Saturday, February 12, 2011

ఉపనిషద్విజ్ఞానము

ఉపనిషద్విజ్ఞానము

దీనిని చాలా రోజుల క్రితం బ్రహ్మశ్రీ జానపాటి బాల నరస అప్పేశ్వరశాస్త్రిగారు నాకు ఇచ్చారు। ఇందులో ఉపనిషత్తుల పేర్లు వాటి విశేషాలు ఉన్నాయి। పాఠకులకు నచ్చుతుంది, జ్ఞానవర్ధకం గా ఉంటుందన్న ఉద్దేశ్యంతో దీనిని ఇక్కడ ప్రకటిస్తున్నాను। ఇంతకు ముందు కాశీకేదారాన్ని ఆదరించినట్లే దీనినీ ఆదరింస్తారని తలుస్తూ

మీ
వేణుగోపాల్

వర్ధతాం బ్రహ్మవిద్యాచ లోకేభ్యః సుఖమేధతామ్

మానవజాతి యొక్క సంస్కృతిని పెంచునది సంస్కృత భాష. గనుక లోకమున వేద విజ్ఞానము బ్రహ్మవిద్య ద్వారానే వర్ధిల్ల వలసియున్నది.

కృతయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగముల వరకును మహర్షుల ద్వారా వారి శిష్య ప్రశిష్యులకు బోధింపబడిన వేద విజ్ఞానము క్రమ క్రమముగ లోపించుచు కలియుగమున పండిత ప్రకాండులకు మాత్రమే పరిమితమయినది.

జాతస్యహి ధృవోమృత్యుః. ఈ జనన మరణ పరిభ్రమణమునుండి తప్పించుకొను మార్గము జన్మరాహిత్యమార్గాన్వేషణ. దానినే ముక్తి, మోక్షము, కైవల్యము అందురు. జ్ఞానాదేవీతుకైవల్యమ్. కైవల్యప్రాప్తి జ్ఞానము ద్వారానే సాధ్యము. మరిజ్ఞానసముపార్జనకు ఒకేమార్గము వేద, వేదాంగ, వేదాంత, శ్రవణ, పఠన, మనన, నిదిధ్యాసము. వేదములపౌరుషేయములై గురుశిష్య పరంపరగా ఉపవీతులై గురూపదేశమున మాత్రమే సాధ్యము. ఇతర మత, కుల, లింగభేదములవారు నినుట కూడ నిషిద్ధమను సనాతన వేదవిదుల తర్క వాదము గూడ గలదు. కాని సామాన్య మానవులు జ్ఞానసముపార్జనకనర్హులనుట దుస్సాహసము.

మంత్ర పఠన, శ్రవణార్హత లేకపోవచ్చును గాని తత్తాత్పర్యమునవగతము జేసికొని, నిష్ఠాగరిష్ఠులై, మనన, నిదిధ్యాసమూలమున జ్ఞనము బడయనగును. కాని ఉపనిషత్తులను వినినంతనే అవి అగ్రాహ్యములుగానెంచి సామాన్య మానవులు భక్తి, నీతి, ధర్మ ప్రబోధకములగు రామాయణ, భారత, భాగవత ప్రబంధములు, పురాణేతిహాసములకు పరిమితమగుట నిత్య సత్యము. ఇవి పుణ్య ప్రదములై మానవ నిత్య జీవిత మార్గదర్శకములు.

జ్ఞాన, వైరాగ్య ప్రబోధకములగు ఉపనిషత్తులను గుఱించియు, వాని తాత్పర్య సూచితము నవలోకించుట తెలివిగల ప్రతి మానవునకావశ్యకము.

బ్రహ్మకు గోచరించిన చతుర్వేదముల సారమంతయును, ఉపనిషత్తుల రూపమున మహర్షులకు వేదాంగములుగ భాసించినవి. నాల్గువేదముల నుండి మొత్తము 1180 ఉపనిషత్తులు వెల్వడగా అందు ఋగ్వేదీయములు 21, యజుర్వేదీయములు 109, సామవేదీయములు 1000, అధర్వణములు 50. వీనినుండి ముఖ్యమగు 108 ఉపనిషత్తులను మాత్రము శ్రీరామచంద్రులచే శ్రీమదాంజనేయస్వామికి ఉపదేశింపబడినట్లు 108వదగు ముక్తికోపనిషత్తు ప్రమాణము. శ్రీరామ పట్టాభిషేక సమయమున సీతామాతచే బహూకరింపబడిన మౌక్తిక మాలను శ్రీమదాంజనేయ స్వామి భిన్నము చేయగా శ్రీరామచంద్రులు 1180 ఉపనిషత్తుల మూలమంత్రములను మాలగా అలంకరింపజేసి శ్రీమదాంజనేయుని తృప్తిపరచినట్లును పురాణగాథ గలదు.

No comments:

Post a Comment