమున ధరించుటకును, జపమునకు బొటనవ్రేలు, మధ్యవ్రేలు, అనామికలతో మాలలోని పూసలను ముందుకు జరుపుటకును, వివిధ మాలలలో తంత్రసార శాస్త్రానుసారము తులసిమాల, శంఖమాల, పవడముల మాల, స్ఫటిక మాల, ముత్యాలమాల, పద్మాక్షమాల, సువర్ణమాల, కుశగ్రంధి మాలలు ఒకదానికన్న ఒకటి వరుసగా పది పది రెట్లు అధికఫలమొసంగును. ఇక రుద్రాక్షమాల అనంత ఫలదాయకము.

రుద్రాక్షమాలలము గురించి ప్రస్తుత కాలమున వారపత్రికలు, దృశ్యమాధ్యమముల (T.V.) ద్వారా వాణిజ్యప్రచారము ఎక్కువగా జరుగుచున్నది. కాని రుద్రాక్షలలో ఏకముఖి నుండి 14 ముఖములవరకు గలవాని విశిష్ఠత ప్రత్యేక మంత్ర బలము వలన సిద్ధించునేకాని, కేవలము ధరించినంత మాత్రమున సిద్ధించదని వేదవాక్యము.

9. ఆసనము
శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత 6వ అధ్యాయం 11వ శ్లోకంలో ధ్యానము, పూజలకు
శ్లో॥ శుచౌదేశే ప్రతిష్ఠాప్య స్థిరమానసమాత్మనః
నాత్యుచ్ఛితం నాతినీచం చేలాజిన కుశోత్తరమ్॥
అంటారు. మనసు భగవంతుని ఆరాధనలో లగ్నమగుటకు ఆసన ప్రభావం కూడ దోహదకారి. ఈ నాటి పరిస్థితులను బట్టి జింక చర్మంగాని, పులి చర్మంగాని లభించకపోయినా, సరాసరి నేలపై కూర్చొనకుండ పీటవేసికొని దానిపై దర్భాసనం, దానిపై చిత్రాసనం దొరకని యడల మెత్తని తెల్లని వస్త్రం వేసికొని కూర్చొనవలెను.
దర్భాసనం - పుష్ఠిని, కంబళి - దుఃఖవిమోజనమును, చిత్రాసనం - కామ్యసిద్ధిని, జింకచర్మం - జ్ఞానమును, పులిచర్మం - మోక్షమును, తెల్లని వస్త్రం - శాంతిని గల్గించును.
వెదురు - దరిద్రం, రాయి - వ్యాధి, నేల – దుఃఖము, కొయ్య – దౌర్భాగ్యము, గడ్డి - యశోహాని, చిగురుటాకులు - చిత్రభ్రమణము గాన వీనిని ఉపయోగింపరాదు.

10. ఇష్టదేవతా ప్రార్థన
84 లక్షల జీవరాసులను సృష్ఠించిన బ్రహ్మదేవునకు తనను తెలుసుకొను జీవిలేదను విచారముతో మానవులకు బుద్ధియను ప్రత్యేక గుణమును ప్రసాదించి జీవిత పరమావధిని తెలిసికొనునట్లు సృష్ఠించెను. కనుక ప్రతి మానవునకు ఇష్టదేవతా ప్రార్ధన ముఖ్యము. కోరికలతోనో, లేక కష్టములనుండి విముక్తి కొఱకో, లేక తప్పులకు క్షమాపణగానో గాక, మానవ జన్మనిచ్చినందులకు కృతజ్ఞతగా జన్మరాహిత్యము కొరకు నిత్యమూ ఇష్టదేవతా ప్రార్థన చేయుట విద్యుక్త ధర్మము. శుచిగా తూర్పుముఖముగా కూర్చొని దైవప్రార్థన చేయవలెను.

3 comments:

 1. శ్రీ అప్పేశ్వర శాస్త్ర్రి గారు కేదార్ ఘాట్ దగ్గర ఉంటారు. మీరు ఆంధ్రాశ్రమంలో కనుక్కుంటే చిరునామా తెలుపుతారు.

  ReplyDelete
 2. Nice one ..

  By the way my email id is:

  bharadwaja@yahoo.com

  ReplyDelete
 3. అలకయేల వచ్చెనో మరిచెను యామె
  జాలమేల తెచ్చెనో మరిచెను ఈతడు

  super

  ReplyDelete