Wednesday, April 29, 2009

28 వ అధ్యాయము

మహర్షులిట్లనిరి. శివజ్ఞాన సముద్రులగు ఓ సూతా! మీ ద్వారా ఈశ్వరుని లోక తారక రహస్యము వింటిమి. భక్త వత్సల కేదారేశ్వర మహిమ, ప్రాచీన మణికర్ణిక యొక్క గుప్త అద్భుత ప్రభావము, విశ్వనాథ, మణికర్ణికల ప్రభావము, నిత్య యాత్రా విధానము, ఢుంఢిరాజు, ఓంకారాది మహా లింగముల విభవము, జ్ఞానవాపి మొదలగు తీర్థముల అద్భుత మహిమ, పంచ క్రోశములోని లింగములు, శివగణములు, శివయోగుల చరితము, శివాపరాధ భ్రష్టులై కల్పాంత పాప భోగులను గూడ శివ ప్రసాదము తరింపజేయు రహస్యము, అసాధ్యమగు శివాపరాధ నిష్కృతి మొదలగునవి వింటిమి. ఇదంతయు శ్రీకేదారేశ్వరుని విలక్షణ కృపావిశేషము. మేము భక్తిపూర్వకముగ తీర్ధయాత్రలు చేసి యుంటిమి. కాని కేదార మహిమ వినియుండలేదు. కనుక మీరు దయతో మాచే యాత్ర చేయించుడు. గుప్తతీర్థ స్నాన, కేదారేశ దర్శనములచే మమ్ము కృతార్ధులను చేయుడు. మీరే మా పాలిట తారకులు. అని ప్రార్ధించి నైమిశారణ్య వాసులగు మునిగణము, శౌనకాది ఋషులు సూతునితో కాశీ యాత్రకు బయలు దేరిరి.

కేదారనాథ, విశ్వనాథులు, మణికర్ణికలను మనమున తలంచుచు మనో వేగమున కాశికి చేరిరి. మణికర్ణికలో స్నానమాడి విశ్వనాథుని పూజించి, ఢుంఢిరాజు, ఓంకారేశ్వరాది మహాలింగములు, జ్ఞానవాపి, పంచ క్రోశలింగములు ప్రదక్షిణచేసి కేదారము చేరి, ప్రాచీన మణికర్ణికలో విధివిధానముగ స్నానమాడి, కేదారేశ్వరుని రుద్ర పారాయణతో అభిషేకించి, సూతునితో సహా ఆనంద సముద్రమున ఓలలాడిరి. కేదారేశ్వరుని సన్నిధిన సత్కథా కాలక్షేపముతో సూతునిట్లు కీర్తించిరి.

గురువరా! మేము ధన్యులమైతిమి. మా తపము ఫలించినది. మీ కథా సారాంశము ద్వారా లోకమున రెండు సుప్రసిద్ధములు గా తెలిసికొంటిమి. మొదటిది ప్రాచీన మణికర్ణికా స్నానము, రెండవది కేదారేశ్వరుని అర్చించుకొనుటు. మా పుణ్యమున మాకు రెండును ప్రాప్తించినవి. కాశీక్షేత్ర దర్శనము బహుళఫల ప్రదము. ఇక్కడ భైరవయాతనకూడ లేదు. ఇక జీవన్ముక్తులనై మేము ఇక్కడే నివశింతుము. కాని ఒక్క సందేహము నివారింపుడు. స్వామీ, ధర్మము ఫలించు స్థానములు చాలా గలవు. అర్ధము నిచ్చు స్థలములునూ చాలా గలవు. చతుర్విధ పురుషార్ధములనొసగు శివక్షేత్రములు గలవు. తీర్థ క్షేత్రములు గలవు. స్వయంభూలింగములు, దివ్యమూర్తులలో గణేశ, దుర్గ, విష్ణు మొదలుగా గలవి అనేకములు. సర్వకామ్యార్ధ సిద్ధిదములు. ఇవి మోక్షప్రదములెట్లగును? జీవులు అనాది అవిద్యా వాసనవలన బంధితులు గదా? స్వాత్మజ్ఞానము కల్గనిదే మొక్షమెట్లు సిద్ధించును. అనేక జన్మల పుణ్యమున శాస్త్ర, వేదాంతముల తెలిసికొనవలయునను ఇచ్ఛ జనించును, వేదాంత శ్రవణమున, మనన, నిధి ధ్యాసలు, అవశ్యమని తెలియును. అట్టి నిధి ధ్యాసవలన భగవానుడే గురురూపియై ధృఢభక్తుల ఆగామి, సంచిత పాపముల నిర్మూలనకు ఉపదేశము చేయును. కాని ప్రారబ్దము అనుభవించి తీరవలయును. ఎట్టి యోగులునూ ప్రారబ్ద క్షయమగువరకూ అజగర వృత్తితో దేవధారులై యుండవలసినదే, ప్రారబ్ద క్షయమయిన తర్వాతనే విదేహ ముక్తియని శృతి వాక్యము గదా! మరి సాధారణ జీవులకు ముక్తి ఎట్లు సాధ్యము? అనాదిగా జీవులు అవిద్యా పాశబద్ధులై యుందురు గదా! అట్టివారికి స్వాత్మ జ్ఞానములేక ముక్తి ఎట్లు సాధ్యము? భగవంతుని యడల అనన్య భక్తి గల్గి, వారికి గురువే దైవమై గురు శుశ్రూషచే వేద, శాస్త్రములు నేర్చి, నిరాతంకులై సుఖదుఃఖములు, శత్రు మిత్రులు, మానావమానములు సమానములై జీవభావము వదలి, ఆత్మానుసంధానులై కొందరు ముక్తికి అర్హులగుదురు, కాని సాధారణ మానవులెట్లు ముక్తి బడయుదురు? ఈ సంశయము నివారింపమని మునులు సూతుని కోరగా సూతుడిట్లు వివరించిరి.

మునులారా మిమ్ము సంపూర్ణ సంశయ రహితులను చేయుటకు విశ్వేశ్వరుడే సమర్ధుడు. కాని నాకు మా గురుదేవులు బోధించిన విధముగా మీకు తెల్పెదను వినుడు. పరమేశ్వరుడు సర్వ సమర్ధుడు. అందరి హృదయములో ఆత్మగా తానే యుండి లీలగా ఆడించుచున్నాడు. కర్తుం, అకర్తుం, అన్యధా కర్తుం సమర్ధుడు. ప్రతిజీవియందును స్వాత్మ జ్ఞానము అంతర్లీనముగ గలదు. కాని మాయా వరణముచే జీవులలో అది వెలువడుటలేదు. శాస్త్ర విద్య వలన అవిద్య నిర్మూలనమై భగవదంశ ప్రకాశితమై కాశీ స్ఫురణ గల్గి, సాధారణ జీవులు ముక్తికి అర్హులగుదురు. కాశీ ప్రాప్తితో ముక్తి నిశ్చయమని వేదవాక్కు. ఒక్కమారు కాశీ దర్శించినను క్రమముక్తి గల్గును. సామవేదగానము చేయుచు సాలోక్య, సామీప్య, సారూప్య ముక్తుల తర్వాత సంకల్ప మాత్రమున సర్వభోగములు ప్రాప్తించి, సర్వ సుఖములననుభవించిన తర్వాత విరక్తులై ఆత్మానుసంధానముతో సాయుజ్య ముక్తి బొందుదురు. అట్టి సాయుజాయము కాశీలో దేహత్యాగముచే కల్గును. ఇందు సంశయము లేదు. ఇతర పుణ్య తీర్థ, క్షేత్రములయందు గల్గు ముక్తికి విలక్షణముగా కాశీలో సద్యఃముక్తి గల్గును. పాపులకును, ప్రారబ్దవశమున అనుభవింపవలసిన కర్మ ఫలమంతయునూ తుది శ్వాస విడుచు సమయమున క్షణకాలములో భైరవదండన రూప ప్రక్షాళనతో, శంకరుడు తారకమంత్రోపదేశము చేసి ముక్తి నిచ్చును. ఇది మరెక్కడనూ సాధ్యము కాదు. శివానుగ్రహమున కాశీవాసులలో ధర్మలోపము జరుగదు. కాశీకేదార క్షేత్రమందు అట్టి భైరవ యాతన కూడ లేకనే ముక్తి గల్గునట్లు శివాజ్ఞ. శివాజ్ఞ వలన బ్రహ్మాండము పిండాండమగును. అట్లే యుగముల పర్యంతము ఎన్నో జన్మలలో అనుభవించవలసిన కర్మ పరిపాకము ప్రాణోత్క్రమణ సమయమందు క్షణకాలమున భైరవుడు అనుభవింపజేయుటలో సంశయమేమిగలదు. జ్ఞానాదేవతు కైవల్యమనునది వేదోక్తి. అట్టి జ్ఞానము ఏ జీవికైనను తారక మంత్రోపదేశ రుపమున సాక్షాత్ శివుడే కల్గించునపుడు ఇక సాయుజ్యముక్తి గాక మరి ఏ ముండును? కాశీలో కేదార క్షేత్రము విశేష ఫలదాయకము. కేదార నామము ధరించుటయు కళ్యాణ ప్రదము. మహాపుణ్యవిశేషమున మనకు కాశీ దర్శన ప్రాప్తియు మీరు నన్ను పరి ప్రశ్నించుటయు, నా గురువు వ్యాస భగవానుని అనుగ్రహమున నేను తెలిసికొనిన కాశీ మహాత్మ్యమును సత్సంగరూపమున నేను మీకు వినిపించుటయు జరిగినది. సత్సంగము వలన ధర్మార్ధకామమోక్షములు నిశ్చయముగ ఫలించును. ఇది నిశ్చయము.

No comments:

Post a Comment