Monday, May 9, 2011

గంగా పుష్కరాలు - ప్రారంభం

మే 8, 2011 ఆదివారం నాడు వారణాశిలో గంగాపుష్కరాలు ప్రారంభం అయ్యాయి. ఆంధ్రా ఆశ్రమం చుట్టు ప్రక్కల ప్రాంతాలంతా ఆంధ్ర ప్రదేశ్ నుండి వచ్చిన తీర్థ యాత్రికులతో కిటకిట లాడుతున్నాయి. చాలా మంది యాత్రికులు గంగ ఒడ్డునే నిద్రించి ఉదయం 3.30 ని. నుండే స్నానాలు చెయ్యడం మొదలు పెట్టారు. దాదాపు లక్షమంది స్నానాలు చేసారని అంచనా. స్నానాలు చేయడం, పితృ దేవతలకు తర్పణాలు వదలడం దాదాపు సాయింత్రం వరకూ కొనసాగుతూనే ఉంది. వివిధ పంచాంగాలలో గురుని మేషప్రవేశం వివిధ సమయాలలో చూపించడం వల్ల యాత్రికులలో కొంత తికమక కొనసాగింది.

ఈ గంగా పుష్కరాల ఆచారం ఆంధ్రావారికి మాత్రమే ఉండడంతో గంగ ఘాట్లు అన్నీ ఆంధ్రనుండి వచ్చిన యాత్రికులతో కళకళ లాడుతున్నాయి. ఆంధ్రా ఆశ్రమంలో గదులు తక్కువ ఉండటంతో మానేజిమెంటువారు దాతలకు మాత్రమే 3 రోజులకు మాత్రమే గదులు ఇవ్వాలని నిర్ణయించడంతో డోనర్లు కాని యాత్రీకులకు గదులు దొరకుటలేదు. దాదాపు 3 నెలలనుండే ఆంధ్రాశ్రమం చుట్టుపక్కల ఉన్న చాలా సత్రములను, ఇళ్లను యాత్రీకులు రిజర్వ్ చేసుకున్నారు.

అఖిల భారత కరివెన నిత్యాన్నదాన సత్రం వారు పుష్కరముల సందర్బంగా యాత్రీకుల ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లను చేసారు. వారి సత్రానికి ఎదురుగా కల మందిరంలో ఉన్న ఖాళీ స్థలంలో పందిర్లు వేయించి బ్రాహ్మణ యాత్రీకులకు భోజన వసతి కలిపిస్తున్నారు. వీరు కాక బాసరనుండి వచ్చిన వారుకూడా కుమారస్వామి మఠములో బ్రాహ్మణులకు భోజన వసతి కలిపిస్తున్నారు.

ఆంధ్రాశ్రమము, వైశ్య సత్రములలో ఆశ్రమములో నివసిస్తున్నవారికి మాత్రమే మధ్యాహ్న భోజనం, సాయింత్రం ఉపాహారం సదుపాయం కలిపిస్తున్నారు.

కాశీ విశ్వనాధ మందిరంలో దర్శనానికి 5 గంటలు పట్టిందని సమాచారం.

ఇంతవరకూ ఏవిధమయిన అపశృతులు చోటుచేసుకోలేదు. యాత్రీకుల సౌకర్యార్థం కాశీ తెలుగు సమితి తయారు చేసిన కరపత్రాన్ని ముద్రించి యాత్రికులకు పంచుతున్నారు.

No comments:

Post a Comment