Monday, March 23, 2009

అష్టాదశోధ్యాయము

మునులు మరల సూతుని, మహాత్మా దుర్ధరుడు ఎట్లు ఉద్ధరింపబడెను? వినిపింపుడనగా సూతుడిట్లు తెల్పెను. మేలక దుర్ధరుని విమానములో కూర్చుండ బెట్టుకొని స్వర్గమునుండి కాశీకి వచ్చెను. కాశీ విశ్వేశ్వర, కేదారేశ్వరులను పూజించుటకొరకు స్వర్గములోని నందనవనము నుండి పాజాతములు తెచ్చెను. విమానము కాశీ చేరిన వెంటనే ఆకాశమున సంచరించు శివగణములు విమానమును నిల్పివేసి మేనకతో, నీవు తీసికొనివచ్చిన ఈ దుర్ధరుడు పరమ పాతకుడు. ఇతనిని కాశీలోనికి అడుగు పెట్టనివ్వము. వానిని కాశీవెలుపలే వదని నీవు వెళ్లి స్వామిని అర్చించి రమ్మనిరి. కోటి కల్పాంతములవరకు నరకయాతన అనుభవింపపలసిన ఈపాపిని వేరుకారణమున యముడు నీ వద్దకు పంపియుండవచ్చును గాని, వీనికి కాశీ ప్రవేశార్హతలేదనిరి. అపుడు మేనక వారిని ప్రార్ధించి సర్వజ్ఞుడయిన యముడు వానిని ఉద్ధరించుటకు నావద్దకు పంపిరి గనుక మీరు వానిని కరుణించి జ్ఞాన దృష్ఠితో పరికించి వానికి తరుణోపాయము తెల్పుడనగా, శివగణము ఆమె కోరికపై జ్ఞనదృష్ఠితో దుర్ధరుని వృత్తాంతము తెలిసికొని మేనకతో అమ్మా ఈపాపి విషప్రయోగముతో చంపనుంకించిన శివానందుడను యోగిపుంగవుడు నిగ్రహానుగ్రహ సంపన్నుడై యిపుడు కాశీలో నున్నాజు. జ్ఞనదృష్ఠితో ఇతడు చేసిన దుశ్చర్య తెలిసియూ ఇతడు మహాపాపియయినను అతని మనసులో ఇతనికి శుభము కల్గవలెనని తలంచి అతడే ఇతని దహన క్రియలు సల్పినాడు. దుర్ధరుని ఇక్కడ వదలి, నీవు వెళ్ళి ఆమహాత్ముని దర్శించి విషయములను వివరించి అతని ఆదేశానుసారముగ ప్రవర్తించమని శివగణము మేనకతో చెప్పి ఆ శివానందయోగిని తెలిసికొనుట కష్టము. అతడు సాధారణముగా కన్పించు వ్యక్తిగాడు. కాశీలో తపోధనులందరు, శ్రావణ సోమవారమున, విశేషముగ పూర్ణిమతో చేరిన శ్రావణ సోమవారమునను, మూడులోకములలోని వారు శ్రీకాశీకేదారేశ్వరుని సేవించుటకు వచ్చెదరు. కార్తీక పూర్ణిమ, విశేషముగ సోమవారము కలిసినచో, ఆమాస ఆర్ద్రా నక్షత్రమునాడు, పుష్యమాస పుష్యమీ నక్షత్రమునాడు మాఘమాస మఖ నక్షత్రమునాడు, ఫాల్గుణమాస పూర్వ ఫల్గుణి నక్షత్రమునాడు, చైత్రమాస చిత్ర నక్షత్రమునాడు, వైశాఖమాస విశాఖ నక్షత్ర దినమున, జ్యేష్ఠమాస జ్యేష్ఠా నక్షత్రదినమున, ఆషాఢమాస పూర్వాషాఢ నక్షత్రము రోజున, భాద్రపద మాసమున ఉత్తరాభాద్ర నక్షత్రమునాడు, మరియు ఆశ్వీయుజ పౌర్ణమి దినములలో త్రలోకములలోని తపస్వులందరు కాశీని సేవించుటకు వత్తురు. వీరందరు విశ్వేశ్వరాది దేవతల దర్శనానంతరము కేదారేశ్వరుని సేవించుటకు తప్పక వచ్చెదరు. వారిలో నీవు శివానందుని గుర్తించి ప్రార్ధింపగలవు. నీ పుణ్య విశ్షమున ఈరోజే శ్రావణ పూర్ణిమ. విశేష సోమవారమయినది. అందరకూ కన్పించకపోయినను అతడు నీకు దర్శనమిచ్చును. ఎందుకనగా పరోపకారపరాయణులకు దర్శన మిచ్చుట అతని నైజము. అని పలుకగా మేనక దుర్ధరుని, విమానమును అక్కడవదలి మనోవేగముతో కాశీలోనికి ప్రవేశించెను. విశ్వేశ్వర దర్శన మణికర్ణికా స్నానములాచరించి శ్రీ కేదారేశ్వర మందిరముచేరి నమస్కరించి పూజించి వేయికన్నులతో శివానందయోగి దర్శనార్ధము నాల్గుమూలల పరికించుచుండెను. తూర్పు ముఘద్వారము నుండి క్రిందకు చూడగా సహస్ర కిరణ సూర్య ప్రకాశముతో ఒక యోగి ప్రాచీన మణికర్ణిక తీర్థము వద్ద కన్పించెను. అతడే శివానందుడు. విశ్వేశ్వర, మణికర్ణికల నర్చించి శివాపరాధ నివృత్త తీర్థమగు హరంపాప/ రేతోదక/ గౌరీకుండ/ ప్రాచీన మణికర్ణికకు వచ్చి స్నానమొనరించినంతెనే మేనక అతని పాదములపై వ్రాలి మహాత్మా నన్ననుగ్రహింపుడని వేడగా, శివానందులు చిరునగవుతో అప్సర సామణి శుభమేగదా యనగా, మేలక సర్వజ్ఞా! మీ కృపకు పాత్రురాలనగు నాకేమి కొదువ? ఇపుడు నేను వచ్చిన కార్యము సానుకూలమగునట్లు వరమిండనిగా, మరల శివానందులు నవ్వి, మేనకా! నీవు పరోపకార బుద్ధితో బయలుదేరినది మొదలుగా నేను జ్ఞానదృష్టితో తిలకించుచుంటిని, నీవు ఈ తీర్థ జలము, కేదారేశ్వర నిర్మాల్య బిల్వపత్రము తీసికొని వెళ్లి దుర్ధరునిపై వేసిన యడల శివగణము వానినడ్డగించక లోనికి రానిత్తురు. అపుడు నీవతనిని తీసికొని నావద్దకు రమ్మని చెప్పగా, మేనక మహాప్రసాదమని యోగిచెప్పినవిధముగా తీర్థ జలము, బిల్వపత్రములు దుర్ధరునిపై వేయగా మహాశ్చర్యముగా అతని దేహమునుండి కాకులు, గద్దలు, గుడ్లగూబలు, కొంగలు, కుక్కలు, గాడిదలు, పులులు, సింహములు, ఎద్దులు, బఱ్ఱెలు, ఏనుగులు, గుఱ్ఱములు, ఒంటెలు, తోడేళ్ళు, పిల్లులు, జింకలు, పాములు, తేళ్ళు, మల క్రిములతో సహా క్రిమికీటకాదులు మొదట బయటకు వచ్చిన తర్వాత, బ్రహ్మరాక్షస, భేతాళాది కోట్లకొలది పిశాచములు హాహాకారములు చేయుచు నల్లని కాలిన శరీరములతో పర్వతాకారములు గల్గి బయటపడినావారు రోదించుచు ఆకాశమున నిల్చిరి. ఇంకనూ మహాశ్చర్యముగ దుర్ధరుని శరీరమునుండి సూర్యకిరణములవలె మెఱుపులు బయల్వెడలి ఆకాశమునంటి మొదటినుండి అతని శరీరమునుండి బయటకు వచ్చిన అండజ, స్వేదజ, జరాయుజ, పిశాచాదులనన్నిటిని భస్మమొనర్చి మరల అతని శరీరమునకు వచ్చి అదృశ్యమయినవి. అట్లు భస్మమయిన పొగ యంతయూ ఆకాశమును కప్పివేసి ఆకాశము నీలిమయినది. ఈ అద్భుత దృశ్యముచూచి చకితురాలయిన మేనక శివగణమును ప్రార్ధించి ఆవింతను గురించి తెల్పుడనగా, వారు దుర్ధరుడు క్రితము జన్మలలో చేసిన పాపమునకు గాను అతనినుండి బయల్వెడలిన అన్నిరకముల భూత యోనులలోను నూరు, నూరు సంవత్సరములు జీవించవలసి యున్నది గనుక అవన్నియూ వాసనారూపమున ఇతని అంతఃకరణమందు నిల్చియున్నవి. నీవు అతనిపై చిలికిన తీర్థమహాత్మ్యమున, కేదారేశ్వర నిర్మాల్య బిల్వస్పర్శవలనను అవన్నియూ నిల్వలేక బయటపడి రోదించుచుండగా, మరల అవి అతనినాకర్షించకుండుటకు తీర్థమహాత్మ్యమున అతనిలో ప్రవేశించిన శక్తి కిరణములు వచ్చి వానిని భస్మమొనరించి మరల అతనిలో చేరినవని చెప్పి అంతటి మహోపకారము తలపెట్టిన మేనకను ప్రశంసించి ఇప్పుడతనిని కాశీలో ప్రవేశించుటకు అనుమతింతుము, వెంటనే తీసికొనివెళ్ళి శివానందుని పాదములపై పడవేయుమనిరి. ఇదంతయు జ్ఞానదృష్టిచే తెలిసికొనిన శివానందుడు నిన్నిట్లు ఆదేశించెను. ఇదంతయు తెలిసిన మేము నిన్నతనివద్దకు పంపితిమనిరి. మేనక వారికి నమస్కరించి దుర్ధరుని తీసికొనివెళ్ళి శివానందుని పాదములపై పడవేసెను. యోగి ప్రసన్నుడై తన పాదముల చెంతనున్న దుర్ధరుని లేవనెత్తి విధివిధానముగా ప్రాచీన మణికర్ణికా స్నానము చేయించగా మరొక వింత జరిగినది. దుర్ధరుని శరీరమునుండి ఒక స్వచ్ఛ మైన తెల్లని హంస బయటకు వచ్చి యోగికి నమస్కరించి నేను ఇతని అంతఃకరణమును. ఒకనాడు ఈతడొకపుష్పమును శివార్పణమన్న కారణమున శివ పుణ్యమను నేను శ్వేతహంస రూపమున ఇతనియందు చేరితిని. ఇతడు చేసిన మహాపాపములు నన్ను హింసించినవి. ఇపుడు మీదయవలన అన్నియూ ధ్వంసముకాగా నేను సుఘముగా మీ దర్శనమునకు బయటకు వచ్చితిని. ఇతడు చపల చిత్తుడు. మరల నేనితనిలో ప్రవేశించిన యడల మరల పాపములు చేసి నన్ను బాధించును గనుక మీ ఆజ్ఞ ప్రకారము నేను ప్రవర్తింతును. ఇతనిలో చేరుటయా లేక మిమ్ము సేవించుటయా అని ఆ హంస శివయోగిని ప్రశ్నింపగా యోగి ఆ హంసతో ఇట్లనెను. ఈతడు పూర్వజన్మమున బ్రాహ్మణుడు. ధర్మభ్రష్టుడే అత్యంత పాపి అయినాడు. సర్వభక్షకుడై అగామగామియై నీచజాతి స్త్రీలోలుడై దశార్ణదేశమున మ్లేచ్ఛుల సహవాసమున మ్లేచ్ఛ స్త్రీలంపటుడై ఒకనాటి రాత్రి గ్రామము వెలుపల ఒక వనములో శిధిలమైన ఒక సోమేశ్వర దేవాలయమున ఆ స్త్రీ సంగమము కొరకు తీసికొని వెళ్లి, తన వస్త్రముతో గర్భాలయమును శుభ్రముచేసి ఆ వస్త్రమును వెలుపలకు విసిరివేసి, ఆ స్త్రీకొరకు తెచ్చిన మాలలు, తాంబూలము ఆ చీకటిలో తడుముకొనుచి ఎదో రాతి దిమ్మయని తలచిన శివలింగము పైనుంచి, ఆ స్త్రీని చేయిపట్టుకొని లోనికి తీసికొనివచ్చి అనుభవించు సమయమున ఆ మాలలు, వగైరా తీసి ఆ స్త్రీకి సమర్పించెను. తెలియక చేసిననూ ఆ పుష్పమాలలు, విడియము, శివార్పితమయిన పుణ్యమున ఇతడు కాంచీ క్షేత్రమున ఒక వెశ్య పుత్రుడుగా జన్మించెను. ఇతని తల్లి వేశ్యయై వర్ణ సంకరమయిన కారణమున, అట్టి గర్భజనితుడు ఇతని బుద్ధి భ్రష్టమయినది. పరమ పాపి అయినను, మాలలు విడియము క్రితజన్మ యందు శివుని కర్పించిన కారణమున, తన చేతినుండి జారిపడిన పుష్పమును తనకు తెలియకనే శివార్పణమను పదము తన నోటిద్వారా ఉచ్ఛరించిన కారణమున శివాజ్ఞచే శివపుణ్యమము నీవు హంసరూపమున ఇతనిలో ప్రవేశించితిని. నీమహిమయే యమధర్మరాజు చే మరల ఆలోచింపజేసి, తెలియక చేసిననూ ఆ ఒక్క పుణ్య ఫలము ఇతనిని స్వర్గమందు మేనకవద్దకు పంపినది. ఆమెకు ఇతనిని ఉద్ధరించి ఉద్దేశ్యము కల్గినది. కాశీ ప్రాచీన మణికర్ణిక జలము, కేదారేశుని నిర్మాల్య పుష్పములు తాకినంతనే అతనిలోని పాప సముచ్ఛయమంతయూ నిర్గమించి భస్మమయినదు. ఇతని కింకనూ మంచి జరుగనున్నదని శివయోగి వచించెను. అపుడు శివపుణ్యమను హంస మరల దుర్ధరుని అంతరాత్మను చేరినది. ఈ సంవాదమంతయు మేనకకు అవగతమయినది. కాని దుర్ధరునికి తెలియదు. శివానందులు మేలక, దుర్ధరులను కేదారేశ్వరుని వద్దకు తీసికొని వెళ్లి, నందన వనము నుండి మేనక చే తేబడిన పుష్పములచే కేదారేశ్వరుని వారిద్దరిచే పూజింపజేసెను. ప్రదక్షిణ నమస్కారముల తర్వాత కేదారేశ్వరుని స్తుతింపగా పరమేశ్వరుడు వృషభ వాహనుడై పార్వీ సమేతుడై, వినాయక, షణ్ముఖ, శివగణ సమేతుడై శివానందులకు దర్శనమిచ్చి, నాకు అత్యంత ప్రీతిపాత్రుడవగు నీ కృపకు పాత్రుడైన ఈ దుర్ధరుడు ప్రతిష్ఠానపురమున రాజ కుమారుడుగా జన్మించును. అక్కడ రాజు తపమాచరించి నన్ను కుమారునిగా పొందగోలెను. అతనికి నా అనుగ్రహమున ఈ దుర్ధరుడు కుమారుడు కాగలడు. శివభక్తి పరాయణుడై కాశీకి వచ్చి విశ్వేశ్వర, మణికర్ణిక, కేదారేశ్వరాదుల నర్చించి అధిక సంపన్నుడైనందున బ్రాహ్మణులను సత్కరించి, తపో యోగమార్గముల నవలంబించి సార్వభౌముడై, నా అనుజ్ఞచే బ్రహ్మద్వారా వరములు పొంది ఈ కాశీ పట్టణమునకు దివోదాసను పేర రాజగును. దేవతలను మించిన శక్తి సంపన్నుడై తపోబలముచే పంచ భూతములను తిరస్కరించి తానే వారి కృత్యములు చేయుచు, నా మాయామొహమున కాశీలోని దేవతలనందరనూ నాతో సహా కాశీనుండి బయటకు పంపివేసి, తుదకు విరక్తుడై మాయ వదలగనే నా పదము పొందును. కనుక ఇతనిని మేనకతో స్వర్గమునకు పంపి తృప్తి తీరునంతవరకు స్వర్గసౌఖ్యమనుభవించి తదుపరి భూలోకమున ప్రతిష్ఠానపుర రాజకుమారునిగా జన్మింప నిమ్మని పరమేశ్వరుడు శివయోగికి చెప్పి అంతర్ధానమయ్యెను. శివానందులు ఆనందపారవశ్యమున శివుని స్తుతించి మేనకా దుర్ధరులను స్వర్గమునకు పంపెను. దేవతలెట్లు సద్యఃఫల సిద్ధి బొందుదురో అట్లే మనుష్య దేహధారులును శివభక్తి పరాయణులగుచో సర్వసౌఖ్యమున ననుభవించి తుదకు ముక్తి బొందుదురు. అట్లు శివానందుని అనుగ్రహ పాత్రుడయిన పరమపాపియు దురాత్ముడగు దుర్ధరుడే దివోదాసుగా కాశీని పరిపాలించి దేవతలనేధిక్కరించి, చివరకు పరమాత్మనే మందరాచలమునకు పంపివేయగల సమర్ధుడాయెను. తన భక్తుల కీర్తి ప్రబలుటకై శంకరుడునూ లీలా విలాసము చేయుచుండును. ముల్లోకములయందు కాశీ క్షేత్రము, విశ్వేశ్వర, మణికర్ణికాది సేవనము ప్రబల పాపహరములు. శివాపరాధమను ఘోరపాపము మాత్రము ప్రాచీన మణికర్ణికా స్నానము, కేదారేశ్వర సేవనమున మాత్రమే విముక్తమగును.

ఇట్టి కాశీమూల రహస్యమగునది శివాజ్ఞచే నాకు స్ఫురించి మీకు తెల్పితినని సూతుడు వచించెను. కాశీలో అడుగడుగుననూ గల తీర్థములు, లింగముల మహిమ ఆ శివునికే తెలియును గాని అన్యులెరుగరు. కేదారేశ్వర, ప్రాచీన మణికర్ణికల మహిమ తెలియుట దుర్లభము. దేశాంతరమందు, కాశీ తక్క మరెక్కడ నయిననూ చేసిన పాపములకు సూర్యపుత్రుడు యముడు దండనాయకుడు. కాని కాశీలో అతనికి స్థానము లేనందున కాశీలో పాపులను శిక్షించునది కాలభైరవుడు. కాశీలో శివాపరాధులకు నిష్కృతి లేనేలేదు. కాశీలో మరణించువారు ముక్తులగుదురు. కాశీలో కొద్ది ధర్మమయిననూ అమోఘ ఫలమొసంగును. ఒక్క పర్యాయమైనను కాశీ దర్శించి వెళ్ళి వేరెక్కడ మృతిచెందినను వారికి మరుజన్మగాని తదుపరి జన్మగాని కాశీలో తథ్యము. కాశీ మృతి వెంటనే జన్మరాహిత్యకారకము. కృత, త్రేతా, ద్వాపరయుగముల కంటె కలియుగమున కలిదోషముచే జీవులు శివాపరాధులగుదురు. అట్టివారికి తరుణోపాయము కాశీలో ప్రాచీన మణికర్ణిక, కేదారనాథ సేవనము తక్క వెరొండులేదు. ప్రేమపాత్రులగు సతి, గౌరి, రావణాసులులకే మోహవసమున శివాపరాధ దోషము ప్రాప్తించి వారికిని కాశీ ప్రాచీన గంగ, కేదారసేవనముల వలననే తద్దోష నివారణ జరిగినదన సాధారణ జీవుల గతి చెప్పవలెనా! యని సూతముని చెప్పగా శౌనకాదులు సంతసించిరి.

No comments:

Post a Comment