Monday, April 20, 2009

25 వ అధ్యాయము

ఋషి పుంగవులు సూత పౌరాణికుని ద్వారా చంద్రవాన్ అను రాజు వృత్తాంతము వినగోరి, మహాత్మా ఆ చంద్రవాన్ అను రాజు వామదేవ, సనత్కుమారులనుండి శివరహస్యమెట్లు తెలిసికొనెను. అతడెవరు? అట్లు శివరహస్యజ్ఞానము పొందియూ, కాశీని, కాశీలోని శివలింగములను ఏల నిందించెను. అయినను అతనికి శివానుగ్రహము ఎట్లు కల్గినది? వివరింపగోరగా సూతుడు చెప్పదొడగెను.

పూర్వకాలమున హిమాచల ప్రాంతమున నేపాల బ్రాహ్మణుడొకడు పశుపతినాధుని షట్కాలపూజలు చేయుచుండెను. అక్కడ శివతత్వజ్ఞాని శివశర్మయును ఒక బ్రాహ్మణుడు ఒడలంతయూ భస్మము ధరించి, నుదుట త్రిపుండ్రములు, మొడలో రుద్రాక్షమాలలు ధరించి సదాశివ పంచాక్షరీజపము, రుద్రపారాయణ చెయుచు నియమముగా త్రిసంధ్యలయందు శివలింగార్చన చేయుచుండెను. శ్రద్ధగా నిత్య నైమిత్తిక కర్మలాచరించుచు సదా పశుపతినాథునియందే మనసు లగ్నముచేసిన వాని కుటుంబమునకు సేవచేయుటకు అకలితో బాధపడు ఒక భిల్లుడు వారింట చేరెను. నిష్కపట భావముతో ఆ బ్రాహ్మణుడు చెప్పిన పనులన్నియూ చేయుచుండెను. ఒకసారి వేరుపనిలో నిమగ్నమయిన అతడు ఆ బ్రాహ్మణునికి నిందాపూర్పకముగా సమాధానమిచ్చెను. కాని శాంతపరుడయిన ఆ బ్రాహ్మణుడతనిని ఏమియు చేయక క్షమించియుండెను. పశుపతి నాథుడు ప్రసన్నుడై ఆకాశవాణి రూపమున ఆ బ్రాహ్మణునితో, భక్తా! నీ త్రికాలపూజలకు, భక్తి శ్రద్ధలతో నీవుచేయు శ్రౌత, స్మార్త కర్మానుష్ఠానములకు నేను తృప్తుడనయితిని. నీకు అవరోక్ష జ్ఞానము కల్గును, రాబోవు జన్మలో నీవు అట్టి జ్ఞానముచే నా పదము జేరుదువు అని పల్కగా ఆ బ్రాహ్మణుడు ఆకాశవాణి వాక్యమును శివాజ్ఞగా స్వీకరించి విరక్తుడై శరీరమును సుష్కింపజేసి తపోనిరతుడై ప్రాయోపవేశమున శరీరమును చాలించెను. అతడే మరుజన్మలో గర్గమహర్షిగా జన్మించెను. అతని పత్ని ప్రఖ్యాత ఉపనిషద్జ్ఞానవ్త్త బ్రహ్మవాదిని. యాజ్ఞవల్కాది మునులకును ఆమె వ్యాఖ్యానమును గ్రహించుట కష్టమయ్యెడిది. పూర్వజన్మమున కూడ వారు భార్యా భర్తలు. వారి సేవకుడగు భిల్లుడు మరు జన్మలో రాజుగా జన్మించి హిమాచల ప్రాంతమునకు రాజయ్యెను. అతడు బ్రాహ్మణుడు, ధర్మపరాయణుడు, పరాక్రమవంతుడు, కీర్తిమంతుడు. అనేక యజ్ఞములు చేసెను. గర్గముని తన త్రికాల జ్ఞానముచే ఆరాజు క్రితము జన్మలో తమ సేవకుడగు భిల్లునిగా గుర్తించి అతనిని ఉద్ధరింపనెంచి రాజుకడకు వెళ్లి ఆత్మజ్ఞానోపదేశము చేసెను. ఆ జ్ఞానముతో రాజు విరక్తుడై గర్గమునితో మహాత్మా నేను నాకుమారునకు రాజ్యమిచ్చి తపస్సుకు పోవుదును. తగిన స్థలమునిర్దేశించుడని కోరెను. గర్గుజు అతనిని కేదారము వెళ్లి తపమాచరింపమని చెప్పి, రాజా నీవు అచట తపస్సిద్ధి పొందుదువు. కాని నీ పుర్వజన్మకృత ప్రారబ్దమున ఒక ఉపాధి యున్నది. అది లేనియడల ఈ జన్మమందే ముక్తి గలదని చెప్పగా, రాజు స్వామీ ఆ ఉపాధికి కారణమేమని అడిగెను. గర్గముని రాజా నీవు పూర్వజన్మమందు ఒక శివజ్ఞాని బ్రాహ్మణుని ఇంట సేవకుడగు భిల్లుడవు. ఒకనాడు అన్యమనస్కుడవై యజమానిని నిందించితివి. ఆ దోషమున ప్రారబ్ది ఫలమునుభవింపక తప్పదని తెల్పెను. వెంటనే రాజు ఆ గర్గముని పాదములపై బడి విలపించి మహాత్మా మీరు తపోబల సంపన్నులు. నా ప్రాహబ్దమును తప్పింపగల శక్తి మీకు గలదు. కనుక నన్ననుగ్రహింపుడని వేడగా, గర్గముని అతనిని తన చేతితో నిమిరి, శంకరుడు కరుణాసముద్రుడు, దీనజన బాంధవుడు. నిన్ను తప్పక అనుగ్రహించును, వెళ్ళి నిష్ఠగా తపము చేయమని దీవించి పంపెను. రాజు కఠోర తపమాచరించి ఆకాశవాణి రూపమున శివకృపకు పాత్రుడాయెను. శివ రహస్యము శివునకే ఎఱుక. శివభక్తుల మహాత్మ్యము వర్ణింపనలవిగానిది. సేవకుని రాజును చేసినది. సేవకుని దూషణతను సహించినను దాని ఫలితము తపస్సిద్ధికి ఆటంకమగుటయు మరల ఆ శివభక్తుని దయవల్లనే అది తొలగి శివకటాక్షమునకు పాత్రుడగుట శివ లీలామృతము. దీనిని వినినవారు, చదివినవారును జన్మపర్యంతము చేసిన పాపములు క్షణములో నశించి భోగములననుభవించి ముక్తి బొందుదురు.

No comments:

Post a Comment