Monday, May 4, 2009

30 వ అధ్యాయము

ఋషి గణము మరల సూతునిట్లడిగిరి. శివజ్ఞాన రహస్య తత్వజ్ఞుడవగు గురువర్యా! మీ ద్వారా తెలిసికొనదలచిన ముఖ్యవిషయము ఒకటి కలదు. శివుడు గౌరీదేవిని వినిపించిన నూరు కథలలో మీకు ఎవైన తెలిసియున్నచో సెలవిండు. శివుడు ఏకాంతమందిరమున, తనకు మాత్రమే తెలిసిన కథలు గౌరికి వినిపింపగా వానిని నౌగమేయుడు విని రహస్యముగ లక్ష్మికి వినిపించెనని తెల్పితిరి గదా! ఆ కథలలో కొన్ని మీకు తెలిసియుండిన దయచేసి మాకు వినిపింపుడని కోరిరి. సూతుడు, మునులారా ఆ కథలను సంత్రేపముగా తెల్పుదును వినుడు. మాగురువు వ్యాసుని ద్వారా నేను తెలిసికొనిన వానిలో కాశీకి సంబంధించిన వానిని తెల్పుదును.

కల్పభేదముచే సృష్ఠిలో కూడ భేదముండును. శివలీలలు అద్భుదము. శివునిచే గౌరికి చెప్పబడిన కథలు అనేక కల్పములలో, విచిత్రముగా ఎందరు శివుని సేవించి బ్రహ్మపదము, దేవాంగనా పదములను బొందిరో లెక్కకందవు. శివ మహిమ తెల్పు కాశీని గురించిన కథలు వినుడు.

పరమేశ్వరుడిట్లు చెప్పుచున్నాడు. దేవీ భూమండలమున ప్రత్యేక ప్రధానమగు కాశీ నా శరీరము. కాశీ నా త్రిశూలాగ్రమున నిర్భయముగ నుండును. ప్రళయకాలమున కాశీని మహాకైలాశమునకు ఎత్తి పట్టుకొని మరల సృష్ఠి జరిగిన వెంటనే క్రిందకు దించి భూమిలో చేరునట్లు చేసెదను. కాశీ లౌకిక దృష్టికి పృధ్విలో చేరినట్లుండును కాని జ్ఞాన దృష్టికలవారికి కాశి నేనుగానే తెలియును. అందున విశ్వేశ్వర,ఓంకారేశ్వర, కేదారేశ్వర లింగముల మహిమ చాలా గొప్పది.

1) కశ్యపుని కథ
ఒకప్పుడు దశార్ణవదేశమున కక్షివంతుడను బ్రాహ్ణుడు శ్రద్ధాళువై తన కుమారునితో సహా కాశీయాత్రకు వచ్చెను. తన ఇద్దరు భార్యలతో కేదార క్షేత్రమున వశించి, నిత్యము కేదారేశ్వరుని సంవత్సరకాలము సేవించెను. సోమవార వ్రతములు విధిగా సల్పుచుండెను. శాస్త్రోక్తముగా గౌరీ కుండమున స్నానమాడి భస్మరుద్రాక్షధారియై పగలు శివుని పూజించి రాత్రికి భుజించెడివారు. హవిష్యాన్నము, పాలు, పండ్లు స్వామికి నివేదించిన వానినే అందరూ స్వీకరించెడివారు. ఒక సంవత్సరకాలమిట్లు సేవించి మరల వారి స్థానమును చేరిరి. కాలమాసన్నమై భార్యలతో సహా మరణించి మరు జన్మలో బ్రహ్మపుత్రుడు కశ్యపుడుగా జన్మించి భార్యలు దితి, అదితులై అతనినే పరిణయమాడిరి. కేదారేశ్వరుని ప్రసాదమున వారికుమారుడు ఇంద్రపదవి పొందెను. అంతమున శివజ్ఞానము పొంది నాలో చేరిరి.

2) స్వాయంభువ మనువు కథ

కౌశల దేశమున సుదాసుడను పేరు గల రాజు కలడు. అతడు, భార్య, కుమారులు చాలా ధార్మికులు. ధర్మాత్ములు. చిన్నకుమారునకు రాజ్యమప్పగించి కాశీని సేవించుటకు వచ్చిరి. కేదాల క్షేత్రమున వసించి ప్రతి పక్ష ప్రదోషము దినముననూ కేదార గౌరి కుండమున స్నానమాడి భస్మ రుద్రాక్షలు ధరించి కేదారేశ్వరుని పూజించి బ్రాహ్మణ సమారాధన తర్వాతనే వారు భుజించెడ్వారు. అట్లు సంవత్సరకాలము వ్రతమాచరించి వారి రాజ్యమునకు వెళ్ళిరి. వారు గతించి మరు జన్మమున కేదారేశ్వరుని కృపచే స్వాయంభువమనువుగను, భార్య శతరూపగను పుత్రుడు సూర్యుడుగను భాసించిరి. క్రమముగ శివజ్ఞానముపొంది నా పదమును చేరిరి.

3) చంద్రుని కథ

పాండ్య దేశమున సుధనుడను వ్యాపారి ధనికుడు, శివధర్మపరాయణుడు. స్త్రీ పుత్రులతో కాశీయాత్రకు వచ్చిరి. యధావిధిగా కేదార క్షేత్రమున శివపూజా ధురంధరులై రెండు సంవత్సరములు గడిపిరి. నిత్య గౌరీకుండ స్నానము కేదార సేవనము సల్పిరి. శివరాత్రి వ్రతమునందాసక్తులై రెండు శివరాత్రులు గౌరీకుండ స్నానము భస్మ రుద్రాక్షధారణ అహోరాత్రకేదార అర్చన, రాత్రి జాగరణ, నాల్గు జాముల పూజ, మరుదినము బ్రాహ్మణ సమారాధన తర్వాత అతడు భార్యా పుత్రులతో కలసి భోజనము జేసి మరల వారి దేశము చేరిరి. దేహావసానంతరము వారు చంద్రుడు, రోహిణి, వారి పుత్రుడు బుధుడుగా అవతరించిరి. ఆ భోగమనుభవించిన తర్వాత నాభక్తులై నాలో ఐక్యమయిరి. నేనే కేదారేశ్వరుడను. వారి భక్తికి ప్రసన్నుడనై వారికి శివ పదము అనుగ్రహించితిని.

4) యమ, శనైశ్వరుల కథ

కాశ్మీర దేశమున శ్రీదాసు యను ఒక శూద్రుడు గలడు. వానికైదుగురు కుమారులు. చాలా అన్యోన్యముగా నుండెడివారు. బిడ్డలననాధులను చేసి తలిదండ్రులు గతించిరి. బిడ్డలు వారి చితా భస్మమును గంగలో నిమజ్జనము చేయుటకు కాశీకి వచ్చిరి. విధి పూర్వకముగ ఉత్రర క్రియలు గవించి, కేదార క్షేత్రమున ఒక సంవత్సర కాలము నిత్య నియమిత యాత్రలు చేయుచు, నిత్యము గౌరీకుండ స్నానము, కేదార సేవనము చేసిరి. ఆ సంవత్సర కాలములో మూడు శని ప్రదోషములు రాగా వారు ఉపవాసదీక్షతో భస్మ రుద్రాత్రధారులై కేదారేశ్వరుని పూజించిరి. వారి దేశము చేరిన తర్వాత కాలమాసన్నమై వారు మరణించిరి. వారు కేదారేశ్వరుని అనుగ్రహమున యముడు, శనైశ్చరుడు, సావర్ణిమను, మరియు అశ్వనీ కుమార దేవతలైరి. భోగానంతరము శివ జ్ఞానులై నాపదమును బొందిరి.

5) రాహువు కథ

మార్వాడ దేశ శమీపురమను గ్రామమున దుర్ఘటుడను పేర ఒక చండాలుడుండెను. అతడు చాలా పాపి. మ్లేచ్ఛ వర్తకునితో అతడు కాశీకి వచ్చెను. మ్లేచ్ఛుడు వర్తకము ముగించుకొని వెళ్లిపోయెను. దుర్ఘటుడు అనారోగ్య కారణమున వానితో వెళ్ళలేక కేదారక్షేత్రమున బిచ్చగాడుగా పడియుండెను. అట్లు ఆరునెలలు గడిచి పోయినవి. ప్రతినెల కృష్ణపక్ష చతుర్దశి కేదారేశ్వరునికి మాస శివరాత్రి ఉత్సవమునకు భక్త జనసందోహము వచ్చును. దుర్ఘటుడు అందరివద్ద బిచ్చమెత్తి అందరిని భగవంతుడు మీకు మేలు చేయునని చెప్పెడివాడు. అట్లే రాత్రి గడచి పొయెడిది. ఆరు మాసములలో ఆరు మాస శివరాత్రులట్లు జాగరణ చేసెను. అట్లు దైవికముగ చండాలుడైనను కేదార నామోచ్ఛారణ, రాత్రి జాగరణల ఫలితముగ అనారోగ్యము మటుమాయమై తన గ్రామమునకు తిరిగి వెళ్లి, కాలవశమున మృతి జెందెను. కేదార అనుగ్రహమున అతడు రాహువుగా సింహికకు జన్మించి, మోహిని అమృతము పంచునపుడు రాక్షసుడైనను మోసపూరితముగ అమృతపానము చేసిన కారణముగా రెండుగా ఖండింపబడినను, కేదారేశ్వరుని కృపవలన నవగ్రహములలో ఒకనిగా పూజలందుకొనుచు భోగాంతమున నాపదము పొందెను.

6) పార్వతి, లక్ష్మి, సరస్వతి, ఇంద్రాణుల కథ

దేవీ మరొక కథ వినిపించెదను. కర్ణాటక దేశమున కళావతి యను ఒక బ్రాహ్మణ యువతి గలదు. అంగదేశమున విలాసినియగు ఒక రాణి గలదు. ఘూర్జర దేశమున సుమతి యను ఒక వైశ్య స్త్రీ గలదు. విదర్భ దేశమున పుష్ప నామముతో ఒక శూద్ర స్త్రీ గలదు. వీరు నల్గురు వైధవ్యమును పొంది పతిలేకపోగా పుత్రులుకూడ లేనివారై విడివిడిగా కాశీకి చేరిరి. నిత్యము గంగాస్నాన, విశ్వేశ్వర అర్చనలు యధాశక్తి బ్రాహ్మణులకు దానములు చేయుచు ఒకరోజు వారు నల్గురు కేదారేశ్వర ఆలయమున కలిసి ముచ్చటించు కొనుచు, వారి వారి కష్టసుఖములు, పూప్వ వృత్తాంతములు చెప్పుకొనిరి. వారివద్దనున్న ధనము పూర్తిగా వ్యయమగువరకు నల్గురునూ ఒకచోట కలిసి యుండునట్లు నిశ్చయించుకొనిరి. నిత్యము గౌరీకుండములో స్నానము, కేదారేశ్వర పూడ, ఇష్ట దేవతలైన పతులను మనసా ధ్యానించుకొనుచు 12 సంవత్సరములు కాశీ కేదారేశ్వరుని సమీపముల వశించిరి. సోమవారములు, ప్రదోషములు మాస శివరాత్రులు, మహాశివరాత్రులు, ఉపవాస ప్రతముతో భక్తి ప్రపత్తులతో బ్రాహ్మణ సమారాధనలు చేసి తర్వాత వారు భుజించెడివారు. శరీర కష్ముల కోర్చి ఈ విధముగ వారి వద్ద ధనము పూర్తిగా వ్యయమగువరకు కాశీవాసము చేసి తర్వాత వారి వారి గ్రామములకరిగిరి. కాలవశమున నల్గురును మరణించిరి. కేదార క్షేత్రమున వారు అన్నలింగమునకు గంధపుష్పాక్షతలతో నిత్యపూజ చేసిన కారణమున కాశీ అన్నపూర్ణ ప్రసన్నురాలై వారికి నా శివపద మబ్బునట్లు చేసినది. హే గౌరీ వినుము, నీవు ఆ కల్పమందు ఆ బ్రాహ్మణ స్త్రీ కళావతి, లక్ష్మి రాణియగు విలాసిని, సరస్వతి వైశ్య స్త్రీ సుమతి, మరియు ఇంద్రాణి పుష్పయను శూద్ర స్త్రీ. వారు ఒక కల్పకాలము మీ పదవులలో యుండి నా భక్తిచే నా జ్ఞానమును పొంది శివపదమలంకరించిరి.

7) దూర్వాసుని కథ

మరొక కథ వినుడు. కాంచీ పురమందు ధర్మ శర్మ యను పుణ్యాత్ముడు ఒక బ్రాహ్మణ బ్రహ్మచారి గలడు. వేద విద్యాభిమాని. యధావిధి కాశీ యాత్రకు వచ్చి కాశీ కేదార నాథుని దగ్గర మూడు సంవత్కరములు నిత్యము గౌరీకుండమందు స్నానము, కేదారేశ్వరుని పూడ చేసి మధూకర వృత్తితో భుజించెడివాడు. ఆర్ద్రా నక్షత్ర దినమున ప్రతిమాసము అరుణోదయకాలమున, ముఖ్యముగ ధనుర్మాస ఆర్ద్రాదినమున విశేషముగ నా మహాలింగ అర్చన చేసెడివాడు. స్వామీ నా పూజలతో ప్రసన్నుడవయి నాకు నీ కల్మష రహిత సుజ్ఞానము ప్రసాదింపుమని రోజునూ ప్రార్ధించెడివాడు. అట్లు 3 సంవత్సరములు గడచిన తర్వాత మరల కాంచీపురము వెళ్లుచు త్రోవలోనే మరణించెను. కేదారేశ్వరుని అనుగ్రహమున అతడు మరుజన్మలో అత్రి మహర్షి కుమారుడు దూర్వాసుడుగా జన్మించెను. శివమానసుడు, శివరహస్య జ్ఞానిగా ఒక కల్పము భోగమనుభవించి కల్పాంతమున శివపద ప్రాప్తి బొందెను. అత్రి మహర్షి భార్య అనసూయాదేవి కేదారలింగమునకు అన్నలింగ జ్ఞానముతో పూజలు సలిపి త్రిమూర్తులకు మాత అయినది.

8) అగస్త్య, లోపాముద్రల కథ

మరియొక కథ వినుడు. ఒకప్పుడు శ్రీశైల పర్వతము ధృతియను పేరుగల బ్రాహ్మణుడు శ్రీమల్లిఖార్జున లింగమును భక్తితో పూజించెడివాడు. అతడు భార్యా సమేతుడై కాశీ యాత్రకు వచ్చి కేదార క్షేత్రమున వసించి, ఆరు సంవత్సరములు నియమ నిష్ఠలతో షణ్ముఖ స్వామి కార్తికేయుని పూజించెడివారు. ప్రతిమాసము కృత్తికా నక్షత్రమున, శుక్ల పక్ష షష్ఠీ దినమునను, విశేషముగ కార్తీక మాస శుక్ల పక్షమున, చంపా షష్ఠీ, స్కంద షష్ఠీ దినములందు విధిపూర్వకముగ ఉపవాస వ్రతమాచరించుచు పూజలు సల్పిరి. నిత్యము గౌరీ కుండమున స్నానము చేసి కేదారేశ్వరుని పూజించుట వారి నిత్య కృత్యము. అన్నపూర్ణా సమేత కేదారేశ్వరునిగా ధ్యానించెడివారు. యధాశక్తి బ్రాహ్మణులకు బిక్షులకు అన్నమిడెడివారు. ఆ తర్వాత వారు భుజించెడివారు. ఆరు సంవత్సరముల తర్వాత వారికి పృధ్వీ ప్రదక్షణము చేయు సంకల్పము కల్గి కాశీని వదలి మార్గ మధ్యమున దేహ త్యాగము చేసిరి. అతని భార్య అతనితో సహగమనము చేసినది. వారు మరు జన్మమున అగస్త్య, లోపాముద్రలై గొప్ప కీర్తి గడించిరి. కార్తికేయుని ద్వారా శివ రహస్య జ్ఞానముపదేశింపబడి కల్పాంతమున నా సన్నిధికి చేరి శివపదము బొందిరి.

9) పృధి చక్రవర్తి తండ్రి వేణు కథ

మరియొక కథ. వింధ్య పర్వత శ్రేణిలోని ఒక వనమందు దుర్నయుడను పేరు గల ఒక మహాపాపి, కిరాతకుడుండెడివాడు. పథికులను దారిదోపిడి చేయుచు బ్రతికెడివాడు. ఒకనాడు అతడు ఒక కార్పణికుని చంపుటకు కత్తి ఎత్తగా అతడు భయపడి హే ఢుంఢి గణపతీ, హే కేదారనాథా నన్ను కాపాడుడని దీనుడై పెద్దగా ప్రార్థించెను. వెంటనే కత్తి ఎత్తిన కిరాతుని చేయి పైన స్తంభించిపోయెను. అతడు ఎంత ప్రయత్నించినను కత్తి పట్టిన చేయి దింపజాలనందున అతి దుఃఖితుడై ఆ బ్రాహ్మణుని ప్రార్ధించి, స్వామీ నన్ను దయతలచి మరల నా చేయి సరియగునట్లు చేయుడు. మీ ఇష్టదైవమును ప్రార్థించి నన్ను కాపాడుడని బిగ్గరగా ఏడ్వగా బ్రాహ్మణుడు దయాళువై మరల ఢుండి రాజ కేదారేశ్వరులను ప్రార్ధించి కిరాతుని చేయి దిగునట్లు చేసెను. కిరాతుడతని కాళ్లపై బడి, కాధూ నా అపరాధమును మన్నించి నాకు తరుణోపాయముపదేశింపుడని పేడగా, బ్రాహ్మణుడతనిని ఆదరముగ లేవనెత్తి నీవు కాశీయాత్ర చేసి ముందుగా గణేశుని, ఆపై శంకరుని విధాయకముగా పూజించినచో నీవు కృతార్ధుడవగుదువని తెల్పెను. దుర్నయుడు వెంటనే కాశీ యాత్ర జేసి విధిపూర్వకముగ గణేశుని, ఢుండిరాజును, విశ్వేశ్వరుని పూజించి, కేదార క్షేత్రమున ఒక సంవత్కర కాలము కేదారేశ్వరుని పూజించుచు నిత్యము గౌరీకుండ స్నానము, చతుర్ధి దినములలో గణపతి పూజ, మహాచతుర్ధియందు విశేషార్చన, బ్రాహ్మణ, యతి, భిక్షుల ఆతిధ్యము తర్వాత తాను భుజించును గడిపి ఉపవాస జాగరణలతో శివుని తృప్తిపరచెడివాడు. తర్వాత ఒకనాడు తనదేశము చేరుటకు కేదారుని అనుమతి కోరగా, ఆకాశవాణిరూపమున నీకు మంచి జరుగును, వెళ్లి భక్తితో నన్ను ప్రార్ధించుచుండుమని అతనికి వినిపించెను. అతడు తనదేశము తిరిగి వచ్చి కలమాసన్నమై మరణించి, మరుజన్మమున పృధుచక్రవర్తి తండ్రి వేణు యను రాజుగా జన్మించి కీర్తి గడించెను. గణపతిని గురించిన పూర్తి జ్ఞానముపదేశము పొంది మరుజన్మ ఇంద్రుడై, శివజ్ఞాన ప్రాప్తిపొంది అంతమున నాపదము చేరెనని శివుడు గౌరికి రహస్య కథ వినిపించెను.

10) నారద, తుంబురుల కథ

పూర్వము కళింగదేశమున ముగ్గురు భిల్లులుండెడివారు. వారి పూర్వపుణ్య వశమున వారికి కాశీయాత్ర చేయు సంకల్పముదయించి కాశీచేరి కేదార క్షేత్రమున ప్రతి శుక్ర, శని, మంగళవారములందు, దండపాణి, బిందుమాధవ, కాలభైరవులను విధిపూర్వకముగ పూజించి మరుజన్మలలో వారు విశ్వవసు, నారద, తుంబురులుగా జన్మించి, నాగానమందు రతులై ఒక కల్పకాలము భోగమనుభవించి, కేదారేశ్వరుని కృపవలన ముక్తులై నాలోని శివపదము జేరిరి.

ఇట్లు వివిధ కల్పములందు ఎందరో విశ్వేశ్వర, ఓంకారేశ్వర, కేదారేశ్వర లింగములను పూజించి కాశీ వదలి మరల వారి స్థానములకు చేరినను వారికి దేవత్వమబ్బి భోగములననుభవించి నాజ్ఞానము కల్గి నన్ను చేరినవారనేకులు ఋషులు, మునులు, సాధ్యులు, విశ్వేదేవతలు, మరుద్గణములు, ఆదిత్య, వసు, రుద్ర, దిక్పాలకులు, వారి స్త్రీలు, పాతాళవాసులు, గంధర్వ, యక్ష, కిన్నెరలు, నాగ కన్యలు, అప్సరసలు, మహాలోక, తపోలోక, జనాలోకవాసులు, బ్రహ్మ, విష్ణు, రుద్ర లోక పాసులు, ప్రఖ్యాత చక్రవర్తులు, ఇట్లు ఎందరో కల్పి కల్పములలో కాశీలో నా పూడచేసిన వారలు కాశీవదలి వెళ్లిననూ దేవయోనులయందు జన్మించినవారనేకులు గలరు. నా ఇతర క్షేత్రములందు నన్ను సేవించిన వారునూ అట్లే ఉత్తమోత్తమగతులు పొందినారు. ఇట్లు అనేక గుహ్యతమ చరిత్రలు ఎన్ని చెప్పగలను. నా ఆనందమయ మీలలు చిత్రాతి చిత్రములు. అని శంకరులు గౌరికి ఇట్టి ఎన్నో కథలను వినిపించిరి. ఈ విధముగనే కాశీలో ఓంకారేశ్వర, విశ్వేశ్వర లింగములను పూజించి కృతార్ధులై దేవత్వమబ్బినవారెందరి కథలో గలవు. అవియునూ వినిపించిరి.

సూతుడు శౌనకాదులతో పుణ్యాత్ములారా! శివునికి మాత్రమే తెలిసి గౌరీదేవి కి వినిపించిన ఇట్టి పరమ రహస్యములు, నా గురువులు వ్యాస భగవానులు, శివభక్తి పరాయణులై దివ్య జ్ఞానముచే కొన్ని తెలిసికొని నాకు వినిపించిరి. నేను మీకు వినిపించితిని. మీరు ధన్యులు. కాశీ విశ్వేశ్వర మందిరమునందును, వివిధ దేవతల మందిరములందుని శివ, శక్తి, గణేశ, కార్తికేయ, నంది, భృంగి, మరియు అన్ని దేవతల పుణ్య దినములందును విశేషమూజలు సల్పిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, భిల్ల, చండాలాదులు కూడ మరుజన్మమున దేవతలలో ముఖ్యులైనవారి కథలు వింటిరిగదా! పరమేశ్వరుని ఒక్కొక్క అంశ ఒక్కొక్క లింగరూపమున భుతలమందనేక ప్రదేశములందు నెలకొని ఎందరినో ముక్తులను చేసినది. అనన్య భక్తులకు మాత్రమే అవి ప్రాప్తించును. పుర్వ జన్మల పుణ్యవిశేషమున మాత్రమే అపవిత్ర వాసనా క్షయము, పవిత్ర కర్మలపై ఆపేక్ష జనించి శివారాధన ద్వారా ముక్తులగుదురు.

2 comments:

  1. its grt!! man! meeru " Kashi majili kathalu " pdf dorikithe link ivvagalara??
    telugu grandhikam lo vunnadi kavali ( patha prathi). can u? thank u in advance

    ReplyDelete
  2. " Kashi majili kathalu " dorikithe grandhikam lo vunnadi kavali can u suggest me any book stores

    ReplyDelete