Wednesday, May 6, 2009

31 వ (ఆఖరి) అధ్యాయము

మహర్షులు సూతుని, గురుదేవా! మంగళకరమగు శివకళ్యాణ రహస్యము శలవిండని వేడిరి. సూతుడిట్లు వివరించిరి.

జడుడు, స్థావరుడగు హిమాచలము పర్వతముల రాజుగా రాణించి కృతార్ధుడగుట, శివ పార్వతుల కళ్యాణ గాథ సర్వ సిద్ధి ప్రదము. శివుని ఆజ్ఞానుసారము దాక్షాయణి సృష్ఠి నిమిత్తము, దానవ సంహారము కొరకు కుమారస్వామిని ప్రసాదించుటకుగాను పర్వతరాజుకు తనయగా ఉద్భవించెను. కశ్యపాదులు శివాంశతో సృష్ఠి నిమిత్తమై ఉద్భవించిరి. వారికి శక్తి అంశతో భార్యగా పార్వతి సృష్ఠికి కారణమైనది. దేవ, మానవ, పశు, పక్ష్యాది సృషఠికి పూర్వమే పరాశక్తి మూడులోకములను సృష్ఠింటినది. బ్రహ్మ, శివ పరాశక్తుల ఆజ్ఞచే ప్రతి కల్పమందును సృష్ఠి జేయును. లీలా వినోదముగా శివుడు మహాకైలాసమున రుద్రరూపముతో నున్నపుడు పరాశక్తి సతి రూపము శివుని వరించెను. దక్షుని కుమార్తెగా అవతరించి శివుని పరిణయ మాడగా దక్షుడు శివునికి మామగారైన గర్వమున దేవతలను లెక్కజేయక తిరస్కరించనను వారు శివుని ధ్యానించుచు దక్షుని ఉపేక్షించిరి. శివుని ద్వారానే దక్షుని గర్వమడగింపనెంచి వాని ఆజ్ఞావర్తులుగా దక్షునిచే ఒక యజ్ఞమారంభింపజేసిరి. దక్షుని మోహింపజేసి మామగారిగా శివునికన్న నీదే పైచేయిగా నుండవలెను అని నమ్మించి సలహా నిమిత్తము దేవతలు దక్షుని శివుని వద్దకు తీసుకొనివెళ్లి వారందరునూ శివునికి నమస్కరించి కూర్చొనిరి. శివుని కేవలము అల్లునిగా తలచిన దక్షుడు శివునికి నమస్కరించకయే ద్వతల మధ్య ఆశీనుడాయెను. అందరు దేవతలతో సహా దక్షుని కూడ శివుడు కుశలము విచారించిరి. కాని దక్షుడు కోపించి, మామగారినగు నాకు నమస్కరింపకయే మూర్ఖుడై, శివుడు దుష్ట స్వభావముతో నన్ను అందరితో సమానముగా చూచెనని కోపించి, శివుని దూషించి సభనుండి వెళ్లిపోయెను. దేవతలందరునూ దక్షుని పతనమారంభమైనదని తలచి శివునికి నమస్కరించి నిష్క్రించిరి.

దక్షుడు యజ్ఞమందు పూర్ణ ఫలదాత యగు శివుని ఆహ్వానింపకయే యజ్ఞమారంభించి హవిర్భాగము రుద్రునికివ్వనందున కోపించిన సతీదేవి, శివుడు వారించిననూ వినక దక్షయమునకు వెళ్లి బంధువర్గముతో సహా దక్షుని నిందించి, నీపేరుతో దాక్షాయణిగా నున్న ఈ దేహము త్యజించుచున్నానని యజ్ఞవాటిక యందు దుమికి అంతర్ధానమయినది. ఈ విషయము నారదుని ద్వారా తెలిసిన పరమాత్మ వీరభద్రుని సృష్ఠించి పంపి దక్షయజ్ఞము ఛిన్నాభిన్నము చేసి దేవతలను దండించి దక్షుని గర్వమడగించెను.

ఆ సతియే శివాజ్ఞచే పర్వత రాజ దంపతులకు తనయగా, బాలగా వారినానందింపజేసెను. కుమారిగా పరమేశ్వరుని పతిగా పొందునిమిత్తము తపమాచరించెను. శివుడు లీలగా ఎన్ని పరీక్షలు పెట్టిననూ సడలనీయని దీక్షతో అపర్ణగా ధృడముగ నిల్చి శివుని అభిమానములకు పాత్రురాలై, తన తలిదండ్రులను ఒప్పించి తనవద్దకు వరాన్వేషణకు పంపునట్లు శివునిచే అనుజ్ఞపొంది, తన మనోభీష్టమును తలిదండ్రులకు తెల్పెను. పర్వతరాజ దంపతులు సాక్షాత్ పరమేశ్వరుని తమ అల్లునిగా తలంచి ఆనందముతో తమ పూర్వజన్మముల పుణ్యము ఫలించి తమకీ అదృష్టము కల్గినట్లు భావించిరి. శివుడు హిమవంతుని వద్దకు జ్యోతిష బ్రాహ్మణులు, బృహస్పతి, శుక్ర, వశిష్ఠ, అత్రి, భృగు, కుత్స మహర్షుల ద్వారా కన్యావరణము నిమిత్తము పంపిరి. హిమవంతునికి అనుకూలమగు ముహూర్తము వారిద్వారా తెలిసికొని కన్యను చూచు నిమిత్తము శివుడు హిమవంతునింటికి వెళ్లెను. విశ్వకర్మను నియమించి అతని మనస్సంకల్పముద్వారా మనోహరమగు మండపమును, గృహమును, కళ్యాణ వేదికను, శిబిరములను నిర్మింపజేసిరి. నవరత్న ఖచిత స్వర్ణ రజిత మండపములు, రత్నములు పొదిగిన కుశ వనములు, ముత్యములు, రత్నములు నింపిన ఊయలలు, వీధులలో పతాకములు రెపరెపలాడుచు, చింతామణి, కల్పవృత్రము, కామధేనువు, అక్కడకు వచ్చినవి. షడ్రసముల పిండివంటలతో భోజనములు సమకూర్చుటకు కామధేనువు సిద్ధమయినది. వస్తు, గంధ మాల్యాది లేపనములు సమకూర్చుటకు కల్పవృక్షము సిద్ధమయినది. రత్నభూషణములు సమకూర్చుటకు చింతామణి వచ్చినది. సంగీత, వాద్య ఘోషలు మిన్ను ముట్టించుటకు నారదాదులు వచ్చిరి. ఆవాహితులను స్వాగతించుటకు లోకపాలురు వచ్చిరి. సర్వకార్యములు సమకూర్చు బాధ్యత స్వయముగ బ్రహ్మ తన భుజస్కందములపై ధరించెను. వివాహవిషయముల సంప్రతింపులకు విష్ణుమూర్తి సిద్ధమాయెను. హిమవంతుని ఇంట అన్నియు సమకూర్చి, దేవతలందరునూ వరుని ఆహ్వానించి తీసికొని వచ్చుటకు కైలాసము వెళ్లి శివునికు సాష్టాంగ నమస్కారము చేసి హిమవంతుని ఆహ్వానము విన్నవించిరి. పరమేశ్వరుడు వృషభ వాహనుడై నంది, భృంగి, గణ పరివార సమేతుడై, దేవతలు స్తుతి స్తోత్రములు చేయుచు ముందు నడువగా, యక్ష, గంధర్వ, కిన్నెర, అప్సరసలు సేవింపగా హిమవంతుని ఇంటికి చేరిరి. హిమవంత దంపతులు స్వామివారికి పాలతో పాద ప్రక్షాళన చేసి, రత్న నీరాజనమిచ్చి స్వాగతించిరి. మామగారిచ్చిన ఫలములు చేతగైకొని బ్రాహ్మణులు స్వస్తివాచకము పల్కగా శివుడు హిమవంతుని మందిరము జొచ్చిరి. హైమవతి సర్వాలంకార భుషితయై రత్న సింహాసనమున ఆశీనురాలాయెను. స్వామి హిమవంతునితో, బ్రహ్మ, విష్ణు, ఋషిగణములతో అంతర్వేది మండపమున ప్రవేశించిరి. మామగారు అల్లుని రత్నపీఠమున అధివసింపజేసిరి. బ్రహ్మగారు పురోహితులు కాగా, బాజా భజంత్రీలు, బ్రాహ్మణుల స్వస్తి వాచకములు, గణముల జయజయధ్వానములు, మిన్ను ముట్టగా, హిమవంత దంపతులు స్వామివారికి కన్యాదానము జేసి కృతార్ధులైరి. అగ్నౌకరణ, లాజహోమ, సదస్య, భూరి భోజనాదుల అనంతరము స్వామి అమ్మవారిని తీసికొని కైలాసము బయలుదేరగా, దేవతలు పుష్ప వృష్టి కురిపించిరి. దేవతల ఢంకా, భేరి, మృదంగముల మధ్య గంధర్వులు గానము, అప్సరసలు నాట్యము జేసిరి. అందరి మనములు ప్రపుల్లములై ఆనంద డోలికలలో ఊగినవి. శంకరుడు బ్రహ్మ, విష్ణులను సత్కరించి బ్రాహ్మణులకు యధోచిత దానములొసంగి దేవితో సహా వృషభారూఢుడై కైలాసమేగిరి. ఆహూతులు ఆనందముగ తమలోకముల కేగిరి. లీలావినోదభరిత శివ పార్వతుల కళ్యణమట్లు వైభవోపేతముగ జరిగినది. తోడబుట్టిన అన్నదమ్ములు లేని కన్యను వివాహమాడుట ధర్మ విరుద్ధము గనుక శంకరులు హిమవంతునకు మైనాకుడను కుమారుని అనుగ్రహించిరి. కాని మైనాకుడు అమ్మవారికి సహోదరుడనిపించుకొనుటకు భయపడి ఇప్పటికిని సముద్రమున దాగియున్నాడు. కేదారేశ్వరుడు 15 కళలతో కాశీకి చేరి ఒక్క కళను మాత్రము హిమాలయకేదారమున వదలినాడు. విశ్వనాధుడు కేదార క్షేత్రమున కాలభైరవదండన లేకయే తారకమంత్రముపదేశించి ముక్తినిచ్చును. ఈ శివకళ్యాణ కథా శ్రవణము సర్వ మంగళ ప్రదము. ఏ కోరికతో శివ కళ్యాణ పఠన, శ్రవణములు జరుపుదులో అవి నిశ్చయముగా ఫలించును.

ఈ పురాణము విని మునిశ్రేష్ఠులు ఈశ్వరుని స్తుతించిరి. అన్నానాం పతయే, దిశాంచ పతయే, మాదృక్పపశూం పతయే నమః. తస్కరానాం పతయే, జగత్ సమస్త క్షేత్రౌషధీనాం పతయే నమః. వృక్షాణాం పతయే పుష్ఠానాం పతయే. బుద్ధానాం పతయే, దుష్ఠానాం పతయే, దినాంచ పతయే నమః. స్వామీ అనంత కోటి నమస్కారములు. అప్రమేయా! అభీష్ట వరదా! మీ ధామము ప్రసాదింపుడు. మాకు మరి ఏదియునూ వలదు. కేదార క్షేత్ర మహిమ కేవలము ముక్తి ప్రదము. అందువలన మాకు నిరంతరు, ఆజన్మ కేదార వాసమనుగ్రహింపుడు. ఋషుల ధ్యానమునకు సంతుష్టుడై పరమాత్మ పార్వతీ సమేతుడై, వృషభవాహనుడై, సూతునితో సహా ఋషులకు దర్శనమొసంగెను. గణేశ, కుమార, గణ సహితుడై దర్శన మొసగి ప్రఫుల్ల సుస్వరమున సద్భక్తముని శ్రేష్ఠులారా! మీ స్తుతికి ప్రసన్నుడనయితిని. మీకు పునరావృత్తి రహిత మొక్షమొసంగితిని. కేదార క్షేత్రములో నున్నను, ఇతర దేశముల కరిగినను, ప్రసాదమెక్కడ భుజించినను ఫలించినట్లు, మీ దేహత్యాగమెక్కడ జరిగినను, నా రహస్య వృత్తాంతము లన్నియూ అవగతము చేసికొనిన మీరు ధన్యులు. ముక్తులని పలికి లింగముల అంతర్ధానము జెందిరి. కోటి సూర్య ప్రభాభాసితమగు స్వామిని దర్శించిన సూతుడు, మునులారా! మనము ధన్యులము, కాశీ కేదార మూల రహస్యము వేదసారము. శంకర ప్రతిపాదితముగనుక జనన మరణచ్ఛేదము. పూర్వ జన్మల పుణ్య సంచయముచే మాత్రమే దీనిని వినుట, వినిపించుట, చదువుచ, చదివించుట యనునవి సంభవించును. లేనిచో నేను నా గురుదేవులు వ్యాసమహానుభావుని ముఖకమలము నుండి వినుట, ఇక్కడకు వచ్చుట, మీకు వినిపించుట ఎట్లు జరుగును? మీరు విశ్వశించుడు, కేదారేశ్వరుని ఎదుట శివజ్ఞాన రహస్యము పూర్తిగనో, సగమో, ఒకభాగమో, కేవలమొక శ్లోకము గాని చదవుట, వినుట, వినిపించుట వలన ఇష్ట సౌఖ్యములనుభవించిన తర్వాత అంతమున శివపదము ప్రాప్తించుట నిశ్చయము. శివునికి ప్రీతికరమగు శ్రావణ, కార్తీక, మాఘమాసములు గాని అథవా వైశాఖమున కాని ప్రతి దినము ఈ పురాణము చదివిననూ, వినిపించిననూ, వినిననూ వారు శివునికి ప్రీతులై ముక్తి పొందుదురు. వక్తకు వస్త్ర భూషణములనొసగి సంతృప్తి పొందించిన వారిని కేదారేశ్వరుడు అనుగ్రహించి ముక్తినొసగును.

సూతుని ద్వారా ఇట్లు వినిన మునులు ఆనందముగ మున్ముందు సూతుని పూజించి, సుగంధ పూరిత వస్త్రములు, అసంఖ్యాక రత్న, సువర్ణ ద్రవ్యములచే సంతృప్తుని జేసి, విశ్వనాథ, మణికర్ణిక, పంచక్రోశ దేవతలు, కాశీలోని సర్వదేవతలను పూజించి, చివరగా కేదారేశ్వరుని శరణు జొచ్చి విధి విధాయకముగ పూజించిన వెంటనే ఆకాశవాణి రూపమున కేదారేశ్వరుడు ఆజ్ఞాపించిన విధముగా శివుని హృదయమున నిల్పి ధ్యానమగ్నులై ఇచ్ఛాను సారము భోగములనుభవించి సద్యః ముక్తులై దేహపతనానంతరము విదేహముక్తులైరి.

ఇది బ్రహ్మవైవర్త పూరాణాంతర్గత,
కాశీమూల రహస్యాంతర్గత
కాశీ కేదార ఖండ మహాత్మ్యము
సంపూర్ణము

ఇతీశమ్

No comments:

Post a Comment