Wednesday, April 29, 2009

28 వ అధ్యాయము

మహర్షులిట్లనిరి. శివజ్ఞాన సముద్రులగు ఓ సూతా! మీ ద్వారా ఈశ్వరుని లోక తారక రహస్యము వింటిమి. భక్త వత్సల కేదారేశ్వర మహిమ, ప్రాచీన మణికర్ణిక యొక్క గుప్త అద్భుత ప్రభావము, విశ్వనాథ, మణికర్ణికల ప్రభావము, నిత్య యాత్రా విధానము, ఢుంఢిరాజు, ఓంకారాది మహా లింగముల విభవము, జ్ఞానవాపి మొదలగు తీర్థముల అద్భుత మహిమ, పంచ క్రోశములోని లింగములు, శివగణములు, శివయోగుల చరితము, శివాపరాధ భ్రష్టులై కల్పాంత పాప భోగులను గూడ శివ ప్రసాదము తరింపజేయు రహస్యము, అసాధ్యమగు శివాపరాధ నిష్కృతి మొదలగునవి వింటిమి. ఇదంతయు శ్రీకేదారేశ్వరుని విలక్షణ కృపావిశేషము. మేము భక్తిపూర్వకముగ తీర్ధయాత్రలు చేసి యుంటిమి. కాని కేదార మహిమ వినియుండలేదు. కనుక మీరు దయతో మాచే యాత్ర చేయించుడు. గుప్తతీర్థ స్నాన, కేదారేశ దర్శనములచే మమ్ము కృతార్ధులను చేయుడు. మీరే మా పాలిట తారకులు. అని ప్రార్ధించి నైమిశారణ్య వాసులగు మునిగణము, శౌనకాది ఋషులు సూతునితో కాశీ యాత్రకు బయలు దేరిరి.

కేదారనాథ, విశ్వనాథులు, మణికర్ణికలను మనమున తలంచుచు మనో వేగమున కాశికి చేరిరి. మణికర్ణికలో స్నానమాడి విశ్వనాథుని పూజించి, ఢుంఢిరాజు, ఓంకారేశ్వరాది మహాలింగములు, జ్ఞానవాపి, పంచ క్రోశలింగములు ప్రదక్షిణచేసి కేదారము చేరి, ప్రాచీన మణికర్ణికలో విధివిధానముగ స్నానమాడి, కేదారేశ్వరుని రుద్ర పారాయణతో అభిషేకించి, సూతునితో సహా ఆనంద సముద్రమున ఓలలాడిరి. కేదారేశ్వరుని సన్నిధిన సత్కథా కాలక్షేపముతో సూతునిట్లు కీర్తించిరి.

గురువరా! మేము ధన్యులమైతిమి. మా తపము ఫలించినది. మీ కథా సారాంశము ద్వారా లోకమున రెండు సుప్రసిద్ధములు గా తెలిసికొంటిమి. మొదటిది ప్రాచీన మణికర్ణికా స్నానము, రెండవది కేదారేశ్వరుని అర్చించుకొనుటు. మా పుణ్యమున మాకు రెండును ప్రాప్తించినవి. కాశీక్షేత్ర దర్శనము బహుళఫల ప్రదము. ఇక్కడ భైరవయాతనకూడ లేదు. ఇక జీవన్ముక్తులనై మేము ఇక్కడే నివశింతుము. కాని ఒక్క సందేహము నివారింపుడు. స్వామీ, ధర్మము ఫలించు స్థానములు చాలా గలవు. అర్ధము నిచ్చు స్థలములునూ చాలా గలవు. చతుర్విధ పురుషార్ధములనొసగు శివక్షేత్రములు గలవు. తీర్థ క్షేత్రములు గలవు. స్వయంభూలింగములు, దివ్యమూర్తులలో గణేశ, దుర్గ, విష్ణు మొదలుగా గలవి అనేకములు. సర్వకామ్యార్ధ సిద్ధిదములు. ఇవి మోక్షప్రదములెట్లగును? జీవులు అనాది అవిద్యా వాసనవలన బంధితులు గదా? స్వాత్మజ్ఞానము కల్గనిదే మొక్షమెట్లు సిద్ధించును. అనేక జన్మల పుణ్యమున శాస్త్ర, వేదాంతముల తెలిసికొనవలయునను ఇచ్ఛ జనించును, వేదాంత శ్రవణమున, మనన, నిధి ధ్యాసలు, అవశ్యమని తెలియును. అట్టి నిధి ధ్యాసవలన భగవానుడే గురురూపియై ధృఢభక్తుల ఆగామి, సంచిత పాపముల నిర్మూలనకు ఉపదేశము చేయును. కాని ప్రారబ్దము అనుభవించి తీరవలయును. ఎట్టి యోగులునూ ప్రారబ్ద క్షయమగువరకూ అజగర వృత్తితో దేవధారులై యుండవలసినదే, ప్రారబ్ద క్షయమయిన తర్వాతనే విదేహ ముక్తియని శృతి వాక్యము గదా! మరి సాధారణ జీవులకు ముక్తి ఎట్లు సాధ్యము? అనాదిగా జీవులు అవిద్యా పాశబద్ధులై యుందురు గదా! అట్టివారికి స్వాత్మ జ్ఞానములేక ముక్తి ఎట్లు సాధ్యము? భగవంతుని యడల అనన్య భక్తి గల్గి, వారికి గురువే దైవమై గురు శుశ్రూషచే వేద, శాస్త్రములు నేర్చి, నిరాతంకులై సుఖదుఃఖములు, శత్రు మిత్రులు, మానావమానములు సమానములై జీవభావము వదలి, ఆత్మానుసంధానులై కొందరు ముక్తికి అర్హులగుదురు, కాని సాధారణ మానవులెట్లు ముక్తి బడయుదురు? ఈ సంశయము నివారింపమని మునులు సూతుని కోరగా సూతుడిట్లు వివరించిరి.

మునులారా మిమ్ము సంపూర్ణ సంశయ రహితులను చేయుటకు విశ్వేశ్వరుడే సమర్ధుడు. కాని నాకు మా గురుదేవులు బోధించిన విధముగా మీకు తెల్పెదను వినుడు. పరమేశ్వరుడు సర్వ సమర్ధుడు. అందరి హృదయములో ఆత్మగా తానే యుండి లీలగా ఆడించుచున్నాడు. కర్తుం, అకర్తుం, అన్యధా కర్తుం సమర్ధుడు. ప్రతిజీవియందును స్వాత్మ జ్ఞానము అంతర్లీనముగ గలదు. కాని మాయా వరణముచే జీవులలో అది వెలువడుటలేదు. శాస్త్ర విద్య వలన అవిద్య నిర్మూలనమై భగవదంశ ప్రకాశితమై కాశీ స్ఫురణ గల్గి, సాధారణ జీవులు ముక్తికి అర్హులగుదురు. కాశీ ప్రాప్తితో ముక్తి నిశ్చయమని వేదవాక్కు. ఒక్కమారు కాశీ దర్శించినను క్రమముక్తి గల్గును. సామవేదగానము చేయుచు సాలోక్య, సామీప్య, సారూప్య ముక్తుల తర్వాత సంకల్ప మాత్రమున సర్వభోగములు ప్రాప్తించి, సర్వ సుఖములననుభవించిన తర్వాత విరక్తులై ఆత్మానుసంధానముతో సాయుజ్య ముక్తి బొందుదురు. అట్టి సాయుజాయము కాశీలో దేహత్యాగముచే కల్గును. ఇందు సంశయము లేదు. ఇతర పుణ్య తీర్థ, క్షేత్రములయందు గల్గు ముక్తికి విలక్షణముగా కాశీలో సద్యఃముక్తి గల్గును. పాపులకును, ప్రారబ్దవశమున అనుభవింపవలసిన కర్మ ఫలమంతయునూ తుది శ్వాస విడుచు సమయమున క్షణకాలములో భైరవదండన రూప ప్రక్షాళనతో, శంకరుడు తారకమంత్రోపదేశము చేసి ముక్తి నిచ్చును. ఇది మరెక్కడనూ సాధ్యము కాదు. శివానుగ్రహమున కాశీవాసులలో ధర్మలోపము జరుగదు. కాశీకేదార క్షేత్రమందు అట్టి భైరవ యాతన కూడ లేకనే ముక్తి గల్గునట్లు శివాజ్ఞ. శివాజ్ఞ వలన బ్రహ్మాండము పిండాండమగును. అట్లే యుగముల పర్యంతము ఎన్నో జన్మలలో అనుభవించవలసిన కర్మ పరిపాకము ప్రాణోత్క్రమణ సమయమందు క్షణకాలమున భైరవుడు అనుభవింపజేయుటలో సంశయమేమిగలదు. జ్ఞానాదేవతు కైవల్యమనునది వేదోక్తి. అట్టి జ్ఞానము ఏ జీవికైనను తారక మంత్రోపదేశ రుపమున సాక్షాత్ శివుడే కల్గించునపుడు ఇక సాయుజ్యముక్తి గాక మరి ఏ ముండును? కాశీలో కేదార క్షేత్రము విశేష ఫలదాయకము. కేదార నామము ధరించుటయు కళ్యాణ ప్రదము. మహాపుణ్యవిశేషమున మనకు కాశీ దర్శన ప్రాప్తియు మీరు నన్ను పరి ప్రశ్నించుటయు, నా గురువు వ్యాస భగవానుని అనుగ్రహమున నేను తెలిసికొనిన కాశీ మహాత్మ్యమును సత్సంగరూపమున నేను మీకు వినిపించుటయు జరిగినది. సత్సంగము వలన ధర్మార్ధకామమోక్షములు నిశ్చయముగ ఫలించును. ఇది నిశ్చయము.

Friday, April 24, 2009

27 వ అధ్యాయము


మహర్షులు సూతుని, వ్యాస భగవానుని ప్రియశిష్యులు, జ్ఞానసముద్రులగు మహాత్మా! అంబిక పరమాత్మ నడిగిన రహస్యమును వివరింపుడని కోరగా సూతుడు వారికిట్లు తెల్పిరి.

దేవీ నా పూజా పుణ్యవశమున ఈ హంసల జంట బ్రాహ్మణ యోనియందు జన్మించి సుఖశర్మ యనునామముతో నిర్దోష భక్తితో మనలము పూజించి సుఖములకు నాధుడైనందున నాథశర్మగా ప్రసిద్ధి చెందును. నిర్దోషురాలగు అతని భార్య అనవద్య పేరుతో ప్రసిద్ధి చెందును. వీరు బ్రహ్మవేత్తలై నా క్షేత్రములన్నిటిని సేవించి శివతత్వమును కార్తికేయుని ద్వారా తెలిసికొని, అన్ని క్షేత్రముల మహాత్మ్యమును గ్రహించి త్రికాల జ్ఞానులై అహంగ్రహోపాసనద్వారా దేహాభిమానము వదలి ఆత్మానుసంధానులై మనమే వారుగా భావించి అనవద్య ఉమగాను, నాథశర్మ మహేశ్వరుడుగాను కైలాసము చేరుదురు. మనము వారిలో లీనమగుదుము. ప్రమధగణములతో సేవలందుకొందురు. మనభక్తులవైభవమును దర్శించి ఆనందమనుభవించెదము. అనేక బ్రహ్మ కల్పముల తర్వాత, విష్ణు కల్పమారంభమగును. అనేక విష్ణు కల్పముల తర్వాత రుద్ర కల్పమగును. అపుడు మనము మహాకైలాసమున కేగెదము. ఉమామహేశ్వరాత్మక కల్పమువరకు వీరు మనవద్ద ముక్త స్థితులై మనలో లీనమగుదురు. జగద్వ్యవహారము కొరకు మనము క్షణికలీల, నిత్యలీల, మరియు భక్తులను ఉద్ధరించుటకు దీర్ఘలీలలు నిర్వహింపవలయును. భక్తులను తృప్తులను చేయుటయే లీలావిశేషము. భక్తశులభుడగునేను శంభువిజ్ఞానుని ఆశీర్వాదము నెఱవేర్చుటకు ఈ దంపతులకు ఇన్ని జన్మలలో క్రమక్రమముగా వీరినిట్లు ఉద్ధరించ వలసివచ్చినది.

ఇట్టి వృత్తాంతమును శివునివద్ద తెలిసికొని పార్వతి సంతసించి స్వామికి నమస్కరించి ఆ హంసలను కృపాదృష్టితో దీవించి వృషభవాహనారూఢులై పార్వతీ పరమేశ్వరును మహాకైలాసమునకేగిరి. కాలగమనమున ఆ హంసలు వేదశాస్త్రార్ధసంపన్నులగు బ్రాహ్మణ కుటుంబములందు జన్మించిరి. దంపతులై యోగ ప్రవృత్తులై అనవద్య, నాథశర్మలుగా ప్రసిద్ధులై అనేకానేక శివక్షేత్రములు దర్శించి, కాశి, కేదార, నేపాల, గోకర్ణ, భువనేశ్వర, శ్రీపర్వత, త్ర్యంబకేశ్వర, విరూపాక్ష, కాళహస్తి, కంచి, శోణాద్రి, అంధకాసుర, సుదనేశ్వర, గోపర్వతేశ్వర, నవనీతేశ్వర, వృద్ధగిరీశ్వర, శ్రీమచ్ఛిదంబర సభ, బ్రహ్మేశ్వర, వైద్యనాథ, ఛాయావన, శ్వేతవన, అమృతకుభ, త్రయీవన, వాల్మీక, శ్రీవాంఛ, మధ్యార్జున, మయూరనాథ, పంపాపురి, వాతపురి, సేతునాథ, బలేశ్వర, నందీశ, శాలివాటి, శ్రీమద్బలాస్యనాధ, శ్రీకంఠ, మాతృభూతేశ, జంబీశ, బృహదీశ్వర, పంచనద, కుంభకోణ, వటకానన, హిమాచల, విధ్యగిరి, గుహ్య, మలయ పర్వతములు, గంగ పూర్వాపరములు, యమున పూర్వాపరములు, నర్మద, గోదావరి, కృష్ణవేణి, క్షీరనది, పినాకిని, హరితపురి, సంక్షేపముగ హిమాలయ, సేతుబంధములమధ్యగల మఖిలశివ క్షేత్రములు, మరుద్వధ, పూర్వాపరములతర్వాత, తాలకాననము చేరిరి. అక్కడ తాలవనేశ్వరుని పూజించి రాత్రికి అక్కడ విశ్రమించిరి. తాలవనేశ్వరమహేదేవుడు భక్త రక్షణకొరకు రక్తవర్ణ, ఆకుపచ్చ జటలతో అక్కడ కొలువుతీరినాడు. ఈ దంపతులు మహాదేవుని, నిర్మల భక్తితో ప్రార్ధించి తమను ఉద్ధరింపమని వేడగా, వారి స్వప్నమందు దర్శనమిచ్చి ప్రేమపూర్వక గంభీర స్వరముతో భక్తులారా! ఈ పర్వతపు నైఋతి కోణమున కావేరికి ఉత్తర తీరమున మీరు వెళ్ళి కార్తికేయుని ద్వారా ప్రణవజ్ఞానమును ఉపదేశము పొందుడు. ఆ నిర్ద్వంద శివ జ్ఞానముతో నా పదము జేరుదురు అని పల్కి అంతర్ధానము జెందేను.

తెల్లవారగనే దంపతులు లేచి మహాతీర్థమున స్నానమాడి, భస్మ రుద్రాక్ష ధారులై త్రిపుండ్రములు ధరించి పంచాక్షరి జపించి, రుద్రపారాయణ చేసి, పార్వతీ పరమేశ్వరులను మనసా స్తుతించి మీ ఆజ్ఞచే మేము వెళ్లి కార్తికేయుని ప్రార్ధించి వారి ఉపదేశము పొందుదుము, దయతో మీలో చేర్చు కొనుడని ప్రార్ధించి బయలుదేరి ధృడనిశ్చయముతో కార్తికేయుని పుర్వ భక్తులు అగస్త్యాది ఆచార్య వర్యులను చేరి నాల్గుదిక్కులు ప్రదక్షిణ చేసి నైఋతి కోణమున స్కందుని ఎదుట నిలిచి చేతులు జోడించి, స్వామీ మేము మీ శరణు జొచ్చినాము, దయతో మాకు దీక్ష నిచ్చి, మీ అధీనులమయిన మాకు సదా మీ పాదాబ్జముల సేవాభాగ్యము అనుగ్రహింపుడని దీనముగా ప్రార్ధించిరి. అపుడు కార్తికేయుడు తృప్తుడై వారితో ఇట్లనెను.

మీరు శివాజ్ఞచే నావద్దకు వచ్చిరి. పరశివ మహిమా రహస్యమును మీకు అనుగ్రహించితిని. ఈ క్షణమునుండి అఖిల శివజ్ఞాన ఆనంద బోధమీపరమైనదని ఆశీర్వదించిరి. ఆ దంపతులు పరమానందముతో షణ్ముఖుని కీర్తించి మనసా, వాచా, కర్మణా వారు తమ సర్వస్వము స్వామి కర్పించుకొని లీలా వినోదముగా శివక్షేత్ర దర్శనము కొరకు బయలుదేరిరి. కార్తికేయుడు మరల వారినుద్దేశించి, భక్తులారా! పూర్వజన్మలలో మీ ద్వారా కించిత్ శివాపరాధము జరిగిన కారణముగా, దాని నిర్మూలనతో సంపూర్ణ ఫలితమునకు మీరు వెంటనే కాశీ కేదార గుప్త తీర్థ సేవనము చేసి పరమ పదము పొందుడనెను. వెంటనే వారు కుమారస్వామి ఆజ్ఞ శిరసావహించి దారిలోని శివ క్షేత్రములను దర్శించుచు, వాని మహాత్మ్యమును గ్రహించి స్తుతించుచు చివరకు కాశీ కేదార క్షేత్రము చేరిరి. విశ్వేశ్వరాది సర్వదేవతలను, ఒంకారాది సర్వలింగములము, జ్ఞానవాపి మొదలగు తీర్ధములను సేవించుకొని పంచ క్రోశయాత్రలోని సర్వదేవతలను పూజించి చివరగా కేదార గుప్త తీర్ధము చేరి విధి పూర్వకముగా స్నానమాడి, పూర్వ జన్మలలోని శివాపరాధము, శివ జ్ఞానయోగులయడల తాము జరిపిన అపరాధములనుండి ముక్తులై, దీక్షా గురు శ్రీకార్తికేయ ముఖకమలమునుండి గ్రహించిన ఉపదేశమును విధివిధానముగా సాధన చేయుచు పరమేశ్వరుని యందు చిత్తము ఏకీకృతమొనరించి ఎండిన మానులవలె నిశ్చలమైన వారి నిరంతర తైలధారాపూర్వక ధ్యానమునకు సంతసించి పార్వతీ పరమేశ్వరులు ప్రసన్నులై వారికి తమ దేహముల నొసంగిరి. వారి అంశమును ఆ దంపతుల దేహములందు ప్రవేశింపజేసిరి. రుద్రకల్పము వరకు వారు దేహ ధారులై, కల్పాంతమున విదేహముక్తి బొందిరి.

కేశీ కేదారేశ్వరుని మహిమ అట్టిది. శివపార్వతుల లీలలు అపారము. మునులారా వినుడు, నా సద్గురు కృపచే నాకీ వేదరహస్యము బోధింపబడినది. నాథశర్మ, అనవద్యల జన్మవృత్తాంతము వినినవారికి జ్ఞానాంకరము ఉదయించి, మాయా వృతము విడివడి పక్వమైన ఫలము చేతికంది ముక్తులగుదురు. ఈ సద్రహస్య అమృతభాండమును మీకందించు సంకల్పము నాకు కల్గుట నాభాగ్యము. సంసార సముద్రమును అవలీలగా తరించు రహస్యము గ్రహించితిరి. ఉమాకాంత స్మరణతో మునులు సూతుని స్తుతించి, గురుదేవా! మాకు అనేక శివకథలు వినిపించితిరి. క్షేత్రమహిమలలో భేదము, భక్తులనుద్ధరించుటలో భేదము, రాజుల మనోవృత్తులలో భేదము, బ్రహ్మ సృష్టిలోనే భేదము. ఇవన్నియూ పూర్వాపరములెట్లు తెలిసికొనగలము? మీరు పౌరాణికిలుగా సకల పురాణముల వచించితిరి, ఈ భేదమెట్లు కల్గినది? ఇతిహాసములు జగత్ సత్యముగా భాసింపజేయుచున్నవి, సృష్ఠి, స్థితి, లయములలో కల్పభేదములు తెలియుచున్నవి? ఈ సంశయమును మానుండి దూరముచేయుడని కోరిరి.

అపుడు సూతుడు, మునులారా! ఒక్కొక్క కల్పమందు పరమాత్మ లీలా విశేషములు భిన్నముగా యుండును. బ్రహ్మాది కీట పర్యంతము వారి సంచిత పుణ్య పాపముల ననుసరించి భేదములు కల్గుచుండును. పురాణములలో భేదమున్నట్లు కన్పించునేగాని, వస్తుతః అట్టి భేదమేమియు లేదు. శాస్త్రములన్నియూ సత్యములే. కలగతి ననుసరించిన భేదమేకాని, శివమహిమలో మార్పులేదు. బుద్ధిమంతులు ఆదినుండి అంతము వరకు సవిస్తరముగ గ్రహించిన యడల ప్రేమ పూర్వకముగ శివుని భజించుట ద్వారా గ్రహించగలరు. బ్రాహ్మణ శ్రేష్ఠులారా! సంశయము విడిచి అన్ని విచిత్రకథలలోని తాత్పర్యము శివధామము చేరు మార్గము భక్తి ఒక్కటిగానే గ్రహించుడు. ఈ కథము విన్నవారు సద్గతిని బొంది శివధామము జేరుదురు.

Wednesday, April 22, 2009

26 వ అధ్యాయము

ఋషి పుంగవులు సూతుని, సత్యవతి పుత్ర వ్యాసభగవానుని ప్రియశిష్యులు, సర్వజ్ఞానులు, మీరు వినిపించు అమృతమును గ్రోలి మేము ధన్యులయగుచున్నాము. మహాత్మా ఇంతవరకు అనవద్యకు నాథశర్మ చెప్పిన దానిని మీరు మాకు వివరించుచున్నట్లు తెల్పుచున్నారుగదా! ఆ అనవద్య నాథశర్మలను శివజ్ఞాన దురంధరులు ఎవరు? వారి పూర్వజన్మ వృత్తాంతమేమి? వారికట్టి జ్ఞానమెట్లబ్బినది? వీనిని సవివరముగా తెలియజేయుడని ప్రార్ధింపగా సూతులవారిట్లు తెల్పిరి. నేనుకూడా ఈ రహస్యమును మా గురువునడిగి తెల్సికొంటిని. భగవాన్ బాదరాయణులు నాకిట్లు తెల్పిరి.

పూర్వకాలమున మానససరోవరమునందు ఒక హంసమిధునము విహరించుచుండెడిది. అవి అన్యోన్యప్రేమతో ఆనందముగా యున్నవి. ప్రతిదినము ప్రాతఃకాలమున, ఉదయము, మధ్యాహ్నము, సూర్యాస్తమయమునకు పూర్వము, కాయంత్రము, రాత్రి ఇట్లు షట్కాలములయందు ఆ సరోవరములోని తామరతూడులు తినుచు, రాత్రికి సరోవరము ఒడ్డునగల వటవృక్షమున అవి ఏర్పరచుకొనిన గూటిలో నిద్రించుచు కాలము గడుపుచున్నవి. యక్షరాజు కుబేరుడు తన స్త్రీలతో నిత్యము మానస సరోవర ప్రాంతమున విహరించి, అందు స్నానమాడు, హంకలు కాపురముచేయు అదే వటవృక్షముక్రింద శివార్చనకై రత్న నిర్మిత శివలింగము ప్రతిష్టచేసికొని, భస్మరుద్రాక్షధారుడై ఆలింగమునర్చించిన తర్వాత తన స్త్రీలతో తననగరము అలకాపురికి వెళ్ళుచుండెను.య హంసలు ఆహారమునకై సరోవరములోని స్వర్ణకమలములు వాని తూడులతో సహా చెట్టు పైకి తెచ్చుకొని షట్కాలములయందు వాని ముక్కులతో తూడులుతెంపి, స్వర్ణకమలములు క్రిందకు వదలు చుండినవి. ఆ కమలములు సరాసరి క్రిందనున్న రత్న లింగముపై పడి, ఆ పక్షులకు తెలియకయే షట్కాల శివ లింగార్చన స్వర్ణపుష్పములచే జరుగుచుండెను. తర్వాత హంసలు ఆ తూడులను తినుచుండెను. ఇట్లు నిత్య శివార్చన తర్వాత ఆహారము తీసుకొనుచున్న ఆ హంకలజంట కొంతకాలము జరిగిన తర్వాత, పార్వీ పరమేశ్వరులు, గజానను, షడానన, సర్వగణ సమేతులై వృషభారూఢులై మానస సరోవర తటమున విహారమునకు వచ్చిరి. వటవృక్షము క్రింద రత్న శివలింగముపై నాళరహిత స్వర్ణకమలములు ఒక్కొక్కటిగా పడుచుండుటచూచి, పార్వతి విష్మయమున శివునితో నాథా! ఇదేమి వింత? ఆకాశమున గాని, ఈ ప్రాంతమున గాని ఎప్పరునూ కన్పించుటలేదు, సహస్రనామార్చన చేయుచున్నట్లు ఈ స్వర్ణకమలార్చన ఎట్లు చరుగుచున్నదని అడుగగా, స్వామి నవ్వుచూ పార్వతీ సృష్ఠియందు ప్రాణుల గతి విచిత్రముగా యుండును. అది వాని కర్మపై ఆధారపడి యుండును. సత్కర్మకు సద్గతి, దుష్కర్మకు దుర్గతి కల్గును. కర్మఫలమనుభవించి ఆ జీవి ఆయుర్దాయము పూర్తికాగా యింకనూ కర్మఫలము మిగిలినచో మరల జన్మించవలయును. ఈ విధముగా జీవులు జనన మరణ చక్రమున తగుల్కొని పరిభ్రమించుచున్నారు. ఇది విచిత్రము. ఈ వటవృక్షముపైన చివర కొమ్మలలో ఆకులలో దాగి ఒక గూడు కన్పించుచున్నది చూడుము. అక్కడనుండి ఈ మహాలింగార్చన జరుగుచున్నది. అని శివుడు చెప్పగా పార్వతి ఆశ్చర్యముతో పైకి చూడగా వృక్షముపైనున్న గూటినుండి పుష్పవర్షము కురియుచున్నది.

అపుడు పార్వతి స్వామితో నాథా! పక్షులలో ఇట్టి దుర్లభమగు అనన్య భక్తి ఎట్లు సాధ్యము? ఈ పక్షులు ఈపూజ తెలిసి చేయుచున్నవా? లేక తెలియక యధాలాపముగా జరుగుచున్నదా? విధి వశమున జరుగుచున్నదా? నాకు వినకుతూహలముగా యున్నది. ఇవి భక్తితో చేసినచో తప్పక శివపదము బొందగలవు. తెలియక చేసిననూ ముందు జన్మలలో సద్గతి కల్గును. లేక పూర్వజన్మ సుకృతమున ఇట్లు జరుగుచుండవచ్చును. ఎట్లయిననూ జంతువులకు దుర్లభమయిన మీ పూజ జరుగుచున్నది. దీనివలన అవి తరించుట నిశ్చయము. కాన స్వామీ నాకు వివరముగా తెల్పుడు. పూర్వజన్మలలోని ఏ పుణ్యమున మీసేవా భాగ్యమబ్బినది? ఏపాపము వలన వీటికి పక్షిజన్మ కల్గినది? మీ లీల విచిత్రముగదా!

దేవీ వినుము. వీని పూర్వజన్మ విశేషము, నా పూజా ప్రభావము తెల్పుచున్నాను. భ్రమరాంబా సమేతుడై శూలపాణి విహరించిన మల్లిఖార్జున స్థానమగు శ్రీపర్వతమున ధర్మగుప్తుడను శివజ్ఞాని నివశించుచుండెను. అతడు త్రికాలములయందు మల్లిఖార్జునుని సేవించుచుండెను. ఒకలేడి సమీపమందలి వనములనుండి పారిపోయివచ్చి ధర్మగుప్తుని ఆశ్రమమునకు చేరెను. అతడు దానిని చూసి పుత్రవాత్సల్యముతో దానికి పచ్చి గడ్డిపరకలు, నీరు అందించుచు కాపాడుచుండెను. అతనితోపాటుగా ఆ లేడిపిల్ల అక్కడి బ్రాహ్మణుల కూటీరములలో తిరుగుచు, అతనితోపాటు త్రికాలపూజలకు భ్రమరాంబా, మల్లిఖార్జునులను దర్శించుచుండెను. పూజముగియగనే ధర్మగుప్తుడు ఆ హిరణమునకు, శివ ప్రసాదము భస్మమును చల్లి, అమ్మవారి ప్రసాదము పుష్పములు అలంకరించుచుండెను. ఒకరోజు ఆ మగలేడి తనసహవాసము కొరకు వనమునుండి మరియొక ఆడలేడిని తెచ్చుకొని రెండునూ ఆడుకొనుచు, తిరుగుచు బ్రాహ్మణునకు ఆనందము కల్గించుచుండెను. ఒకనాడు ఆశ్రమ గోవులతోపాటుగా ఆ లేడి జంట వనమునకు వెళ్లి మరల తిరిగి రాలేదు. ధర్మగుప్తుడు విచారముతో వనమంతయూ వెతికినను అవి కన్పించనందున అవి ఏమైయుండును? వేటగాండ్రు ఎవరయిన చంపి తీసికొనివెళ్లిరా? సరస్సులో నీరుత్రాగుటకు వెళ్లి పడిపోయినవా? కొట్టుకొనిపోయినవా? అడవి మృగములబారి పడినవా? నేనెంత మూఢుడను, వానిని పెంచితినేగాని రక్షింపలేకపోతిని. అవి చనిపోయినచో నాకు హత్యాదోషమాపాదింపబడునేమో? ఏమైననేమి చేయగలమని మిన్నకుండెను.

కాలగతిన ఆ లేడి జంట చనిపోయి, వాని పలకునికి క్లేశము కల్గించిన కారణమున మరుజన్మలో వింధ్యపర్వతముపై కిరాత భార్యాభర్తలైరి. ధర్మగుప్తునిచే నిత్యము శివపూజా భస్మము, నిర్మాల్యపుష్పముల అలంకరణచే ఆ మిథునము ఆ బ్రాహ్మణునితోసహా శివపదము చేరియుండవలసినదే, కాని పూర్వజన్మ దుష్కృతముచే విఘ్నము గల్గినది. ఆ విషయము కూడ తెల్పుదునని శివుడు పార్వతి కిట్లు తెల్పెను.

అంతకు పూర్వజన్మలో ఈ లేడి మిథునమే ప్రభాస తీర్థమున బ్రాహ్మణ దంపతులు. ఇద్దరునూ దుష్టులే. దొంగతనము చేసి పొట్ట పోసుకొనుచుండిరి. అక్కడ శంభువిజ్ఞానవంతుడను ఒక శివజ్ఞాని యోగి యుండెడివాడు. ఒకనాడు ఈ దుష్ట బ్రాహ్మణ దంపతులు ఆ శివజ్ఞాని సొమ్ము అపహరించి దొరికిపోయిరి. కాని ఆ యోగి వారిని మందలింపక దయతో అతని యింటిలోనే పనిచేయుటకు నియమించుకొనెను. వారు కొన్ని రోజులు అతనిని మంచి చేసుకొని కేవలు చేయుచు ఒకరాత్రి అతని డబ్బు, నగలు, వస్త్రములు మొత్తము దొంగిలించి ఆ ప్రక్క అడవిలోనికి పారిపోయిరి. అడవిలోని అసలు గజ దొంగలు వీరివద్దనున్న మొత్తము దోచుకొనిరి. ఈ దంపతులు వేరు దిక్కుగానక బిచ్చమెత్తుచు దేశదేశములు తిరుగజొచ్చిరి.

శివజ్ఞాని తన ద్రవ్యమంతయు అపహరింపబడినను, ఆ దంపతులను నిందింపక, వైరాగ్యముచే భోగభాగ్యములు క్షణ భంగురములయినను అజ్ఞానముచే వారట్లు చేసినందులకు వారిని క్షమింపమని భగవంతుని ప్రార్థించెను. వారు దుష్ట బుద్ధులయినను నా సేవ చేసిన సమయమున, నా దైవకార్యములకు కొంతయినను సహాయము చేసి యుండ వచ్చును గదా! ఆ కొద్ది పుణ్యమున వానికి మంచి జరుగు గాక! యని భగవంతుని ప్రార్థించిన కారణమున భక్త సులభుడగు పరమాత్మ తన భక్తుని కోరిక మన్నించుటకుగాని, ఆ దంపతులు చేసిన పాపములకు వారు ఒక కల్పకాలమునకును ఉద్ధరింపబడకపోయినను వారిపై కృపా దృష్టితో రెండు, మూడు జన్మల తర్వాతనే లేడి జంటగా అగునట్లు తలంచెను. మృగములుగా జన్మించినను పూర్వ జన్మ వాసనా ఫలమున వాటిని కాపాడి పోషించిన ఆ మునికి మనస్తాపము కల్గించి పారిపోయినవి. ఆ పాపమున మరుజన్మ కిరాత దంపతులైరి. కాని ఆ లేడి మిథునమునకు సద్గతి కల్గువలెనను ధర్మగుప్తుని కోరికపై కిరాత దంపతులకు మానస సరోవరమున జీవించు హంసల జన్మ కల్గినది. ప్రతి జన్మలోను ఈ దంపతులపై శివభక్తుల అనుగ్రహమువలన ఆ భక్తుల అభీష్టము నెఱవేరుటకై హంసలకు రత్నమయ శివలింగముపై స్వర్ణకమలములచే పూజచేయు భాగ్యమబ్బినది. కనుక వీటిక మరుజన్మలో నాపదమబ్బునని శివుడు పార్వతికి తెల్పెను.

ఈ కథ ద్వారా శివపూజ కన్ననూ శివభక్తుల సేవచే పరమాత్మ ఎక్కువ ప్రీతి చెంది సద్గతి కల్పించునని తేట తెల్లమయినది. పార్వతి పరమాశ్చర్యముతో నాథా! మీ కృపాపాత్రులైన మీ భక్తుల మనోభీష్టము నిర్వర్తించుటకు ఎట్టి పాపాత్ముల నయినను మీరు ఉద్ధరింతులు. మరి ఈ పక్షులు వాటికి తెలియకనే, వాటి పూర్వజన్మ పుణ్య విశేషములేకనే, వాటిపై మీ భక్తుల అనుగ్రహము వలన కల్గిన పుణ్యమువలన మిమ్ము పూజించు ఈ సత్కర్మ ఫలితముగా వారి మరుజన్మ ఏమగును, విన కుతూహలముగా నున్నదని పార్వతి చేతులు జోడించి, స్వామి చరణములకు నమస్కరించి ప్రార్థింపగా స్వామి సంతసించెను. మరల పార్వతి స్వామీ! మీ భక్తుల మహిమ అపారము. బ్రహ్మ, విష్ణు, ఇంద్రుల మహిమను కూడ నష్టపరచును. పర్వతములు వారికి దాసులు. సముద్రము నీటి బిందువంత యగును. కాలమే నష్టమగును. కైలాసము బంతి యగును. విష్ణు చక్రము కంఠమాల యగును. చంద్ర సూర్యులు వెన్నముద్దలగుదురు. త్రిమూర్తులు పసిపాపలగుదురు. జగత్తు తృణభంగురమగును. తృణమే వజ్రమగును. మీ భక్తుల మహిమ మీకు మాత్రమే తెలియును. గనుక ఈ పక్షుల మరుజన్మ ఏమగునని ప్రార్థించెను. ఈ ఆఖ్యానము శివభక్తి పూర్వకముగ వినినవారు పాప సముద్రమునుండి విముక్తులై శివధామము చేరుదురు.

Monday, April 20, 2009

25 వ అధ్యాయము

ఋషి పుంగవులు సూత పౌరాణికుని ద్వారా చంద్రవాన్ అను రాజు వృత్తాంతము వినగోరి, మహాత్మా ఆ చంద్రవాన్ అను రాజు వామదేవ, సనత్కుమారులనుండి శివరహస్యమెట్లు తెలిసికొనెను. అతడెవరు? అట్లు శివరహస్యజ్ఞానము పొందియూ, కాశీని, కాశీలోని శివలింగములను ఏల నిందించెను. అయినను అతనికి శివానుగ్రహము ఎట్లు కల్గినది? వివరింపగోరగా సూతుడు చెప్పదొడగెను.

పూర్వకాలమున హిమాచల ప్రాంతమున నేపాల బ్రాహ్మణుడొకడు పశుపతినాధుని షట్కాలపూజలు చేయుచుండెను. అక్కడ శివతత్వజ్ఞాని శివశర్మయును ఒక బ్రాహ్మణుడు ఒడలంతయూ భస్మము ధరించి, నుదుట త్రిపుండ్రములు, మొడలో రుద్రాక్షమాలలు ధరించి సదాశివ పంచాక్షరీజపము, రుద్రపారాయణ చెయుచు నియమముగా త్రిసంధ్యలయందు శివలింగార్చన చేయుచుండెను. శ్రద్ధగా నిత్య నైమిత్తిక కర్మలాచరించుచు సదా పశుపతినాథునియందే మనసు లగ్నముచేసిన వాని కుటుంబమునకు సేవచేయుటకు అకలితో బాధపడు ఒక భిల్లుడు వారింట చేరెను. నిష్కపట భావముతో ఆ బ్రాహ్మణుడు చెప్పిన పనులన్నియూ చేయుచుండెను. ఒకసారి వేరుపనిలో నిమగ్నమయిన అతడు ఆ బ్రాహ్మణునికి నిందాపూర్పకముగా సమాధానమిచ్చెను. కాని శాంతపరుడయిన ఆ బ్రాహ్మణుడతనిని ఏమియు చేయక క్షమించియుండెను. పశుపతి నాథుడు ప్రసన్నుడై ఆకాశవాణి రూపమున ఆ బ్రాహ్మణునితో, భక్తా! నీ త్రికాలపూజలకు, భక్తి శ్రద్ధలతో నీవుచేయు శ్రౌత, స్మార్త కర్మానుష్ఠానములకు నేను తృప్తుడనయితిని. నీకు అవరోక్ష జ్ఞానము కల్గును, రాబోవు జన్మలో నీవు అట్టి జ్ఞానముచే నా పదము జేరుదువు అని పల్కగా ఆ బ్రాహ్మణుడు ఆకాశవాణి వాక్యమును శివాజ్ఞగా స్వీకరించి విరక్తుడై శరీరమును సుష్కింపజేసి తపోనిరతుడై ప్రాయోపవేశమున శరీరమును చాలించెను. అతడే మరుజన్మలో గర్గమహర్షిగా జన్మించెను. అతని పత్ని ప్రఖ్యాత ఉపనిషద్జ్ఞానవ్త్త బ్రహ్మవాదిని. యాజ్ఞవల్కాది మునులకును ఆమె వ్యాఖ్యానమును గ్రహించుట కష్టమయ్యెడిది. పూర్వజన్మమున కూడ వారు భార్యా భర్తలు. వారి సేవకుడగు భిల్లుడు మరు జన్మలో రాజుగా జన్మించి హిమాచల ప్రాంతమునకు రాజయ్యెను. అతడు బ్రాహ్మణుడు, ధర్మపరాయణుడు, పరాక్రమవంతుడు, కీర్తిమంతుడు. అనేక యజ్ఞములు చేసెను. గర్గముని తన త్రికాల జ్ఞానముచే ఆరాజు క్రితము జన్మలో తమ సేవకుడగు భిల్లునిగా గుర్తించి అతనిని ఉద్ధరింపనెంచి రాజుకడకు వెళ్లి ఆత్మజ్ఞానోపదేశము చేసెను. ఆ జ్ఞానముతో రాజు విరక్తుడై గర్గమునితో మహాత్మా నేను నాకుమారునకు రాజ్యమిచ్చి తపస్సుకు పోవుదును. తగిన స్థలమునిర్దేశించుడని కోరెను. గర్గుజు అతనిని కేదారము వెళ్లి తపమాచరింపమని చెప్పి, రాజా నీవు అచట తపస్సిద్ధి పొందుదువు. కాని నీ పుర్వజన్మకృత ప్రారబ్దమున ఒక ఉపాధి యున్నది. అది లేనియడల ఈ జన్మమందే ముక్తి గలదని చెప్పగా, రాజు స్వామీ ఆ ఉపాధికి కారణమేమని అడిగెను. గర్గముని రాజా నీవు పూర్వజన్మమందు ఒక శివజ్ఞాని బ్రాహ్మణుని ఇంట సేవకుడగు భిల్లుడవు. ఒకనాడు అన్యమనస్కుడవై యజమానిని నిందించితివి. ఆ దోషమున ప్రారబ్ది ఫలమునుభవింపక తప్పదని తెల్పెను. వెంటనే రాజు ఆ గర్గముని పాదములపై బడి విలపించి మహాత్మా మీరు తపోబల సంపన్నులు. నా ప్రాహబ్దమును తప్పింపగల శక్తి మీకు గలదు. కనుక నన్ననుగ్రహింపుడని వేడగా, గర్గముని అతనిని తన చేతితో నిమిరి, శంకరుడు కరుణాసముద్రుడు, దీనజన బాంధవుడు. నిన్ను తప్పక అనుగ్రహించును, వెళ్ళి నిష్ఠగా తపము చేయమని దీవించి పంపెను. రాజు కఠోర తపమాచరించి ఆకాశవాణి రూపమున శివకృపకు పాత్రుడాయెను. శివ రహస్యము శివునకే ఎఱుక. శివభక్తుల మహాత్మ్యము వర్ణింపనలవిగానిది. సేవకుని రాజును చేసినది. సేవకుని దూషణతను సహించినను దాని ఫలితము తపస్సిద్ధికి ఆటంకమగుటయు మరల ఆ శివభక్తుని దయవల్లనే అది తొలగి శివకటాక్షమునకు పాత్రుడగుట శివ లీలామృతము. దీనిని వినినవారు, చదివినవారును జన్మపర్యంతము చేసిన పాపములు క్షణములో నశించి భోగములననుభవించి ముక్తి బొందుదురు.

Sunday, April 19, 2009

23వ అధ్యాయము

మునులు సూతుని ఇట్లడిగిరి. తమరు సర్వజ్ఞులగు వ్యాస శిష్యులు. కనుక మీరు మీ గురువు ద్వారా వినివ విధముగా సనత్కుమారులు బ్రహ్మదేవునుండి ఎట్లు ఉత్పన్నమయిరి? ఎప్పుడునూ 5 సంవత్సరముల బాలకునివలె నుండుటెట్లు జరిగెను? సర్వజ్ఞులెట్లయిరి? తెల్పుడనగా, సూతుడుమునిబృందములకిట్లు తెల్పెను. పూర్వము అనవద్య తన పతియగు నాథశర్మనీవిషయముతో పాటుగా, వామదేవుని వృత్తాంతమునుగూడా అడుగగా నాథశర్మ ఇట్లు తెల్పిరి.

పూర్వము ఒక కల్పాంతము తర్వాత మరల కొత్త బ్రహ్మగారు సృష్ఠి చేయు నిమిత్తము 10 వేల సంపత్కరములు ఏకాగ్రమనస్కులై తపమాచరింపగా పరమేశ్వరుడు సంతృప్తిజెంది గంభీరనాదముతో వరము కోరుకొమ్మనిరి. బ్రహ్మదేవుడు శంకరునికి నమస్కరించి, పరమాత్మా! మూడు లోకముల సృష్ఠికొరకు మీ భక్తుల ద్వారా నేనాపని నిర్వర్తింతును. వారు నాకుమారులుగా నా కార్య సాధనకు సమర్ధులు, సర్వజ్ఞులు గావలయును అని ప్రార్థించిరి. శంకరులు పద్మాసనా! దుర్లభమగు వరము కోరితివి. కాని సృష్టి కార్య నిర్వహణ కొరకు నేను నాభక్తులను నిర్దేశింతునని తెల్పి విఘ్నేశ, వీరభద్ర, నందికేశ, కుమార, మహాకాలులను అయిదుగురను పిలిచి, సృష్ఠి కార్యము కొరకు బ్రహ్మ మిమ్ములను తన కుమారులుగా కోరుచున్నాడు. మీకుకూడ అట్టి కోరిక గలదేని జగద్వస్తారము చేయుడనగా, వారు పరమాత్మా తమ ఆజ్ఞ బలవత్తరమయినది గనుక మేము బ్రహ్మదేవుని కుమారులముగా వ్యవహరింతుము కాని సృష్ఠి విషయమున గాదు. బ్రహ్మ తలచినవెటనే మేము ఉద్భవింతుమనిరి. బ్రహ్మ సంతుష్టుడై సత్యలోకము చేరెను. పరమాత్మ అంతర్హితులైరి. వారైదుగురునూ అంతర్హితులైరి.

బ్రహ్మ సృష్ఠి జేయ తలంచినవాడై శివభక్తులను తలంచగా విఘ్నేశ్వరుడు సనకుని రూపమున బ్రహ్మ మనస్సునుండి ఉద్భవించెను. వీరభద్రుడు సనందునిగా, నందీశ్వరుడు సనాతనునిగా, కార్తికేయుడు సనత్కుమారునిగా, మహాగాలుడు సనత్సుజాతునిగాను 5 సంవత్సరముల బాలకులుగా బ్రహ్మ మానస పుత్రులుగా ఉద్భవించిరి. కాని సదా శివనామ స్మరణముతో వేరు భావము మనసున రానీయక, విరక్తులై నిత్య తృప్తులుగా నుండిరి. బ్రహ్మ వారిని చూచి పుత్రులారా! మీరు దేవ, మనుష్య, పశు, పక్ష్యాదులను పుత్ర, పౌత్ర, ప్రపౌత్ర సంతతిగా వర్థిల్లజేసి సృష్ఠికార్యము జేయుడని తెల్పగా వారు శివధ్యానపరులై మూగ, చెవిటివారుగా బదులు పల్కక మిన్నకుండిరి. బ్రహ్మ వారిని చూచి, వీరు సృష్ఠికి సహకరింపరని ఎంచి, మరల నూరు సంవత్సరములు తపమాచరించెను. కాని మానసిక తపోబలమున సృష్ఠి జరుపలేక ఎన్నోమార్లు తపమాచరించి విఫలులైరి. అపుడు దీర్ఘముగ ఆలోచించి మైధున సృష్ఠిద్వారా జగత్తును నింపివేసి సంసారిగా మారెను. సనకాదులు మహా మహిమాన్విత రుద్రగణములు. ఇందు నాల్గవ వారు సనత్కుమారులు కార్తికేయుని అంశగా ప్రసిద్ధులు. మూడు లోకములందుని వారి ప్రజ్ఞను తెలిసినవారు లేరు. వైరాగ్యము, బ్రహ్మనిష్ఠ ఎట్టిదో లోకమున చాటుటకు శివుడే ఈ రూపము దాల్చెనా యన్నట్లుందురు. ఎప్పటికిని 5 సంవత్సరముల బాలుని వలె స్వర్గ, మర్త్య, పాతాళ లోకములందును, బ్రహ్మ, విష్ణు, రుద్రలోకములందును వీరు ఎక్కడ సంచరించిననూ అడ్డువారు లేకపోగా అందరునూ వినమ్రులై నమస్కరింతురు. వీరి శాప ప్రభావమున విష్ణు ద్వారపాలకులు జయవిజయులు జగత్తునందు జన్మించి శాపావసానంతరమున ముక్తులై శివపదము పొందిరి. లోక సంరక్షణార్ధము వీరు మానసమందు పరమేశ్వరుని తలంచుచు మనోవేగమున సంచరింతురు. ఈ కథను విని అనవద్య తన ప్రాణనాధుడు నాథశర్మను ఇట్లడిగెను. స్వామీ విష్ణుద్వారపాలకులు శాపోపహారము తర్వాత శివపదము పొందుటేమి? యనగా నాథశర్మ, ప్రియా శివరహస్యమెఱిగిన వారికే ఈ విషయము తెలియును. వినుము.

తొల్లి విష్ణుమూర్తి శంకరుని ప్రార్థించి స్వామీ మీ ద్వారపాలకులు నన్ను రక్షించువారినిగా జేయుడని కోరగా శివుడు కరుణించి తన ద్వారపాలకులు సుభద్ర, భద్రలనువారిని పిలిచి మీరు విష్ణుమూర్తి ద్వారపాలకులుకండని ఆజ్ఞాపింపగా, వారు శివుని ప్రార్థించి స్వామీ మాకు మరల మీచరణ సేవాభ్గ్యమెప్పుడు? పరమాత్మా మీ ఆజ్ఞను ఉల్లంఘించిజాలము, మీ నిత్య దర్శన, సేవనువిడువజాలము. ఇట్టి సంకట స్థితిలోనున్న మమ్ము కరుణింపుడని వేడగా, శంకరులు మీరు ఒక కల్పకాలము విష్ణువున్నంతవరకు అతనిని సేవించుచుండగా నా అంశతో సలక సనందనులు మీకు శాపమిత్తురు. ఆవ్యాజమున మరల నావద్దకు చేరుదురని ఊరడించిరి. నాసేవక భక్తులను నేనెక్కడనియమించిననూ వారొక్క అంశతో మాత్రమే అక్కడకు వెళ్ళి చివరగా మరల నన్ను చేరుదురు. ఇట్లు బ్రహ్మ, విష్ణు, రుద్రులు కూడా నాచే సృష్ఠి, స్థితి, లయ కార్యములకు నియమింపబడి, ఒక అంశతో వెళ్లి ఆ కార్యక్రమముల కల్పాంతమున మరల వచ్చి నన్ను చేరుదురు. కనుక వారు నా అంశతో నాకును వారికినీ భేదము లేదని తెలిసికొనుడు. అట్లే మీరు కుమారముని శాపమున మూడు జన్మలకాలము నన్నే తలంచుచు చివరకు మరల నన్ను చేరగలరు. అని పంపగా వారు విష్ణు ద్వారపాలకులు జయ, విజయులుగా, దేవాసుర యుద్ధములందు విష్ణు భక్తులకు విష్ణువుకు విజయము చేకూర్చుచుండిరి.

ఒకపరి సనకాది మహర్షులు లోక సంచారముచేయుచు విష్ణులోకమునకు వచ్చిరి. అపుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఏకాంతమున శివమహిమలను చెప్పుచుండిరి. ద్వారపాలకలగు జయ, విజయులు అనుమతి లేనిదేలోనికి వెళ్లరాదని సలకాదుల నడ్డగించిరి. అపుడు మునులు వారిని చూచి, ఊర్ధ్వ, అధో లోకములందెక్కడనూ మాకడ్డునిలుచు వారు లేరు. మీరు దేవ, మానవ, రాక్షస ప్రవృత్తులుగా మమ్ము నిలువరించిరి గనుక మీరు మూడు జన్మలలో అట్టి ప్రవృత్తులుగలవారగుదురని శపించిరి. ఇది గమనించిన లక్ష్మీ నారాయణులు వారే ద్వారము కడకు వచ్చి మునులను సాదరముగ ఆహ్వానించి అర్ఘ్య పాద్యములతో పూజించి స్తుతించుట చూసి జయ విజయులు తమ శాపోపసంహారమునకై వారిని ప్రార్థించిరి. మునులు యోచించి, తమ నోటి ద్వారా అట్టి వాక్యములు వచ్చుట శంభుని ఆజ్ఞగా తలంచి, విధి బలీయము గనుక మీరు మూడు జన్మలలో దైత్య, రాక్షస, మానవులుగా జన్మింతురు. శివ కృపచే మేము ఆ జన్మలలో మీకుమారులుగా ఉద్భవించి మిమ్ము ఉద్ధరింతుము. అని చెప్పి లక్ష్మీ నారాయణులము కూడ వారిని ఉద్ధరింపగోరిరి. అపుడు లక్ష్మీదేవి ఆలోచించి, పరమేశ్వరుని ఆజ్ఞ వలన నేను కూడా వీరిని ఉద్ధరించుటకు ప్రయత్నింతును. వీరి రెండవ జన్మలో వారిచే ఆశింపబడి విష్ణుమూర్తి ద్వారా వారిని ఉద్ధరింతుననెను. సనకాదులు జయ, విజయుల నూరడించి వెడలిపోయిరి.

శాప పర్యవసానమున వారు మొదటి జన్మలో హిరణ్యాక్ష, హిరణ్యకశపులైరి. సనక మహర్షి హిరణ్యకశపుని కుమారుడు ప్రహ్లాదునిగా విష్ణువును ప్రార్థించగా, విష్ణుమూర్తి తన శక్తిచాలక శివుని ప్రార్థించెను. పరమాత్మ నృశింహరూపమున విష్ణువులో ప్రవేశించి హిరణ్యకశిపుని, వరాహరూపమున ప్రవేశించి హిరణ్యాక్షుని వధించి ఉద్ధరించిరి.

రెండవ జన్మలో వారు రావణ, కుంభకర్ణులైరి. లక్ష్మి సీతాదేవిగా రావణునిచే బంధింపబడి, విష్ణుమూర్తి రామావతారముతో రావణుని వధించుటకు అగస్త్యునిచే ఆదిత్య హృదయరూపమున శివుని ప్రార్థించి ఆ శక్తితో రెండవ జన్మలో రావణ కుంభకర్ణులను ఉద్ధరించిరి.

మూడవ జన్మలో భద్ర, సుభద్రులు ఒక అంశతో జయ విజయులుగా విష్ణు ద్వారపాలకులైరి. చివరకు కల్పాంతమున ఆ విష్ణువుతో సహా మరల శివపదము బొందిరి. (ఇక్కడ ఏదో తేడా వచ్చింది చూడగలరు ...)

సనకాదులు అనేక కోటి బ్రహ్మాండములు శివధ్యాన పరులై వేరొండు తలంపక శివజ్ఞానులయిరి. ఈ రహస్యము శివుడు పార్వతికిని, స్కందుడు నాథశర్మకును తెల్పిరి. నాథశర్మ అనవద్య కిట్లు తెల్పి శివ రహస్యము అత్యద్భుతము. సనకాదులు బ్రాహ్మ మానస పుత్రులైననూ అనన్య శివభక్తి పరాయణులు. శివ మహాత్మ్యము విచిత్రము. శివయోగుల లీలను కూడ విచిత్రములు

22వ అధ్యాయము

ఋషులు సూత పౌరాణికుని ప్రార్థించి వామదేవుడు సనత్కుమారునిద్వారా వినిన శివరహస్య మేమని అడిగిరి. సూతుడిట్లు చెప్పిరి. సనత్కుమారుడు వామదేవుని మహాత్మా! మీ దివ్య పరిజ్ఞానముల పాపములంది మిక్కిలి గొప్ప పాపము, ఎట్టి కర్మలవల్లనూ నివృత్తి గాని పాపమేది యని అడిగిరి. శివాపరాధమునకు మించిన పాపము, ఎట్టి పుణ్యకార్యములవల్లనూ రహితము గాది. పదివేల ప్రాయశ్చిత్తముల వల్లనూ అట్టి పాపము ప్రక్షాళితముగాదు. అనగా సనత్కుమారులిట్లు తెల్పిరి. కలియుగము పాప భూయిష్టము. పాపభీతి గలవారు తక్కువ. ఉచితానుచితములు తలంపరు. కేవలము ఇంద్రియ, జిహ్వ సుఖ నిరతులు. సత్య, త్రేతా, ద్వాపర యుగములందు ధర్మలోపము లేదు. కలియుగమున మానవులు కుటిలాత్ములై అధర్మపురలగుట వలన శంకరుని కృపలేనిదే వారు తరించు మార్గము లేనందున దయామయుడై శంకరుడు కాశీలో విశ్వనాథుడుగా, గంగ, మణికర్ణికలను పాప ప్రాయశ్చిత్తార్మేర్పరచి, తన యడల, తన భక్తులయడల చేయు అపరాధముల నివృత్తికై తానే కేదారేశ్వరుడై ఈ రహస్యమును మొదట గౌరీదేవికి చెప్పెను. కనుక శివాపరాథ, శివభక్తాపరాథ నివారణ కేవలము ప్రాచీన మణికర్ణిక, గుప్త తీర్థము మాత్రమే. అంతియేగాక తన చుట్టూగల తన అంతర్గ్రుహమున భైరవదండనయునూ లేక పాపులను గూడ తారకమంత్రముచే ముక్తులను చేయుచున్నాడు.

వేరెక్కడనూ పదివేల కల్పములయిననూ తీరని శివాపరాధము కాశీలో ఆజన్మయందే ఉపశమించి ముక్తి గల్గుట తథ్యము. కాశీకేదారునికి ఒక్క బొట్టు గంగాజలము, ఒక్క పుష్పము సమర్పించినవారికి మోక్షద్వారములు తెరుచుకొనును. ఒక దీపము వెలిగించినవారికి జ్ఞానదీపముచే అవిద్య తొలగును. ధూపమిడినవారికి జన్మజన్మాంతరముల కర్మవాసలము దుర్గంధము వీడిపోవును. మంత్రయుక్త పూజనాచరించిన వారిని కేదారేశ్వరుడు ముక్తినొసంగును. ఛత్ర, చామరాది సర్వష్డశోపచారములు చేసినవారిని రుద్ర కన్యలు సపర్యలు చేయుదురు. మహాపూజ చేసిన వారిని రుద్ర గణములు పూజింతురు. కేదారాలయమున భిక్షులకు అన్నపానీయములిచ్చినవారు శంకరుని దయాసముద్రమున తేలియాడుదురు. జీవితమున ఒక్కమారయినను కాశీ కేదారనాథుని పూజించినవారు పునరావృత్తి రహితులగుదురు. వీభూతి రుద్రాక్షధారులై రుద్ర పాఠమాచరించిన వారు అంబికా సహిత శివదర్శనము పొంది శివపదము చేరుదురు. శివ, కేదార, కేదార, కేదార యను ధ్వని మొక్షలక్ష్మితలుపులు తట్టు ధ్వని యగును. ఇది శృతి, స్మృతులవచనము. ఎట్టి సందియమును లేదు. అర్ఘ్య, పాద్య, ఆచమనీయ, మధుపర్కముల మంత్ర ధ్వని అట్టివానిని దేవతను తమలోకములకు తీసికొని వెళ్ళుటకు చేయు భేరీధ్వనియగును. కేదారేశ్వరుని ఎదురుగా పురాణము చెప్పువారు, చెప్పించువారు, వినువారు మోక్షలక్ష్మి తమను వరించుటకు వచ్చునపుడు కాలియందియల ధ్వనిగా తలంచవలయును. కేదారము నాల్గు ప్రక్కల ఉన్నవారిని ఒక్క గ్రాసము ఆతిథ్యమునకు పిలుచు ధ్వని ఆతిథ్యమిచ్చు వారిని కైలాసమునకు ఆహ్వానించు ధ్వనిగా తలంచవలయును. కేదారేశ్వరుని స్తోత్రమంత్ర ధ్వని వారనిని కైలాసము తీసికొనివెళ్లునపుడు చేయు భేరీ భజంత్రీల ధ్వనిగా తలచవలయును. కేదారేశ్వరుని పూజించు భాగ్యమునకు నోచుకొననివారు విశ్వేశ్వర సారూప్యము బొందుదురు. ఇందు సందేహము లేనేలేదు. కేదారేశ్వరుని చుట్టునూ అగణిత లింగసమూహము గలదు. అవి దేవ, దానవ, దైత్య, నాగ, రాక్షస, అకుర, రాజ, మునివర్యులు, అప్సరసలు స్థాపించినవి. ఇవి ఐశ్వర్య, భుక్తి, ముక్తులనొసగునవి. కేదారేశ్వరునికి తూర్పున శ్రీకరకంఠ నామముతో సముద్రుడు స్థాపించినది, దానికి తూర్పున మయూర లింగము, వరుణ, సింహ, జారవ్య, మాయేశ లింగములు గలవు. ఇవి కొన్ని లుప్తములు, కొన్ని అదృశ్యములు.

కశ్యపుని కుమారులు శూరాదులు కార్తికేయునిచే నిహతులై స్వామి అనుగ్రహమున శిఖి, కాలజ్ఞాని అనుపేర్లతో స్వామివారి వాహనము, ధ్వజముగాను, తారకాసురుడు పూర్వ జన్మ తపోబలముచే స్వామి గజవాహనముగాను, అమ్మవారి సింహవాహనముకూడ పూర్వ జన్మ తపోవిశేషమున గల్గినదే. వీరి సోదరి అజ నామకురాలు, తల్లి మాయాదేవి కూడ శంకరుని విరోధించి స్కందుని ఆగ్రహమునకు గురై మరల వారి ప్రార్థనల నాలకించి కాశీలో ప్రాచీన మణికర్ణికలో స్నానమాడి విధి విధానముగా కేదారేశ్వరుని పూజించి, వారి పేర్లతో లింగములు స్థాపించి పాపరహితులై మరల కార్తికేయుని దర్శించి, అమ్మవారిని ప్రార్థించి శివాజ్ఞచే ముక్తులైరి. వారి కుమారులు కూడా ఉపాసనా ఫలముగా వారి ఇష్టదేవతల పేర లింగములు స్థాపించిరి. మరియు నాల్గు వర్ణముల స్త్రీ, పురుషులు స్థాపించిన లింగములును గలవు. గౌరీతీర్థమున గౌరీదేవి, లక్ష్మి, వ్యాస, భార్గవులు స్థాపించిన లింగములు గలవు. సనత్కుమార, గంగ, యుము, సరస్వతులు స్థాపించిన లింగములు త్రినదీశ్వర నామములతో గలవు. ఈ విధముగా పదివేల లింగములు గంగలోని, తీరమునను గలవు.

దక్షిణ భాగముల అసంఖ్యాక లింగములు గలవు. చిత్ర కేతు, చిత్ర రధ, చిత్రాంగద, విచిత్రక, సీత, లక్ష్మణ, శత్రుఘ్న, హనుమాన్, భరత, వానర, జాంబవంత, లంగురులు స్థాపించిన లింగములు, మహాతేజస్వి రామచంద్రుడు, అన్యరాజులు తమ నామధేయములపై లింగములు స్థాపించిరి. అట్లే పశ్చిమమున వైప్రచిత్తేశ్వర, కాలకేయేశ్వర, నిరాతక వచేశ్వర, వైరోచనేశ్వర, వల్మీకేశ్వర, తిలభాండేశ్వర, వాలకేశ్వర లింగములు, కుండేశ్వర, కుఠారేశ్వర, పరిభద్రేశ్వర, శుంభేశ్వర, నిశుంభేశ్వర, కాళీశ్వర, ప్రమథేశ్వర లింగములు స్థాపించి వారందరు శివధామము చేరిరి. ఉత్తరమున ఇంద్రద్యుమ్నేశ్వర, అధీశ్వర, నిషధేశ్వర, గణేశ్వర, క్షేమేశ్వర, వాలఖిల్యేశ్వర, నారదేశ్వర, సఖీశ్వర, అక్రూరేశ్వర, కబంధేశ్వర, పాండేయేశ్వర, క్షాళనేశ్వర, దశాశ్వమేధేశ్వర, కులేశ్వర, కుండలీశ్వర లింగములు గలవు. వీనిలో కొన్ని నష్టమయినవు. కొన్ని భిన్నమయినవి. కొన్ని స్థానభ్రంశమయినవి, కొన్ని భూస్థాపితములు, కొన్ని మాత్రమే ప్రస్తుతము తెలియబడుచున్నవి.

ఈ నామములు విన్నంత మాత్రమున ముక్తిగల్గును. విశ్వేశ్వరుడే కేదారుడుగా ఖ్యాతి గాంచినాడు. కామి, అకామి, భోగి, విరాగి, యోగులకందరకునూ ముక్తి ప్రదాయిని కాశి మాత్రమే. భోగకాములకు ముక్తినిచ్చి తనలోకమున సర్వభోగముల ననుభవింపజేయును. ఈ పురాణరహస్యముని వినినవారు శివపార్శ్వవర్తి గణములలో ఒకరుగా చేరుదురు.

Thursday, April 16, 2009

21 వ అధ్యాయము

మునులు మరల సూతమహామునికి నమస్కరించి కాశీకేదార రహస్యమునికనూ వివరింపుడని కోరగా సూతుడిట్లు వచించిరి. మాంథాత కేదారేశ్వరుని అనేక విధములుగ స్తుతించి స్వామీ మీరు మొదట హిమాలయములందు లింగరూప దర్శనమయిన వారందరకునూ ముక్తి నొసగుచుండిరి. శివాపరాధులకు అక్కడ దర్శనమివ్వనిచ్చగించని మీరు నన్ననుగ్రహించి కాశీలో ఇక్కడ మీ దర్శన భాగ్యము ఇపుడు నాకొసంగిరి. అట్లే ఇక్కడ మీదర్శనము చేసినవారందరకును ముక్తి ప్రసాదింపుడని వేడగా, వెంటనే బ్రహ్మ, విష్ణు మొదలగు దేవతలందరునూ చేతులు జోడించి కేదారేశ్వరునకు నమస్కరించి ప్రభూ! ఇట్టి దుర్లభమగు వరము మీరు అనుగ్రహించినచో క్షణములో నీదర్శనము చేసినవారందరితో కైలాసము నిండిపోయి నరకమున యమునికి గాని ఇక్కడ భైరవునికి గాని, విష్ణు, ఇంద్రాదిదేవతలకు గాని లోకపాలకులకెవరికిని పనియుండదుగదా! మీచే ఏర్పరుపబడిన సృష్ఠి, స్థితి, లయముల నియమముననుసరించి జీవులు వారి సుకృత, దుష్కృతముల వలన స్వర్గ, నరకములు పొందుటనేర్పరచినది మీరేగదా! అట్టి వ్యవస్థ తారుమారయినచో లోకమున మానవులు పాపభీతి వదలి, సుకర్మలు చేయకనే నీ దర్శనముతో ముక్తులగుటకు ప్రయత్నింతురు. గనుక మీరు భక్తుల ననుగ్రహించుటకు గాని, మీ కేదార అంతర్గ్రుహ మందు మాత్రము పాపులకు భైరవ యాతన లేకయే ముక్తి గల్గునట్లు జేయుడని కోరిరి. మీ వరప్రభావమున అర్బుద కల్పములు బ్రహ్మలోగ, విష్ణులోకములలో భోగములనుభవించి పునరావృత్తి రహిత శివధామ ప్రాప్తి నొసగుడని వేడిరి. అపుడు పరమాత్మ ప్రసన్నుడై మాంథాతా! నీవు నా ప్రియ భక్తుడవు గనుక చెప్పుచున్నాను వినుము. కారణాంతరములచే ఇక్కడ నా దర్శనమాత్రమున ముక్తి నీయజాలను. మొదటి మూడు యుగములలో మనుష్యులు ధర్మవంతులుగ నుందురు గనుక ముక్తి సాధ్యము. కాని కలియుగమున పాపులధికముగ నుందురు గనుక దర్శనమాత్రమున ముక్తి బొందిన యడల కర్మశ్ష అనుభవము లయమగుటచే సృష్ఠినియమలోపమగును. గనుక నిశ్చయముగ కాశీ కేదార లింగ దర్శనానంతరము దేశాంతరమున ఎక్కడ మృతి జెందినను ముక్తి తథ్యము. వేరు ఏమార్గమునను అట్టి ముక్తి లభ్యమవదు. ఈ రహస్య వాక్యముపై ధృడ నిశ్చయము గల్గిన వారికి పునరావృత్తి రహిత ముక్తి లభ్యమగును. భోగ మోక్షములు వారి కరతలామలకములు. కాశీలో దేహత్యాగము వలన ఇది నిశ్చయము. కేదారేశ్వరుడు మాంథాతతో మరియు ఇట్లు తెల్పెను. నాయీలింగము ఇపుడు పులగరూప పాషాణముగా తెలియునది. సత్యయుగమున నవరత్నమయముగను, త్రేతాయుగమున బంగారు లింగముగను, ద్వాపరమున వెండిలిగముగను, కలియుగమున ఇట్లు పాషాణముగను కన్పించును. నీచే రెండు భాగములు చేయబడినది హరిహరాత్మకము, శివ శక్త్యాత్మకము. అన్నముచే చేయబడినదగుటచే అన్నపూర్ణయగును. అన్నపూర్ణ సహితముగా నన్నర్చించుటచే వారింట అన్నమునకు సదాలోటుండదు. అంతమున నన్ను జేరుదురు. నా ఎదుట గుప్త తీర్థమునుండి 60 వేల పాతాళ లోక నాగకన్యలు నిత్యము నా దర్శన అర్చన నిమిత్తము వత్తులు. దేవలోకమునుండి అప్సరసలు, దేవతలు నిత్యము నన్నర్చించ వచ్చెదరు. గనుక కాశీ కేదార లింగము సర్వ కామప్రదము. నేను విశ్వనాథ లింగమందెట్లున్నానో అంతకన్న ఎక్కువగ ఈ లింగమందున్నాను. విశ్వనాథుని మణికర్ణిక ఎట్లో అంతకన్న ఎక్కువ మహాత్మ్యము ఈ ప్రాచీన మణికర్ణికది. ఇక్కడ ఢుంఢిరాజు, మాధవుడు, భైరవునితో పాటుగా దండపాణియు గలరు. ఇక్కడ నా అంతర్గ్రుహమున మరణించినవారు భైరవ యాతన లేకయే నా తారకమంత్రోపదేశముచే నా రూపము బొంది నన్ను చేరుదురు. అని శంకరుడు వరమిచ్చి మాంథాతను తన ధామమునకు చేరుమని చెప్పి ఆలింగమందు అదృశ్యుడాయెను. అక్కడి ఋషి పుంగవులు మాంథాతను అనేక వధముల కొనియాడిరి. మాంథాత వెంటనే విశ్వనాథ, కేదార, భైరవ, దండపాణి, ఢుండిరాజ, బిందుమాధవ, మణికర్ణికలను సేవించి పాంచభౌతిక శరీరము త్యజించెను. శివగణములతనిని విమానములో మహా కైలాసమునకు తీసికొని వెళ్ళిరి. మాంథాత విమానములో ఒకమారు కాశికి ప్రదక్షణము చేసి, హిమాలయ కేదారము వెళ్లి అక్కడ శంకరుని దర్శించి, ఒక అంశతో అక్కడ నిత్యము కేదారేశ్వరుని అర్చించు కొనగోరగా ఆకాశవాణి రూపమున పరమేశ్వరుడు అనుజ్ఞనొసంగెను. ఇట్లు కాశీకేదార శివ రహస్యమును వామదేవునకు సనత్కుమారులు వినిపించిరి.

కాశీలో కేదారనాధ మహిమ, గుప్త తీర్థముహిమ అత్యద్భుతములు. శివానుగ్రహముగల వారికి మాత్రమేవీని యందాసక్తిగల్గి కాశీదర్శింతురు. ఒక్కపర్యాయమయినను శ్రీకేదారేశ్వర దర్శనము, ధూప, దీప, నైవేద్య సేవనము జేసిన వారికి జనన మరణ భయములు ఉండవు. వారికి ముక్తి మండప ద్వారములు తెరిచి యుండును. పంచక్రోశాత్మక కాశీ పట్టణమంతయు విశ్వేశ్వర స్వరూపము. మణికర్ణిక సర్వపాప వినాశిని. ఇందు సంశయము లేదు. ఓంకారాది లింగములన్నియూ ముక్తిదాయకములు. చతుష్షష్ఠి యోగినులు గూడ ఇష్టకామ్యముల నిత్తురు. 56 వినాయకులు సిద్ధి నిత్తురు. ద్వాదశాదిత్యులు పాపహరులు. కార్తీకములో పంచ గంగా స్నానము, వైశాఖమున పంచతీర్థములు, మాఘమాసమున శూలటంకేశ్వరుని ఎదురుగా తీర్థము పాపహరము. కాశీలో అన్నదానము పాపహరము. పంచక్రోశమహాయాత్ర నిశ్చయముగ మహాపాపహరము. దండపాణి, మాధవ, ఢుండరాజ, భైరవులు పాప సంహరులు. 500 విష్ణుమూర్తులు పాప సంహారకులు. దుర్గా క్షేత్రము పాపహరము. కాశీలోని అణువణువున గల సర్వ దేవ తీర్థములు పాపహరములు. వినినెవరు వర్ణించ గలరు. విశ్వేశ్వరుడు ఓంకారేశ్వరాది ప్రతి లింగములోను 42 మహాలింగరూపములుగ వర్ధిల్లుచున్నాడు. ప్రతి క్షేత్రమందును విశేషమహిమలు గలవు. శివుడు ఐశ్వర్య ప్రదాత. ఒకప్పుడు విష్ణువుకు, బ్రహ్మకు, ఇంద్ర, అగ్ని, రాక్షస, వరుణ, వాయు, కుబేర, సూర్య, చంద్ర, నక్షత్రమండలమందు గల ధృవ, సప్తర్షి, గ్రహ, అష్ట దిగ్గజ, తక్షక, కర్కోటకాది నాగులు, వశిష్ఠ, దూర్వాసాది బ్రహ్మర్షులు, దివోదాస, హరిశ్చంద్రాది చక్రవర్తులు, ఒకటని వివరించనలవిగాని అనేక దివ్య అనుగ్రహములు చేసి కాశియందు అనేకరూపములుగా నున్నాడు.

ఇట్లు సనత్కుమారునిచే చెప్పబడిన శివ విభూతులు భక్తిపూర్వకముగ విని వామదేవుడు మరల కుతూహలముతో శివ మహాత్మ్యమునిట్లు తెలిసికొనగోరెను.

Tuesday, April 14, 2009

20 వ అధ్యాయము

శౌనకాది మునులు సూతునిట్లడిగిరి. హే శివాజ్ఞాన నిధీ! మాంథాత సంశయ నివారణకు ఎట్టి మహాత్ముల వద్దకు వెళ్ళిరి. వారు కాశీయందు ఎట్టి నియమములనాచరింతురు? తెల్పుమనగా సూతుడిట్లు చెప్పదొడగెను. శివ రహస్యము నెఱిగిన ఆ మహాత్ములు మనసా, వాచా, కర్మణా అహరహము శివకైకర్యమున కంకితమైనవారు. సిద్ధులు, చిద్ఘములు, శివానంద సముద్రముల కెరటమువంటివారి. శివ తత్వార్ధమును తెలిసినవారు. శివునికి వలె శివభక్తులకును సేవ జేయువారు. శివ పూజా పరాయణులు. శివ పురాణమును ప్రవచించువారు. శైవ శాస్త్ర, ఆచార, తంత్రములయందారితేరినవారు. శివ ధ్యానరూపమగు తృప్తితో ప్రాపంచిక విషయములను తృణమాత్రముగ నెంయి శివజ్ఞానమను అగ్నితో భస్మము జేయువారు. మనోవేగమున నిత్యము అఖిల శివ క్షేత్రములను దర్శించనిదే భోజనము చేయనివారు. అట్టివారి సభలో మాంథాత వారికి సాష్ఠాంగ మనస్కారములు చేసి తన సంశయమును నివేదించగా వారు మాంథాతను ప్రశంసించి, నీవు ధన్యుడవు. నీ తపస్సుకు మెచ్చి కేదారేశ్వరుడు ఆకాశవాణి రూపమున నిన్నాదేశించెను. శాస్త్రోచిత నియమపాలన కన్ననూ శివాజ్ఞయే మిన్న గనుక నీవు వెంటనే వెళ్ళి స్వామికి నైవేద్యము తయారు చేయుము. మేముకూడ నీవలె మనోవేగము గలవారము. నీ స్వామ్ ఆదేశానుసారము అతిథి సేవ, భోజనము అయిన తర్వాత మేమునూ యాత్రలో నిన్ననుసరించి వచ్చెదమనిరి. మాంథాత వెంటనే తన స్థానమునకు చేరి, పులగము వండి, నేతితో కలిపి ఆకులో గుమ్మరించి, మధ్యలో గీత గీసి రెండు భాగములు చేసి శివునికి నివేదించి, అతిథి కొరకు ఎదురు చూచుచున్న సమయమున ఇతనితో యాత్ర చేయుటకు సిద్ధులందరును ఎతెంచిరి. ఎంతకును అతిథి దొరకడాయెను. కాలాతీతమగుచున్నందున మాంథాత తో చేరి అందరునూ శివుని స్తుతించిరి. వెంటనే పరమాత్మ భిక్షురూపమున వెలుపల నిలిచి నాకు భిక్షనిత్తువాయాని పిలచెను. మాంథాత సంతోషముతో భిక్షును చూచి నమస్కరించి పొంగలి భిక్ష తెచ్చుటకు లోనికి వెళ్లి అతిథి భాగమును తీయబోగా క్షణములో రెండు భాగములుని పాషాణమూగా మారినవి. మాంథాత ఆశ్చర్యముతో అతిథికి భిక్షనీయలేకపోతినే యని చింతించి, నేనేదో తప్పుచేసి యుండవచ్చును. కేదారేశ్వరుడు కోపించి యుండునని తలచి దుఃఖితుడై వెలుపలకు వచ్చి చూడగా భిక్షువు కన్పింపలేదు. శివభక్తులందరునూ వెలుపలకు వచ్చిచూడగా ఆకాశమున మాహాశంఖ నాదము, ఘంటానాదము, రుద్రకన్యల తాటంకముల ఝణఝణ శబ్దము, శివస్వరూపులగు రుద్రగణములతో, సహస్ర సూర్యకాంతులు మిరిమిట్లు గొల్పు కాంతితో, ఛత్ర, చామర సహిత, శీతల పవనముసు లీటు కఛము క్రిందకు దిగి అందుండి రుద్రగణములు, మాంథాతతో ఋషిసత్తమా కైలాసమునుండి, మీతపస్సుకు సంతృప్తుడయిన పరమ శివుడు ఈ రథమును పంపి మిమ్ము తీసికొని రమ్మనిరి. దయచేసి వచ్చి రథములో మాతోరండని ప్రార్థించిరి.

కాని మాంథాత మనసు సాక్షాత్ కేదారేశ్వరుని దర్శనము కొఱకు ఆరోటపడుచున్నందున, పరమేశ్వరుడు సగభాగమున పార్వతితో అర్ధనారీశ్వరుడుగ వృషభవాహనారూఢుడై, కార్తికేయ, గణేశ, శివగణ సహితుడై, నందీశ్వరుడు ముందు నడువగా, కోటి సూర్య ప్రకాశముతో, కోటి చంద్రుల శీతల పవన శోభతో, సరస్వతీదేవి వీణావాదన సామగానము వినపించుచుండగా, బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలందరూ పత్నీ సమేతులై జయజయ ధ్వానములు సల్పుచుండగా పాషాణ రూపమయిన అన్నకూటము నుండి ప్రకటితమయి, శిలా ప్రతిమవలె నిశ్చేష్టుడై నిల్చుండిన మాథాతతో స్వామి గంభీరముగా భక్తాగ్రగణ్య శిఖామణీ మాంథాతా! నీ నీశ్చల తపోనిష్టకు, భక్తి ప్రపత్తులకు నేనెంతో తృప్తుడనైతిని. వేరెవ్వరకునూ అలభ్యమగు వరములు నీకివ్వ సంకల్పించితిని గనుక నీ అభీష్టము తెల్పునమిరి. మాంథాత తెలివిలోనికి వచ్చి స్వామి ప్రసాదించిన దివ్య దృష్టితో స్వామిని దర్శించి దండ ప్రణామమాచరించి ఆనందాశ్రువులు ధారా ప్రవాహముగ రాలుచుండ, మహాదేవా! బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలకే అలభ్యమగు ఇట్టి మీ సాక్షాత్కారమునకు మూఢుడనయిన నేనునూ పాత్రుడనగుట నా పూర్వజన్మల సుకృతమగును. నీ భక్తుల సత్సంగ ఫలితమగును. ప్రభో ఈ శివభక్తులందరూ నిన్నెప్పుడూ మనమునచూడ నిచ్చగించు మహాత్ములు, గనుక నాపై తమకు గల దయా దృష్ఠి వీరందరిపై యుండు గాక, ఇక రెండవ వరముగా నాకు ముక్తిగూడ కోరను. అనగా పరమ శివుడు, నీవు భక్త శిఖామణి వయితివి, నీకు వరము ఇతరుల కొఱకు కోరుటయే నీ గొప్పతనము కనుక నాయీ దివ్యదర్శన భాగ్యము కొరకు నీవు కోరినట్లు ఇక్కడి వారందరకు దివ్యదృష్ఠి నిచ్చుచున్నాను. అనగనే అక్కడి మునులందరూ బ్రహ్మాదులకే అలభ్యమగు దివ్య దర్శనము చూచి ఆనంద తాండవము చేయుచు, జయ జయ ధ్వానములతో, వేదాంత, స్మృతి, శృతి, పురాణ స్తుతులతో, రుద్ర పాఠ ఘోషతో, మోక్షలక్ష్మీ ప్రార్ధనలతో శంకరుని స్తుతించిరి. వెంటనే శంభుని ఆజ్ఞపై ఆకాశమున శంఖారావ, ఘంటానాదములు మార్మోగ నూర్లకొలది రుద్ర కన్యలు ఛత్ర చామరములు వీచుచున్న విమానములు కన్పట్టెను. అక్కడి మహాత్ములందరు వారి భౌతిక శరీరములు వదలి సూక్ష్మ శరీర ధారులై ఆ విమానముల నెక్కిరి. కేదారనాథుడు వారందరకును తారకమంత్రోపదేశము చేసి మీలో ఇంకనూ భోగ తృష్ణగలవారు నాధామమున అలౌకిక భోగములననుభవించి తదుపరి ముక్తి బొందుడు. భోగవిరక్తుల నన్నే ధ్యానము చేయుచు మోక్షప్రాప్తులు గండని వారిని అనుగ్రహించి మహాకైలాసమునకు పంపిరి. పరమ భక్తుడగు మాంథాత శరీరమును తన కరకమలములచే నిమురుచు వత్సా నీక సశరీర కైవల్యమొసగు చుంటిని, మరేదైన వరమొసంగవలయునని సంకల్పించితిని. వరము కోరమనగా మాంథాత ప్రభో! కాశీలో పాపాత్ములకు భైరవ దండన అత్యంత ఘోరమయినది. అసమాన్యమగు మీ అంతర్గ్రుహమున ఎట్టి పాపులకునూ అట్టి భైరవ దండన లేకయే ముక్తినొసగుడని కోరగా, స్వామి కరుణించి, కాలభైరవ, దండపాణి, ఢుంఢిరాజ, ఆదికేశవ, బిందుమాధవ మరియు ఇతర దేవతా సమూహమునంతయూ చేరబిలిచి, కాశీలో నాయీ కేదార అంతర్గ్రుహమున మృతిజెందు ఎజీవికినీ, ఎంతటి పాపాత్ములయినను కాలభైరవ దండన లేకయే నా తారకమంత్రోపదేశముతో ముక్తులగుదురని ఆదేశించెను. అట్లు ఆదేశించి పరమాత్మ దేవతలచే సేవింపబడుచు, విశ్వేశ్వరుడే నవరత్నమణి మయ రూపముల కేదారేశ్వరుడుగ ఆపాషాణ రూప అన్నకూటమున అంతర్హితుడాయెను.

సూతుడిట్లు ముగించి, మునులారా ఈ కధాంశమును భక్తిపూర్వకముగ విన్నవారు ముక్తులగుదురని చెప్పెను.