Wednesday, April 22, 2009

26 వ అధ్యాయము

ఋషి పుంగవులు సూతుని, సత్యవతి పుత్ర వ్యాసభగవానుని ప్రియశిష్యులు, సర్వజ్ఞానులు, మీరు వినిపించు అమృతమును గ్రోలి మేము ధన్యులయగుచున్నాము. మహాత్మా ఇంతవరకు అనవద్యకు నాథశర్మ చెప్పిన దానిని మీరు మాకు వివరించుచున్నట్లు తెల్పుచున్నారుగదా! ఆ అనవద్య నాథశర్మలను శివజ్ఞాన దురంధరులు ఎవరు? వారి పూర్వజన్మ వృత్తాంతమేమి? వారికట్టి జ్ఞానమెట్లబ్బినది? వీనిని సవివరముగా తెలియజేయుడని ప్రార్ధింపగా సూతులవారిట్లు తెల్పిరి. నేనుకూడా ఈ రహస్యమును మా గురువునడిగి తెల్సికొంటిని. భగవాన్ బాదరాయణులు నాకిట్లు తెల్పిరి.

పూర్వకాలమున మానససరోవరమునందు ఒక హంసమిధునము విహరించుచుండెడిది. అవి అన్యోన్యప్రేమతో ఆనందముగా యున్నవి. ప్రతిదినము ప్రాతఃకాలమున, ఉదయము, మధ్యాహ్నము, సూర్యాస్తమయమునకు పూర్వము, కాయంత్రము, రాత్రి ఇట్లు షట్కాలములయందు ఆ సరోవరములోని తామరతూడులు తినుచు, రాత్రికి సరోవరము ఒడ్డునగల వటవృక్షమున అవి ఏర్పరచుకొనిన గూటిలో నిద్రించుచు కాలము గడుపుచున్నవి. యక్షరాజు కుబేరుడు తన స్త్రీలతో నిత్యము మానస సరోవర ప్రాంతమున విహరించి, అందు స్నానమాడు, హంకలు కాపురముచేయు అదే వటవృక్షముక్రింద శివార్చనకై రత్న నిర్మిత శివలింగము ప్రతిష్టచేసికొని, భస్మరుద్రాక్షధారుడై ఆలింగమునర్చించిన తర్వాత తన స్త్రీలతో తననగరము అలకాపురికి వెళ్ళుచుండెను.య హంసలు ఆహారమునకై సరోవరములోని స్వర్ణకమలములు వాని తూడులతో సహా చెట్టు పైకి తెచ్చుకొని షట్కాలములయందు వాని ముక్కులతో తూడులుతెంపి, స్వర్ణకమలములు క్రిందకు వదలు చుండినవి. ఆ కమలములు సరాసరి క్రిందనున్న రత్న లింగముపై పడి, ఆ పక్షులకు తెలియకయే షట్కాల శివ లింగార్చన స్వర్ణపుష్పములచే జరుగుచుండెను. తర్వాత హంసలు ఆ తూడులను తినుచుండెను. ఇట్లు నిత్య శివార్చన తర్వాత ఆహారము తీసుకొనుచున్న ఆ హంకలజంట కొంతకాలము జరిగిన తర్వాత, పార్వీ పరమేశ్వరులు, గజానను, షడానన, సర్వగణ సమేతులై వృషభారూఢులై మానస సరోవర తటమున విహారమునకు వచ్చిరి. వటవృక్షము క్రింద రత్న శివలింగముపై నాళరహిత స్వర్ణకమలములు ఒక్కొక్కటిగా పడుచుండుటచూచి, పార్వతి విష్మయమున శివునితో నాథా! ఇదేమి వింత? ఆకాశమున గాని, ఈ ప్రాంతమున గాని ఎప్పరునూ కన్పించుటలేదు, సహస్రనామార్చన చేయుచున్నట్లు ఈ స్వర్ణకమలార్చన ఎట్లు చరుగుచున్నదని అడుగగా, స్వామి నవ్వుచూ పార్వతీ సృష్ఠియందు ప్రాణుల గతి విచిత్రముగా యుండును. అది వాని కర్మపై ఆధారపడి యుండును. సత్కర్మకు సద్గతి, దుష్కర్మకు దుర్గతి కల్గును. కర్మఫలమనుభవించి ఆ జీవి ఆయుర్దాయము పూర్తికాగా యింకనూ కర్మఫలము మిగిలినచో మరల జన్మించవలయును. ఈ విధముగా జీవులు జనన మరణ చక్రమున తగుల్కొని పరిభ్రమించుచున్నారు. ఇది విచిత్రము. ఈ వటవృక్షముపైన చివర కొమ్మలలో ఆకులలో దాగి ఒక గూడు కన్పించుచున్నది చూడుము. అక్కడనుండి ఈ మహాలింగార్చన జరుగుచున్నది. అని శివుడు చెప్పగా పార్వతి ఆశ్చర్యముతో పైకి చూడగా వృక్షముపైనున్న గూటినుండి పుష్పవర్షము కురియుచున్నది.

అపుడు పార్వతి స్వామితో నాథా! పక్షులలో ఇట్టి దుర్లభమగు అనన్య భక్తి ఎట్లు సాధ్యము? ఈ పక్షులు ఈపూజ తెలిసి చేయుచున్నవా? లేక తెలియక యధాలాపముగా జరుగుచున్నదా? విధి వశమున జరుగుచున్నదా? నాకు వినకుతూహలముగా యున్నది. ఇవి భక్తితో చేసినచో తప్పక శివపదము బొందగలవు. తెలియక చేసిననూ ముందు జన్మలలో సద్గతి కల్గును. లేక పూర్వజన్మ సుకృతమున ఇట్లు జరుగుచుండవచ్చును. ఎట్లయిననూ జంతువులకు దుర్లభమయిన మీ పూజ జరుగుచున్నది. దీనివలన అవి తరించుట నిశ్చయము. కాన స్వామీ నాకు వివరముగా తెల్పుడు. పూర్వజన్మలలోని ఏ పుణ్యమున మీసేవా భాగ్యమబ్బినది? ఏపాపము వలన వీటికి పక్షిజన్మ కల్గినది? మీ లీల విచిత్రముగదా!

దేవీ వినుము. వీని పూర్వజన్మ విశేషము, నా పూజా ప్రభావము తెల్పుచున్నాను. భ్రమరాంబా సమేతుడై శూలపాణి విహరించిన మల్లిఖార్జున స్థానమగు శ్రీపర్వతమున ధర్మగుప్తుడను శివజ్ఞాని నివశించుచుండెను. అతడు త్రికాలములయందు మల్లిఖార్జునుని సేవించుచుండెను. ఒకలేడి సమీపమందలి వనములనుండి పారిపోయివచ్చి ధర్మగుప్తుని ఆశ్రమమునకు చేరెను. అతడు దానిని చూసి పుత్రవాత్సల్యముతో దానికి పచ్చి గడ్డిపరకలు, నీరు అందించుచు కాపాడుచుండెను. అతనితోపాటుగా ఆ లేడిపిల్ల అక్కడి బ్రాహ్మణుల కూటీరములలో తిరుగుచు, అతనితోపాటు త్రికాలపూజలకు భ్రమరాంబా, మల్లిఖార్జునులను దర్శించుచుండెను. పూజముగియగనే ధర్మగుప్తుడు ఆ హిరణమునకు, శివ ప్రసాదము భస్మమును చల్లి, అమ్మవారి ప్రసాదము పుష్పములు అలంకరించుచుండెను. ఒకరోజు ఆ మగలేడి తనసహవాసము కొరకు వనమునుండి మరియొక ఆడలేడిని తెచ్చుకొని రెండునూ ఆడుకొనుచు, తిరుగుచు బ్రాహ్మణునకు ఆనందము కల్గించుచుండెను. ఒకనాడు ఆశ్రమ గోవులతోపాటుగా ఆ లేడి జంట వనమునకు వెళ్లి మరల తిరిగి రాలేదు. ధర్మగుప్తుడు విచారముతో వనమంతయూ వెతికినను అవి కన్పించనందున అవి ఏమైయుండును? వేటగాండ్రు ఎవరయిన చంపి తీసికొనివెళ్లిరా? సరస్సులో నీరుత్రాగుటకు వెళ్లి పడిపోయినవా? కొట్టుకొనిపోయినవా? అడవి మృగములబారి పడినవా? నేనెంత మూఢుడను, వానిని పెంచితినేగాని రక్షింపలేకపోతిని. అవి చనిపోయినచో నాకు హత్యాదోషమాపాదింపబడునేమో? ఏమైననేమి చేయగలమని మిన్నకుండెను.

కాలగతిన ఆ లేడి జంట చనిపోయి, వాని పలకునికి క్లేశము కల్గించిన కారణమున మరుజన్మలో వింధ్యపర్వతముపై కిరాత భార్యాభర్తలైరి. ధర్మగుప్తునిచే నిత్యము శివపూజా భస్మము, నిర్మాల్యపుష్పముల అలంకరణచే ఆ మిథునము ఆ బ్రాహ్మణునితోసహా శివపదము చేరియుండవలసినదే, కాని పూర్వజన్మ దుష్కృతముచే విఘ్నము గల్గినది. ఆ విషయము కూడ తెల్పుదునని శివుడు పార్వతి కిట్లు తెల్పెను.

అంతకు పూర్వజన్మలో ఈ లేడి మిథునమే ప్రభాస తీర్థమున బ్రాహ్మణ దంపతులు. ఇద్దరునూ దుష్టులే. దొంగతనము చేసి పొట్ట పోసుకొనుచుండిరి. అక్కడ శంభువిజ్ఞానవంతుడను ఒక శివజ్ఞాని యోగి యుండెడివాడు. ఒకనాడు ఈ దుష్ట బ్రాహ్మణ దంపతులు ఆ శివజ్ఞాని సొమ్ము అపహరించి దొరికిపోయిరి. కాని ఆ యోగి వారిని మందలింపక దయతో అతని యింటిలోనే పనిచేయుటకు నియమించుకొనెను. వారు కొన్ని రోజులు అతనిని మంచి చేసుకొని కేవలు చేయుచు ఒకరాత్రి అతని డబ్బు, నగలు, వస్త్రములు మొత్తము దొంగిలించి ఆ ప్రక్క అడవిలోనికి పారిపోయిరి. అడవిలోని అసలు గజ దొంగలు వీరివద్దనున్న మొత్తము దోచుకొనిరి. ఈ దంపతులు వేరు దిక్కుగానక బిచ్చమెత్తుచు దేశదేశములు తిరుగజొచ్చిరి.

శివజ్ఞాని తన ద్రవ్యమంతయు అపహరింపబడినను, ఆ దంపతులను నిందింపక, వైరాగ్యముచే భోగభాగ్యములు క్షణ భంగురములయినను అజ్ఞానముచే వారట్లు చేసినందులకు వారిని క్షమింపమని భగవంతుని ప్రార్థించెను. వారు దుష్ట బుద్ధులయినను నా సేవ చేసిన సమయమున, నా దైవకార్యములకు కొంతయినను సహాయము చేసి యుండ వచ్చును గదా! ఆ కొద్ది పుణ్యమున వానికి మంచి జరుగు గాక! యని భగవంతుని ప్రార్థించిన కారణమున భక్త సులభుడగు పరమాత్మ తన భక్తుని కోరిక మన్నించుటకుగాని, ఆ దంపతులు చేసిన పాపములకు వారు ఒక కల్పకాలమునకును ఉద్ధరింపబడకపోయినను వారిపై కృపా దృష్టితో రెండు, మూడు జన్మల తర్వాతనే లేడి జంటగా అగునట్లు తలంచెను. మృగములుగా జన్మించినను పూర్వ జన్మ వాసనా ఫలమున వాటిని కాపాడి పోషించిన ఆ మునికి మనస్తాపము కల్గించి పారిపోయినవి. ఆ పాపమున మరుజన్మ కిరాత దంపతులైరి. కాని ఆ లేడి మిథునమునకు సద్గతి కల్గువలెనను ధర్మగుప్తుని కోరికపై కిరాత దంపతులకు మానస సరోవరమున జీవించు హంసల జన్మ కల్గినది. ప్రతి జన్మలోను ఈ దంపతులపై శివభక్తుల అనుగ్రహమువలన ఆ భక్తుల అభీష్టము నెఱవేరుటకై హంసలకు రత్నమయ శివలింగముపై స్వర్ణకమలములచే పూజచేయు భాగ్యమబ్బినది. కనుక వీటిక మరుజన్మలో నాపదమబ్బునని శివుడు పార్వతికి తెల్పెను.

ఈ కథ ద్వారా శివపూజ కన్ననూ శివభక్తుల సేవచే పరమాత్మ ఎక్కువ ప్రీతి చెంది సద్గతి కల్పించునని తేట తెల్లమయినది. పార్వతి పరమాశ్చర్యముతో నాథా! మీ కృపాపాత్రులైన మీ భక్తుల మనోభీష్టము నిర్వర్తించుటకు ఎట్టి పాపాత్ముల నయినను మీరు ఉద్ధరింతులు. మరి ఈ పక్షులు వాటికి తెలియకనే, వాటి పూర్వజన్మ పుణ్య విశేషములేకనే, వాటిపై మీ భక్తుల అనుగ్రహము వలన కల్గిన పుణ్యమువలన మిమ్ము పూజించు ఈ సత్కర్మ ఫలితముగా వారి మరుజన్మ ఏమగును, విన కుతూహలముగా నున్నదని పార్వతి చేతులు జోడించి, స్వామి చరణములకు నమస్కరించి ప్రార్థింపగా స్వామి సంతసించెను. మరల పార్వతి స్వామీ! మీ భక్తుల మహిమ అపారము. బ్రహ్మ, విష్ణు, ఇంద్రుల మహిమను కూడ నష్టపరచును. పర్వతములు వారికి దాసులు. సముద్రము నీటి బిందువంత యగును. కాలమే నష్టమగును. కైలాసము బంతి యగును. విష్ణు చక్రము కంఠమాల యగును. చంద్ర సూర్యులు వెన్నముద్దలగుదురు. త్రిమూర్తులు పసిపాపలగుదురు. జగత్తు తృణభంగురమగును. తృణమే వజ్రమగును. మీ భక్తుల మహిమ మీకు మాత్రమే తెలియును. గనుక ఈ పక్షుల మరుజన్మ ఏమగునని ప్రార్థించెను. ఈ ఆఖ్యానము శివభక్తి పూర్వకముగ వినినవారు పాప సముద్రమునుండి విముక్తులై శివధామము చేరుదురు.

No comments:

Post a Comment