Thursday, April 16, 2009

21 వ అధ్యాయము

మునులు మరల సూతమహామునికి నమస్కరించి కాశీకేదార రహస్యమునికనూ వివరింపుడని కోరగా సూతుడిట్లు వచించిరి. మాంథాత కేదారేశ్వరుని అనేక విధములుగ స్తుతించి స్వామీ మీరు మొదట హిమాలయములందు లింగరూప దర్శనమయిన వారందరకునూ ముక్తి నొసగుచుండిరి. శివాపరాధులకు అక్కడ దర్శనమివ్వనిచ్చగించని మీరు నన్ననుగ్రహించి కాశీలో ఇక్కడ మీ దర్శన భాగ్యము ఇపుడు నాకొసంగిరి. అట్లే ఇక్కడ మీదర్శనము చేసినవారందరకును ముక్తి ప్రసాదింపుడని వేడగా, వెంటనే బ్రహ్మ, విష్ణు మొదలగు దేవతలందరునూ చేతులు జోడించి కేదారేశ్వరునకు నమస్కరించి ప్రభూ! ఇట్టి దుర్లభమగు వరము మీరు అనుగ్రహించినచో క్షణములో నీదర్శనము చేసినవారందరితో కైలాసము నిండిపోయి నరకమున యమునికి గాని ఇక్కడ భైరవునికి గాని, విష్ణు, ఇంద్రాదిదేవతలకు గాని లోకపాలకులకెవరికిని పనియుండదుగదా! మీచే ఏర్పరుపబడిన సృష్ఠి, స్థితి, లయముల నియమముననుసరించి జీవులు వారి సుకృత, దుష్కృతముల వలన స్వర్గ, నరకములు పొందుటనేర్పరచినది మీరేగదా! అట్టి వ్యవస్థ తారుమారయినచో లోకమున మానవులు పాపభీతి వదలి, సుకర్మలు చేయకనే నీ దర్శనముతో ముక్తులగుటకు ప్రయత్నింతురు. గనుక మీరు భక్తుల ననుగ్రహించుటకు గాని, మీ కేదార అంతర్గ్రుహ మందు మాత్రము పాపులకు భైరవ యాతన లేకయే ముక్తి గల్గునట్లు జేయుడని కోరిరి. మీ వరప్రభావమున అర్బుద కల్పములు బ్రహ్మలోగ, విష్ణులోకములలో భోగములనుభవించి పునరావృత్తి రహిత శివధామ ప్రాప్తి నొసగుడని వేడిరి. అపుడు పరమాత్మ ప్రసన్నుడై మాంథాతా! నీవు నా ప్రియ భక్తుడవు గనుక చెప్పుచున్నాను వినుము. కారణాంతరములచే ఇక్కడ నా దర్శనమాత్రమున ముక్తి నీయజాలను. మొదటి మూడు యుగములలో మనుష్యులు ధర్మవంతులుగ నుందురు గనుక ముక్తి సాధ్యము. కాని కలియుగమున పాపులధికముగ నుందురు గనుక దర్శనమాత్రమున ముక్తి బొందిన యడల కర్మశ్ష అనుభవము లయమగుటచే సృష్ఠినియమలోపమగును. గనుక నిశ్చయముగ కాశీ కేదార లింగ దర్శనానంతరము దేశాంతరమున ఎక్కడ మృతి జెందినను ముక్తి తథ్యము. వేరు ఏమార్గమునను అట్టి ముక్తి లభ్యమవదు. ఈ రహస్య వాక్యముపై ధృడ నిశ్చయము గల్గిన వారికి పునరావృత్తి రహిత ముక్తి లభ్యమగును. భోగ మోక్షములు వారి కరతలామలకములు. కాశీలో దేహత్యాగము వలన ఇది నిశ్చయము. కేదారేశ్వరుడు మాంథాతతో మరియు ఇట్లు తెల్పెను. నాయీలింగము ఇపుడు పులగరూప పాషాణముగా తెలియునది. సత్యయుగమున నవరత్నమయముగను, త్రేతాయుగమున బంగారు లింగముగను, ద్వాపరమున వెండిలిగముగను, కలియుగమున ఇట్లు పాషాణముగను కన్పించును. నీచే రెండు భాగములు చేయబడినది హరిహరాత్మకము, శివ శక్త్యాత్మకము. అన్నముచే చేయబడినదగుటచే అన్నపూర్ణయగును. అన్నపూర్ణ సహితముగా నన్నర్చించుటచే వారింట అన్నమునకు సదాలోటుండదు. అంతమున నన్ను జేరుదురు. నా ఎదుట గుప్త తీర్థమునుండి 60 వేల పాతాళ లోక నాగకన్యలు నిత్యము నా దర్శన అర్చన నిమిత్తము వత్తులు. దేవలోకమునుండి అప్సరసలు, దేవతలు నిత్యము నన్నర్చించ వచ్చెదరు. గనుక కాశీ కేదార లింగము సర్వ కామప్రదము. నేను విశ్వనాథ లింగమందెట్లున్నానో అంతకన్న ఎక్కువగ ఈ లింగమందున్నాను. విశ్వనాథుని మణికర్ణిక ఎట్లో అంతకన్న ఎక్కువ మహాత్మ్యము ఈ ప్రాచీన మణికర్ణికది. ఇక్కడ ఢుంఢిరాజు, మాధవుడు, భైరవునితో పాటుగా దండపాణియు గలరు. ఇక్కడ నా అంతర్గ్రుహమున మరణించినవారు భైరవ యాతన లేకయే నా తారకమంత్రోపదేశముచే నా రూపము బొంది నన్ను చేరుదురు. అని శంకరుడు వరమిచ్చి మాంథాతను తన ధామమునకు చేరుమని చెప్పి ఆలింగమందు అదృశ్యుడాయెను. అక్కడి ఋషి పుంగవులు మాంథాతను అనేక వధముల కొనియాడిరి. మాంథాత వెంటనే విశ్వనాథ, కేదార, భైరవ, దండపాణి, ఢుండిరాజ, బిందుమాధవ, మణికర్ణికలను సేవించి పాంచభౌతిక శరీరము త్యజించెను. శివగణములతనిని విమానములో మహా కైలాసమునకు తీసికొని వెళ్ళిరి. మాంథాత విమానములో ఒకమారు కాశికి ప్రదక్షణము చేసి, హిమాలయ కేదారము వెళ్లి అక్కడ శంకరుని దర్శించి, ఒక అంశతో అక్కడ నిత్యము కేదారేశ్వరుని అర్చించు కొనగోరగా ఆకాశవాణి రూపమున పరమేశ్వరుడు అనుజ్ఞనొసంగెను. ఇట్లు కాశీకేదార శివ రహస్యమును వామదేవునకు సనత్కుమారులు వినిపించిరి.

కాశీలో కేదారనాధ మహిమ, గుప్త తీర్థముహిమ అత్యద్భుతములు. శివానుగ్రహముగల వారికి మాత్రమేవీని యందాసక్తిగల్గి కాశీదర్శింతురు. ఒక్కపర్యాయమయినను శ్రీకేదారేశ్వర దర్శనము, ధూప, దీప, నైవేద్య సేవనము జేసిన వారికి జనన మరణ భయములు ఉండవు. వారికి ముక్తి మండప ద్వారములు తెరిచి యుండును. పంచక్రోశాత్మక కాశీ పట్టణమంతయు విశ్వేశ్వర స్వరూపము. మణికర్ణిక సర్వపాప వినాశిని. ఇందు సంశయము లేదు. ఓంకారాది లింగములన్నియూ ముక్తిదాయకములు. చతుష్షష్ఠి యోగినులు గూడ ఇష్టకామ్యముల నిత్తురు. 56 వినాయకులు సిద్ధి నిత్తురు. ద్వాదశాదిత్యులు పాపహరులు. కార్తీకములో పంచ గంగా స్నానము, వైశాఖమున పంచతీర్థములు, మాఘమాసమున శూలటంకేశ్వరుని ఎదురుగా తీర్థము పాపహరము. కాశీలో అన్నదానము పాపహరము. పంచక్రోశమహాయాత్ర నిశ్చయముగ మహాపాపహరము. దండపాణి, మాధవ, ఢుండరాజ, భైరవులు పాప సంహరులు. 500 విష్ణుమూర్తులు పాప సంహారకులు. దుర్గా క్షేత్రము పాపహరము. కాశీలోని అణువణువున గల సర్వ దేవ తీర్థములు పాపహరములు. వినినెవరు వర్ణించ గలరు. విశ్వేశ్వరుడు ఓంకారేశ్వరాది ప్రతి లింగములోను 42 మహాలింగరూపములుగ వర్ధిల్లుచున్నాడు. ప్రతి క్షేత్రమందును విశేషమహిమలు గలవు. శివుడు ఐశ్వర్య ప్రదాత. ఒకప్పుడు విష్ణువుకు, బ్రహ్మకు, ఇంద్ర, అగ్ని, రాక్షస, వరుణ, వాయు, కుబేర, సూర్య, చంద్ర, నక్షత్రమండలమందు గల ధృవ, సప్తర్షి, గ్రహ, అష్ట దిగ్గజ, తక్షక, కర్కోటకాది నాగులు, వశిష్ఠ, దూర్వాసాది బ్రహ్మర్షులు, దివోదాస, హరిశ్చంద్రాది చక్రవర్తులు, ఒకటని వివరించనలవిగాని అనేక దివ్య అనుగ్రహములు చేసి కాశియందు అనేకరూపములుగా నున్నాడు.

ఇట్లు సనత్కుమారునిచే చెప్పబడిన శివ విభూతులు భక్తిపూర్వకముగ విని వామదేవుడు మరల కుతూహలముతో శివ మహాత్మ్యమునిట్లు తెలిసికొనగోరెను.

No comments:

Post a Comment