Friday, April 24, 2009
27 వ అధ్యాయము
మహర్షులు సూతుని, వ్యాస భగవానుని ప్రియశిష్యులు, జ్ఞానసముద్రులగు మహాత్మా! అంబిక పరమాత్మ నడిగిన రహస్యమును వివరింపుడని కోరగా సూతుడు వారికిట్లు తెల్పిరి.
దేవీ నా పూజా పుణ్యవశమున ఈ హంసల జంట బ్రాహ్మణ యోనియందు జన్మించి సుఖశర్మ యనునామముతో నిర్దోష భక్తితో మనలము పూజించి సుఖములకు నాధుడైనందున నాథశర్మగా ప్రసిద్ధి చెందును. నిర్దోషురాలగు అతని భార్య అనవద్య పేరుతో ప్రసిద్ధి చెందును. వీరు బ్రహ్మవేత్తలై నా క్షేత్రములన్నిటిని సేవించి శివతత్వమును కార్తికేయుని ద్వారా తెలిసికొని, అన్ని క్షేత్రముల మహాత్మ్యమును గ్రహించి త్రికాల జ్ఞానులై అహంగ్రహోపాసనద్వారా దేహాభిమానము వదలి ఆత్మానుసంధానులై మనమే వారుగా భావించి అనవద్య ఉమగాను, నాథశర్మ మహేశ్వరుడుగాను కైలాసము చేరుదురు. మనము వారిలో లీనమగుదుము. ప్రమధగణములతో సేవలందుకొందురు. మనభక్తులవైభవమును దర్శించి ఆనందమనుభవించెదము. అనేక బ్రహ్మ కల్పముల తర్వాత, విష్ణు కల్పమారంభమగును. అనేక విష్ణు కల్పముల తర్వాత రుద్ర కల్పమగును. అపుడు మనము మహాకైలాసమున కేగెదము. ఉమామహేశ్వరాత్మక కల్పమువరకు వీరు మనవద్ద ముక్త స్థితులై మనలో లీనమగుదురు. జగద్వ్యవహారము కొరకు మనము క్షణికలీల, నిత్యలీల, మరియు భక్తులను ఉద్ధరించుటకు దీర్ఘలీలలు నిర్వహింపవలయును. భక్తులను తృప్తులను చేయుటయే లీలావిశేషము. భక్తశులభుడగునేను శంభువిజ్ఞానుని ఆశీర్వాదము నెఱవేర్చుటకు ఈ దంపతులకు ఇన్ని జన్మలలో క్రమక్రమముగా వీరినిట్లు ఉద్ధరించ వలసివచ్చినది.
ఇట్టి వృత్తాంతమును శివునివద్ద తెలిసికొని పార్వతి సంతసించి స్వామికి నమస్కరించి ఆ హంసలను కృపాదృష్టితో దీవించి వృషభవాహనారూఢులై పార్వతీ పరమేశ్వరును మహాకైలాసమునకేగిరి. కాలగమనమున ఆ హంసలు వేదశాస్త్రార్ధసంపన్నులగు బ్రాహ్మణ కుటుంబములందు జన్మించిరి. దంపతులై యోగ ప్రవృత్తులై అనవద్య, నాథశర్మలుగా ప్రసిద్ధులై అనేకానేక శివక్షేత్రములు దర్శించి, కాశి, కేదార, నేపాల, గోకర్ణ, భువనేశ్వర, శ్రీపర్వత, త్ర్యంబకేశ్వర, విరూపాక్ష, కాళహస్తి, కంచి, శోణాద్రి, అంధకాసుర, సుదనేశ్వర, గోపర్వతేశ్వర, నవనీతేశ్వర, వృద్ధగిరీశ్వర, శ్రీమచ్ఛిదంబర సభ, బ్రహ్మేశ్వర, వైద్యనాథ, ఛాయావన, శ్వేతవన, అమృతకుభ, త్రయీవన, వాల్మీక, శ్రీవాంఛ, మధ్యార్జున, మయూరనాథ, పంపాపురి, వాతపురి, సేతునాథ, బలేశ్వర, నందీశ, శాలివాటి, శ్రీమద్బలాస్యనాధ, శ్రీకంఠ, మాతృభూతేశ, జంబీశ, బృహదీశ్వర, పంచనద, కుంభకోణ, వటకానన, హిమాచల, విధ్యగిరి, గుహ్య, మలయ పర్వతములు, గంగ పూర్వాపరములు, యమున పూర్వాపరములు, నర్మద, గోదావరి, కృష్ణవేణి, క్షీరనది, పినాకిని, హరితపురి, సంక్షేపముగ హిమాలయ, సేతుబంధములమధ్యగల మఖిలశివ క్షేత్రములు, మరుద్వధ, పూర్వాపరములతర్వాత, తాలకాననము చేరిరి. అక్కడ తాలవనేశ్వరుని పూజించి రాత్రికి అక్కడ విశ్రమించిరి. తాలవనేశ్వరమహేదేవుడు భక్త రక్షణకొరకు రక్తవర్ణ, ఆకుపచ్చ జటలతో అక్కడ కొలువుతీరినాడు. ఈ దంపతులు మహాదేవుని, నిర్మల భక్తితో ప్రార్ధించి తమను ఉద్ధరింపమని వేడగా, వారి స్వప్నమందు దర్శనమిచ్చి ప్రేమపూర్వక గంభీర స్వరముతో భక్తులారా! ఈ పర్వతపు నైఋతి కోణమున కావేరికి ఉత్తర తీరమున మీరు వెళ్ళి కార్తికేయుని ద్వారా ప్రణవజ్ఞానమును ఉపదేశము పొందుడు. ఆ నిర్ద్వంద శివ జ్ఞానముతో నా పదము జేరుదురు అని పల్కి అంతర్ధానము జెందేను.
తెల్లవారగనే దంపతులు లేచి మహాతీర్థమున స్నానమాడి, భస్మ రుద్రాక్ష ధారులై త్రిపుండ్రములు ధరించి పంచాక్షరి జపించి, రుద్రపారాయణ చేసి, పార్వతీ పరమేశ్వరులను మనసా స్తుతించి మీ ఆజ్ఞచే మేము వెళ్లి కార్తికేయుని ప్రార్ధించి వారి ఉపదేశము పొందుదుము, దయతో మీలో చేర్చు కొనుడని ప్రార్ధించి బయలుదేరి ధృడనిశ్చయముతో కార్తికేయుని పుర్వ భక్తులు అగస్త్యాది ఆచార్య వర్యులను చేరి నాల్గుదిక్కులు ప్రదక్షిణ చేసి నైఋతి కోణమున స్కందుని ఎదుట నిలిచి చేతులు జోడించి, స్వామీ మేము మీ శరణు జొచ్చినాము, దయతో మాకు దీక్ష నిచ్చి, మీ అధీనులమయిన మాకు సదా మీ పాదాబ్జముల సేవాభాగ్యము అనుగ్రహింపుడని దీనముగా ప్రార్ధించిరి. అపుడు కార్తికేయుడు తృప్తుడై వారితో ఇట్లనెను.
మీరు శివాజ్ఞచే నావద్దకు వచ్చిరి. పరశివ మహిమా రహస్యమును మీకు అనుగ్రహించితిని. ఈ క్షణమునుండి అఖిల శివజ్ఞాన ఆనంద బోధమీపరమైనదని ఆశీర్వదించిరి. ఆ దంపతులు పరమానందముతో షణ్ముఖుని కీర్తించి మనసా, వాచా, కర్మణా వారు తమ సర్వస్వము స్వామి కర్పించుకొని లీలా వినోదముగా శివక్షేత్ర దర్శనము కొరకు బయలుదేరిరి. కార్తికేయుడు మరల వారినుద్దేశించి, భక్తులారా! పూర్వజన్మలలో మీ ద్వారా కించిత్ శివాపరాధము జరిగిన కారణముగా, దాని నిర్మూలనతో సంపూర్ణ ఫలితమునకు మీరు వెంటనే కాశీ కేదార గుప్త తీర్థ సేవనము చేసి పరమ పదము పొందుడనెను. వెంటనే వారు కుమారస్వామి ఆజ్ఞ శిరసావహించి దారిలోని శివ క్షేత్రములను దర్శించుచు, వాని మహాత్మ్యమును గ్రహించి స్తుతించుచు చివరకు కాశీ కేదార క్షేత్రము చేరిరి. విశ్వేశ్వరాది సర్వదేవతలను, ఒంకారాది సర్వలింగములము, జ్ఞానవాపి మొదలగు తీర్ధములను సేవించుకొని పంచ క్రోశయాత్రలోని సర్వదేవతలను పూజించి చివరగా కేదార గుప్త తీర్ధము చేరి విధి పూర్వకముగా స్నానమాడి, పూర్వ జన్మలలోని శివాపరాధము, శివ జ్ఞానయోగులయడల తాము జరిపిన అపరాధములనుండి ముక్తులై, దీక్షా గురు శ్రీకార్తికేయ ముఖకమలమునుండి గ్రహించిన ఉపదేశమును విధివిధానముగా సాధన చేయుచు పరమేశ్వరుని యందు చిత్తము ఏకీకృతమొనరించి ఎండిన మానులవలె నిశ్చలమైన వారి నిరంతర తైలధారాపూర్వక ధ్యానమునకు సంతసించి పార్వతీ పరమేశ్వరులు ప్రసన్నులై వారికి తమ దేహముల నొసంగిరి. వారి అంశమును ఆ దంపతుల దేహములందు ప్రవేశింపజేసిరి. రుద్రకల్పము వరకు వారు దేహ ధారులై, కల్పాంతమున విదేహముక్తి బొందిరి.
కేశీ కేదారేశ్వరుని మహిమ అట్టిది. శివపార్వతుల లీలలు అపారము. మునులారా వినుడు, నా సద్గురు కృపచే నాకీ వేదరహస్యము బోధింపబడినది. నాథశర్మ, అనవద్యల జన్మవృత్తాంతము వినినవారికి జ్ఞానాంకరము ఉదయించి, మాయా వృతము విడివడి పక్వమైన ఫలము చేతికంది ముక్తులగుదురు. ఈ సద్రహస్య అమృతభాండమును మీకందించు సంకల్పము నాకు కల్గుట నాభాగ్యము. సంసార సముద్రమును అవలీలగా తరించు రహస్యము గ్రహించితిరి. ఉమాకాంత స్మరణతో మునులు సూతుని స్తుతించి, గురుదేవా! మాకు అనేక శివకథలు వినిపించితిరి. క్షేత్రమహిమలలో భేదము, భక్తులనుద్ధరించుటలో భేదము, రాజుల మనోవృత్తులలో భేదము, బ్రహ్మ సృష్టిలోనే భేదము. ఇవన్నియూ పూర్వాపరములెట్లు తెలిసికొనగలము? మీరు పౌరాణికిలుగా సకల పురాణముల వచించితిరి, ఈ భేదమెట్లు కల్గినది? ఇతిహాసములు జగత్ సత్యముగా భాసింపజేయుచున్నవి, సృష్ఠి, స్థితి, లయములలో కల్పభేదములు తెలియుచున్నవి? ఈ సంశయమును మానుండి దూరముచేయుడని కోరిరి.
అపుడు సూతుడు, మునులారా! ఒక్కొక్క కల్పమందు పరమాత్మ లీలా విశేషములు భిన్నముగా యుండును. బ్రహ్మాది కీట పర్యంతము వారి సంచిత పుణ్య పాపముల ననుసరించి భేదములు కల్గుచుండును. పురాణములలో భేదమున్నట్లు కన్పించునేగాని, వస్తుతః అట్టి భేదమేమియు లేదు. శాస్త్రములన్నియూ సత్యములే. కలగతి ననుసరించిన భేదమేకాని, శివమహిమలో మార్పులేదు. బుద్ధిమంతులు ఆదినుండి అంతము వరకు సవిస్తరముగ గ్రహించిన యడల ప్రేమ పూర్వకముగ శివుని భజించుట ద్వారా గ్రహించగలరు. బ్రాహ్మణ శ్రేష్ఠులారా! సంశయము విడిచి అన్ని విచిత్రకథలలోని తాత్పర్యము శివధామము చేరు మార్గము భక్తి ఒక్కటిగానే గ్రహించుడు. ఈ కథము విన్నవారు సద్గతిని బొంది శివధామము జేరుదురు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment