Saturday, October 28, 2017

శ్రీ అన్నపూర్ణా వ్రత కథ - భాగము 2 - బృహద్రథుని కథ (దేవీ భాగవతము)



దేవీ భాగవతమందలి బృహద్రథుడను రాజర్షి కథ
(శ్రీ అన్నపూర్ణా దేవి మహిమను తెలుపు ఇతిహాసము)

పరిచయము : ఒకనాడు నారద మహర్షి శ్రీమన్నారాయణుని శ్రీ దేవీ పూజావిధానము తెలుపుమని ప్రార్థించెను. అప్పుడు శ్రీమన్నారాయణుడు భుక్తి ముక్తి ప్రదము, సర్వాపన్నివారకము నగు దేవీ పూజనక్రమమును ప్రారంభమునుండి నైవేద్యము వరకు తెలిపెను. ఆ తరువాతి పూజా విధానము, దేవి మహిమను ప్రకటించు బృహద్రథుని కథ ప్రస్తుతము వివరింపబడుచున్నది.

శ్లో॥         తతః పానీయకం దద్యాత్ శుభం గంగాజలం మహత్।
                కర్పూరవాలా సంయుక్తం శీతలం కలశస్థితమ్ ॥
శ్లో॥         తాంబూలం చ తతో దేవ్యై కర్పూర శకలాన్వితమ్।
                ఏలాలవంగ సంయుక్తం సుఖ సౌగన్ధ్యదాయకమ్॥
శ్లో॥         దద్యాద్దేవ్యై మహాభక్త్యా యేన దేవీ ప్రసీదతి।
                మృదంగ వీణా మురజ ఢక్కాదుంధుభినిస్స్వనైః॥
శ్లో॥         తోషయే జ్జగతాం ధాత్రీం గాయనైరతిమోహనైః।
                వేదపారాయణైః స్తోత్రైః పురాణాదిభి రప్యుత ॥

                నైవేద్యము తరువాత పవిత్రమగు గంగాజలమును పానీయముగా దేవికి నొసంగవలెను. ఆ పిమ్మట కర్పూరము, కొబ్బరినీరు కలిసిన చల్లని కలశ జలమును సమర్పించవలెను. అనంతరము పచ్చ కర్పూరము ఏలకులు లవంగములు మున్నగు వానితో సువాసించు తాంబూలమును ముఖశుద్ధికై దేవికి సమర్పించవలెను. వీటిని భక్తిపూర్వకముగా సమర్పించుట వలన జగన్మాత శీఘ్రముగ ప్రసన్నురాలగును. ఇంకనూ వీణ, మృదంగములు, ఢక్క, దుంధుభి మున్నగు వాద్య ధ్వనులతోను, అతి మనోహరములగు సంగీతములతోను, వేదపారాయణలతోను, స్తోత్రములతోను, పురాణాదికములతోను జగదంబను సంతుష్టి పరచవలెను.

శ్లో॥         ఛత్రంచ చామరే ద్వే చ దద్యాద్దేవ్యై సమాహితః।
                రాజోపచారాన్ శ్రీ దేవ్యై నిత్యమే సమర్పయేత్ ॥
శ్లో॥         ప్రదక్షిణాం నమస్కారం కుర్యాద్దేవ్యా అనేకథా ।
                క్షమాపయేజ్జగద్ధాత్రీం జగదంబాం ముహుర్ముహుః ॥
శ్లో॥         సకృత్స్మరణ మాత్రేణ యత్ర దేవీ ప్రసీదతి ।
                ఏతా దృశోపచారైశ్చ ప్రసీదేదత్ర కః స్మయః॥
శ్లో॥         స్వభావతో భవేన్మాతా పుత్రేతి కరుణావతీ।
                తేన భక్తౌ కృతాయాం తు వక్తవ్యం కిం తతః పరమ్ ॥

                ఆ తరువాత సావధానుడై ఛత్ర చామరములు సమస్త రాజోపచారములు సమర్పించవలెను. పెక్కు భంగుల దేవికి ప్రదక్షిణా నమస్కారములు గావింపవలెను. జగముల తల్లిని మాటి మాటికి తమ అపరాథములు క్షమింపుమని వేడుకొనవలెను. ఒక్క మారు తలంచినంతనే ప్రసన్నురాలగు దేవి, తనకిన్ని యుపచారములు సమర్పించిన వారికి ప్రసన్నురాలగుటలో ఆశ్చర్యమేముండును? ఏ తల్లియైనను కుమారునిపై సహజముగనే దయను చూపును గదా! కుమారుడు తల్లిపై భక్తి కల్గియున్నచో, తల్లి వానిపై చూపు దయను గూర్చి వేరుగా చెప్పవలసిన దేముండును?

శ్లో॥         అత్ర తే కథయిష్యామి పురా వృత్తం సనాతనమ్ ।
                బృహద్రథస్య రాజర్షేః ప్రియం భక్తి ప్రదాయకమ్ ॥
శ్లో॥         చక్ర వాకో భవత్పక్షీ క్వచిద్దేశే హిమాలయే ।
                భ్రమన్నానా విధాన్దేశాన్యయౌ కాశీపురం ప్రతి ॥
శ్లో॥         అన్నపూర్ణా మహాస్థానే ప్రారబ్దవశతో ద్విజః ।
                జగామ లీలయా తత్ర కణలోభా దనాథవత్ ॥
శ్లో॥         కృత్వా ప్రదక్షిణామేకాం జగామ స విహాయసా ।
                దేశాంతరం విహాయైవ పురీం ముక్తి ప్రదాయినీమ్ ॥
శ్లో॥         కాలాంతరే మమారా ఽసౌ గతః స్వర్గపురీం ప్రతి ।
                బుభుజే విషయాన్సర్వాన్ దివ్యరూపధరో యువా॥
శ్లో॥         కల్ప ద్వయం తథా భుక్త్వా పునః ప్రాప భువం ప్రతి ।
                క్షత్రియాణాం కులే జన్మ ప్రాప సర్వోత్తమోత్తమమ్ ॥

                ఓ నారదా! ఈ విషయములో నీకొక అతి పురాతనమగు ఇతిహాసమును చెప్పెదను. ఇది రాజర్షి బృహద్రథుని కథ. ఈ కథా శ్రవణము వలన దేవీ భక్తి పెంపొందును. తొల్లి హిమాలయ పర్వత ప్రదేశమునందు ఒక చక్రవాక పక్షి యుండెను. అది బహుదేశములు తిరిగి తిరిగి కాశీ పురమును చేరెను. ఆ పక్షి తన ప్రారబ్ధవశమున, అన్న కణముల కొరకు, లీలగా అనాథవలె అన్నపూర్ణా దేవి మందిరమున కేతెంచెను. ఆకాశమునందు తిరుగుచుండగా అనాయాసముగా అనుకోకుండా అన్నపూర్ణా మందిరమునకు ప్రదక్షిణ చేసినట్లయింది. ఆ పుణ్యము వలన దేశాంతరమునకు వెళ్లక ముక్తి ప్రదాయిని యగు కాశీ యందే ఉండి పోయింది. కొంత కాలానికి మృతి చెంది స్వర్గ పురికేగింది. అక్కడ దివ్యరూపమును ధరించి యువకుడై వివిధ భోగముల ననుభవించెను. రెండు కల్పములు స్వర్గ సుఖములనుభవించి క్షత్రియ కులమునందు సర్వోత్తముడుగా జన్మించెను.

శ్లో॥         బృహద్రథేతి నామ్నాఽ భూత్ ప్రసిద్ధః క్షితి మండలే ।
                మహా యజ్వా ధార్మికశ్చ సత్యవాదీ జితేంద్రియః ॥
శ్లో॥         త్రికాలజ్ఞః సార్వభౌమో యమీ పరపురంజయః।
                పూర్వ జన్మ స్మృతిస్తస్య వర్తతే దుర్లభా భువి ॥
శ్లో॥         ఇతి శ్రుత్వా కిం వదన్తీం మునయః సముపాగతాః ।
                కృతాతిథ్యా నృపేంద్రేణ విష్టరేషూషురేవ తే ॥
శ్లో॥         పప్రచ్ఛుర్మునయః సర్వే సంశయో ఽస్తి మహానృప !
                కేన పుణ్య ప్రభావేణ పూర్వజన్న స్మృతిస్తవ ॥

                అతడు భారతదేశమునందు బృహద్రథుడు అను పేరుతో ప్రసిద్ధుడయ్యెను. ఆ రాజు మహాయజ్వ, ధార్మికుడు, సత్యవాది, జితేంద్రియుడు, త్రికాలవేది, సంయమి, మహాపరాక్రమవంతుడు, శత్రుభీకరుడునగు సార్వభౌముడై వినుతి గాంచెను. ఆ రాజునకు భూమియందు దుర్లభమైన పూర్వజన్మ స్మృతి గల్గినది. ఆ వార్త సర్వత్ర వ్యాపించినది. ఈ విషయము నెరింగి మునులందరు ఆ రాజు రాజధానికేతెంచిరి. రాజు వారిని అతిథి సత్కారముల జేసి సముచితాసనములందు కూర్చుండ బెట్టెను. అప్పుడు మునులు రాజుతో, ఓ రాజా! మా కొక సంశయము గలదు. నీకు ఏ పుణ్య ప్రభావమువలన పూర్వజన్మ స్మృతి గల్గినది?

శ్లో॥         త్రికాల జ్ఞానమే వాఁపి కేన పుణ్య ప్రభావతః ।
                జ్ఞానం తవేతి తత్ జ్ఞాతు మాగతాః స్మ తవాన్తికమ్ ॥
శ్లో॥         వద నిర్వ్యాజయా వృత్త్యా తదస్మాకం యథా తధమ్ ॥

శ్రీ నారాయణ ఉవాచ :
                ఇతి తేషాం వచః శ్రుత్వా రాజా పరమధార్మికః ॥
శ్లో॥         ఉవాచ సకలం బ్రహ్మన్! త్రికాలజ్ఞానకారణమ్ ।
                శ్రూయతాం మునయః సర్వే మమ జ్ఞానస్య కారణమ్ ॥
శ్లో॥         చక్రవాకః స్థితః పూర్వం నీచయోని గతోఽపి వా ।
                అజ్ఞానతోఽపి కృతవాన్ అన్నపూర్ణా ప్రదక్షిణామ్ ॥
శ్లో॥         తేన పుణ్య ప్రభావేణ స్వర్గే కల్ప ద్వయ స్థితః ।
                త్రికాలజ్ఞానతాఽప్యస్మిన్ అభూత్ జన్మని సువ్రత ॥

                ఏ పుణ్య హేతువు వలన త్రికాల జ్ఞానము కల్గినది? ఈ జ్ఞానము నెరుంగుటకై మేమందరము నీకడకేతెంచితిమి. ఈ రహస్యము కపటము వీడి యథా తధముగా మాకు తెలుపుము.
                శ్రీమన్నారాయణుడిట్లు పల్కెను. పరమ ధార్మికుడగు బృహద్రధమహారాజు మునుల మాటలను వినినాడు. ఓ మహర్షులారా! నాకు కల్గిన త్రికాలజ్ఞానకారణమును వినుడు.  నేను గత జన్మయందు చక్రవాక పక్షిగా నీచయోనియందు జననమందితిని. (పశు పక్ష్యాదియోనులు నీచయోనులు). ఆ జన్మయందు నేనొకనాడు తెలియకయే కాశీ అన్నపూర్ణా దేవి మందిరమునకు ప్రదక్షణించితిని. ఆ పుణ్య విశేషముచేత స్వర్గమునందు రెండు కల్పములుండి సర్వసుఖములనుభవించితిని.
                ఓ సువ్రతులారా! ఆ పుణ్య ప్రభావము వలననే భూమండలమందు సార్వభౌమత్వమునంది, త్రికాలజ్ఞానమెరుంగు అద్భుత శక్తిని పొందితిని.

శ్లో॥         కో వేద జగదంబాయాః పదస్మృతి ఫలం కియత్ ।
                స్మృత్వా తన్మహిమానంతు పతంత్యశ్రూణి మేఽనిశమ్ ॥
శ్లో॥         ధిగస్తు జన్మ తేషాం వై కృతఘ్నానాం తు పాపినామ్ ।
                యే సర్వమాతరం దేవీం స్వోపాస్యాం న భజన్తి హి ॥
శ్లో॥         న శివోపాసనా నిత్యా న విష్ణూపాసనా తథా ।
                నిత్యోపాస్తిః పరాదేవ్యా నిత్యా శ్రుత్యైవ చోదితా ॥

                అన్నపూర్ణా దేవిని అజ్ఞానతః దర్శించి, ప్రదక్షిణ చేయుట వలన ఇంతటి మహోత్తమ ఫలము లభించినది. ఇది నాకు ప్రత్యక్షానుభవము. తెలిసి చేసినచో దాని ఫలము చెప్పనలవి గాదు. ఆహా! ఇప్పటికీ జగజ్జనని మహిమను తలంచుకుంటే నిత్యము నా కన్నులనుండి ఆనందాశ్రువులు జాలువారుచున్నవి. శరీరము రోమాంచిత మగుచున్నది. కంఠము గాద్గదికమగుచున్నది. సేవింపదగిన జగదంబయగు దేవిని పూజింపని వారు కృతఘ్నులు, పాపులు. ఛీ! వారి జన్మ వ్యర్థము. శివపూజ, విష్ణు పూజ నిత్యవిధి గాదు. ఒక్క పరాదేవి ఉపాసన మాత్రమే నిత్యవిధి. ఇది శ్రుతి, స్మృతి సమ్మత సిద్ధాన్తము.

శ్లో॥         కిం మయా బహువక్తవ్యం స్థానే సంశయవర్జితే ।
                సేవనీయం పదాంభోజం భగవత్యా నిరన్తరమ్ ॥
శ్లో ॥        నాఽతః పరతరం కించిత్ అధికం జగతీతలే ।
                సేవనీయా పరా దేవీ నిర్గుణా సగుణాఽథవా ॥
శ్రీ నారాయణ ఉవాచ
శ్లో॥         ఇతి తస్య వచః శ్రుత్వా రాజర్షేః ధార్మికస్యచ ।
                ప్రసన్నహృదయాః సర్వే గతాః స్వస్వ నికేతనమ్ ॥
శ్లో॥         ఏవం ప్రభావా సా దేవీ తత్పూజాయాః ఫలం కియత్ ।
                అస్తీతి కేన ప్రష్టవ్యం వక్తవ్యం వా న కేనచిత్ ॥

                సంశయహీనమగు విషయమును గూర్చి అధికముగా చెప్పవలసిన దేముండును? ఇది నిర్వివాదమైన విషయము. ఆది శక్తియగు పరాశక్తి యొక్క పాద పద్మములు నిరంతరము సేవనీయములు. ఇంతకంటె మించి భూమిపై శ్రేష్ఠకార్యము మఱియొకటి లేదు. కావున దేవిని నిర్గుణగాగాని లేక సగుణగాగాని నిత్యము సేవింపవలెను.
శ్రీమన్నారాయణుడిట్లు పలికెను -
                ఓ నారదా! ధార్మికుడు, రాజర్షి యగు బృహద్రథుని మాటలను విని మునులందరు ప్రసన్న హృదయులై తమ తమ నివాసములకేగిరి. భగవతి యింతటి ప్రభావము గలది. దేవీ పూజ ఎంతటి ఫలమొసంగునో ఎవరు ప్రశ్నింపగలరు? ఎవరు సమాధానము చెప్ప గలరు? వినగలవారెవరు? అనగా భగవతి విషయములో ప్రష్ట (ప్రశ్నించువాడు), వక్త, శ్రోత అతి దుర్లభము.

శ్లో॥         యేషాన్తు జన్మ సాఫల్యం తేషాం శ్రద్ధా తు జాయతే ।
                యేషాన్తు జన్మ సాంకర్యం తేషాం శ్రద్ధా న జాయతే ॥
                ఓ నారదమునీ! ఎవ్వనిపై జగదంబ యొక్క అపారమగు కరుణ ప్రసరించునో, ఎవ్వని జన్మ సఫలమో వారికి మాత్రమే దేవీ పూజయందు శ్రద్ధ కల్గును. ఎవ్వని జన్మ సంకరమో, దౌర్భాగ్యవంతమో వారికి దేవిపై ఎప్పటికీ శ్రద్ధ గల్గదు.

ఇతి శ్రీ దేవీ భాగవతే మహా పురాణే ఏకాదశ స్కంధే
శ్రీదేవ్యాః మహత్వే బృహద్రథ కథానకం నామ అష్టాదశోఽధ్యాయః

శక్తి ప్రబోధినీ హిందీ టీకకు తెలుగు అనువాదమగు
శ్రీదేవీ భాగవతమహాపురాణమందలి 11 వ స్కందములోగల
బృహద్రథ పూర్వ జన్మ కథా వర్ణనము అను పేరుగల
18వ అధ్యాయము సంపూర్ణము

No comments:

Post a Comment