శౌనకాది మునులు సూతునిట్లడిగిరి. హే శివాజ్ఞాన నిధీ! మాంథాత సంశయ నివారణకు ఎట్టి మహాత్ముల వద్దకు వెళ్ళిరి. వారు కాశీయందు ఎట్టి నియమములనాచరింతురు? తెల్పుమనగా సూతుడిట్లు చెప్పదొడగెను. శివ రహస్యము నెఱిగిన ఆ మహాత్ములు మనసా, వాచా, కర్మణా అహరహము శివకైకర్యమున కంకితమైనవారు. సిద్ధులు, చిద్ఘములు, శివానంద సముద్రముల కెరటమువంటివారి. శివ తత్వార్ధమును తెలిసినవారు. శివునికి వలె శివభక్తులకును సేవ జేయువారు. శివ పూజా పరాయణులు. శివ పురాణమును ప్రవచించువారు. శైవ శాస్త్ర, ఆచార, తంత్రములయందారితేరినవారు. శివ ధ్యానరూపమగు తృప్తితో ప్రాపంచిక విషయములను తృణమాత్రముగ నెంయి శివజ్ఞానమను అగ్నితో భస్మము జేయువారు. మనోవేగమున నిత్యము అఖిల శివ క్షేత్రములను దర్శించనిదే భోజనము చేయనివారు. అట్టివారి సభలో మాంథాత వారికి సాష్ఠాంగ మనస్కారములు చేసి తన సంశయమును నివేదించగా వారు మాంథాతను ప్రశంసించి, నీవు ధన్యుడవు. నీ తపస్సుకు మెచ్చి కేదారేశ్వరుడు ఆకాశవాణి రూపమున నిన్నాదేశించెను. శాస్త్రోచిత నియమపాలన కన్ననూ శివాజ్ఞయే మిన్న గనుక నీవు వెంటనే వెళ్ళి స్వామికి నైవేద్యము తయారు చేయుము. మేముకూడ నీవలె మనోవేగము గలవారము. నీ స్వామ్ ఆదేశానుసారము అతిథి సేవ, భోజనము అయిన తర్వాత మేమునూ యాత్రలో నిన్ననుసరించి వచ్చెదమనిరి. మాంథాత వెంటనే తన స్థానమునకు చేరి, పులగము వండి, నేతితో కలిపి ఆకులో గుమ్మరించి, మధ్యలో గీత గీసి రెండు భాగములు చేసి శివునికి నివేదించి, అతిథి కొరకు ఎదురు చూచుచున్న సమయమున ఇతనితో యాత్ర చేయుటకు సిద్ధులందరును ఎతెంచిరి. ఎంతకును అతిథి దొరకడాయెను. కాలాతీతమగుచున్నందున మాంథాత తో చేరి అందరునూ శివుని స్తుతించిరి. వెంటనే పరమాత్మ భిక్షురూపమున వెలుపల నిలిచి నాకు భిక్షనిత్తువాయాని పిలచెను. మాంథాత సంతోషముతో భిక్షును చూచి నమస్కరించి పొంగలి భిక్ష తెచ్చుటకు లోనికి వెళ్లి అతిథి భాగమును తీయబోగా క్షణములో రెండు భాగములుని పాషాణమూగా మారినవి. మాంథాత ఆశ్చర్యముతో అతిథికి భిక్షనీయలేకపోతినే యని చింతించి, నేనేదో తప్పుచేసి యుండవచ్చును. కేదారేశ్వరుడు కోపించి యుండునని తలచి దుఃఖితుడై వెలుపలకు వచ్చి చూడగా భిక్షువు కన్పింపలేదు. శివభక్తులందరునూ వెలుపలకు వచ్చిచూడగా ఆకాశమున మాహాశంఖ నాదము, ఘంటానాదము, రుద్రకన్యల తాటంకముల ఝణఝణ శబ్దము, శివస్వరూపులగు రుద్రగణములతో, సహస్ర సూర్యకాంతులు మిరిమిట్లు గొల్పు కాంతితో, ఛత్ర, చామర సహిత, శీతల పవనముసు లీటు కఛము క్రిందకు దిగి అందుండి రుద్రగణములు, మాంథాతతో ఋషిసత్తమా కైలాసమునుండి, మీతపస్సుకు సంతృప్తుడయిన పరమ శివుడు ఈ రథమును పంపి మిమ్ము తీసికొని రమ్మనిరి. దయచేసి వచ్చి రథములో మాతోరండని ప్రార్థించిరి.
కాని మాంథాత మనసు సాక్షాత్ కేదారేశ్వరుని దర్శనము కొఱకు ఆరోటపడుచున్నందున, పరమేశ్వరుడు సగభాగమున పార్వతితో అర్ధనారీశ్వరుడుగ వృషభవాహనారూఢుడై, కార్తికేయ, గణేశ, శివగణ సహితుడై, నందీశ్వరుడు ముందు నడువగా, కోటి సూర్య ప్రకాశముతో, కోటి చంద్రుల శీతల పవన శోభతో, సరస్వతీదేవి వీణావాదన సామగానము వినపించుచుండగా, బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలందరూ పత్నీ సమేతులై జయజయ ధ్వానములు సల్పుచుండగా పాషాణ రూపమయిన అన్నకూటము నుండి ప్రకటితమయి, శిలా ప్రతిమవలె నిశ్చేష్టుడై నిల్చుండిన మాథాతతో స్వామి గంభీరముగా భక్తాగ్రగణ్య శిఖామణీ మాంథాతా! నీ నీశ్చల తపోనిష్టకు, భక్తి ప్రపత్తులకు నేనెంతో తృప్తుడనైతిని. వేరెవ్వరకునూ అలభ్యమగు వరములు నీకివ్వ సంకల్పించితిని గనుక నీ అభీష్టము తెల్పునమిరి. మాంథాత తెలివిలోనికి వచ్చి స్వామి ప్రసాదించిన దివ్య దృష్టితో స్వామిని దర్శించి దండ ప్రణామమాచరించి ఆనందాశ్రువులు ధారా ప్రవాహముగ రాలుచుండ, మహాదేవా! బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలకే అలభ్యమగు ఇట్టి మీ సాక్షాత్కారమునకు మూఢుడనయిన నేనునూ పాత్రుడనగుట నా పూర్వజన్మల సుకృతమగును. నీ భక్తుల సత్సంగ ఫలితమగును. ప్రభో ఈ శివభక్తులందరూ నిన్నెప్పుడూ మనమునచూడ నిచ్చగించు మహాత్ములు, గనుక నాపై తమకు గల దయా దృష్ఠి వీరందరిపై యుండు గాక, ఇక రెండవ వరముగా నాకు ముక్తిగూడ కోరను. అనగా పరమ శివుడు, నీవు భక్త శిఖామణి వయితివి, నీకు వరము ఇతరుల కొఱకు కోరుటయే నీ గొప్పతనము కనుక నాయీ దివ్యదర్శన భాగ్యము కొరకు నీవు కోరినట్లు ఇక్కడి వారందరకు దివ్యదృష్ఠి నిచ్చుచున్నాను. అనగనే అక్కడి మునులందరూ బ్రహ్మాదులకే అలభ్యమగు దివ్య దర్శనము చూచి ఆనంద తాండవము చేయుచు, జయ జయ ధ్వానములతో, వేదాంత, స్మృతి, శృతి, పురాణ స్తుతులతో, రుద్ర పాఠ ఘోషతో, మోక్షలక్ష్మీ ప్రార్ధనలతో శంకరుని స్తుతించిరి. వెంటనే శంభుని ఆజ్ఞపై ఆకాశమున శంఖారావ, ఘంటానాదములు మార్మోగ నూర్లకొలది రుద్ర కన్యలు ఛత్ర చామరములు వీచుచున్న విమానములు కన్పట్టెను. అక్కడి మహాత్ములందరు వారి భౌతిక శరీరములు వదలి సూక్ష్మ శరీర ధారులై ఆ విమానముల నెక్కిరి. కేదారనాథుడు వారందరకును తారకమంత్రోపదేశము చేసి మీలో ఇంకనూ భోగ తృష్ణగలవారు నాధామమున అలౌకిక భోగములననుభవించి తదుపరి ముక్తి బొందుడు. భోగవిరక్తుల నన్నే ధ్యానము చేయుచు మోక్షప్రాప్తులు గండని వారిని అనుగ్రహించి మహాకైలాసమునకు పంపిరి. పరమ భక్తుడగు మాంథాత శరీరమును తన కరకమలములచే నిమురుచు వత్సా నీక సశరీర కైవల్యమొసగు చుంటిని, మరేదైన వరమొసంగవలయునని సంకల్పించితిని. వరము కోరమనగా మాంథాత ప్రభో! కాశీలో పాపాత్ములకు భైరవ దండన అత్యంత ఘోరమయినది. అసమాన్యమగు మీ అంతర్గ్రుహమున ఎట్టి పాపులకునూ అట్టి భైరవ దండన లేకయే ముక్తినొసగుడని కోరగా, స్వామి కరుణించి, కాలభైరవ, దండపాణి, ఢుంఢిరాజ, ఆదికేశవ, బిందుమాధవ మరియు ఇతర దేవతా సమూహమునంతయూ చేరబిలిచి, కాశీలో నాయీ కేదార అంతర్గ్రుహమున మృతిజెందు ఎజీవికినీ, ఎంతటి పాపాత్ములయినను కాలభైరవ దండన లేకయే నా తారకమంత్రోపదేశముతో ముక్తులగుదురని ఆదేశించెను. అట్లు ఆదేశించి పరమాత్మ దేవతలచే సేవింపబడుచు, విశ్వేశ్వరుడే నవరత్నమణి మయ రూపముల కేదారేశ్వరుడుగ ఆపాషాణ రూప అన్నకూటమున అంతర్హితుడాయెను.
సూతుడిట్లు ముగించి, మునులారా ఈ కధాంశమును భక్తిపూర్వకముగ విన్నవారు ముక్తులగుదురని చెప్పెను.
No comments:
Post a Comment