Monday, March 23, 2009

సప్తదశోధ్యాయము

మునులు సూతునితో, మహాత్మా! మీరు శివరహస్యకోవిదులు. లేశమాత్ర శివ నామస్మరణ మహాపాపియగు దుర్ధరునికి స్వర్గప్రాప్తి కల్గించినది. శివజ్ఞానికి అతనిపై గల్గిన కృపాలేశము యమధర్మరాజుకు అతనిపై దయ గల్గునట్లు చేసినది గనుక జీవతమున శివభక్తి రహస్యమును గురించి వినని జన్మ వ్యర్థము. దయచేసి మేనక అతని నెట్లు ఉద్ధరించినది తెల్పుడని కోరిరి. సూతుడిట్లు వచించిరి.

దేవకన్య మేనక దుర్ధనునెట్లు ఉద్ధరించుటాయని ఆలోచించి అతనినోదార్చి తను కైలాసమందు పరాశక్తి దర్శనము చేసికొనివచ్చువరకు అతనినక్కడే ఉండమని చెప్పి వెళ్ళెను. కైలాసమందు శివభక్తులు దేవిసేవకై దుర్వాస, గౌతమ, కణ్య, దధీచి, అంగిరస, భృగు, నారద, ఉపమన్యులు బ్రహ్మవాద శ్రేష్ఠులు ఎనమండుగురు మొదట శైలాదు గణేశ, కార్తికేయులను సేవించి తదుపరి పరమేశ్వరుని అర్చించి పరాశక్తిని పూజించుటకై అమ్మవారి వద్ద చేరిరి. అమ్మవారిని అనేక విధముల స్తుతించి తల్లి ఆజ్ఞమేరకు అక్కడ వేచియున్న సమయమున మేనక అక్కడకు చేరి వారందరకు నమస్కరించి అమ్మవారిని ఆనందపరచుటకై నాట్యము చేయనారంభించెను. పరాశక్తి చాలాకాలము నాట్యము చూచి ఆనందించి శివభక్తులనుద్దేశించి బ్రాహ్మణోత్తములారా ఎక్కడనుండి వచ్చినారు? ప్రపంచమున మీరు చూచిన గొప్ప ఆశ్చర్యకరమైన వింతలేమని ప్రశ్నించిరి. దానికి ముందుగా నారదమహర్షి తల్లీ! శివపార్వతులకు అపరాధము చేసినవారికైనను మంచి జరుగవచ్చును కాని మీభక్తులకపరాధము జేసినవారు నిశ్చయముగ శిక్షార్హులు. రావణాసురుడు బ్రహ్మవరములు పొందిన గర్వముచే కైలాసమునెత్తుటకు ప్రయత్నించి మీకపరాధముసల్పెను. అట్టిపాపోపశమనమునకు మిమ్ములను స్తుతించి తనగానముచే మిమ్ము మెప్పించి మీవద్ద రహస్య ఉపదేశము పొంది కాశీ వెళ్ళి గౌరీకుండస్నానము, కేదారేశ్వర దర్శన అర్చనలతో పాపనివృత్తి పొందెను. ఆ శాపమును మీరునూ తొలగించలేని కారణమున మీకత్యంతభక్తుడయిననూ కులముతో సహానాశము పొందెను.

మీభక్తసిఱోమణి ఈ దూర్వాసుడు మీచే ప్రసాదింపబడిన మాలను ఇంద్రునకు ఇవ్వగా అతడు దానిని భక్తితో స్వీకరింపక గర్వముతో ఐరావతము తలపై వేసెను. ఆ ఏనుగు మదముతో దానిని వేలపై విసిరి తొక్కివేసెను. ఇంద్రుడీ సంయమీంద్రుని వాక్కుతోనైననూ స్తుతింపక శాపగ్రస్తుడై రాజ్యభ్రష్ఠుడై, దుఃఖితుడై, రాక్షస భయముచే మందర పర్వత గుహలో తలదాచుకొని కడకు మునీంద్రుని శరణుజొచ్చి, ఇతడు దచతలచి ఉపదేశము చేయగా కాశీవెళ్ళి గౌరీకుండ క్నానము, కేదారేశ్వరుని అర్చనతో మీభక్తులకొనర్చిన అపరాధమునుండి ముక్తుడాయెను. మహాయోగిపుంగవుడు గౌతముడు మీభక్తాగ్రగణ్యుడు. ఇతనికి అపరాధము చేసి ఇంద్రుడు సహస్రయోనిజుడై నపుంసకుడాయెను గదా! దేవతల ఎగతాఱికి గురై బుధ్ధిగల్గి ఇతని ఏకాంతమున శరణుజొచ్చి క్షమింపవేడగా గౌతముడు కరుణించి కాశీలో గౌరీకుండ స్నానము, కేదారేశ్వర అర్చనము వలన మరల పుంసత్వము గల్గునని శుభము గల్గునని ఉపదేశింపగా అతడట్లేచేసి మరల అసురులను గెల్చి స్వర్గాధిపత్యము పొందెను. బాణుడు మీభక్తుడయినను కణ్వమహామునిని అనాదరించి సర్వమును కోల్పోయెను. యదువంశజులు కృష్ణుని ద్వేషించి యుద్ధమునకు వెళ్ళబోవగా వారికి కృష్ణుడు పాశుపతుడని తెలియజెప్పి అతని మనుమని వదలివేయమని బోధించితిరి. భక్తుని ద్వేషించువారిని శంకరుడునూ రక్షింపడు. కణ్వుడు ఏకాంతమున బాణునకు మంచి బోధించిననూ వినక మదగర్వముతో గురుధిక్కారము జేసి ఎదిరించి తనసహస్రబాహువులను గోల్పోయి రెండు భుజములవాడాయెను. అపుడు శుక్రాచార్యుడు బుద్ధిచెప్పి కణ్వమహర్షి శరణుజొచ్చి శివభక్తులకు అపరాధమొనరించి ఈ అనర్ధము తెచ్చికొంటినని చెప్పి ప్రార్ధించమని హితవుపలుకగా యుద్ధ భూమియందున్న బాణుడు మానసికముగ కణ్వమహర్షిని ప్రార్ధించెను. మహర్షి దానిని స్వీకరించి ప్రసన్నుడై అతనిని కాపాడమని శంకరుని వేడెను. తనభక్తుని అనాదరణకు కోపించిన శంకరుడు మహర్షి ప్రార్ధనకు శాంతించి వానినట్లు రెండు భుజములతో వదలి కాశీకి వెళ్ళి కేదారేశ్వరుని ఎదుట గౌరీకుండమున స్నానమాడి కేదారేశ్వరుని అర్చించి పాపవిముక్తుడవైనన్ను చేరగలవని కరుణించెను. బాణుడట్లేచేసి తనపేర శివలింగ స్థాపన జేసి శివపదము జేరి గణములలో ముఖ్యుడాయెను.

ఇంకనూ ఈ ఉపమన్యుమహాత్ముని చంద్రుడు పరిహసించి క్షీణబలుడయ్యెను. శివప్రసాద బలమున ఇతడు క్షీరసాగర మానము జేయబోగా చంద్రుడు నవ్వి పరిహాసముగా, ఎంతత్రాగగలవు?బ్రాహ్మణుని ఆశకు హద్దులేదు. సముద్రమెంత! నీవెంత! సముద్రమును పానము జేయగలవా? శివునికి కూడ బుద్ధి చాంచల్యము చేనీకు సముద్రునిచ్చెను. అని హేళనచేయగా ఉపమన్యు కోపించి మూఢుడా, శివభక్తుల ప్రతాపను నీవెరుంగవు. శివ భక్తాగ్రగణ్యుడు, యోగిపుంగవుడు, ఘటమున అంగుష్ఠమాత్రమూగా ఉద్భవించిన అగస్త్యమహర్షి ఈ సముద్రమును జలబిందువుగా కరమున గ్రహించి ఆచమనము చేసెను, మరల అల్పాచమనముగా విడిచినందున సముద్రము అపవిత్రమైనది. మహోన్నతుడయిన వింధ్యపర్వతమేమైనది? ఉత్వలుడు, వాతాపి ఎమైరి? ఒక్క వాక్కుతో మరణించిరి. నీవు అత్రిపుత్రుడవై, శివుని తలనెక్కి, క్షీరసాగరమున ఉద్భవించి, మూడులోకములను ఆనందపరచుచు నక్షత్రరాజువైననూ, గురుతల్పదోషమునకు శివుడు కోపించి నిన్ను సమాప్తిగావించతలంచెనుగాని మీమాత అనసూయ పార్వతికి ఇష్టురాలైనందున తల్లి కోరికపై శంకరుడు నిన్ను వదిలివేయగా ఆతల్లి నిన్ను రక్షించుకొనెను. గనుక బ్రాహ్మణుని అవమానించిన ఫలితము నీవిప్పుడే అనుభవింతువని పల్కి ఉపమన్యు వెళ్ళిపోయెను. అదేసమయమున గణపతి తన ఎలుగ వాహమనుపై మేరుపర్వతమున తోటి బాలురతో విహారమునకు వెళ్ళగా చంద్రుడతనిని చూచి పరిహసించెను. ఎలుక వాహనము పర్వతము అంచున పరుగెత్తుచూ జీరి పడిపోగా గణేశుడు నేలపై పడుటచూచి చంద్రుటు వికట్టహాసము జేసెను. గణపతి దానిని సహింపలేక కోపించి మనోదృష్ఠిచే భస్మము చేయనెంచి చంద్రుని చూచి మూఢా! ఈనాటినుండి నీప్రకాశము క్షీణించి దేవతలు నిన్ను మింగివేయుదురు. నిన్ను చూచిన త్రిలోకవాసులు అవమానములు పొందెదరు. అని లోకపాలకులను చంద్రుని కళలను మ్రింగివేయుడని ఆజ్ఞాపించెను. వెంటనే మొదట అగ్ని, తరువాత సూర్యుడు, విశ్వేదేవుడు, సముద్రుడు, వషట్కారుడు, ఇంద్రుడు, దేవర్షులు, అజైకపాదుడు, యముడు, పవనుడు, శక్తి, పితరులు, కుబేరుడు, శివుడు, బ్రహ్మ ఇట్లు 15 కళలు 15మంది లాగవేయగా గణపతి చంద్రుని 16వ కళను విష్ణుమూర్తికిచ్చెను. కాని విష్ణుమూర్తి దానిని హరింపక, దయతో గణపతిని మహానుభావా త్రైలోక్యవాసులు చంద్రుడు లేక జీవింపలేరు. ఒక్క కళతోనైనను ఇతనిని బ్రతకనిండు. అపరాధులకు మీరేదిక్కు అని వేడగా గణపతి, ఈతడు శివభక్తులనవమానించినాడు. నాభక్తుల అవమానము నా అవమానముకన్న గొప్పది. కనుక నాభక్తుడే అతనికి దిక్కు లేనిచో ఇతని గతికి ఇతనిని వదిలివేయవలసినదే. అనగా చంద్రుడు భయముచే కంపించి విష్ణువును ప్రార్ధించి సముద్ర గర్భమున యున్న ఉపమన్యు చరణములపై వ్రాలి రక్షింపప్రార్ధించెను. అపుడు ఉపమన్యు శాంతించి నవ్వుచు, నీకు శుభమగుగాక! నీవు గణేశుని కూడ అవమానించినందున వెంటనే వెళ్ళి ఆయన శరణు వేడమని పంపెను. చంద్రుడు విష్ణుమూర్తి సహాయమున గణేశుని శరణుజొచ్చి బ్రతికింపగోరెను. అపుడు గణపతి కరుణించి, అల్పుడా! నా అవమానము, మా మాతా పితరుల అవమానము కంటె మాభక్తుల అవమానము సహింపరానిది. నీవు వెంటనే కాశీకి వెళ్ళి అక్కడ కేదారేశ్వరుని ఎదురుగానున్న గౌరీకుండమున స్నానముజేసి కేదారేశ్వరుని పూజించి నీపేర లింగప్రతిష్ఠచేసి నిత్యము పూజించుచున్నయడల క్షీణించిన ఒక్కొక్కకళను క్రమ క్రమముగ మరల పొందగలవు. ఇట్లు 15గురు దేవతలచే భక్షింపబడుచు మరల పొందుచు జీవింతువు. మాభక్తులను అవమానించినందులకు నీకీశాస్తి తప్పదని చంద్రుని విష్ణుమూర్తితో సహా కాశీకి పంపెను. చంద్రుడు గణేశుని ఆజ్ఞనిర్వర్తించి జీవించుచుండెను.

నారదుడికనూ, తల్లీ! నీకు తెలియనిదేమి, నీ పూర్వజన్మ జనకుడు దక్షప్రజాపతి, శ్వభక్తుడయినను సభలో దధీచి నవమీనించి ఎగతి పొందెను! అతనిని నిందించిన కారణమున యజ్ఞము ఒక్క క్షణములో భంగమై అతనికి సహాయము జేయబోయిన సూర్యుడు పండ్లువిరిగిన వాడాయెను. దక్షునకు మేకతల ప్రాప్తించి అట్లే శివాజ్ఞపై కాశీకి వెళ్లి గౌరీకుండ స్నానము, కేదారేశ్వర అర్చన, తనపేర శివలింగస్థాపన పూజల వలన, మేకతలతో తిరిగి వచ్చి "చమక" మన్నపర శివస్తుతి జేసి మరల తనపదవిని పొందెను.

ఇక ఈ భృగుమహర్షి మీ భక్తాగ్రగణ్యుడు. పుణ్యాత్ముడు. విష్ణుమూర్తి మొదట ఇతని భార్యను చంపి పాపమాచరించెను. అట్టి అపరాధమునకు విష్ణుమూర్తి జన్మలనెత్తవలసి వచ్చినది. కాని మీకృపవలన దశావతారములతో పాప పరిహారమైనది. మరల జన్మలేకుండ వరము పొందినను భృగు భార్యా వియోగ దోషమున విష్ణువు రామావతారమున భార్యా వియోగమనుభవింపవలసి వచ్చినది. తదుపరి శివాజ్ఞపై కాశీలో గౌరీకుండస్నానము, కేదారేశ్వర పూజలు, అభిషేకముజేసి, తనపేర లింగప్రతిష్ఠజేసి నివృత్తి పొందెను.

ఇక అంగీరసముని విషయమున, పూర్వము నహుషుడను రాజేంద్రుడు విధివిధానముగ యజ్ఞముచేసి ప్రజారంజకముగ పాలన జేసెను. యజ్ఞమందు ఏనుగు తొంజమంత వశోధారతో 12 వర్షములు అగ్నిదేవుని తృప్తి పరచగా అగ్నికి అజీర్ణరోగము వచ్చెను. సర్వభక్షకుడగు అగ్నియే అజీర్ణరోగవిముక్తికి బ్రహ్మను ప్రార్ధించెను. బ్రహ్మ ఆలోచించి నహుషుని దివ్య యజ్ఞమునకు చకితుడై అగ్నిదేవుని ఆజీర్తి శాంతింపజేయుటకై, పృధ్విపైగల ఇంద్రుని ఖాండవవనమందు అజీర్తి ఉపశాంతికి తగిన ఓషధులు గలవు దానిని భక్షింపుమనిచెప్పి, దానిని చేరుట కష్టమయిననూ ప్రయత్నింపుమనెను. అగ్ని వెంటనే వెళ్ళి దహింపబూనగా ఇంద్రుడు మేఘముల నాదేశించి అగ్నిని ఆర్పివేసెను. ఎన్నిమార్లు ప్రయత్నించిననూ మేఘములతో గెలువలేక అగ్ని మరల బ్రహ్మవద్దకు వెళ్లి మొరపెట్టుకొనెను. బ్రహ్మ మరొక ఉపాయమాలోచించి విష్ణుమూర్తి అంశతో నరనారాయణులు కృష్ణార్జులులుగా పృధ్విపై అవతరించియున్నారు. వారిని శరణుజొచ్చి ప్రార్ధించి ఖాండవ దహనమునకు నీకు సహాయము చేయమని కోరుమని సలహా యిచ్చిరి. అగ్ని అట్లేచేసి తన అజీర్తి ఉపశమింపజేసికొనెను. అంతటి ప్రతిభావంతుడు నహుషుడొకమారు స్వర్గమునకు వెళ్ళగా ఇంద్రుడతనిని పూజించి , తనకు సమానముగా ఆసనమిచ్చి గౌరవించెను.

ఒకమారు ఇంద్రుడు వృతాసురుని చంపి భయముతో అదృశ్యుడైన సమయమున దేవతలు ఇంద్ర సభలో సింహాసనము ఖాళీగా యుండకూడదని ఇంద్రుడు వచ్చువరకు నహుషుని ఇంద్ర సింహాసనమున అభిషేకించిరి. నహుషుడు మదగర్వితుడై శచీదేవిపై మనసుపడి, భర్తజాడ తెలియక దుఃఖించుచున్న శచీదేవిని బలాత్కరించెను. అపుడు బృహస్పతి నహుషునితో, సచీదేవి పతివ్రత, తత్కాల సింహాసనాధిష్టత గర్వముతో శచీదేవినాసింపరాదని హితవు పలికి తన తండ్రిని అంగీరసునితో కూడ నహుషుని హెచ్చరింపమని పంపెను. నహుషుడు ఈ మహా యోగిపుంగవుని మాట నిరాదరించిన కారణమున ఇతడు కోపించి అధోగతి పాలగుదువని శపించి తన ఆశ్రమమునకు వెళ్ళెను. నహుషుడు కొండచిలువగా భూమిపై పడెను. 10 వేల సంవత్సరములు సర్పముగా పడియుండి, హిమాలయ బిలములలో తపమాచరించు భక్తులను భక్షించి ఆకలి తీర్చుకొనుచుండెను. ఒకపరి పాంజు కుమారుడు భీముని మ్రింగివేయగా ధర్మరాజు తెలిసికొని అక్కడకు వచ్చి హేపాపీ! నా చిన్న తమ్ముడు భీముని మ్రింగితివి. నేను ధర్మరాజును. పాపఫలముగా పాము జన్మనెత్తియూ శివభక్తుల జంపుట నీ పూర్వజన్మపు శివభక్తులయడలి అపరాధమై యుండును. ఇపుడు నీవు మ్రింగిన నా తమ్ముడు భీముని వెడల గ్రక్కిన యడల నీకు మంచి జరుగును. శంభుని కృపవలన నీ కష్టములు తీరునని ధర్మరాజు చెప్పగా, అతని నోటినుండి శంభుని పదము చెవిని పడిన వెంటనే, ఆ అజగరమునకు పూర్వ స్మృతి గల్గి, భీముని వెడల గ్రక్కి యుధిష్టిరునితో, కుమారా! నేను మీవంశమునందు ప్రధముడను, నహుష చక్రవర్తిగా కీర్తింపబడినవానిని. అకారణముగా అగస్త్య, అంగీరసులతో ద్వేషము పెంచుకొని, ఆ శివభక్తులను అవమానించి ఈగతి తెచ్చుకొంటిని. వారిని ప్రార్ధించి ప్రసన్నులను జేసి నన్ను ఉద్ధరింపుమని బ్రతిమాలెను.

అపుడు ధర్మరాజు అంగీరసుని ఆదరపూర్వకముగ ప్రార్ధించి, అగస్త్యుని పూజించి నహుషుని అపరాధము మన్నింపుమని వేడగా, వారు ధర్మరాజుకు ఉపదేశము జేసి కాశీలో హరంపాప తీర్థస్నానము, కేదారేశ్వరుని అర్చనలవలన వాంఛితార్ధము సిద్ధించి నహుషుని పేర, ధర్మరాజుపేర లింగప్రతిష్ఠలు చేయుమని ఆదేశించిరి. ధర్మరాజట్లేచేసి నహుషుని ఉద్ధరించి తాను ముక్తుడాయెను. ఇట్లు శూర, పద్మ, కారణ్యాది దేత్యులెందరో బ్రాహ్మణ ద్రోహము జేసి గౌరీకుండ, ప్రాచీన గుప్త తీర్థ స్నానము, కేదారేశ్వర అర్చనల వలన ముక్తులైరి. విశ్వేశ్వర, మణికర్ణికల వలన కూడ అలవికాని పాపహరము, శివాపరాధ దోషనివృత్తి, హరంపాప తీర్థస్నాన, శ్రీకేదారేశ్వరుల అర్చనలవలన మాత్రమే నివృత్తి యగునని తెల్పి, తల్లీ శివుని కర్త, అకర్త, అన్యధాకర్త లీలలు నీ నిగ్రహానుగ్రహ ప్రసాదముల వలన జరుగని దేమున్నది. నేను చెప్పతరమా యని నారదుడు, తక్కిన బ్రాహ్మణులతో చేరి తలయొక్కి నమస్కరించి తల్లి అనుజ్ఞపై వారి స్థానములకు జేరిరి. కాశీక్షేత్ర తీర్థములు, విశ్వేశ్వర కేదారలింగములు దుస్తర దోషనివారకములు. శివభక్తులకు ముక్తిదాయకములు. ఆ సమయమున అక్కడ దేవి సన్నిధిలో నారదునిచే అమ్మవారికి వినిపింపబడిన ఈ వృత్తాంతమంతయు విని మేనక స్వర్గము చేరి దుర్ధరునితో అనునయముగా చింతించవలదనియూ, పాపపరిహారమున్నదనియూ తెల్పిన ఈశివ భక్తాగ్రగణ్యుల విశేష వైచిత్ర్యములను వినినవారు శివలోకము చేరుట తధ్యము. మేనక దుర్ధరునకు తాను దేవ బ్రాహ్మణులతో కూడి పరాంబిక వద్ద వినిన శివభక్తాగ్రగణ్యుల ప్రభావము, శివాపరాధుల పాప పరిహార మార్గములను వివరించి అతనికి ధైర్యము చెప్పి అతనినుద్ధరింప తలంచెను.

No comments:

Post a Comment