Wednesday, May 4, 2011

గంగా పుష్కరములు - 3వ భాగము - పుష్కర మహాత్మ్యము

పుష్కర మహాత్మ్యము

నైమిశారణ్యమున శౌనకాది మహర్షులు సత్రయాగము నిర్వహించు సమయమున సూతమహర్షి విచ్చేయగా వారిని ప్రార్థించి శౌనకాదులు మహాత్మా! పాపపంకిలమందు కూరుకొనిపోవుచున్న మానవ జాతికి సత్వర విమోచనమొసంగు సూక్ష్మఉపాయము శలవిండని కోరిరి.

సూతుడు వారి ప్రార్థనను గ్రహించి పుష్కరోత్పత్తి వృత్తాంతమును వారికి వివరించి సాధారణ మానవునికి అత్యంత సూక్ష్మములో పాపపరిహారోపాయమును తెల్పిరి.

పుష్కరుడను బ్రాహ్మణుడు సగటు మానవులందరును పుణ్యనదులలో స్నానమాడి వారి పాపములను నదులకు సంక్రమింపజేయగా నదులు ఎట్లు ఆ పాపములనుండి పునీతులగునను సందిగ్ద తర్కమానసుడై శివుని గురించి తపమాచరించి, ఈశ్వరుని అష్టమూర్తులలో ఒకటగు జలతత్వ సిద్ధికై ప్రాధేయపడగా, భక్తుని ముగ్థావేదనకు సంతసించిన పశుపతి అతనికి ఆభయమొసంగి అతనికి పుష్కర స్ఫూర్తి నొసంగెను. అది తెలిసికొనిన బ్రహ్మ శివుని ప్రార్థించి ఆ పుష్కర స్ఫూర్తిని తన కమండలమందు భద్రపరచుకొనిరి.

ఇంద్రునికి గౌతముని వలన కలిగిన శాపమునుండి విముక్తి కొరకు అతడు బృహస్పతిని ఆశ్రయించగా, దేవగురువగు బృహస్పతి ఇంద్రుని బ్రహ్మవద్దకు తోడ్కొనివెళ్ళి శాపవిమోచనమనుగ్రహింప వేడిరి. అంత బ్రహ్మ మందాకిని వద్ద ఒక సరస్సుని నిర్మించి అందు తన కమండలమందలి పుష్కర స్ఫూర్తిని ఒక బిందువు ప్రోక్షింపగా మహేంద్రుడు ఆ సరస్సులో స్నానమాడి తన వికృతరూపమునుండి విముక్తి పొంది యధాపూర్వ సుందర రూపమును బొందెను.

ఆకాశ గంగ కన్నను అత్యంత ప్రభావసమన్వితమయిన పుష్కర మహాత్మ్యమునకు అబ్బురపడిన బృహస్పతి, దేవేంద్రులు మహోత్సాహమున వారి లోకములు చేరిరి. ఈ విషయమును తెలిసికొనిన పుణ్య నదులన్నియూ ఆకాశ గంగకన్నను అమలమయిన ఆపుష్కర సమ్మేళనముకై ఉవ్విళ్లూరి గంగ, గొతమిలు ముందుండగా సర్వ నదులును బ్రహ్మను ప్రార్ధించినవి. పుష్కర మహాత్మ్యమువలన ఇంద్రుని శాపవిమోచనము కనులార గాంచిన బృహస్పతి పుష్కర తత్వమును తనకు కూడ ఆపాదించమని బ్రహ్మను వేడగా పుష్కరుడు అందుకు విముఖుడాయెను. కాని బృహస్పతియు, నదులును అత్యంత దీనముగ ప్రార్థించినందున బ్రహ్మ పుష్కరుని పలురీతుల సంతుష్టుని జేసి, జీవనదుల వాంఛను తీర్చెను.

మేషాది మీన పర్యంతముగల 12 రాసులలో వరుసగా ఒక్కోక్క సంవత్సరము గంగ, నర్మద, సరస్వతి, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, భీమ, పుష్కర సరస్సు, తుంగభద్ర, సింధు, ప్రణీత నదులలో బృహస్పతి ఆయా రాసులలో ప్రవేశించునపుడు పుష్కరుడు ఆయా నదులలో మూడుకోట్ల యాబది లక్షల తీర్థముల సమేతుడై తొలి పండ్రెండు దినములును, గురువు ఆ రాశిని వదలు తుది పడ్రెండు రోజులును ఆశ్రయించి యుండునట్లు అంగీకరించినాడు. కాని గోదావరికి మాత్రమే అంత్య పుష్కరమహాత్మ్యము ప్రాముఖ్యమయినది. పుష్కర సమయమున చేసిన తప, హోమ, దాన, ధర్మములు, తర్పణ, పిండ ప్రదానాది కర్మ తంత్రములు సహస్రాధిక ఫల హేతువులు అగునని బ్రహ్మ ఆదేశము, అనుగ్రహము.

మేషరాశి యందు బృహస్పతి ప్రవేశింపగా హరిద్వార్, ప్రయాగ, వారాణసి యందలి గంగానదికిని,

వృషభ రాశియందు అమర కంటక్, ఓంకార క్షేత్రములందు నర్మదానదికిని,

మీధునమందు బదరీ తీర్థమందలి భీమపురి, ప్రయాగ, ప్రభాస తీర్థములందు సరస్వతికిని,

కర్కాటకమందు యమునోత్రి, మధుర, ప్రయాగ యందలి యమునకును,

సింహరాశియందు నాశిక్, కందుకుర్తి, రాజమండ్రి యందలి గోదావరికిని,

కన్యయందు శ్రీశైల, విజయవాడలయందలి కృష్ణా నదికిని,

తులయందు తలకావేరి, శ్రీరంగ పట్టణములయందలి కావేరికిని,

వృశ్చికమందు భీమశంకర్, పండరీపురములందలి భీమానదికిని,

ధనస్సునందు రాజస్థాన్ లో అజ్మీర్ వద్దగల పుష్కర సరస్సునందును,

మకరమందు హంపి, మంత్రాలయమందలి తుంగభద్ర కును,

కుంభమందు పాకిస్థాన్ సరిహద్దులలోని లేహ్ (జమ్ము కాశ్మీర్) వద్ద సింధు నందును,

మీనమందు కాళేశ్వరంలోగల ప్రణీతా నదియందును బృహస్పతి, పుష్కరుడు, మూడుకోట్ల యాబది లక్షల నదులతో ప్రవేశించి పండ్రెండు దినములు అందు స్నానమాడిన వారి పాపములు పటాపంచలు జేయుదురు.

పుష్కర మహాత్మ్యం సమాప్తం

No comments:

Post a Comment