Saturday, September 9, 2017

పంచక్రోశీ కాశీ ప్రదక్షిణ యాత్ర -- మాహాత్మ్యము

శ్లో॥ విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణించ భైరవమ్
వన్దే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికామ్ ॥
శ్లో॥ పంచక్రోశాత్మకాయ మహాలింగాయ
జ్యోతిర్లింగ స్వరూపాయ కాశీవిశ్వేశ్వరాయ
శ్రీ శివాయ నమః

కాశీ పరిమాణము

కాశీ యందు కాలభైరవ సమీపమునందు మధ్యమేశ్వర లింగము కలదు. ఆ మధ్యమేశ్వరుని కేంద్రముగా జేసి అక్కడినుండి పడమటి దిశయందుగల దేహలీ వినాయకునివరకు సూత్రమును పట్టి, దానిని అర్థవ్యాసముగ జేసి, మండలాకారముగ చుట్టినచో, ఆ పరిధిలోపలగల క్షేత్రమును “పంచక్రోశాత్మక కాశి” యని పురాణములు ప్రవచించినవి. ఇచ్చట ముక్తి ప్రతిష్ఠితమైయుండును. ఈ పరమ క్షేత్రము విశేష ఫలసాధనమైనది.

వారణాసీ పరిమాణము

తూర్పు దిక్కున "గంగానది" మధ్యభాగము, దక్షిణమున "అసీ" నది, పడమటి దిశయందు "పాశపాణి వినాయకుడు", ఉత్తరమున "వరణానది" అవధిగా కల్గి, ఆ మధ్యనున్న క్షేత్రము "వారాణసి". ఇది దివ్యమును విశేష ఫలసాధనమునైనది.

అవిముక్త పరిమాణము

విశ్వేశ్వర లింగమునుండి నాల్గు దిక్కులందు రెండువందల ధనుస్సుల పరిధిలోపల నున్న ప్రదేశము "అవిముక్తము". ఈ క్షేత్రమునందు ముక్తి అవశ్యము లభించును. ఏ మాత్రము సందేహము లేదు.

అంతర్గృహ పరిమాణము

తూర్పున "మణికర్ణికేశ్వరుడు", దక్షిణమున "బ్రహ్మేశ్వరుడు", పడమటి దిశ యందు "గోకర్ణేశ్వరుడు", ఉత్తరమున "భారభూతేశ్వరుడు" సరిహద్దులుగాగల క్షేత్రము "విశ్వనాథుని గృహము". ఈ క్షేత్రమునే "అంతర్గృహము" అందురు.

కాశి కంటె వారణాసి, వారణాసి కంటె అవిముక్తము, అవిముక్తము కంటె అంతర్గృహము పరిమాణములో చిన్నవి. అనగా కాశీపరిధి లోపల వారాణసి, వారాణసి పరిధిలోపల అవిముక్తము, అవిముక్తము పరిధిలోపల అంతర్గృహము నున్నవని గ్రహించవలెను.

కాశీకృత పాపముల నుండి ముక్తి

ఓ కాశీనాథ! కాశీయందు చేసిన పాపముల విముక్తికి సులభోపాయ మేమి? యని పార్వతి ప్రార్ధించగా విశ్వనాధుడిట్లు పల్కెను.

శ్లో॥ అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి
పుణ్యక్షేత్రే కృతం పాపం గంగా తీరే వినశ్యతి ॥
శ్లో॥ గంగా తీరే కృతం పాపం కాశీం ప్రాప్య వినశ్యతి
కాశ్యాంతు యత్కృతం పాపం వారాణస్యాం వినశ్యతి ॥
శ్లో॥ వారాణస్యాం కృతం పాపమవిముక్తే వినశ్యతి
అవిముక్తే కృతం పాపం అంతర్గేహే వినశ్యతి ॥
శ్లో॥ అంతర్గేహే కృతం పాపం వజ్రలేపో భవిష్యతి
వజ్రలేపచ్ఛిదం హ్యేతత్ పంచక్రోశ ప్రదక్షిణమ్॥
శ్లో॥ తస్మాత్ సర్వప్రయత్నేన కుర్యాత్ క్షేత్ర ప్రదక్షిణమ్

మనుష్యుడు అన్యక్షేత్రములందు చేసిన పాపములు పుణ్య క్షేత్రములందు నశించును. పుణ్యక్షేత్రములందు చేసిన పాపములు గంగాతీరమున నశించును. గంగాతీరమునందు చేసిన పాపములు కాశీయందు ప్రవేశించిన తోడనే నశించును. కాశీయందు చేసిన పాపములు వారాణసియందు నశించును. వారాణసియందు చేసిన పాపములు అవిముక్తమునందు నశించును. అవిముక్తమునందు చేసిన పాపములు అంతర్గృహమునందు నశించును. అంతర్గృహమునందు చేసిన పాపములు వజ్రలేపము వంటివి. అనగా పాపకర్తను విడిచి వెళ్లవని భావము. ఆ వజ్రలేపము వంటి పాపము పంచక్రోశాత్మక జ్యోతిర్లింగ స్వరూపమగు కాశీ ప్రదక్షిణ యాత్ర వలన మాత్రమే తొలగును. కావున కాశీ వాసులు సర్వవిధముల ప్రయత్నించి, పంచక్రోశీ కాశీ ప్రదక్షిణ యాత్రను అవశ్యమాచరింప వలెను.

No comments:

Post a Comment