ఋషులు సూత పౌరాణికుని ప్రార్థించి వామదేవుడు సనత్కుమారునిద్వారా వినిన శివరహస్య మేమని అడిగిరి. సూతుడిట్లు చెప్పిరి. సనత్కుమారుడు వామదేవుని మహాత్మా! మీ దివ్య పరిజ్ఞానముల పాపములంది మిక్కిలి గొప్ప పాపము, ఎట్టి కర్మలవల్లనూ నివృత్తి గాని పాపమేది యని అడిగిరి. శివాపరాధమునకు మించిన పాపము, ఎట్టి పుణ్యకార్యములవల్లనూ రహితము గాది. పదివేల ప్రాయశ్చిత్తముల వల్లనూ అట్టి పాపము ప్రక్షాళితముగాదు. అనగా సనత్కుమారులిట్లు తెల్పిరి. కలియుగము పాప భూయిష్టము. పాపభీతి గలవారు తక్కువ. ఉచితానుచితములు తలంపరు. కేవలము ఇంద్రియ, జిహ్వ సుఖ నిరతులు. సత్య, త్రేతా, ద్వాపర యుగములందు ధర్మలోపము లేదు. కలియుగమున మానవులు కుటిలాత్ములై అధర్మపురలగుట వలన శంకరుని కృపలేనిదే వారు తరించు మార్గము లేనందున దయామయుడై శంకరుడు కాశీలో విశ్వనాథుడుగా, గంగ, మణికర్ణికలను పాప ప్రాయశ్చిత్తార్మేర్పరచి, తన యడల, తన భక్తులయడల చేయు అపరాధముల నివృత్తికై తానే కేదారేశ్వరుడై ఈ రహస్యమును మొదట గౌరీదేవికి చెప్పెను. కనుక శివాపరాథ, శివభక్తాపరాథ నివారణ కేవలము ప్రాచీన మణికర్ణిక, గుప్త తీర్థము మాత్రమే. అంతియేగాక తన చుట్టూగల తన అంతర్గ్రుహమున భైరవదండనయునూ లేక పాపులను గూడ తారకమంత్రముచే ముక్తులను చేయుచున్నాడు.
వేరెక్కడనూ పదివేల కల్పములయిననూ తీరని శివాపరాధము కాశీలో ఆజన్మయందే ఉపశమించి ముక్తి గల్గుట తథ్యము. కాశీకేదారునికి ఒక్క బొట్టు గంగాజలము, ఒక్క పుష్పము సమర్పించినవారికి మోక్షద్వారములు తెరుచుకొనును. ఒక దీపము వెలిగించినవారికి జ్ఞానదీపముచే అవిద్య తొలగును. ధూపమిడినవారికి జన్మజన్మాంతరముల కర్మవాసలము దుర్గంధము వీడిపోవును. మంత్రయుక్త పూజనాచరించిన వారిని కేదారేశ్వరుడు ముక్తినొసంగును. ఛత్ర, చామరాది సర్వష్డశోపచారములు చేసినవారిని రుద్ర కన్యలు సపర్యలు చేయుదురు. మహాపూజ చేసిన వారిని రుద్ర గణములు పూజింతురు. కేదారాలయమున భిక్షులకు అన్నపానీయములిచ్చినవారు శంకరుని దయాసముద్రమున తేలియాడుదురు. జీవితమున ఒక్కమారయినను కాశీ కేదారనాథుని పూజించినవారు పునరావృత్తి రహితులగుదురు. వీభూతి రుద్రాక్షధారులై రుద్ర పాఠమాచరించిన వారు అంబికా సహిత శివదర్శనము పొంది శివపదము చేరుదురు. శివ, కేదార, కేదార, కేదార యను ధ్వని మొక్షలక్ష్మితలుపులు తట్టు ధ్వని యగును. ఇది శృతి, స్మృతులవచనము. ఎట్టి సందియమును లేదు. అర్ఘ్య, పాద్య, ఆచమనీయ, మధుపర్కముల మంత్ర ధ్వని అట్టివానిని దేవతను తమలోకములకు తీసికొని వెళ్ళుటకు చేయు భేరీధ్వనియగును. కేదారేశ్వరుని ఎదురుగా పురాణము చెప్పువారు, చెప్పించువారు, వినువారు మోక్షలక్ష్మి తమను వరించుటకు వచ్చునపుడు కాలియందియల ధ్వనిగా తలంచవలయును. కేదారము నాల్గు ప్రక్కల ఉన్నవారిని ఒక్క గ్రాసము ఆతిథ్యమునకు పిలుచు ధ్వని ఆతిథ్యమిచ్చు వారిని కైలాసమునకు ఆహ్వానించు ధ్వనిగా తలంచవలయును. కేదారేశ్వరుని స్తోత్రమంత్ర ధ్వని వారనిని కైలాసము తీసికొనివెళ్లునపుడు చేయు భేరీ భజంత్రీల ధ్వనిగా తలచవలయును. కేదారేశ్వరుని పూజించు భాగ్యమునకు నోచుకొననివారు విశ్వేశ్వర సారూప్యము బొందుదురు. ఇందు సందేహము లేనేలేదు. కేదారేశ్వరుని చుట్టునూ అగణిత లింగసమూహము గలదు. అవి దేవ, దానవ, దైత్య, నాగ, రాక్షస, అకుర, రాజ, మునివర్యులు, అప్సరసలు స్థాపించినవి. ఇవి ఐశ్వర్య, భుక్తి, ముక్తులనొసగునవి. కేదారేశ్వరునికి తూర్పున శ్రీకరకంఠ నామముతో సముద్రుడు స్థాపించినది, దానికి తూర్పున మయూర లింగము, వరుణ, సింహ, జారవ్య, మాయేశ లింగములు గలవు. ఇవి కొన్ని లుప్తములు, కొన్ని అదృశ్యములు.
కశ్యపుని కుమారులు శూరాదులు కార్తికేయునిచే నిహతులై స్వామి అనుగ్రహమున శిఖి, కాలజ్ఞాని అనుపేర్లతో స్వామివారి వాహనము, ధ్వజముగాను, తారకాసురుడు పూర్వ జన్మ తపోబలముచే స్వామి గజవాహనముగాను, అమ్మవారి సింహవాహనముకూడ పూర్వ జన్మ తపోవిశేషమున గల్గినదే. వీరి సోదరి అజ నామకురాలు, తల్లి మాయాదేవి కూడ శంకరుని విరోధించి స్కందుని ఆగ్రహమునకు గురై మరల వారి ప్రార్థనల నాలకించి కాశీలో ప్రాచీన మణికర్ణికలో స్నానమాడి విధి విధానముగా కేదారేశ్వరుని పూజించి, వారి పేర్లతో లింగములు స్థాపించి పాపరహితులై మరల కార్తికేయుని దర్శించి, అమ్మవారిని ప్రార్థించి శివాజ్ఞచే ముక్తులైరి. వారి కుమారులు కూడా ఉపాసనా ఫలముగా వారి ఇష్టదేవతల పేర లింగములు స్థాపించిరి. మరియు నాల్గు వర్ణముల స్త్రీ, పురుషులు స్థాపించిన లింగములును గలవు. గౌరీతీర్థమున గౌరీదేవి, లక్ష్మి, వ్యాస, భార్గవులు స్థాపించిన లింగములు గలవు. సనత్కుమార, గంగ, యుము, సరస్వతులు స్థాపించిన లింగములు త్రినదీశ్వర నామములతో గలవు. ఈ విధముగా పదివేల లింగములు గంగలోని, తీరమునను గలవు.
దక్షిణ భాగముల అసంఖ్యాక లింగములు గలవు. చిత్ర కేతు, చిత్ర రధ, చిత్రాంగద, విచిత్రక, సీత, లక్ష్మణ, శత్రుఘ్న, హనుమాన్, భరత, వానర, జాంబవంత, లంగురులు స్థాపించిన లింగములు, మహాతేజస్వి రామచంద్రుడు, అన్యరాజులు తమ నామధేయములపై లింగములు స్థాపించిరి. అట్లే పశ్చిమమున వైప్రచిత్తేశ్వర, కాలకేయేశ్వర, నిరాతక వచేశ్వర, వైరోచనేశ్వర, వల్మీకేశ్వర, తిలభాండేశ్వర, వాలకేశ్వర లింగములు, కుండేశ్వర, కుఠారేశ్వర, పరిభద్రేశ్వర, శుంభేశ్వర, నిశుంభేశ్వర, కాళీశ్వర, ప్రమథేశ్వర లింగములు స్థాపించి వారందరు శివధామము చేరిరి. ఉత్తరమున ఇంద్రద్యుమ్నేశ్వర, అధీశ్వర, నిషధేశ్వర, గణేశ్వర, క్షేమేశ్వర, వాలఖిల్యేశ్వర, నారదేశ్వర, సఖీశ్వర, అక్రూరేశ్వర, కబంధేశ్వర, పాండేయేశ్వర, క్షాళనేశ్వర, దశాశ్వమేధేశ్వర, కులేశ్వర, కుండలీశ్వర లింగములు గలవు. వీనిలో కొన్ని నష్టమయినవు. కొన్ని భిన్నమయినవి. కొన్ని స్థానభ్రంశమయినవి, కొన్ని భూస్థాపితములు, కొన్ని మాత్రమే ప్రస్తుతము తెలియబడుచున్నవి.
ఈ నామములు విన్నంత మాత్రమున ముక్తిగల్గును. విశ్వేశ్వరుడే కేదారుడుగా ఖ్యాతి గాంచినాడు. కామి, అకామి, భోగి, విరాగి, యోగులకందరకునూ ముక్తి ప్రదాయిని కాశి మాత్రమే. భోగకాములకు ముక్తినిచ్చి తనలోకమున సర్వభోగముల ననుభవింపజేయును. ఈ పురాణరహస్యముని వినినవారు శివపార్శ్వవర్తి గణములలో ఒకరుగా చేరుదురు.
చాలా బాగా రాసారండి!..
ReplyDelete