ఋషులు సూత పౌరాణికునికి నమస్కరించి, బాదరాయణ శిష్యులు, శివరహస్య నిధియగు మహాత్మా! మీ ద్వారా శ్రీ కాశీ కేదారనాథ మహాత్మ్యము విని తరించితిమి. ఈ కేదారనామము శివునికెట్లు క్లగినది? సాకల్యముగా తెలియజేయుడని కోరిరి. సూతుడు వారడిగిన రహస్య కథతెలియజేయుదునని ఇట్లు తెల్పెను.
పూర్వము హిమవంతుడు భార్యా సమేతముగా శంకరుని ప్రసన్నుని చేసికొనుటకై పదివేల సంవత్సరములు తపస్సుచేసెను. నా యశస్సు పర్వతరాజులందరను మించి పోవలెనన్న, జడుడనగు నాకు శంకరుడు తప్ప వేరు గతి లేదు. గనుక నా మనోరధము నెరవేర్చువరకు తపమాచరింతునను ధృఢసంకల్పముతో వాయు త్రక్షకుడుగా ఇరువదివేల సంవత్సరముల తపస్సు తర్వాత శంకరుడు ప్రీతుడై ప్రత్యక్షమై హే పర్వతరాజా! నీవు భార్యా సహితముగా ఉగ్రతపమాచరించి నన్ను తృప్తుని జేసితివి గనుక నీ అభీష్టము కోరుకొమ్మనగా, వారు పరమానందముతో స్వామిని స్తుతించిరి. జగదాధారా! భక్తాభీష్టవరదా! భక్తుల సర్వస్వమయినా ప్రభో నీకు జయము. హే కరుణాసింధో, త్రిగుణాతీత, సగుణ సర్వజ్ఞ నీకు జయము. స్వామీ మేము ఆపదలలో నున్నపుడు ఎవరిని భజించవలయును? ఈశ్వర చరణారవిందములను భజింతుము. అందువలన ఏమగును? విష్ణువు మొదలుగాగల సర్వ దేవతలు ఆజ్ఞావర్తులగుదురు. ఉపనిషద్వాచకుడగు చంద్రమౌళి నా మనోవాంఛ నెఱవేఱ్చుటకు నా హృదయ గుహయందు నివశించుగాక. సత్య, జ్ఞాన, అనంత, బ్రహ్మరూపుడగు వాని వలన పంచభూతములు, అన్నము సృజింపబడి మరల వానిలోలయమగుచున్నవి. అట్టి త్రిగుణాతీతుడు నా ముందు కన్పించుచున్నాడు. నా పూర్వపుణ్యముచే నా తపము ఫలించినది. ప్రభో నన్ను కరుణించుమని ఆనంద పారవశ్యమున హిమవంతుడు దేహభావన మరచి నాట్యముచేసి సర్వప్రాణుల అంతర్గతుడవైన నిన్ను నేనేమి వరము కోరగలను. నా మనమున గల కోరిక నీవెరుంగనిది కాదు. గాన దనిని నెరవేర్చుమని వేడెను.
పరమశివుడు సంతుష్టుడై హే పర్వత రాజా నీ కోరిక నేనెరుంగుదును. నీవు పర్వత రాజులలో శ్రేష్టుడవగుదువు. దినిని అందరునూ అంగీకరింతురు. నీవు నాకునూ పుజ్యుడవగునట్లు చేయుదును. నా భక్తాగ్రగణ్యులే నాకిష్ఠులు కనుక నీ శిఖరములలో బదరీనామ శిఖరమును నా ఆశ్రమముగా చేసికొందును. కలగతిన జగదంబ నీకు పుత్రిక కాగలదు. తన పూర్వ తండ్రిని నిరశించి వదలివేయుటచే నీకు పుత్రికగా జన్మించగలదు. ఆమెను నాకు వివాహము చేయుటచే నాకు పూజ్యుడవగుదువు. బ్రహ్మాది దేవతలందరును నిన్ను కీర్తింతురు. ఈ బ్రహ్మ కల్పము తర్వాత నీవు ముక్తుడవై నా పదము పొందుదువని వరమొసగి వెంటనే హిమాలయ బదరీ శిఖరమున వసించెను. వెంటనే విష్ణుమూర్తి నర, నారాయణ రూపములు ధరించి, శివును సేవించుటకు ప్రతి దినమునూ ఆ శిఖరమునే తన నెలవుగా చేసికొనెను. ఈ శివలింగ దర్శనమున జీవులకు విదేహముక్తి గల్గి యోగులకునూ దుర్లభమగు శివపద ప్రాప్తిగల్గును. ఇది గ్రహించిన ముముక్షువులందరునూ తండోప తండములుగా ఈ పర్వత శిఖరము దర్శించి ముక్తులగుచుండిరి. ఈ పర్వత దర్శనమున ధర్మార్ధకామమోక్షబీజములు వెంటనే ఫలించుటచే ఈ క్షేత్రము కేదారము అనగా శీఘ్రఫలదాయక భూమియని ప్రశిద్ధిగాంచినది. జగద్వఖ్యాతమయిన కేదార పర్వత దర్శన కేదార లింగార్చనవలన పునరావృత్తి రహిత మోక్షము ప్రాప్తించినది.
మహాకైలాసమున ఒకపరి బ్రహ్మ కేదారము దర్శించి ముక్తులై కైలాసము చేరినవారి హృదయకమలమున మహాలింగ దర్శనము చూచి పరమానందముతో తానునూ కేదార దర్శనమునకు రాగా అక్కడ లింగమున శివదర్శనము కాలేదు. ఆశ్చర్యముతో అటునిటు పరుగెత్తి వెతుకదా అక్కడ ఆవులమందులో దాగి శంకరుడు వృషభరూపమున దర్శనమొసగెను. అప్పటినుండి కేదారలింగమున శివదర్శనము నిల్చిపోయినది. దానితో కేదార దర్శకులకు సద్యఃముక్తియు నిల్చిపోయినది. కాని అక్కడ ప్రాణత్యాగము చేసినవారు, రేతోదక జలపానము చేసినవారు మాత్రము ముక్తులగుచుండిరి.
శివుడు కేదార పర్వతమునుండి కాశీచేరినందున విశ్వేశ్వర నగరమగుటచే కాశీ ద్విగుణీకృతముగ ధర్మార్థ కామమోక్ష ఫలదాయినియు సద్యోముక్తి దాయినియు మాత్రమే గాక, కేదార పర్వతమునకంటె మిక్కుటమగు ఫలప్రదాయిని అయినది. కేదార పర్వత యాత్ర మోక్షదాయిని. కాశీ కేదార దర్శన, స్పర్శన, అర్చనములు అనాయాస ముక్తిదాయకములు. మహాదేవుని తారక మంత్రోపదేశముతో క్షణములో జీవి కాలభైరవ దండన లేకనే ముక్తిపొందును. 50 కోట్లయోజనముల విస్తీర్ణముగల భూమండలమున కాశీ విలక్షణమయినది. శివానుగ్రహముగలవారు కాశీలో మరణించి శివపదము పొందుదురు. శివజ్ఞాన రహస్యము కేవలము శివునికి మాత్రమే తెలియును. ప్రియసతి గౌరీమాతకు తెలియును. కుమారస్వామి ద్వారా సనత్కుమారులు తెలిసికొన గల్గిరి. కేదారనామోచ్ఛారణయు శివప్రీతికరమై కాశీవాసఫలితమొసంగును. కాశీవిశ్వేశ్వరునికిని, కేదారేశ్వరునికిని భేదములేదు. ఇట్టి కాశీ కేదార మహిమను వినినఋషిపుంగవులు పులకాంకితులై నిశ్చల ధ్యాన నిమగ్నులైరి.
No comments:
Post a Comment