Saturday, October 28, 2017

శ్రీ అన్నపూర్ణా వ్రత కథ - భాగము 2 - బృహద్రథుని కథ (దేవీ భాగవతము)



దేవీ భాగవతమందలి బృహద్రథుడను రాజర్షి కథ
(శ్రీ అన్నపూర్ణా దేవి మహిమను తెలుపు ఇతిహాసము)

పరిచయము : ఒకనాడు నారద మహర్షి శ్రీమన్నారాయణుని శ్రీ దేవీ పూజావిధానము తెలుపుమని ప్రార్థించెను. అప్పుడు శ్రీమన్నారాయణుడు భుక్తి ముక్తి ప్రదము, సర్వాపన్నివారకము నగు దేవీ పూజనక్రమమును ప్రారంభమునుండి నైవేద్యము వరకు తెలిపెను. ఆ తరువాతి పూజా విధానము, దేవి మహిమను ప్రకటించు బృహద్రథుని కథ ప్రస్తుతము వివరింపబడుచున్నది.

శ్లో॥         తతః పానీయకం దద్యాత్ శుభం గంగాజలం మహత్।
                కర్పూరవాలా సంయుక్తం శీతలం కలశస్థితమ్ ॥
శ్లో॥         తాంబూలం చ తతో దేవ్యై కర్పూర శకలాన్వితమ్।
                ఏలాలవంగ సంయుక్తం సుఖ సౌగన్ధ్యదాయకమ్॥
శ్లో॥         దద్యాద్దేవ్యై మహాభక్త్యా యేన దేవీ ప్రసీదతి।
                మృదంగ వీణా మురజ ఢక్కాదుంధుభినిస్స్వనైః॥
శ్లో॥         తోషయే జ్జగతాం ధాత్రీం గాయనైరతిమోహనైః।
                వేదపారాయణైః స్తోత్రైః పురాణాదిభి రప్యుత ॥

                నైవేద్యము తరువాత పవిత్రమగు గంగాజలమును పానీయముగా దేవికి నొసంగవలెను. ఆ పిమ్మట కర్పూరము, కొబ్బరినీరు కలిసిన చల్లని కలశ జలమును సమర్పించవలెను. అనంతరము పచ్చ కర్పూరము ఏలకులు లవంగములు మున్నగు వానితో సువాసించు తాంబూలమును ముఖశుద్ధికై దేవికి సమర్పించవలెను. వీటిని భక్తిపూర్వకముగా సమర్పించుట వలన జగన్మాత శీఘ్రముగ ప్రసన్నురాలగును. ఇంకనూ వీణ, మృదంగములు, ఢక్క, దుంధుభి మున్నగు వాద్య ధ్వనులతోను, అతి మనోహరములగు సంగీతములతోను, వేదపారాయణలతోను, స్తోత్రములతోను, పురాణాదికములతోను జగదంబను సంతుష్టి పరచవలెను.

శ్లో॥         ఛత్రంచ చామరే ద్వే చ దద్యాద్దేవ్యై సమాహితః।
                రాజోపచారాన్ శ్రీ దేవ్యై నిత్యమే సమర్పయేత్ ॥
శ్లో॥         ప్రదక్షిణాం నమస్కారం కుర్యాద్దేవ్యా అనేకథా ।
                క్షమాపయేజ్జగద్ధాత్రీం జగదంబాం ముహుర్ముహుః ॥
శ్లో॥         సకృత్స్మరణ మాత్రేణ యత్ర దేవీ ప్రసీదతి ।
                ఏతా దృశోపచారైశ్చ ప్రసీదేదత్ర కః స్మయః॥
శ్లో॥         స్వభావతో భవేన్మాతా పుత్రేతి కరుణావతీ।
                తేన భక్తౌ కృతాయాం తు వక్తవ్యం కిం తతః పరమ్ ॥

                ఆ తరువాత సావధానుడై ఛత్ర చామరములు సమస్త రాజోపచారములు సమర్పించవలెను. పెక్కు భంగుల దేవికి ప్రదక్షిణా నమస్కారములు గావింపవలెను. జగముల తల్లిని మాటి మాటికి తమ అపరాథములు క్షమింపుమని వేడుకొనవలెను. ఒక్క మారు తలంచినంతనే ప్రసన్నురాలగు దేవి, తనకిన్ని యుపచారములు సమర్పించిన వారికి ప్రసన్నురాలగుటలో ఆశ్చర్యమేముండును? ఏ తల్లియైనను కుమారునిపై సహజముగనే దయను చూపును గదా! కుమారుడు తల్లిపై భక్తి కల్గియున్నచో, తల్లి వానిపై చూపు దయను గూర్చి వేరుగా చెప్పవలసిన దేముండును?

శ్లో॥         అత్ర తే కథయిష్యామి పురా వృత్తం సనాతనమ్ ।
                బృహద్రథస్య రాజర్షేః ప్రియం భక్తి ప్రదాయకమ్ ॥
శ్లో॥         చక్ర వాకో భవత్పక్షీ క్వచిద్దేశే హిమాలయే ।
                భ్రమన్నానా విధాన్దేశాన్యయౌ కాశీపురం ప్రతి ॥
శ్లో॥         అన్నపూర్ణా మహాస్థానే ప్రారబ్దవశతో ద్విజః ।
                జగామ లీలయా తత్ర కణలోభా దనాథవత్ ॥
శ్లో॥         కృత్వా ప్రదక్షిణామేకాం జగామ స విహాయసా ।
                దేశాంతరం విహాయైవ పురీం ముక్తి ప్రదాయినీమ్ ॥
శ్లో॥         కాలాంతరే మమారా ఽసౌ గతః స్వర్గపురీం ప్రతి ।
                బుభుజే విషయాన్సర్వాన్ దివ్యరూపధరో యువా॥
శ్లో॥         కల్ప ద్వయం తథా భుక్త్వా పునః ప్రాప భువం ప్రతి ।
                క్షత్రియాణాం కులే జన్మ ప్రాప సర్వోత్తమోత్తమమ్ ॥

                ఓ నారదా! ఈ విషయములో నీకొక అతి పురాతనమగు ఇతిహాసమును చెప్పెదను. ఇది రాజర్షి బృహద్రథుని కథ. ఈ కథా శ్రవణము వలన దేవీ భక్తి పెంపొందును. తొల్లి హిమాలయ పర్వత ప్రదేశమునందు ఒక చక్రవాక పక్షి యుండెను. అది బహుదేశములు తిరిగి తిరిగి కాశీ పురమును చేరెను. ఆ పక్షి తన ప్రారబ్ధవశమున, అన్న కణముల కొరకు, లీలగా అనాథవలె అన్నపూర్ణా దేవి మందిరమున కేతెంచెను. ఆకాశమునందు తిరుగుచుండగా అనాయాసముగా అనుకోకుండా అన్నపూర్ణా మందిరమునకు ప్రదక్షిణ చేసినట్లయింది. ఆ పుణ్యము వలన దేశాంతరమునకు వెళ్లక ముక్తి ప్రదాయిని యగు కాశీ యందే ఉండి పోయింది. కొంత కాలానికి మృతి చెంది స్వర్గ పురికేగింది. అక్కడ దివ్యరూపమును ధరించి యువకుడై వివిధ భోగముల ననుభవించెను. రెండు కల్పములు స్వర్గ సుఖములనుభవించి క్షత్రియ కులమునందు సర్వోత్తముడుగా జన్మించెను.

శ్లో॥         బృహద్రథేతి నామ్నాఽ భూత్ ప్రసిద్ధః క్షితి మండలే ।
                మహా యజ్వా ధార్మికశ్చ సత్యవాదీ జితేంద్రియః ॥
శ్లో॥         త్రికాలజ్ఞః సార్వభౌమో యమీ పరపురంజయః।
                పూర్వ జన్మ స్మృతిస్తస్య వర్తతే దుర్లభా భువి ॥
శ్లో॥         ఇతి శ్రుత్వా కిం వదన్తీం మునయః సముపాగతాః ।
                కృతాతిథ్యా నృపేంద్రేణ విష్టరేషూషురేవ తే ॥
శ్లో॥         పప్రచ్ఛుర్మునయః సర్వే సంశయో ఽస్తి మహానృప !
                కేన పుణ్య ప్రభావేణ పూర్వజన్న స్మృతిస్తవ ॥

                అతడు భారతదేశమునందు బృహద్రథుడు అను పేరుతో ప్రసిద్ధుడయ్యెను. ఆ రాజు మహాయజ్వ, ధార్మికుడు, సత్యవాది, జితేంద్రియుడు, త్రికాలవేది, సంయమి, మహాపరాక్రమవంతుడు, శత్రుభీకరుడునగు సార్వభౌముడై వినుతి గాంచెను. ఆ రాజునకు భూమియందు దుర్లభమైన పూర్వజన్మ స్మృతి గల్గినది. ఆ వార్త సర్వత్ర వ్యాపించినది. ఈ విషయము నెరింగి మునులందరు ఆ రాజు రాజధానికేతెంచిరి. రాజు వారిని అతిథి సత్కారముల జేసి సముచితాసనములందు కూర్చుండ బెట్టెను. అప్పుడు మునులు రాజుతో, ఓ రాజా! మా కొక సంశయము గలదు. నీకు ఏ పుణ్య ప్రభావమువలన పూర్వజన్మ స్మృతి గల్గినది?

శ్లో॥         త్రికాల జ్ఞానమే వాఁపి కేన పుణ్య ప్రభావతః ।
                జ్ఞానం తవేతి తత్ జ్ఞాతు మాగతాః స్మ తవాన్తికమ్ ॥
శ్లో॥         వద నిర్వ్యాజయా వృత్త్యా తదస్మాకం యథా తధమ్ ॥

శ్రీ నారాయణ ఉవాచ :
                ఇతి తేషాం వచః శ్రుత్వా రాజా పరమధార్మికః ॥
శ్లో॥         ఉవాచ సకలం బ్రహ్మన్! త్రికాలజ్ఞానకారణమ్ ।
                శ్రూయతాం మునయః సర్వే మమ జ్ఞానస్య కారణమ్ ॥
శ్లో॥         చక్రవాకః స్థితః పూర్వం నీచయోని గతోఽపి వా ।
                అజ్ఞానతోఽపి కృతవాన్ అన్నపూర్ణా ప్రదక్షిణామ్ ॥
శ్లో॥         తేన పుణ్య ప్రభావేణ స్వర్గే కల్ప ద్వయ స్థితః ।
                త్రికాలజ్ఞానతాఽప్యస్మిన్ అభూత్ జన్మని సువ్రత ॥

                ఏ పుణ్య హేతువు వలన త్రికాల జ్ఞానము కల్గినది? ఈ జ్ఞానము నెరుంగుటకై మేమందరము నీకడకేతెంచితిమి. ఈ రహస్యము కపటము వీడి యథా తధముగా మాకు తెలుపుము.
                శ్రీమన్నారాయణుడిట్లు పల్కెను. పరమ ధార్మికుడగు బృహద్రధమహారాజు మునుల మాటలను వినినాడు. ఓ మహర్షులారా! నాకు కల్గిన త్రికాలజ్ఞానకారణమును వినుడు.  నేను గత జన్మయందు చక్రవాక పక్షిగా నీచయోనియందు జననమందితిని. (పశు పక్ష్యాదియోనులు నీచయోనులు). ఆ జన్మయందు నేనొకనాడు తెలియకయే కాశీ అన్నపూర్ణా దేవి మందిరమునకు ప్రదక్షణించితిని. ఆ పుణ్య విశేషముచేత స్వర్గమునందు రెండు కల్పములుండి సర్వసుఖములనుభవించితిని.
                ఓ సువ్రతులారా! ఆ పుణ్య ప్రభావము వలననే భూమండలమందు సార్వభౌమత్వమునంది, త్రికాలజ్ఞానమెరుంగు అద్భుత శక్తిని పొందితిని.

శ్లో॥         కో వేద జగదంబాయాః పదస్మృతి ఫలం కియత్ ।
                స్మృత్వా తన్మహిమానంతు పతంత్యశ్రూణి మేఽనిశమ్ ॥
శ్లో॥         ధిగస్తు జన్మ తేషాం వై కృతఘ్నానాం తు పాపినామ్ ।
                యే సర్వమాతరం దేవీం స్వోపాస్యాం న భజన్తి హి ॥
శ్లో॥         న శివోపాసనా నిత్యా న విష్ణూపాసనా తథా ।
                నిత్యోపాస్తిః పరాదేవ్యా నిత్యా శ్రుత్యైవ చోదితా ॥

                అన్నపూర్ణా దేవిని అజ్ఞానతః దర్శించి, ప్రదక్షిణ చేయుట వలన ఇంతటి మహోత్తమ ఫలము లభించినది. ఇది నాకు ప్రత్యక్షానుభవము. తెలిసి చేసినచో దాని ఫలము చెప్పనలవి గాదు. ఆహా! ఇప్పటికీ జగజ్జనని మహిమను తలంచుకుంటే నిత్యము నా కన్నులనుండి ఆనందాశ్రువులు జాలువారుచున్నవి. శరీరము రోమాంచిత మగుచున్నది. కంఠము గాద్గదికమగుచున్నది. సేవింపదగిన జగదంబయగు దేవిని పూజింపని వారు కృతఘ్నులు, పాపులు. ఛీ! వారి జన్మ వ్యర్థము. శివపూజ, విష్ణు పూజ నిత్యవిధి గాదు. ఒక్క పరాదేవి ఉపాసన మాత్రమే నిత్యవిధి. ఇది శ్రుతి, స్మృతి సమ్మత సిద్ధాన్తము.

శ్లో॥         కిం మయా బహువక్తవ్యం స్థానే సంశయవర్జితే ।
                సేవనీయం పదాంభోజం భగవత్యా నిరన్తరమ్ ॥
శ్లో ॥        నాఽతః పరతరం కించిత్ అధికం జగతీతలే ।
                సేవనీయా పరా దేవీ నిర్గుణా సగుణాఽథవా ॥
శ్రీ నారాయణ ఉవాచ
శ్లో॥         ఇతి తస్య వచః శ్రుత్వా రాజర్షేః ధార్మికస్యచ ।
                ప్రసన్నహృదయాః సర్వే గతాః స్వస్వ నికేతనమ్ ॥
శ్లో॥         ఏవం ప్రభావా సా దేవీ తత్పూజాయాః ఫలం కియత్ ।
                అస్తీతి కేన ప్రష్టవ్యం వక్తవ్యం వా న కేనచిత్ ॥

                సంశయహీనమగు విషయమును గూర్చి అధికముగా చెప్పవలసిన దేముండును? ఇది నిర్వివాదమైన విషయము. ఆది శక్తియగు పరాశక్తి యొక్క పాద పద్మములు నిరంతరము సేవనీయములు. ఇంతకంటె మించి భూమిపై శ్రేష్ఠకార్యము మఱియొకటి లేదు. కావున దేవిని నిర్గుణగాగాని లేక సగుణగాగాని నిత్యము సేవింపవలెను.
శ్రీమన్నారాయణుడిట్లు పలికెను -
                ఓ నారదా! ధార్మికుడు, రాజర్షి యగు బృహద్రథుని మాటలను విని మునులందరు ప్రసన్న హృదయులై తమ తమ నివాసములకేగిరి. భగవతి యింతటి ప్రభావము గలది. దేవీ పూజ ఎంతటి ఫలమొసంగునో ఎవరు ప్రశ్నింపగలరు? ఎవరు సమాధానము చెప్ప గలరు? వినగలవారెవరు? అనగా భగవతి విషయములో ప్రష్ట (ప్రశ్నించువాడు), వక్త, శ్రోత అతి దుర్లభము.

శ్లో॥         యేషాన్తు జన్మ సాఫల్యం తేషాం శ్రద్ధా తు జాయతే ।
                యేషాన్తు జన్మ సాంకర్యం తేషాం శ్రద్ధా న జాయతే ॥
                ఓ నారదమునీ! ఎవ్వనిపై జగదంబ యొక్క అపారమగు కరుణ ప్రసరించునో, ఎవ్వని జన్మ సఫలమో వారికి మాత్రమే దేవీ పూజయందు శ్రద్ధ కల్గును. ఎవ్వని జన్మ సంకరమో, దౌర్భాగ్యవంతమో వారికి దేవిపై ఎప్పటికీ శ్రద్ధ గల్గదు.

ఇతి శ్రీ దేవీ భాగవతే మహా పురాణే ఏకాదశ స్కంధే
శ్రీదేవ్యాః మహత్వే బృహద్రథ కథానకం నామ అష్టాదశోఽధ్యాయః

శక్తి ప్రబోధినీ హిందీ టీకకు తెలుగు అనువాదమగు
శ్రీదేవీ భాగవతమహాపురాణమందలి 11 వ స్కందములోగల
బృహద్రథ పూర్వ జన్మ కథా వర్ణనము అను పేరుగల
18వ అధ్యాయము సంపూర్ణము

Thursday, October 26, 2017

శ్రీ అన్నపూర్ణ వ్రత కథ

ఇకనుండి శ్రీ అన్నపూర్ణ వ్రత కథను నా బ్లాగులో ప్రచురిస్తున్నాను.

హిందీ లో ఈ పుస్తకం కాశీ లోని అన్నపూర్ణ మందిరంలో దొరుకుతుంది. ఈ వ్రతాన్ని కార్తీకమాసం లో కృష్ణ పక్షంలో మొదలు పెడతారు. వ్రతసమాప్తి మార్గశీర్షమాసంలో పూర్తి అవుతుంది.

హిందీ పుస్తకానికి అనువాదాన్ని శ్రీ మల్లాది శ్రీహరి శాస్త్రి గారు చేసారు. ఈయన కాశీ ఖండము మొదలయిన వాటిని కూడా వ్రాసారు. ఈ పుస్తకం త్వరలోనే గొల్లపూడి వారిచే ప్రచురింపబడుతుంది.

మీరు తెలుగు విజయం వెబ్ సైటులో దొరికే ఖతులను దింపుకుని మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకుంటే అక్షరాలు అందంగా కనపడతాయి. లేకపోతే అన్ని అక్షరాలు గౌతమి లో కనిపిస్తాయి.

వాడిన ఖతులు (ఫాంటులు)
ధూర్జటి, మండలి, శ్రీకృష్ణదేవరాయ.

ఇందులో అన్నపూర్ణ సహస్రము, సహస్రనామావళి, అన్నపూర్ణాష్టకము, హరతి కూడా ఉంటాయి.

పూర్తి పుస్తకాన్ని కొన్నిరోజుల తరువాత Scribd లో పిడియఫ్ ఫార్మాట్ లో పెడతాను.

శ్రీ అన్నపూర్ణా వ్రత కథ - మొదటి భాగము



శ్రీ అన్నపూర్ణా దేవ్యై నమః
శ్రీ భవిష్యోత్తర పురాణాంతర్గత
శ్రీ అన్నపూర్ణా వ్రత కథా ప్రారంభము

యుధిష్ఠర ఉవాచ – యుధిష్ఠురుడు పలికెను
శ్లో॥         భగవన్ దేవ దేవేశ! దేవక్యానందవర్ధన।
                మయా కిల మహద్దుఃఖం సంప్రాప్తం వసతా వనే॥
శ్లో॥         నజానేఽన్నంచ భోగాయ జఠరస్యాపి కేశవ।
                క్వచిద్దివా క్వచిద్రాత్రౌ క్వచిదల్పం క్వచిద్ బహు॥
            ధర్మాత్ముడగు యుధిష్ఠురుడు ప్రభువగు శ్రీకృష్ణునితో ఇట్లు పలికెను. దేవకీ దేవికి ఆనందవర్ధనుడవగు దేవదేవా! భగవానుడవైన శ్రీకృష్ణా! వనవాస సమయమునందు నాకు గొప్ప దుఃఖము సంప్రాప్తమయినది.
            ఓ కేశవా! అన్యభోగములుగాని, కడుపు నిండా అన్నము గాని సరిగా లభింపలేదు. ఒకరోజు పగటియందు, మరొకరోజు రాత్రియందు, ఒకప్పుడు అల్పముగను, మరొకప్పుడు అధికముగను భోజనము లభించుచున్నది.

శ్లో॥         క్వచిదృక్షం క్వచిత్ స్నిగ్ధం క్వచిత్స్వాదు క్వచాన్యథా।
                అశ్నామి వికలః క్వాపి క్షుధితః క్ష్మాతలేశయః॥
శ్లో॥         కందైర్మూలైః ఫలైః శాకైర్మాంసైరృత్తిం ప్రకుర్వతః
                నమే భవేద్ ధృతిః కృష్ణ తృష్ణయా క్లాంతచేతసః॥
            ఓ ప్రభూ! ఒకనాడు రసహీనమైనది, మరొకనాడు ఇంపైనది, ఒకప్పుడు రుచికరమైనది, మరొకప్పుడు రుచిరహితమైనదగు అన్నమును తింటూ మిక్కిలి కలత చెందుచుంటిని. ఒక్కొక్కరోజున క్షుధార్తుడనై భూమిపై శయనించుచుంటిని. ఓ కృష్ణా! ఒకప్పుడు కందమూలములు, పండ్లు, శాకములు, మాంసములు తింటున్నాను. నా మనస్సు ఆకలి దప్పికలతో వ్యాకులముగా నున్నది. ఏ రోజూ తృప్తిగా భుజించుటలేదు.

శ్లో॥         రాజ్యం మేఽపహృతం దుష్టెర్బంధుభిర్విరహోఽభవత్।
                గాండీవధన్వినా సార్ధం ధ్రియమాణే వృకోదరే॥
శ్లో॥         తత్కేనైతన్మహాభాగ పద్బనాభ మమాభవత్ ।
                కథంవా కృష్ణ లోకేస్మిన్నాన్నదుఃఖం నృణాం భవేత్॥
శ్లో॥         నా లక్ష్మీర్నైవ విరహో న ద్వేషో నైవ దీనతా 
                భవేద్యేన కృతేనేహ తన్మమాఽ ఽ చక్ష్వ మాధవ॥

            ఓ ప్రభూ! గాండీవధనుర్ధారియగు అర్జునుడు, మహా బలవంతుడగు భీముడు వంటి సోదరులు గల నా రాజ్యమును దుష్ట దుర్యోధనాదులు అపహరించిరి గదా! బంధు వియోగము సంభవించినది.
            హే మహాభాగ! పద్మనాభ! నేనింతటి కష్టములనుభవించుటకు హేతువెద్ది? ఓ కృష్ణా! ఈ లోకమునందు ఏమి చేసినయెడల నరులకు అన్న దుఃఖము సంభవింపదు.
            ఓ మాధవా! ఈ సంసారమునందు దారిద్ర్యము, బంధువియోగము, శత్రుత్వము, దైన్యము తొలంగుటకు చేయవలసిన పని యేమిటి? నన్ను కరుణించి తెలుపుము.

శ్రీ భగవాన్ ఉవాచ – శ్రీ భగవానుడు పలికెను
శ్లో॥         పిత్రాఙ్ఞాత్యక్త సామ్రాజ్యో రామో రాజీవలోచనః।
                సహ సౌమిత్రి సీతాభ్యాం న్యవసద్దండకే వనే॥
శ్లో॥         ఏకదా లక్ష్మణో రాజన్నాహారార్ధం వనే భ్రమన్।
                నాససాద క్వచిత్సాయం వవందే రఘునందనమ్॥
శ్లో॥         నిషసాద తతస్తూష్ణీం  విషణ్ణః సాశ్రులోచనః।
                తమువాచ తతో రామో భ్రాతరం శ్లక్ష్ణయా గిరా॥

            ధర్మాత్ముడగు యుధిష్ఠురుని వినమ్రవచనములాలకించి, శ్రీకృష్ణభగవానుడిట్లు పల్కెను. ఓ ధర్మరాజా! కమలనేత్రుడగు శ్రీరామచంద్రుడు తండ్రియాజ్ఞను గౌరవించి సామ్రాజ్యమును త్యజించెను. అనంతరము సీతాలక్ష్మణ సహితుడై దండకారణ్యమునందు నివసించెను. ఒకరోజున లక్ష్మణుడు ఆహార సంపాదనకై వనమంతయు సంచరించెను. సాయంసమయమయినది. ఆహారము లభింపలేదు. శ్రీరామచంద్రుని సమీపించి నమస్కరించెను. అతి దుఃఖితుడై కన్నులనీరు నిండగా, లక్ష్మణుడు అన్నగారి ముందు మాట్లాడకుండ కూర్చుండెను. అప్పుడు శ్రీరామచంద్రుడు సోదరుడగు లక్ష్మణుని గాంచి, మధురముగా పల్కదొడంగెను.

శ్లో॥         వత్స మా కురు సంతాపం లోకో హి నిజదిష్టభుక్।
                యద్దదాతి నరః పూర్వం తదాప్నోతి న చాన్యథా॥
శ్లో॥         యేన దత్తాని భోజ్యాని రమ్యాణి రసవంతిచ।
                సంప్రాప్నోతి మహాబాహో భక్ష్యభోజ్యాన్యనేకశః॥
శ్లో॥         యైర్నదత్తం క్వచిత్కించిత్తే నిన్దన్తు యథావయమ్।
                పృథివ్యామన్నపూర్ణాయాం వయమన్నస్య కాంక్షిణః॥
శ్లో॥         సౌమిత్రే నూనమస్మాభి ర్న బ్రాహ్మణముఖే హుతమ్।
                తస్మాదదృష్ట మన్వీక్ష్య చింతాం జహి మహామతే॥
శ్లో॥         ఏవం కథయత స్తస్య తదా కుంభోద్భవో మునిః।
                ఆజగామ సముత్థాయ తం వవందే రఘూత్తమః॥

            హే వత్స! మనస్సులో దుఃఖించకుము. ఈ లోకమునందు ప్రతి ప్రాణి తన భాగ్యానుసారముగ ఫలముల ననుభవించును. నరుడు పూర్వజన్మయందు దానము చేసినదే ఈ జన్మయందు పొందును. అందుకు భిన్నంగా జరుగదు. ఓ మహాబాహూ! గత జన్మయందు రుచికరములు, రసవత్తరములు, మనోహరములైన భోజనముల నొసంగినవారు ఈ జన్మయందు అనేక భక్ష్యభోజ్యాదులను పొందుదురు. ఓ సోదరా! గత జన్మయందు కొంచెము కూడ దానము చేయని వారు మనవలె దుఃఖమును పొందుదురు. భూమండలమంతయు అన్నపూర్ణయై యున్నది. కాని మనము మన కర్మఫలము వలన అన్నము కొరకు తహ తహ లాడుచుంటిమి. ఓ సుమిత్రానందన! మన వంటి వారు బ్రాహ్మణులను భుజింపచేయలేదనుట నిశ్చితము. ఓ మహాబుద్ధీ! మన భాగ్యమును గ్రహించి విచారింపకుము. అని సోదరులిరువురు సంభాషించుచుండగా అగస్త్య మహర్షి యేతెంచెను. రఘువంశోత్తముడగు శ్రీరామచంద్రుడు నిల్చుండి ఆ మునికి నమస్కరించెను.

శ్లో॥         సత్కృతం సుఖమాసీనం అగస్త్యం రాఘవోఽబ్రవీత్।
                ఇమమేవార్ధముద్దిశ్య యన్మాం త్వం పరిపృచ్ఛసి॥
అగస్త్య ఉవాచ – అగస్త్యుడు పలికెను
శ్లో॥         అస్తివారాణసీనామ నగరీ గిరిశప్రియా।
                అపారతరసంసారాంభోధిపారనిదర్శినీ॥
శ్లో॥         తస్యాం బభూవతుర్విప్రౌ దేవదత్త ధనంజయౌ।
                భ్రాతరౌ, దేవదత్తోఽభూదాఢ్యో, దుఃఖీ ధనంజయః॥
శ్లో॥         తస్య చింతా సముత్పన్నా దరిద్రస్య కుటుంబినః।
                అహో కిం మే కృతం పాపం యేనాన్నం మే సుదుర్లభం॥

            ఓ ధర్మరాజా! శ్రీ రాముడు అగస్త్యమహర్షిని చక్కగా సత్కరించి, సుఖోవిష్టుని జేసి, నీవు నన్నడిగిన విధముగ ప్రశ్నించెను. అప్పుడగస్త్యుడు ఓ శ్రీరామా! శంకరునకు పరమ ప్రియమైన "వారాణసి" యను నగరంబు గలదు. ఆ నగరము దాట శక్యముగాని సంసార సాగరమును దాటించి మోక్షమునొసంగునది. అందు దేవదత్తుడు, ధనంజయుడు అనెడు బ్రాహ్మణ సోదరులుండిరి. వారిలో దేవదత్తుడు అత్యంత ధనవంతుడు. ధనంజయుడు ధనహీనుడై దుఃఖములనుభవించు చుండెను. బహు కుటుంబి, దరిద్రుడగు ధనంజయుడు తన దైన్యమునకు హేతువును ఆలోచింపసాగెను. అహో! నేనొనర్చిన  పాపమేమి? ఎందువలన నాకు అన్నము సుదుర్లభమయినది?

శ్లో॥         కిం మయైకాకినా భుక్తం త్యక్త్వా గర్భవతీం శిశుమ్।
                కిం మమాపగతో గేహాదతిధిః విముఖో ద్విజః॥
శ్లో॥         కిం మయోపేక్షితం దత్తమన్నం భుక్తం న శ్రద్ధయా।
                నిందితం వాన్నకాలే కిం క్షిప్తం రోషేణ వాన్యతః॥

            నేను గర్భవతియగు స్త్రీని, పిల్లలను విడిచి ఏకాకినై భుజించితినా? ఇంటికి వచ్చిన అతిథి బ్రాహ్మణులను సత్కరింపక పంపితినా? నాకు ఇతరులు ఇచ్చిన అన్నమును శ్రద్ధతో భుజింపలేదా? ఉపేక్షించితినా? నిందించితినా? భోజన సమయమున క్రోధముతో అన్నమును మరొకవైపు పారవేసితినా?

శ్లో॥         కిం మయాన్నవతా లోభాత్ దుర్భిక్షం కాంక్షితం శ్రియై।
                కింవా రథ్యాసు పతితం మయాన్నం సముపేక్షితమ్॥
శ్లో॥         కింవా గర్వాదతృప్తేన త్యక్తమన్నం మమార్పితమ్।
                శ్రాద్ధే నిమంత్రితో వాహన్న గతో ధనగర్వితః॥
శ్లో॥         అనర్చయిత్వా దేవాన్ వా ప్రతిభుక్తం మయాన్వహమ్।
                కులదైవత కార్యేషు నిందితా వా కులస్త్రియః॥

            ఎప్పుడైనా నాయొద్ద అధికముగ నున్న అన్నమును దాచి, అధిక సంపాదనకై లోభముతో దుర్భిక్షమును కోరితినా? మార్గమందు పడిన అన్నమును ఉపేక్షించితినా? నాకర్పించిన అన్నమును అసంతృప్తితో అహంకరించి త్యజించితినా? శ్రాద్ధమునందు నిమంత్రితుడనై ధనగర్వముతో వెళ్లలేదా? నేను ప్రతి దినము దేవతార్చన సేయక భుజించితినా? కులదైవత కార్యములందు కులస్త్రీలను నిందించితినా?

శ్లో॥         కిం మమాలయ భోక్తారః సదా తృప్తివివర్జితాః।
                సదన్నే సతి కింవా మే కదన్నం బాంధవేర్పితమ్॥
శ్లో॥         కింవా శ్రాద్ధదినే విఘ్నోమయా వ్యాజేన దర్శితః।
                పితృదేవద్విజాతీనాం కృతే వాహం నిషేధవాన్॥

            మా యింట్లో భుజించువారు తృప్తిగా భుజింపలేదా? ఉత్తమాన్నమును నేను భుజించి, దుష్టాన్నమును బంధువులకు సమర్పించితినా? శ్రాద్ధదినమునందు ఏదో నెపముతో విఘ్నమును కల్గించితినా? పితృ, దేవ, బ్రాహ్మణ కార్యములను నిషేధించితినా?

శ్లో॥         దుర్లభం మమ యేనాభూన్నిత్యమన్నం కుటుంబినః।
                నిత్యమాహార పర్యాప్తౌ పురుషార్థోఽస్తి, నాన్యథా॥
శ్లో॥         క్షుత్ క్షామానర్భకాన్ దృష్ట్వా హృదయం మే విదీర్యతే।
                దృష్ట్వాఢ్య శిశు భక్ష్యాణి ప్రార్థయంతి మమార్భకాః ॥
శ్లో॥         రుదంతో రోదయన్త్యేవ కర్షంతో దీనమాతరమ్।
                ఆగతస్య యదా బాలాః పరిమ్లానముఖశ్రియః॥
శ్లో॥         యదాన్నం మృగయంతే మే హ్యన్నకామాః కృతజ్వరాః।
                తదా జానామ్యహం హంత విశామి వసుధాతలమ్॥
శ్లో॥         అన్యచ్చ మమ దారిద్ర్యం కేనేదృక్ సముపస్థితమ్।
                న సదా భగవాన్ విష్ణురర్చితః క్లేశనాశనః॥
శ్లో॥         న మయా కాంచనం దత్తం న గౌర్నైకాదశీ కృతా ।
                ప్రాయశో నగ్నవనితా మయాన్యేషాం విలోకితాః॥

            ఎందువలన కుటింబినగు నాకు నిత్యమన్నము కష్టసాధ్యముగ నున్నది? నిత్యము కడుపు నిండుగా తినుటకు మిక్కిలి శ్రమించవలసి వచ్చుచున్నది? క్షుధార్తులై కృశించిన పిల్లలను చూచి నా గుండె బ్రద్దలగుచున్నది. ధనవంతుల పిల్లలు మంచి తిను బండారములను తినుట చూచి, నా పిల్లలు తమకు అవి కావాలని తల్లిని వేడుకొంటున్నారు. దీనురాలైన తల్లిని పట్టుకొని, తాము ఏడ్చుచూ, తల్లిని ఏడ్పించుచున్నారు. నేనింటికి రాగానే నా పిల్లలు వాడిన ముఖాలతో నన్ను సమీపించి, అన్నము తెచ్చితినేమోయని, ఎంతో బాధతో వెదకుచున్నారు. అప్పుడు నిట్టూర్పులు విడుచుచూ తల దించుకొనుచున్నాను. నా కింతటి దారిద్ర్యము సంభవించుటకు మరొక కారణమేమిటో గదా? నేను సతతము క్లేశ నాశకుడగు విష్ణువును పూజించలేదేమో? సువర్ణ గోదానములు చేయలేదేమో? ఏకాదశీ వ్రతమునాచరింపలేదేమో? నగ్నముగా నున్న పరస్త్రీలను తరచుగా చూచితినేమో?

శ్లో॥         శయ్యా వా మే సమాక్రాన్తా వృషల్యా కామముగ్ధయా।
                వృషలీ కిల విప్రాణాం లక్ష్మీ బ్రాహ్మణ్య హారిణీ॥
శ్లో॥         కిం మయా మాతురాక్రోశః పితుర్వా విహితో రుషా।
                అథవా నిందితా నార్యో దృష్ట్వా నేపధ్యమద్భుతమ్॥

            కామాతురయగు శూద్రస్త్రీతో కూడి ఏకశయ్యపై శయనించితినా? శూద్ర స్త్రీ సంపర్కము వలన బ్రాహ్మణుల సంపద, బ్రాహ్మణత్వము నశించును. నేను తల్లిని క్రోథముతో తూలనాడితినా? తండ్రిని నిందించితినా? స్త్రీల విలక్షణ రూపమును చూచి దూషించితినా?

శ్లో॥         ఋతౌ త్యక్తాథవా భార్యా భుంజానా వాపభాషితా।
                పరాపవాద పైశున్య పరహింసా రతోఽథవా॥
శ్లో॥         నిత్యం మిథ్యా జనద్వేషీ నిత్యం వా కలహ ప్రియః।
                విద్వాన్ ప్రష్టుమశక్తోఽన్యం జగ్రాహ నియమం వృథా॥
శ్లో॥         స స్నాత్వా మణికర్ణ్యాంతు నత్వా విశ్వేశ్వరం శివమ్।
                రుద్రసూక్తం జపన్ముక్తి మండపేష్వనయద్దినమ్ ॥
శ్లో॥         రాత్రౌ వరతరప్రఖ్యైః దర్భైరాస్తీర్య మేదినీమ్ ।
                తత్కార్యం హృదయేన్యస్య నమస్కృత్య పినాకినమ్॥
శ్లో॥         సుష్వాప ప్రయతో దేవీమంబాం సంచిత్య పార్వతీమ్।
                తతః స్వప్నేఽవదద్విప్రో బ్రాహ్మణో జటిలః శుభః॥

                ఋతుకాలమునందు నా భార్యను త్వజించితినా? భుజించుచు ఆమెతో పరుషవచనములాడితినా? పరనింద, పరహింస, ఇతరులపై కొండెములు చెప్పుట యందు ఆసక్తి చూపితినా? ప్రజలను నిష్కారణముగ ద్వేషించితినా? కలహప్రియుడనా? పండితుడనై అన్యులను అడుగవలసినదేమియూ లేదని విర్రవీగితినా? వ్యర్ధముగ శపథములు చేసితినా? అని ధనంజయుడనేక విధముల చింతించినాడు.
                అనంతరము ఒకనాడతడు మణికర్ణికా తీర్థమునందు స్నానము చేసినాడు. మంగళస్వరూపుడైన విశ్వేశ్వరునకు నమస్కరించినాడు. ముక్తిమండపమందు కూర్చుండి రుద్రసూక్తములు జపించుచు ఆ రోజు పగలంతయు గడపినాడు. ఆనాటి రాత్రియందు శ్రేష్ఠములగు దర్భలను నేలపై పరచినాడు. ఆ దర్భలపై పరుండి తన దారిద్ర్యము తొలంగు నుపాయమెద్దియా యని చింతించుచు, శివునకు నమస్కరించి, పార్వతిని స్మరించి, ప్రయత్నపూర్వకముగా నిద్రించినాడు. మనోహరుడు, జటాధారియగు బ్రాహ్మణుడొకడు స్వప్నమున దర్శనమిచ్చి, దీన బ్రాహ్మణుడగు ధనంజయునితో ఇట్లు పలికెను.

విప్రోవాచ – బ్రాహ్మణుడు పలికెను
శ్లో॥         పురా కాంచీపురే రాజ్ఞః పుత్రోఽభూచ్ఛత్రుమర్దనః।
                తస్య మిత్రమభూత్కోపి శూద్రో హేరంబ సంజ్ఞకః॥
శ్లో॥         యౌవరాజ్యం పితుః ప్రాప్య కుమారః శత్రుమర్దనః।
                హేరంబమాత్మనస్తుల్యం చక్రే భక్త్యాపరాయణః॥
శ్లో॥         క్వచిద్ధేరంబసహితః కుమారో మృగయాం గతః।
                నిఘ్నన్ వరాహాన్ మహిషాన్ గండకాన్ హరిణాన్ఛశాన్॥

                పూర్వము కాంచీపుర రాజునకు శత్రుమర్దనుడను పుత్రుడుండెను. వానికి హేరంబుడను నామంబుగల శూద్రమిత్రుడు కలడు. తండ్రి శత్రుమర్దనుని యువ రాజును జేసెను. శత్రుమర్దనుడు తనకాప్తమిత్రుడగు హేరంబుని తనతో సమానునిగా చేసినాడు. ఒకనాడు రాకుమారుడు తన మిత్రుడగు హేరంబునితో గూడి వేటనిమిత్తం వనమునకేగినాడు. అక్కడ రాకొమరుడు అనేక వరాహములను, అడవి దున్నలను, ఖడ్గమృగములను, లేళ్లను, కుందేళ్లను వధించినాడు.

శ్లో॥         చచార మృగయాం హృష్టః కుమారః సహ సైనికైః ।
                తత్రైకః పర్వతాకారో వరాహః సముపస్థితః॥
శ్లో॥         దారయన్నివ భూభూగం గ్రసన్నివ చమూం రుషా।
                తంచ ప్రాణార్ధినః శస్త్రైః నిజఘ్నుః పరితః శితైః॥
శ్లో॥         శ్వానః సహస్రాణ్యావవ్రుః కుర్వన్తః శబ్దముల్బణమ్।
                సోఽపి కోలో యువా సర్వానవమత్య తృణం యథా॥

                రాకుమారుడు తన సైనికులతో కూడి అతి ప్రసన్నుడై వేటాడుచుండెను. ఇంతలో పర్వతాకారమగు వరాహమొకటి కంటబడింది. అది భూమినంతయు ఖండ ఖండములు చేయుచున్నట్లుగ, సేన నంతయు కబళించుచున్నట్లుగ తోచెను. తమ ప్రాణ రక్షణకై అందరు దానిని నల్దెసల చుట్టు ముట్టి, వాడియగు బాణంబులతో కొట్టిరి. భీకరా రావములొనర్చుచు వేలకొలది వేటకుక్కలు దానిపై కురికినవి. ఆ యువ వరాహము ఆ శునకములన్నింటిని గడ్డి పరకను వోలె చీరెను.

శ్లో॥         వ్యదారయత్పునః క్రోడో నృణాం జంఘాంతరం వపుః।
                హయాశ్చ వృషణైర్హీనాః కృతాస్తేన చ విద్రుతాః॥
శ్లో॥         తతః కోలాహలే జాతే స గతః శత్రుమర్దనః।
                తం జఘాన శరేణాశు స్వర్ణ పుంఖేన వేగినా॥
శ్లో॥         తముపేక్ష్య ప్రహారం స వరాహో రాజవాజినమ్।
                అభిదుద్రావ వేగేన పుప్లువే స తురంగమః॥
శ్లో॥         పశ్చాన్ముఖో నృపసుతో జఘాన శూకరం పునః।
                శస్త్రేణాభ్యర్దితః కోలః పలాయన పరోఽభవత్॥
శ్లో॥         తమనుప్రయయౌ వీరః సముత్థాప్యాసి ముత్తమమ్।
                నచానుగంతుం శక్తోఽభూదన్య స్తాదృగ్ హయం వినా॥

                అది మనుష్యుల పిక్కలను పెక్కువిధముల చీల్చెను. అశ్వముల అండకోశములను ఛిన్నము చేసెను. ఆ గుర్రములు భయముతో పరుగులు తీసినవి. ఆ కోలాహలమును విని శత్రుమర్దనుడక్కడికి చేరినాడు. స్వర్ణ పుంఖము గల్గి వేగవంతమునైన  శరముతో కొట్టినాడు. ఆ వరాహమాదెబ్బను ఏ మాత్రము సరకు సేయక రాకుమారుని హయముపై కురికెను. ఆ తురంగము భీతిల్లి బహు వేగముగా పరుగుతీసినది. రాకొమరుడు వెనుదిరిగి మరల సూకరమును బాణముతో బాధించెను. వరాహమా శస్త్రఘాతమునకు గాయపడి పారిపోయినది. వీరుడగు రాజకుమారుడు ఉత్తమ ఖడ్గమును గొని వరాహమును వెంబడించినాడు. రాకుమారుని సాటి గుఱ్ఱము లేనందున ఇతర సైనికులు రాజకుమారుని అనుసరింపలేకపోయిరి.

శ్లో॥         హేరమ్బోఽనుయయావేకో యస్య తుల్య తురంగమః।
                స హత్వా యోజనశతే శూకరం శత్రుమర్దనః॥
శ్లో॥         ఉత్తీర్య శ్లథపర్యాణం తురగం సమచాలయత్।
                హేరంబోఽపి గతః పశ్చాదుత్తీర్య తురగ న్దధే
శ్లో॥         క్షణం విశ్రమ్య తౌ వీరౌ క్షుత్పిపాసా సమాకులౌ ।
                పప్రచ్ఛతుర్జలం కంచిన్మునిం కుశసమిద్ధరమ్॥
శ్లో॥         స నీత్వా స్వాశ్రమన్తౌ తు మునిశ్చక్రే గతశ్రమౌ।
                స్నాతయోః పీతజలయోః శ్యామ శక్తూనుపాహరత్॥

                శత్రుమర్దనుని గుర్రమువలె వేగముగా పోవు గుఱ్ఱముగల హేరంబుడొక్కడే రాకుమారుని అనుసరించెను. శత్రుమర్దనుడు నూరు యోజనములు వెంబడించి, ఆ వరాహమును సంహరించెను. అనంతరము గుఱ్ఱమును దిగి, జీనును తొలగించి, మెల్లగా పచారు చేయుటకు విడిచి పెట్టెను. ఇంతలో హేరంబుడచటికి చేరి, గుఱ్ఱమును దిగి పట్టుకొనెను. వారిరువురు ఒక్క క్షణము విశ్రమించిరి. ఆకలి దప్పికలతో వ్యాకులతనందిరి. దర్భలు సమిధలు తెచ్చుకొనుటకేగు ఒక మునిని చూచి, త్రాగుటకై పానీయమునడిగిరి. ఆ ముని వారిని తన ఆశ్రమమునకు తోడ్కొని వెళ్లి గతశ్రములను జేసెను. వారు స్నానములొనర్చి మంచినీటిని త్రాగిరి. పిమ్మట ఆ ముని వారికి తినుటకు నల్లని పేలపిండి నొసంగెను.

శ్లో॥         ఉంఛవృత్యా హృతాన్ మేథ్యాన్ పితృదేవాగ్నిశేషితాన్।
                తాన్ గృహీత్వా ప్రహృష్టాత్మా కుమారో బుభుజే సుధీః॥
శ్లో॥         అచిర ప్రాప్త సంపత్తి ర్గర్వితః స నృపానుగః।
                ఉపవిశ్య వినింద్యాథ వికృతం బుభుజేఽల్పకమ్॥
శ్లో॥         వికిరన్నవనౌ భూయో వైరస్యం ప్రతిదర్శయన్।
                తత్యాజానాదరాన్మూఢః రాజపుత్రస్తు సాదరమ్॥
శ్లో॥         భూమౌ పతితమప్యన్నముత్థాప్యాశ్నాతి శ్రద్ధయా।
                ఆలోడ్య పత్రపుటకం పపౌ భూరిజలేన చ॥

                ఆపేల పిండి ఉంఛవృత్తిచే ప్రాప్తమయినది. పితరులకు, దేవతలకు, అగ్నికి సమర్పించగా మిగిలినది. అతి పవిత్రమైనది. బుద్ధిమంతుడగు రాకుమారుడు ఆ పేలపిండిని ప్రసన్న చిత్తముతో భుజించెను. నడమంత్రపు సిరిచే గర్వితుడగు రాకొమరుని మిత్రుడగు హేరంబుడు తినుటకు కూర్చుండి, కోపముతో ఏవగించుకొనుచు, కొంచెము తినెను. ఆ మూఢుడు ఇది రుచికరముగా లేదని చూపించుచూ, అనేక పర్యాయములు భూమిపై వెదజల్లుచూ, తిరస్కార భావముతో పేలపిండిని త్యజించెను. రాకుమారుడు నేలపై పడిన అన్నమును కూడ సాదరముగ గ్రహించి భక్షించెను. ఇంకనూ పరిశిష్టాన్నమును ఆకుదొన్నెయందుంచి నీటితో కలిపి త్రాగెను.

శ్లో॥         తతో విశ్రామ్య మునినాభ్యనుజ్ఞాతో నృపాత్మజః।
                ప్రణమ్య సహ హేరంబో జగామ నిజపత్తనమ్॥
శ్లో॥         యోఽసౌ రాజకుమారః స దేవదత్త స్తవాగ్రజః।
                ధనధాన్యసుతైర్యుక్తో లేభే మోక్షపురే వపుః॥
శ్లో॥         ఉంఛాన్న భోగాద్ధేరంబో యః స త్వం ద్విజోత్తమః।
                ఉంఛాన్నం యత్త్వయా భుక్తం కించిజ్జాతస్తతో ద్విజః॥
శ్లో॥         అన్నానాదరదోషేణ దరిద్రోఽన్నవివర్జితః।
                యే కుర్వంతి నరా హేలా మన్నస్య ద్విజసత్తమ॥
శ్లో॥         అన్నహీనాః ప్రజాయంతే దరిద్రాః దుఃఖభాగినః।
                తస్మాద్విస్వాద మప్యన్నం భుంజీతామృతవత్ సుధీః॥

                తదనంతరము కొంతతడవు విశ్రమించి, మునికి నమస్కరించి, అనుజ్ఞను పొంది, రాకొమరుడు హేరంబునితో గూడి తన పత్తనమున కేగెను. ఆ రాజ కుమారుడు ఉంఛాన్నము శ్రద్ధతో భుజించినందువలన మోక్షపురి వారాణసియందు ధనధాన్య పుత్రవంతుడైన నీ యన్నయగు దేవదత్తుడుగా జన్మించెను. అనాదరముతో ఉంఛాన్నమును కొంచెము తినిన హేరంబుడే బ్రాహ్మణోత్తముడవైన నీవు. ఏ విధముగానైనను పవిత్రాన్నమును భుజించుటవలన నీకు బ్రాహ్మణ జన్మ సంప్రాప్తమయినది. అన్నముపై అనాదర భావము ప్రదర్శించిన దోషమువలన అన్నము లభింపని దరిద్రుడవైతివి. ఓ ధనంజయా! బ్రాహ్మణోత్తమా! అన్నమును హేళన చేసినవారు అన్నహీనులై, దరిద్రులై దుఃఖములననుభవింతురు. కావున బుద్ధిమంతుడు రుచికరముగాని అన్నమును సైతము అమృతమువలె భుజింపవలెను.

శ్లో॥         దద్యాదనుదినం చాన్నం బ్రాహ్మణాయ సుసత్కృతమ్।
                తత్కురుష్వాధునా బ్రహ్మన్ అన్నపూర్ణా వ్రతం శుభమ్॥
శ్లో॥         లప్స్యసే నాన్నదుఃఖాని సంపద్భిశ్చ న మోక్ష్యసే।
                ఇతి శ్రుత్వా వ్రతం ప్రష్టుముత్సుకో బ్రాహ్మణస్తదా॥
శ్లో॥         తత్యాజ నిద్రాం భూయః స వ్రత చింతామవాప్తవాన్।
                పప్రచ్ఛ వృద్ధానన్యాంశ్చ నానాదేశ సమాగతాన్॥

                ప్రతిరోజు సుష్టుగా సత్కరించి బ్రాహ్మణునకు అన్నమును సమర్పించవలెను. “ఓ బ్రాహ్మణుడా! నీవిపుడు శుభప్రదమగు అన్నపూర్ణా వ్రతమునాచరింపుము. ఈ వ్రతప్రభావము వలన మున్ముందు నీవు అన్నదుఃఖమును పొందవు. సంపదలెప్పటికీ నిన్ను విడిచి పెట్టవు"  అను మాటలు స్వప్నమునందు వినిన ధనంజయుడు అన్నపూర్ణా వ్రత విధానమును అడుగుటకు సిద్ధమగునంతలో నిద్రనుండి  మేల్కొనెను. అతనికి వ్రత విధానము నెరుంగవలెనను చింత కల్గెను. దేశ దేశాంతరముల నుండి వచ్చిన వృద్ధులను, అన్యులను వ్రతవిధానమును గురించి యడిగెను.

శ్లో॥         గ్రంథానాలోడ్య భూరీంశ్చ నాద్యగచ్ఛద్ వ్రతోత్తమమ్।
                తద్ర్వతాహృత చేతాః స తతో బభ్రామ మేదినీమ్॥
శ్లో॥         నానావిధాని తీర్థాని భ్రమన్ప్రాగ్జోతిషం గతః।
                స సమభ్యర్చ్య కామాక్షీం పరిసర్పన్నితస్తతః॥
శ్లో॥         ఉత్తరే సరసస్తీరే మేరోరుత్తర సంకులే।
                దివ్యకౌశేయసమ్వీతం దివ్యనేపథ్యపేశలమ్॥
శ్లో॥         దివ్యస్త్రీ సార్థమద్రాక్షీత్ అర్చయన్తం శివప్రియామ్।
                ఉపసృత్యతతో విప్రః ప్రాహేదం వినయాన్వితః॥

                ఆ ధనంజయుడనేక గ్రంథములను సమగ్రముగ పరిశీలించెను. ఆ వ్రత విధానపు జాడలు బోధపడలేదు. తెలిసికొనుటకై భూమండలమంతయు భ్రమించెనుు. అనేక తీర్థములను సేవించుచు ప్రాగ్జ్యోతిషపురమున కేగెను. అచ్చట మహామాయా కామాక్షినర్చించి ఇటు నటు తిరిగెను. మేరు పర్వతపు ఉత్తర భాగమునకు చేరెను. అక్కడొక సరస్సును చూచెను. ఆ సరస్సునకు ఉత్తరమునందు దివ్యరూపధారిణులైన స్త్రీ సమూహమును దర్శించెను. వారు శివునకు పరమ ప్రియయైన కామాక్షీ దేవిని పూజించుచుండిరి.  వారు మంచి పట్టు వస్త్రములు ధరించిరి. వారి అలంకరణ అలౌకికముగా నుండెను. ధనంజయుడు వారిని సమీపించి సవినయముగా ప్రశ్నించెను.

శ్లో॥         సాధ్వ్యః కిమేతదారబ్ధం వ్రతం కోఽస్యావిధి స్మృతః।
                కిం ఫలం కుత్ర సమయే క్రియతే వ్రతముత్తమమ్॥

                ఓ సాధ్వీమణులారా! మీరొనర్చు వ్రతంబెయ్యది? ఈ వ్రతవిధానమెద్ది? ఈ వ్రతాచరణము వలన కల్గు ఫలమెట్టిది? ఏ సమయమునందు అనుష్ఠించవలెను? తెలుపుమని యడిగెను.

సాధ్వ్యః ఊచుః - సాధ్వీమణులు పల్కిరి
శ్లో॥         శ్రుణుష్య్వైకమనాః విప్ర శ్రద్ధా భక్తి సమన్వితః।
                సచ్చిదానన్ద రూపస్య శక్తిర్యా పరమాత్మనః॥
శ్లో॥         ఏకథా బహుథా సా చ యయా సర్వమిదన్తతమ్।
                శివశక్త్యాత్మకం విద్ధి జగదేతచ్చరాచరమ్॥
శ్లో॥         యః శివః స హి విశ్వేశః శక్తిర్యా సాచ పార్వతీ।
                మాయేతి కీర్త్యతే సృష్టా వన్నపూర్ణేతి పాలనే॥
శ్లో॥         సంహృతౌ కాలరాత్రీతి త్రిథా సైకా ప్రకీర్తితా।
                తస్యాస్తదన్నపూర్ణాయాః వ్రతమేతచ్ఛుభప్రదమ్॥

                ఓ విప్రుడా! శ్రద్ధా భక్తి సమన్వితుడవై ఏకాగ్ర చిత్తముతో వినుము. సచ్చిదానంద ఘనస్వరూపుడగు పరమేశ్వరుని శక్తి ఏకరూపములోనున్ననూ బహురూపములలో సర్వమునందు వ్యాపించియున్నది. ఈ చరాచర జగత్తంతయు శివశక్తి స్వరూపముగా నెరుంగుము. ఆ శివుడే విశ్వేశ్వరుడు. ఆయన శక్తియే పార్వతి. ఆ శక్తి సృష్టి చేయునప్పుడు మాయ, పాలన సేయునప్పుడు అన్నపూర్ణ, సంహార క్రియయందు కాలరాత్రిగా పేర్కొనబడుచున్నది. ఈ అన్నపూర్ణాదేవి వ్రతము శుభప్రదమైనది.

శ్లో॥         మార్గశీర్షే తు పంచమ్యాం కృష్ణాయాం ప్రాతరాప్లుతః।
                పట్టసూత్ర మధో సూత్రం గృహీత్వా కుంకుమారుణమ్॥
శ్లో॥         దద్యాత్సప్తదశ గ్రంథీశ్చందనాగురు చర్చితాన్।
                స్థాపయిత్వాన్నపూర్ణాం చ డోరకం ధారయేత్పునః॥
శ్లో॥         పూజయేదంబికాందేవీం ఉపచారైర్మనోరమైః ।
                గృహీత్వా హరితా సప్త దశ విప్రాక్షతానిచ॥
శ్లో॥         ఓం అన్నపూర్ణే దదస్వాన్నం పశూన్పుత్రాన్  యశః శ్రియమ్।
                ఆయురారోగ్యమైశ్వర్య న్దేహి దేవి నమోఽస్తుతే॥
శ్లో॥         అనేన డోరకం బద్ధ్వా బాహుమూలేతు దక్షిణే।
                పుమాన్వామే పునః నారీ సచేతా శృణుయాత్కథామ్॥
శ్లో॥         గృహీత్వా హరితాఃసప్తదశ విప్రాక్షతాం స్తథా।
                కథాన్తే పూజయేత్తైస్తు మన్త్రేణానేన డోరకమ్॥
శ్లో॥         సర్వశక్తిమయీ యస్మాదన్నపూర్ణే త్వముచ్యసే।
                సర్వపుష్పమయీ దూర్వా తస్మాత్ తుభ్యం నమోస్తుతే॥



వ్రత విధానము

                బార్హస్పత్యమానము ప్రకారము మార్గశీర్ష కృష్ణ పంచమియందు (అనగా చాంద్రమానము ప్రకారము కార్తీక కృష్ణ పంచమి) ప్రాతఃకాలమున శిరస్స్నానము చేయవలెను. పట్టుదారమునకు కుంకుమపూసి, పదునేడు ముళ్లు వేయవలెను. ఆ గ్రంథులను చందన ధూపములతో పూజించి, ఆ తోరపు గ్రంథులందు అన్నపూర్ణా దేవిని స్థాపించవలెను. పిమ్మట పదునేడు దూర్వలను అక్షతలను చేతితో తీసికొని, నానా ప్రకారములగు సులభలభ్యములగు సామగ్రితో అంబికా భగవతిని పూజించ వలెను. అనంతరము క్రింది విధముగా చెప్పవలెను.

శ్లో॥         ఓం అన్నపూర్ణే దదస్వాన్నం పశూన్పుత్రాన్ యశః శ్రియమ్।
                ఆయురారోగ్య మైశ్వర్యన్దేహి దేవి నమోస్తుతే॥

                "ఓ మాతా అన్నపూర్ణా! మాకు అన్నమును, పశువులను, పుత్రులను, యశస్సును, శ్రీని ఇమ్ము. ఆయురారోగ్యములను, ఐశ్వర్యమును ఇమ్ము. ఓ దేవీ! నీకు నమస్కారము.” అని నమస్కరించవలెను. ఆ పిమ్మట పురుషుడు దక్షిణ హస్తమునకు (బాహుమూలమున) స్త్రీ వామహస్తమునకు పూజించిన తోరమును ధరించి ప్రసన్న చిత్తముతో కథను వినవలెను. కథాంతమునందు పదునేడు పచ్చని అక్షతలను దూర్వలను తీసికొని , క్రింది మంత్రమును పఠించుచూ,

మంత్రము :            సర్వశక్తిమయీ యస్మాదన్నపూర్ణే త్వముచ్యసే।
                                సర్వపుష్పమయీ దూర్వా తస్మాత్ తుభ్యం నమోస్తుతే॥

                ఓ మాతా అన్నపూర్ణాదేవీ! నీవు సర్వశక్తిమయివిగా కీర్తింపబడుచుంటివి. అందువలన సర్వ పుష్పమయమైన దూర్వలను నీకు సమర్పించుచుంటిని. అమ్మా నీకు నమస్కారము.

శ్లో॥         శ్రుత్వైవం షోడశాహాని కథాం సంపూజ్య డోరకమ్।
                దినే సప్తదశే ప్రాప్తే షష్ఠ్యాం పక్షే తథా సితే॥
శ్లో॥         శుక్లాంబరధరో రాత్రౌ వ్రతీ పూజాగృహే స్థితః।
                శాలివల్లరిభిః క్లుప్తం స్థాపయేత్కల్పపాదపమ్॥
శ్లో॥         అధస్తాదన్నపూర్ణాయాః స్థాపయేన్మూర్తి ముత్తమామ్।
                జపాపుష్పప్రతీకాశాం త్రినేత్రోల్లసితాననామ్॥
శ్లో॥         సుధాకరలసన్మౌళిం నవయౌవన మణ్డితామ్ ।
                బన్ధూక బన్ధనిచయాం దివ్యాభరణ భూషితామ్॥
శ్లో॥         స్మేరాననాం సుప్రసన్నాం రత్నసింహాసనస్థితామ్ ।
                వామే మాణిక్యపాత్రం చ పూర్ణమన్నేన దర్శయేత్॥
శ్లో॥         దక్షిణే రత్నదర్వీన్తు కరే తస్యాః ప్రదర్శయేత్।
                కర్ణికాయాం లిఖిత్వైవం పద్మే షోడశపత్రకే॥
శ్లో॥         పూర్వాది పత్రేషు లిఖేన్నందినీ మధ మేదినీమ్।
                భద్రాం గంగాం బహురూపాం తితిక్షాం దైశికోత్తమః॥
శ్లో॥         మాయాం హేతిం స్వసారం చ రిపుహన్త్రీం తధాన్నదామ్।
                నన్దాం పూర్ణాం రుచినేత్రాం స్వామి సిద్ధాం చ హాసినీమ్ ॥

                ఈ విధముగ పదునారు దినములు కథను వింటూ తోరమును పూజించవలెను. మరల పదునేడవ దినమునందు అనగా మార్గశీర్ష శుక్ల షష్ఠి రాత్రి సమయమున వ్రతము ననుష్ఠించువారు తెల్లని వస్త్రమును ధరించి పూజా గృహమును ప్రవేశించవలెను. వరి కంకులతో ఒక కల్పవృక్షమును సిద్ధము చేసి స్థాపించవలెను. ఆ వృక్షము క్రింద అన్నపూర్ణా భగవతి యొక్క ఉత్తమ మూర్తిని స్థాపించవలెను. ఆ మూర్తి యొక్క రంగు జపాపుష్పము వలె ఎర్రగా ప్రకాశించవలెను. ముఖమండలమునందు మూడు నేత్రములుండవలెను. శిరస్సుపై అర్ధచంద్రుడు శోభిల్ల వలెను. నవయౌవనముట్టి పడవలెను. ఆ మూర్తికి నలువైపుల ఎఱ్ఱని మంకెన పూవుల రాశులుండవలెను. దివ్యాభరణ భూషితయై, మందస్మితయై, సుప్రసన్నయై, రత్నసింహాసస్థితయై , వామహస్తమున అన్నపూర్ణమైన మాణిక్యపాత్రను, దక్షిణ హస్తమున రత్నములు పొదిగిన గరిటెను ధరించి యున్నట్లుగా దర్శింప జేయవలెను. ఆ తరువాత పదునారు రేకులు గల పద్మమును లిఖించి, తూర్పున మొదలిడి దక్షిణమువైపుగా ఒక్కొక్క రేకుపై, క్రమముగా (‍1) నందినీ, (2) మేదినీ, (3) భద్రా, (4) గంగా, (5) బహురూపా, (6) తితిక్షా, (7) మాయా, (8) హేతి, (9) స్వసా, (10) రిపుహన్త్రీ, (11) అన్నదా, (12) నన్దా, (13) పూర్ణా, (14) రుచి నేత్రా, (15) స్వామి సిద్ధా, (16) హాసినీ, అని వ్రాయవలెను.

శ్లో॥         గృహాణేమాం మయా దత్తాం పూజాం దేవి నమోఽస్తుతే।
                వరాభయ ప్రదాః సర్వా బన్దూక కుసుమప్రభాః ॥
శ్లో॥         ఆవాహయే త్తతో దేవీం గృహీత్వా కుసుమాంజలిమ్ ।
                ఏహ్యేహి దేవి దేవేశి దేవ దేవేశ వల్లభే ॥
శ్లో॥         గృహాణేమాం మయా దత్తాం పూజాం దేవి నమోస్తు తే।
                ఇత్యావాహ్య తతః పాద్యం అన్నదాయై నమోఽర్చయేత్॥
శ్లో॥         అర్ఘ్యం గీరీశ కాన్తాయై ఉమాయాచమనీయకమ్ ।
                మధుపర్కం జగన్మాత్రే గిరిజాయై చ చన్దనమ్ ॥
శ్లో॥         దత్వా సంపూజయేత్పుష్పాక్షతాద్యైః మన్త్రముచ్చరేత్।
                నమో గిరీన్ద్రతనయే జగన్మంగళ మంగళే ॥
శ్లో॥         శ్రీ మహేశాత్మమహిషి స్కందమాత ర్నమోస్తు తే ।
                ధూపం దీపం చ నైవేద్యం వస్త్రం సిన్దూర భూషణమ్ ॥
శ్లో॥         తామ్బూలం ముఖవాసం చ సర్వమేతేన దర్శయేత్ ।
                తతః ప్రదక్షిణీకృత్య దండవత్ ప్రణిపత్యచ ॥
శ్లో॥         ఉత్తార్య డోరకం బాహోః దేవీచరణయోర్న్యసేత్ ।
                సర్వసంపత్ప్రదే దేవి డోరకం విధృతం మయా ॥
శ్లో ॥        వ్రతం సంపూర్ణమభవత్ గృహాణ జగదంబికే ।
                భృత్యోహం తవ దేవేశి పాల్యం తవ జగత్త్రయమ్ ॥
శ్లో॥         వ్రతేనానేన వరదే పాహి భృత్య మనుత్తమ్ ।
                కథాం శ్రుత్వాచ గురవే దత్వా సంతోష్య దక్షిణామ్ ॥
శ్లో॥         పాత్రాణి సప్తదశ చ పక్వాన్నైః పూరితాని చ ।
                కృత్వా తావద్ ద్విజేభ్యోపి భోజయేచ్చ సువాసినీః॥
శ్లో॥         స్వయం భుక్త్వా త్వలవణం కుర్యాద్రాత్రౌ మహోత్సవమ్।
                ప్రాతర్విసర్జయేద్దేవీం ప్రణిపత్య క్షితిం గతః॥
శ్లో॥         అహమేష వధూరేషా శిశవో మే తవానుగాః।
                మాతస్తవాంఘ్రి కమలం గతిః కా ఇతి చిన్తయ॥

                ఓ దేవీ! నేను సమర్పించు పూజను స్వీకరించుము. నీకు నమస్కారము. ఓ బంధూకపుష్ప (మంకెన పూవు) సమానకాంతి గల దేవీ! నీవు సంపూర్ణముగ వరములను అభయమును ఇచ్చుదానవు. అని పలికి

                ఏహ్యేహి దేవి దేవేశి దేవ దేవేశ వల్లభే ।
                గృహాణేమాం మయా దత్తాం పూజాం దేవి నమోస్తు తే॥

                ఓ దేవీ! దేవేశీ! దేవాధిదేవ మహాదేవ ప్రియా! నేనిచ్చు పూజను గ్రహించుము అని దేవిని పుష్పాంజలిని సమర్పిస్తూ మరల ఆవాహన చేయవలెను. ఆ తరువాత అన్నదాయై నమః పాద్యం సమర్పయామి, గిరీశకాన్తాయై నమః అర్ఘ్యం సమర్పయామి, ఉమాయై నమః ఆచమనీయం సమర్పయామి, జగన్మాత్రేనమః మధుపర్కం సమర్పయామి, గిరిజాయై నమః చందనం సమర్పయామి, అని పూజించ వలెను. అనంతరము ఈ క్రింది మంత్రమును పఠించుచు పుష్పాక్షతాదులతో పూజను చేయవలెను.

మంత్రము:             నమో గిరీంద్ర తనయే జగన్మంగళ మంగళే।
                                శ్రీమహేశాత్మ మహిషి స్కందమాతర్నమోస్తు తే॥

                ఇదే మంత్రమును పఠించుచూ ధూప, దీప, నైవేద్య, వస్త్ర, సిందూర, భూషణ, తాంబూల, ముఖ వాసాదులను (ఏలకులు మున్నగునవి) సమర్పించవలెను. తరువాత ప్రదక్షిణము చేసి సాష్టాంగ దండ ప్రణామములు గావించవలెను.

మంత్రము:             సర్వసంపత్ప్రదే దేవి డోరకం విధృతం మయా।
                                వ్రతం సంపూర్ణమభవత్ గృహాణ జగదంబికే॥

                ఓ సర్వసంపత్ప్రదవైన దేవీ! వ్రతము సంపూర్ణమయినది. నేను ధరించిన తోరమును స్వీకరించుము. అని పఠించుచు తన బాహువునకు ధరించిన తోరమును విప్పి దేవి చరణములందుంచవలెను.

మంత్రము:             భృత్యోహం తవ దేవేశి పాల్యం తవ జగత్త్రయమ్ ।
                                వ్రతేనానేన వరదే పాహి భృత్యమనుత్తమమ్ ॥

                ఓ దేవీ! నేను నీ భృత్యుడను. నీవు ముల్లోకములను పాలించు తల్లివి. వరదాత్రివి. ఉత్తమ దాసుడనగు నన్ను ఈ వ్రతమునకు సంతసించి రక్షింపుము. అని ప్రార్థించ వలెను.
                ఈ కథను విని గురువును దక్షిణలతో సంతోషింపజేయవలెను. 17 పాత్రలందు పక్వాన్నములను నింపి బ్రాహ్మణులకు దానము చేయవలెను. సువాసినీ స్త్రీలను భుజింపచేయవలెను. ఆ రోజున తాను లవణ హీనముగ భుజించవలెను. నాటి రాత్రియందు మహోత్సవమును జరిపించవలెను. మరునాడు ప్రాతఃకాలమున పూజాగృహమున ప్రవేశించి, సాష్టాంగ నమస్కారములు చేసి,
                అహమేష వధూరేషా శిశవో మే తవానుగాః ।
                మాతస్తవాంఘ్రి కమలం గతిః కా ఇతి చింతయ ॥

                ఓ తల్లీ! నేను, నా పత్ని, నా పిల్లలు మున్నగు వారందరము నీ దాసులము. మీ పవిత్ర చరణములే మాకు శరణ్యములు. అని శరణాగతిని చేయవలెను.

శ్లో॥         క్షమస్వ త్రిజగద్ధాత్రి కురు నిత్యం కృపాం మయి।
                ధాన్య కుల్యం తతో విప్ర బీజాదావుపయోజయేత్ ॥
శ్లో॥         భుంజీత వా స్వయం గేహే అన్యస్మై ప్రతిపాదయేత్ ।
                తతః సప్త దశే వర్షే వ్రతోద్యోపనమాచరేత్ ॥
శ్లో॥         పాత్రాణి పూర్వవత్ కృత్వా వస్త్రాచ్ఛన్నాని వస్తుభిః ।
                దద్యాద్ ద్విజేభ్యో ధేనూంశ్చ గురవేఽన్నం పటత్రయమ్ ॥

                ఓ త్రిజగజ్జననీ! నా అపరాథమును మన్నించి నాపై కృపచూపుము అని ప్రార్థించి దేవ్యుద్వాసన చేయవలెను. ఓ విప్రా! ఆ ధాన్యపు కంకులందలి బీజములను తాను గాని, తన గృహమందలివారు గాని భుజించవలెను. ఇతరులకైననూ ఇవ్వవచ్చును. ఈ విధముగ ప్రతి సంవత్సరము ఈ వ్రతమాచరించుచు, 17వ సంవత్సరమున వ్రతోద్యాపనము చేయవలెను. పూర్వము వలె 17 పాత్రలను అన్నముతో నింపి, వస్త్రములు చుట్టి, బ్రాహ్మణులకు దానమివ్వవలెను. గోదానము నొనర్చి, గురువును భుజింపజేసి 3 పట్టు వస్త్రములను సమర్పించవలెను.

శ్లో॥         మహాన్త ముత్సవం కుర్వాత్ భుంజీత జ్ఞాతిభిః సహ।
                ఏతత్తే కథితం విప్ర సర్వసంపత్ప్రదం వ్రతమ్॥
శ్లో॥         న దద్యాన్నాస్తికాయై తద్వికల్పోపహతాత్మనే।
                భక్తిశ్రద్ధా విహీనాయ దాంభికాయ శఠాత్మనే॥

                మహోత్సవమును చేసి బంధువులతో కూడి భుజించవలెను. ఓ విప్రా! సర్వసంపత్ప్రదమగు అన్నపూర్ణా వ్రతమును నీకు చెప్పితిని. నాస్తికులకు, సంశయాత్ములకు, భక్తిశ్రద్ధలు లేనివారికి, దాంభికులకు, దుష్ప్రవృత్తి కలవారికి ఈ వ్రతమును గూర్చి తెలుపరాదు.

శ్లో॥         దేయం శ్రద్ధావతే దేవ పితృభక్తాయ జ్ఞానినే।
                తతః స విస్మయావిష్టో విప్రో హృష్టతనూరుహః ॥
శ్లో॥         చక్రే వ్రతన్నమస్కృత్య సార్థం జానన్ కృతార్ధతామ్।

                శ్రద్ధాళువులగు సజ్జనులకు, దేవపితృభక్తులకు, జ్ఞానులకు మాత్రము చెప్పవలెను. ఆ సాధ్వీ జనుల మాటలు వినిన విప్రుడు ఆశ్చర్యమునంది, హర్షరోమాంచిత శరీరుడయ్యెను. తన పరిశ్రమ సఫలమైనట్లు తలంచి, ఆ స్త్రీలకు నమస్కరించెను. వారితో కూడి అన్నపూర్ణా దేవీ వ్రతమునొనర్చెను.

శ్లో॥         మత్తమాతంగసంరుద్ధం తురంగైరుప బృంహితమ్॥
శ్లో॥         బభూవ తస్య భవనం స్వర్ణ సోపాన సౌధవత్।
                దాస్యః కమల పత్రాక్ష్యో నిష్కకంఠ్యః సువాససః॥
శ్లో॥         విచరన్తి గృహే తస్య భృత్యాః రాజసుతోపమాః।
                లక్ష్మీర్వైశ్రవణస్యేవ వత్సరాభ్యన్తరేఽ భవత్॥
శ్లో॥         అథ విప్రో యువా చక్రే వివాహమపరం సుఖీ।
                భిన్న సౌధాలయే కామీ కామయామాస కామినీమ్॥
శ్లో॥         ఏకదా జ్యేష్ఠ భార్యాయాః గృహే తిష్ఠన్ ద్విజాగ్రణీః।
                మార్గశీర్షేఽన్నపూర్ణాయాః బబన్ధ వ్రతడోరకమ్ ॥

                ఆ వ్రత ప్రభావమువలన వాని భవనము స్వర్ణ సోపాన సౌధముగా రూపొందెను. ముఖద్వారము నొద్ద మత్త గజములు నిలబడెను. వాని అశ్వశాల అశ్వ సమృద్ధమయ్యెను. వాని గృహమునందు కమల దళ నేత్రలగు దాసీ జనము మేలి వస్త్రములు ధరించి, కంఠమునందు హారములను భూషించి సంచరించిరి. వాని భృత్యులు రాజకుమారుల వలె శోభిల్లిరి. ఒక సంవత్సరము లోపే వాని గృహమునందు కుబేరుని పగిది లక్ష్మి తాండవించెను. అతడు యువకుడైనందున ద్వితీయ వివాహమాడెను. రెండవ భార్యకు వేరుగా మరొక దివ్య భవనము నిర్మింపజేసి, ఆ కామినితో గూడి సుఖములదేలెను. ఒకనాడు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు జ్యేష్ఠ భార్యా గృహమునందుండెను. అక్కడే మార్గశీర్ష కృష్ణ పంచమినాడు అన్నపూర్ణా వ్రతమును ఆచరించి తన చేతికి కంకణమును ధరించెను.

శ్లో॥         యయౌ కనిష్ఠ భార్యాయాః గృహే భుక్త్వాఽథ కౌతుకీ।
                స్ఫీత పర్యంకగః కాంతోపాత్త పణౌఘయోగవాన్ ॥
శ్లో॥         సంస్మరద్ బహుధాం క్రీడాం రేమే సంగమయన్ క్షపామ్।
                రమమాణస్య సా దృష్ట్వా డోరకం స్త్రీ స్వభావతః॥
శ్లో॥         సపత్నీ శంకితా ఛిత్వా దాస్యా వహ్నౌ న్యపాతయత్।
                కామాక్షిప్త స్తదా విప్రో న బుబోధాన్యవాసరే ॥
శ్లో॥         కథాక్షణే డోరకన్తమపృచ్ఛత్ స నిజాన్ జనాన్ ।
                న కోప్యకథయత్తస్య తతోఽసావన్య డోరకమ్ ॥
శ్లో।          బబన్ధాథ తతస్తస్య క్షీణా లక్ష్మీర్దినే ర్దినే।
                వత్సరాభ్యన్తరే భూయః సఏవాసీద్ధనంజయః॥
శ్లో॥         బిక్షాపి నామిలత్తస్య ప్రాయశో వికలాత్మనః ।
                పునశ్చిన్తాకులోఽవాదీత్ హన్త మే డోరకో హృతః ॥

                భోజనానంతరము కౌతుకముతో కనిష్ఠ భార్యా గృహమున కేగెను. తెల్లని సెజ్జయందు కూర్చుండి, ప్రియురాలిచ్చిన తాంబూలమును సేవించెను. మిక్కిలి ప్రసన్నుడై, బహు విధ క్రీడలను స్మరించుచు, చిన్న భార్య తో ఆ రాత్రి యంతయు క్రీడించెను. అప్పుడామె తన భర్త చేతితోరణమును చూచెను. స్త్రీ స్వభావము వలన తన సవతి భర్తృ వశీకరణకై కట్టిన తాయెత్తుగా తలంచెను.
                చతురురాలగు నామె యా తోరమును తెంపి, తన దాసి ద్వారా అగ్నియందు దగ్థమొనరింపజేసెను. కామవశుడగు విప్రుడావిషయమును తెలిసికొన లేదు. రెండవ నాడు కథా పఠన సమయమునందు తన చేతికి తోరము లేకుండుటను గమనించెను. వెంటనే తన పరిజనమును ప్రశ్నించెను. అందరు తమకు తెలియదని సమాధాన మిడిరి. అప్పుడాతడు మఱొక తోరమును తయారు చేసి ధరించెను. ఆ రోజు నుండి వాని లక్ష్మి రోజు రోజుకు క్షీణించెను. ఒక్క సంవత్సరము లోపే ధనంజయుడు మరల దరిద్రుడయ్యెను. భిక్ష కూడ లభించుట దుర్లభమాయెను. తరచుగా వ్యాకుల చిత్తుడై అయ్యో! నా తోరము హరింపబడినది గదా! యని చింతాకులుడగుచుండెను.

శ్లో॥         తతః ప్రభృతి మే భూయో దారిద్ర్యం సముపస్థితమ్ ।
                కుర్వతోపి వ్రతం దేవ్యానమే సందృశ్యతే ఫలమ్ ॥
శ్లో॥         భిక్షాపి లభ్యతే పూర్వం ఇదానీం సాఽపి మే గతా ।
                తత్త్వం పృచ్ఛామి కం వాస్య యథా న శ్రీవినాశనమ్ ॥

                తోరము పోయిన నాటినుండి నాకు మరల దారిద్ర్యము సంభవించింది. అన్నపూర్ణా వ్రతము నాచరించుచున్ననూ ఫలము కన్పించుట లేదు. పూర్వము అడిగినచో భిక్ష లభించెడిది. ఇప్పుడా భిక్ష కూడ లభించుట లేదు. ఇప్పుడు నా లక్ష్మి నశింపకుండు ఉపాయము నెవ్వరి నడుగాలి?

శ్లో॥         తత్కామరూపమేవాహం గత్వా పృచ్ఛామి తాః స్త్రియః ।
                ఇతి నిశ్చిత్య సోఽగచ్ఛత్తం దేశం వ్రత మాప్తవాన్ ॥
శ్లో॥         న తత్ర దృశ్యతే కించిత్ పూర్వదృష్టం పురాదికమ్ ।
                సర్వతోఽపి మహారణ్యం జన్తు సంచార వర్జితమ్ ॥
శ్లో॥         పక్షీ న లభ్యతే తత్ర కా కథా మనుజస్యహి।
                ఇతస్తతః పరిభ్రమ్య చిన్తయామాస సద్విజః॥
శ్లో॥         యేన పాపేన మే బాహోః డోరకః కేనచిద్ధృతః।
                తేన కిం భవితా లాభః విహతవ్రతకస్య మే ॥

                ఆకామ రూప నగరమునకే వెళ్లి, గతములో నాకు అన్నపూర్ణా వ్రత విధానమును తెలిపిన స్త్రీలనే యడిగెదను. అని నిశ్చయించి, కామరూప దేశానికి వెడలినాడు. అచ్చట తాను పూర్వము దర్శించిన పట్టణాదులు గోచరించలేదు. ఆ ప్రాంతమంతయు మహారణ్యముగా నుండెను. ఏ విధమగు ప్రాణి సంచారము లేదు. పక్షులే లేవు. మనుష్యుల గూర్చి వేరుగా చెప్పవలెనా? ఆ బ్రాహ్మణుడు దినమంతయు పరిభ్రమించి చింతా క్రాంతుడాయెను. నేనే పాపమొనర్చితినో గదా? ఎవడో నా చేతి తోరమును హరించినాడు. నా వ్రత భంగము వలన ఆ చోరునకు కల్గు లాభమేమిటి?

శ్లో॥         క్వ గతా సా పురీ రమ్యా క్వ సరః క్వ సురాలయః।
                నూనం మద్భాగ్యదోషేణ సమస్తం విధినా హృతమ్॥
శ్లో॥         ధిఙ్మాం దైవహతం స్వర్గాద్భ్రంశితం దుఃఖ భాజనమ్।
                తత్మిమేభిర్మయా ప్రాణైః రక్షితైః క్లేశకోటిదైః ॥
శ్లో॥         ఇత్యుక్త్వా పురతః కూపే మర్తు కామోఽపతత్తదా ।
                పతితో నిర్వ్యథోఽథాసౌ ప్రకాశందదృశే తథా ॥              
శ్లో॥         పథా సప్రయయౌ తేన ప్రకీర్ణం దేశముత్తమమ్ ।
                నానోద్యాన లతాకీర్ణం నానా మృగసేవితమ్॥
శ్లో॥         మయూర నృత్య సంశోభి సానుపర్వత మండితమ్।
                మత్తకోకిల గీతాఢ్యం భృంగసంగీత పేశలమ్॥

                ఇప్పుడా రమ్యమైన కామరూప నగర మెక్కడికి పోయినది? ఆ సరస్సు ఏమయింది? ఆ సురాలయమెక్కడ? నా దురదృష్టము వలన విధి సర్వమును నష్టపరచెను గదా? ఇది నిశ్చయము. ఛీ! దేవీ ప్రకోపము వలన స్వర్గభ్రష్టుడనై దుఃఖభాజనుడ నైతిని. నానా కష్ట భోగినై జీవించి ప్రయోజన మేమిటి? యని తలంచి, మరణింపగోరి సమక్షమందలి కూపము నందు పడెను. పడిన వెంటనే వాని బాధ తొలంగినది.నలువైపుల వెలుగును దర్శించి నాడు. ఆ మార్గములో వెళ్లి వెళ్లి విశాలమై, ఉత్తమమైన దేశమును చేరినాడు. ఆ దేశము అనేకోద్యానవనములతోను,  లతలతోను శోభాయమానముగా నుండెను. నానా మృగసేవితమై అలరారుచుండెను. పర్వతములపై నెమళ్లు ఇంపుగా నాట్యము సేయుచుండెను. మత్త కోకిలలు కుహూనాదములు సేయుచుండెను. గండు తుమ్మెదలు ఝంకారములాలపించుచుండెను.

శ్లో॥         కాననం దృశ్యతే తత్ర సర్వర్తు కుసుమోజ్జ్వలమ్।
                ఫలనమ్రైస్తరువరైః రచితం కదలీచయైః ॥
శ్లో॥         విస్మయోత్ఫుల్ల నయనస్తదాపశ్యన్ వ్రజన్ద్విజః ।
                దదర్శ సాగర ప్రాయం సరః ప్రోత్ఫుల్ల పంకజమ్ ॥
శ్లో॥         హంస కారండవాకీర్ణం చక్రవాకాకులాకులమ్ ।
                మీనపుచ్ఛోచ్చలత్తోయ బిందు తారాంకితాంబరమ్ ॥
శ్లో॥         తరంగోత్తీర్ణ పవన శ్లిష్ట వేతస మండపమ్ ।
                నానామణి తటా క్రీడద్దేవ కన్యా కృతార్చనమ్ ॥

                అక్కడొక కాననము ఋతువులన్నింటిలో పూయు కుసుమములతో ప్రకాశమానముగా నున్నది. ఆ తరువులు ఫలభారముతో వంగి యున్నవి. అరటి చెట్లు ఆనందము నింపుచున్నవి. ఆ ధనంజయుడా దృశ్యములను ఆశ్చర్యముతో కన్నులార గాంచుచు ముందునకేగుచుండెను. సముద్రము వలె విశాల మగు సరస్సును చూచెను. ఆ సరస్సులో పద్మములు వికసించి యుండెను. హంసలు, కన్నె లేడి పిట్టలు, చక్రవాకములతోను కలకలముగా నుండెను. చేపల తోకల తాకిడిచే పై కెగిరిన నీటి బిందువులు చీకటి రాత్రులందు ఆకాశమందలి నక్షత్రకాంతులను తలపించుచుండెను. తరంగముల మీదుగా వచ్చే గాలి తీరమందలి ఱెల్లు దుబ్బులపై ప్రసరించుచుండెను. మణిమయములగు ఆ సరోవరపు టొడ్డులందు దేవతా కన్యలు పూజలు సల్పు చుండిరి.

శ్లో॥         అథాపశ్యత్ సంగీతం సరసః పశ్చాత్ తదాఽశ్రుణోత్।
                షడ్జగాంధార జాత్యుగ్రం దివ్య గేయమనుత్తమమ్॥
శ్లో॥         మృదంగ వేణు పణవ కోకిలా స్వ మండితమ్।
                శనైరనుసరన్ రమ్య స్ఫటికావాస మృద్ధిలత్ ॥
శ్లో॥         రత్న విద్రుమ సోపానం చతుర్ద్వారం వ్యలోకయత్।
                సవివేశ తతోఽభ్యన్తర్దదృశే మణి మండపమ్॥
శ్లో॥         తస్య మధ్యే ప్రనృత్యన్తం పురుషం స్ఫటిక ద్యుతిమ్।
                చంద్ర చూడం త్రినయనం జటిలం ఫణి భూషణమ్॥
శ్లో॥         నానాకారాంశ్చ పురుషాన్ సంగీతం కుర్వతోఽధ్భుతమ్ ।
                తదగ్రేరత్న పర్యంకే సుఖాసీనాం మనోరమామ్॥
శ్లో॥         నవయౌవన సంపన్నాం దివ్యాలంకారభూషితాం ।
                కర్పూర శకలైః మిశ్రతాంబూల పూరితాననామ్ ॥
శ్లో॥         బన్ధూక బన్ధు నిచయాం బన్ధూకారుణవిగ్రహామ్ ।
                కరపల్లవే వహన్తీం దివ్య తాంబూల వీటికామ్ ॥
శ్లో॥         చామరాన్దోలనో ద్వేలత్కర్ణ పూరాలకాననామ్ ।
                ముఖవాసోపయోగ్యాస్యాం నిత్య శ్లాధార సస్మితామ్ ॥

                ఆ ధనంజయుడు ఆ సరస్సునకు తరువాత షడ్జమ గాంధారాది స్వనములతో ఆలపించు దివ్య సంగీతమును వినెను. మృదంగము, పిల్లనగ్రోవి డోలుల ధ్వనులు కోకిలా రావముల బోలి మధురముగా నుండెను. ఆ బ్రాహ్మణుడు మెల్ల మెల్లగా ముందునకు సాగి రత్నములు, పగడములు పొదిగిన మెట్లు, నాల్గు ద్వారములు గల్గి రమ్యమైన స్ఫటిక మయ భవనమును దర్శించెను. లోపలికి ప్రవేశించి మణిమయ మండపమును చూచెను. ఆ మండపమధ్యమున చంద్రశేఖరుడు, జటాధారి, నాగభూషణుడు, శుద్ధ స్ఫటిక సంకాశ దేహుడునగు ముక్కంటి నృత్యము సేయు చుండెను. నానా ప్రకారులగు దివ్యపురుషులు అద్భుతముగా గానము చేయుచుండిరి. వారికి ముందు భాగమున భగవతి మాహేశ్వరి రత్న పర్యంకముపై సుఖాసీనురాలయి యుండెను. ఆ తల్లి నవయౌవనముతో కూడి దివ్య భూషణములతో శోభిల్లుచుండెను. ఆమె నోరు కర్పూర తాంబూలముతో సువాసించుచున్నది. ఆమె చరణములకు నలువైపుల బంధూక పుష్పరాశి యుండెను. ఆమె శరీర కాంతి బంధూక పుష్పకాంతి వలె (మంకెన పూవు) ఎఱ్ఱగా నుండెను. ఆమె కర పల్లవమందు దివ్యతాంబూల వీటిక యలరారు చుండెను. రెండువైపుల వింజామరల గాలిచే చెవికుండలములు చలించుచుండెను. మోముపై ముంగురులు అందముగా కదలాడుచుండెను. కర్పూరాది సుగంధ ద్రవ్యాలతో సువాసితమగు ఆమె ముఖము మందహాసముతో శోభాయుక్తముగా నున్నది.

శ్లో॥         సఖీభిర్దివ్య రూపాభిః సేవ్యమానాం మహేశ్వరీమ్।
                కోయం కోయమితి వ్యగ్ర స్త్రియా వేత్రేణ వారితః॥
శ్లో॥         దేవ్యా భ్రూసంజ్ఞయా భూయః తయైవాన్తర్నివేశితః।
                దణ్డవత్ప్రణిపత్యాథ విప్రః సాధ్వస పూరితః ॥
శ్లో॥         న కించిద్వక్తుమశకత్ తేజసోపహతప్రభః ।
                తమువాచ సమాశ్వాస్య సఖీ తాంబూల వాహినీ॥
శ్లో॥         విప్ర యస్వా వ్రతం చక్రేభవాన్ సర్వసమృద్ధయే ।
                ఏషా త్త్రైలోక్య జననీ సాన్నపూర్ణా మహేశ్వరీ ॥
శ్లో॥         దుఃఖదారిద్ర్యశమనీ సర్వసంపత్సమృద్ధిదా ।
                సృష్టి సంస్థితి సంహారకో యోసౌ మహేశ్వరః ॥               

                దివ్యరూపలైన సఖీజనులు ఆ మహేశ్వరిని సేవించుచుండిరి. ఆ జగదమ్బకు కొంచెము దూరములో ఒక స్త్రీ బెత్తముతో వారించుచుండెను. ఆ స్త్రీ ధనంజయుని గాంచి సంభ్రమముతో వీడెవడు? వీడెవడు? అని పల్కుచూ బెత్తముతో అడ్డగించింది . ఆ స్త్రీయే దేవి భ్రూసంజ్ఞతో ఆ విప్రుని లోపలికి ప్రవేశ పెట్టెను. వెంటనే ఆ బాపడు భయపడుచు సాష్టాంగ దండ ప్రణామమును చేసినాడు. దేవి తేజస్సు వలన తన ప్రభను గోల్పోయి మాట్లాడుటకు అశక్తుడాయెను. తాంబూలవాహిని యగు సఖి, వాని నోదార్చుచూ, ఓ విప్రా! సర్వసంపత్ప్రాప్తికి నీవెవరి వ్రతమును అనుష్ఠించితివో, ఆ త్రిలోక జనని మహేశ్వరియగు అన్నపూర్ణా మాత ఈమెయే. ఈ తల్లి దుఃఖ దారిద్ర్య హారిణి, సర్వసంపదలను సమృద్ధిగా నొసంగునది. సృష్టిస్థితి సంహారములొనర్చు మహేశ్వరుడితడే.

శ్లో॥         స ఏష భగవాన్ రుద్రో నృత్యతేఽస్యాః పురః ప్రభుః।
                యోగమాయాం సమాసాద్య క్రీడతే యో మహేశ్వరః॥
శ్లో॥         శివ ఏష ఇయం శక్తిః మాయేయం పురుషస్త్వసౌ ।
                యత్కించిత్ దృశ్యతే విప్ర సర్వమేతద్ ద్వయాత్మకమ్ ॥
శ్లో॥         న చాత్ర విస్మయః కార్యో దృష్ట్వా చేష్టిత మేతయోః ।
                లోకోత్తరాణాం చరితం కో హి విజ్ఞాతుమీశ్వరః ॥
శ్లో॥         త్వంచ భూయః కురు బ్రహ్మన్ వ్రతం భక్తి సమన్వితః।
                యత్సఖీభిః పురోద్దిష్టం కామరూపే సరస్తటే ॥
శ్లో॥         ప్రాప్స్యసే విపులాం లక్ష్మీం కీర్తిమాయుః సుతాన్ బహూన్ ।
                ఇన్ద్రోఽపి భాగ్యాన్తే ప్రాప్తోతి విరహం శ్రియః ॥

                భగవాన్ రుద్రుడు ఈ జగన్మాత సమక్షమున నృత్యము సేయుచుండును. ఇతడే యోగమాయను ఆశ్రయించి క్రీడించు మహేశ్వరుడు. ఇతడు శివుడు, ఈమె శక్తి. వీరినే పురుషుడు, మాయ అందురు. దృశ్యమానమగు జగత్తంతయు శివశక్తుల స్వరూపమే. వీరి చేష్టలను చూచి ఆశ్చర్యమును పొందుట తగదు. లోకోత్తర దివ్య పురుషులగు వీరి చరితము నెవరెరుంగగలరు? ఓ బ్రాహ్మణుడా! కామరూప నగరమునందు సరోవర తీరమున స్త్రీలు తెలిపిన అన్నపూర్ణా దేవి వ్రతమును భక్తి యుక్తుడవై మరల సమాచరింపుము. ఈ వ్రత ప్రభావము వలన నీవు విస్తారమగు లక్ష్మిని, కీర్తిని, ఆయువును, బహుసుతులను బడయగలవు. భాగ్యాంతమునందు ఇంద్రుడు కూడ లక్ష్మీ హీనుడగును గదా!

శ్లో॥         బ్రహ్మాది దుర్లభం దేవ్యాః సంప్రాప్తం యేన దర్శనమ్ ।
                తతో జగాద విప్రోఽసౌ దండవత్ప్రణతః పునః ॥
శ్లో॥         దేవి ప్రసీద పరిపాలయ పాలనీయమ్
                                దారిద్ర్య దుఃఖ మపనీయ జగత్పునీహి ।
                ధన్యాస్తే ఏవ గుణినః కులశీలయుక్తాః
                                మాతస్త్వయా కరుణయా కిల వీక్షితా యే ॥
శ్లో॥         అపార తర సంసార పార కృత్తవ దర్శనమ్ ।
                తారయత్యఖిలం యోఽసౌ విశ్వేశ్వర నమోస్తుతే ॥

                ఓ విప్రా! బ్రహ్మాదులకు సైతము దుర్లభమగు దేవీ దర్శనము నీకు లభ్యమయినది. అని పల్కిన దేవీ సఖి వచనములను విని బ్రాహ్మణుడు వెంటనే దేవికి దండ ప్రణామమును చేసి, ఇట్లు పల్కెను. ఓ దేవీ! నన్ను అనుగ్రహించి పాలించుము. దారిద్ర్య దుఃఖములను బాపి జగత్తును పవిత్రము చేయుము. ఓ తల్లీ! నీ కరుణా దృష్టి ప్రసరించిన వారే ధన్యులు, గుణవంతులు, కులశీల వంతులు. ఓ విశ్వేశ్వరా! నీ దర్శన మాత్రమున అపార సంసార సాగరమును తరింతురు. మీ యిరువురికి నమస్కారము. అని పల్కి మిన్నకుండెను.

శ్లో॥         తమువాచ అన్నపూర్ణాధ విప్రైతన్మే వ్రతం శుభమ్ ।
                యే కరిష్యన్తి లోకేఽస్మిన్ తేషాం శ్రీః సర్వతో ముఖీ॥
శ్లో॥         నాన్న దుఃఖం భవేత్తేషాం వియోగో న చ సంపదః।
                కీర్తిమన్తో రూపవన్త ఉదారా రాజపూజితాః ॥
శ్లో॥         భవిష్యన్తి గుణాఢ్యాస్తే ధర్మశీలాః ప్రియంవదాః ।
                సదాహం న విమోక్ష్యామి తేషాం వేశ్మ ద్విజోత్తమ॥
శ్లో॥         యేషాం గేహే కథాప్యేషా లిఖితాపి భవిష్యతి ।
                తత్రతత్ర గమిష్యామి పూర్వవద్వర్ధసేఽధునా ॥

                అప్పుడు అన్నపూర్ణామాత వానితో ఇట్లు పల్కెను. ఓ బ్రాహ్మణుడా! ఈ లోకమునందు శుభప్రదమగు నా వ్రతము నాచరించినవారు సర్వతోముఖమగు లక్ష్మిని పొందెదరు. వారికి అన్న దుఃఖము, సంపద్వియోగము సంభవింపదు. వారు కీర్తి మంతులు, రూపవంతులు, ఉదారులు, రాజపూజితులు, గొప్ప గుణవంతులు, ధర్మ స్వభావులు, ప్రియ వాదులునై రాణింతురు. ఎవరు తమ గృహమందు అన్నపూర్ణా ప్రత కథను లిఖించి యుంచుకొందురో వారి సదనమును వీడక సదా వసింతును. నీవు పూర్వమునందు వలె వర్ధిల్లుదువు గాక!

శ్లో॥         కురు వ్రతం సదా మహ్యం తవానుగ్రహకామ్యయా ।
                యాస్యామి కాశ్యాం విశ్వేశాద్దక్షిణే మే గృహం కురు॥
శ్లో॥         అధాఽబ్రవీద్ధరః ప్రీతః శ్రుణు విప్ర పురే మమ।
                ప్రసన్నాననో మే గణో దండపాణిః ప్రియో మమ॥
శ్లో॥         స్థాస్యతి త్వత్ప్రియార్ధం దదాత్యన్నం నృణాం సతామ్ ।
                యే కరిష్యంతి విప్రైతద్ వ్రతం జగతి మానవాః ॥
శ్లో॥         తేషాం కులే న దారిద్ర్యం భవిష్యతి కదాచన ।
                అన్తే వారాణసీం ప్రాప్య గణో మమ భవిష్యసి ॥
శ్లో॥         భార్యా తే పార్వతీతుల్యా ధనంజయ భవిష్యతి ।
                తతః ప్రణమ్య విప్రోఽసౌ పార్వతీ పరమేశ్వరౌ ॥
శ్లో॥         కాశ్యాం గతస్తథా చక్రే త్వన్నపూర్ణా వ్రతం శుభమ్ ।
                పక్వాన్నం సంచయం కృత్వా చాన్నకూటం చకార సః॥
                                                        
                ఓ విప్రా! నీవు నా వ్రతము నెల్లప్పుడు చేయుచుండుము. నేను కూడ నిన్ను అనుగ్రహించుటకై కాశీకి వెళ్లెదను. నీవు కాశీయందు విశ్వనాథునకు దక్షిణముగా నాకు మందిరమును నిర్మింపుము. అని అనుగ్రహించెను. అనంతరము విశ్వనాథుడు ప్రీతుడై, ఓ బ్రాహ్మణుడా! వినుము. నాకు పరమ ప్రియమైన వారాణసి యందు నా ప్రియ గణము, ప్రసన్న ముఖుడునగు దండపాణి యున్నాడు. ఆ దండపాణి నీకు ప్రియము గూర్చుటకై సిద్ధముగా నుండును. అతడు సత్పురుషులకు అన్న ప్రదాత. ఈ జగత్తునందు అన్నపూర్ణాదేవి వ్రతమును చేసిన వారి వంశమునందు ఎప్పటికీ దారిద్ర్యము కలుగదు. దేహాన్తమున వారాణసిని పొంది నా గణములలో నొకడవు కాగలవు. ఓ ధనంజయా! నీ భార్య పార్వతీ సమానురాలగును అని దీవించెను. తరువాత ఆ బ్రాహ్మణుడు పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించినాడు. కాశీకి వెళ్లి పార్వతీ పరమేశ్వరులు ఆదేశించిన విధముగా దేవీ మందిరమును నిర్మింపజేసినాడు. శుభప్రదమగు అన్నపూర్ణా ప్రతమును చేసినాడు. వివిధములగు పక్వాన్నములను సమకూర్చి మాతా అన్నపూర్ణా దేవి ప్రీతి కొరకు అన్నకూటమును గావించెను.

శ్లో॥         ఏతత్తే గదితం రాజన్ వ్రతానాం వ్రతముత్తమమ్ ।
                యత్కృత్వా రామచంద్రోఽపి లేభే సౌఖ్యం శ్రియం నిజామ్ ॥
శ్లో॥         శ్రియమిచ్ఛసి రాజన్ త్వం వృద్ధిం చైవ యశః సుతాన్ ।
                తదా కురు మహాబాహో వ్రతమేతత్ స్వబంధుభిః ॥
శ్లో॥         మయాప్యేతద్ వ్రతం రాజన్ క్రియతే భక్తితః సదా ।
                ద్విత్రిషు భాగ్యవత్స్వేషు తదా వర్యో భవిష్యతి॥
శ్లో॥         ప్రాయేణ భాగ్యరహితాః న కరిష్యన్త్యహోవ్రతమ్ ।
                తే దగ్ధ హృదయాః పాపాః సదా లాలాయితా నృప॥

                ఓ ధర్మరాజా! వ్రతములలో ఉత్తమ వ్రతమును చెప్పితిని. రామచంద్రుడీ వ్రతము నాచరించి సౌఖ్యమును తన రాజ్యమును పొందెను. ఓ మహాబాహూ! ఓ రాజా! శ్రీని, వృద్ధిని, యశస్సును, పుత్రులను కోరినచో సోదరులతో కూడి ఈ వ్రతమును చేయుము. ఓ రాజా! నేనెల్లప్పుడీ వ్రతమును భక్తి ప్రపత్తులతో నొనరింతును. ఈ వ్రతము నాచరించిన వారు గణింపదగిన ఇద్దరు ముగ్గురు భాగ్యవంతులలో శ్రేష్ఠుడగును. సామాన్యముగా భాగ్యహీనులీ వ్రతమును చేయరు. అట్టివారు దగ్ధహృదయులు, పాపులు నై సదా అన్నహీనులై పీడితులగుదురు.

శ్లో॥         వృషభేంద్రగతిం వందే చంద్ర చూడార్థ ధారిణీమ్ ।
                కరుణార్ద్ర దృశం దేవీం అన్నపూర్ణాం గిరీంద్ర జామ్ ॥

                వృషభ వాహనుడగు చంద్రశేఖరుని అర్ధాంగియు, కరుణార్ద్ర దృష్టిగలదియు, పర్వత రాజ పుత్రికయు నగు అన్నపూర్ణాదేవికి నమస్కరింతును.

మాతా అన్నపూర్ణా భగవతికి జయమగు గాక!

ఇతి శ్రీ భవిష్యోత్తర పురాణే శ్రీ కృష్ణ యుధిష్ఠర సంవాదే
శ్రీ అన్నపూర్ణా వ్రత కథా సంపూర్ణమ్
అన్నపూర్ణా ప్రసీదతు శుభమస్తు

అన్నపూర్ణా దేవి అనుగ్రహించుగాక! శుభముగల్గు గాక!