పైనక్షత్రమాలలోని మహావాక్యభావము నాకళింపుజేసికొనినవారు, వారికనువగు ఉపనిషత్తును పూర్తి పాఠము, తాత్పర్యమును జదువుకొని ఆత్మానుసంధానమునకు ప్రయత్నింపవచ్చును.
హైందవ సంస్కృతి పునరుద్ధరణకు ఉపయుక్తములగునవి, నిత్య స్వాధ్యాయనమునకు వీలగునవి, కించిత్కాల పారాయణకు సాధ్యమగునవి, ఉపనిషత్తాత్పర్యవచన సారాంశమును ఆస్తికులకు అందుబాటులోనికి తెచ్చు సత్పురుషులు గన్పట్టరైరి.
సగటు మానవాళి ఆసక్తి గల్గిననూ వారి అభిరుచికి తగిన ఉపనిషత్వచన సారాంశము నవగతము చేసికొను సామర్ధ్యము ప్రశ్నార్ధకమే. గనుక నేటి యాంత్రిక యుగమున జిజ్ఞాసులగు ముముక్షులు సమయోచితముగ అనుసంధానమునకు కేవలము 3 మంత్రములనుండి 9 మంత్రముల వరకు గల ఉపనిషత్తులనుటుంకించుట యుక్తముగా భావన.
ఉచితానుచితమును, వారి అర్హతానర్హతలను సద్గురువులద్వారా నెరింగి ఈ క్రింది వానిననుసంధానము జేయనగును.
- మూడు మంత్రములు మాత్రమే గల్గి కలిదోషనివారణయు సద్యోముక్తియు గల్గించు 103వదియగు కలిసంతారణోపనిషత్తు గలదని గ్రహించిన పామరుడునూ దీనిని వదలడు. షోడశాక్షరియగు “హరేరామ హరేరామ రామరామ హరేహరే, హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే” దీనిని నామస్మరణగా భజన గోష్ఠులు చేయుచున్నారు. కాని ఈ రెండు నామములను విడిగా చెప్పుట విచారకరము. మొత్తముగా కలిపి చేయవలయును.
- నాలుగు మంత్రములు మాత్రమే గల్గి పాపహరము, మృత్యుంజయమునగునది 71వదగు “సూర్యోపనిషత్”.
కుబేరత్వము, పాండిత్యము గల్గించు “గణపత్యుపనిషత్”
సహస్రగాయత్రి జపఫలితము, దశ సహస్రరుద్రజప ఫలితము నొసగునది 91వదగు “తారసారోపనిషత్”
చతుర్వేదపారాయణ ఫలితమొసగునది 92వదియగు “మహావాక్యోపనిషత్”
సర్వమంత్ర పారాయణ ఫలితమొసగునది 101వదియగు “దత్తాత్రేయోపనిషత్”
జన్మరాహిత్య ప్రదాత్రి 104వదియగు “జాబాల్యోపనిషత్”
- 5 మంత్రములు మాత్రమే గల్గి నారాయణ సాయుజ్య ప్రదాత్రి 18వదగు “నారాయణోపనిషత్”
శివసాయుజ్య ప్రదాత్రి 28వదగు “కాలాగ్నిరుద్రోపనిషత్”
బ్రహ్మపదమునొసగునది 100దియగు “హయగ్రీవోపనిషత్”
- 6 మంత్రములు మాత్రమే గల్గి మహాసిద్ధి నొసగునది 81వదగు “శ్రీ దేవ్యుపనిషత్”
- 7 మంత్రములు గల్గిన మోక్షప్రదాత్రి 49వదగు “దక్షిణామూర్త్యుపనిషత్”
- 8 మంత్రములు గల విష్ణు సాయుజ్య ప్రదాత్రి 56వదగు “వాసుదేవోపనిషత్”
- 9 మంత్రములు గల్గి జీవన్ముక్తి, సంసార నివృతతులను గల్గించునవి 50 వదగు “శరభోపనిషత్” మరియు 53వదగు “అద్వయ తారకోపనిషత్”
ఇట్టి ఉపనిషత్తులను తాత్పర్య సహితముగ విడి విడిగా చిన్న పుస్తకములుగ తయారుచేసి ఆస్తిక జన బాహుళ్యమునకు అందించినచో వేదవిజ్ఞానమభివృద్ధినొంది, హైందవ సంస్కృతీ విస్తరణ, పరిరక్షణకు దోహదమగుట తథ్యము.
విజ్ఞులు, నాయీ పరిశ్రమను సదవగాహనతో పరిశీలించి తప్పులున్న యడల మన్నించి, నాకు తెల్పినయడల సర్దుబాటు చేసికొనగలను.
శ్రీ అప్పేశ్వర శాస్త్రిగారు నూటఎనిమిది ఉపనిషత్తుల ను సంగ్రహముగా తెనిగించినట్లు తెలిపినారు। త్వరలోనే వాటిని కూడా ఇక్కడ ప్రకటిస్తాము.