Saturday, September 16, 2017

పంచక్రోశీ కాశీ యాత్ర - మహాత్మ్యము - నాలుగవ భాగము

పంచక్రోశ యాత్ర యందు వాహననియమములు

శ్లో॥ పంచక్రోశ్యాశ్చ సీమానం ప్రాప్య దేవో జనార్దనః
వైనతేయా దవరుహ్య కరే ధృత్వా ధ్రువం తతః ॥ (కా. ఖం.)
విష్ణు భగవానుడు ధృవునితో కూడి గరుడ వాహనుడై కాశీ యాత్రకు వచ్చినప్పుడు, కాశీ సీమకు బయట గరుడుని నుండి దిగినాడు. ధ్రువుని చేతితో పట్టుకొని పాదచారియై కాశీ ప్రవేశము చేసెను.
కావున కాశీయందు వాహనారూఢులై యాత్రలు చేయరాదు.

శ్లో॥ బలీవర్దం సమారూఢాః శ్రుణు తస్యాపి యత్ఫలమ్
నరకే వసతే ఘోరే సమాః కల్పశతాయుతమ్ ॥
ఎడ్లబండిపై యాత్రలు గావించువారు పదివేల సంవత్సరములు ఘోర నరకమునందు పడుదురు.

శ్లో॥ సలిలంచ న గృహ్ణంతి పితరస్తస్య దేహినః
ఐశ్వర్య మదలోభ మోహాద్వా గచ్ఛేద్యానే నహియో నరః ॥
ఐశ్వర్య, మద, లోభ, మోహముల వలన వాహనముల నధిష్ఠించి యాత్రలు చేయువారి పితరులు వారి చేతులతో వదలు జలమును కూడ స్వీకరించరు.

శ్లో॥ నిష్ఫలం తస్య తత్తీర్థం తస్మాద్యానం వివర్జయేత్ ॥
వారి పంచక్రోశ యాత్ర నిష్ఫలమగును. కావున వాహనారూఢులై యాత్రలు చేయుట తగదు. (కూ. పు.)

శ్లో॥ నరయానం చాశ్వతరీ హయాది సహితో రథః
తీర్థయాత్రా హ్యశక్తానాం యాన దోష కరీ నహి ॥ (కూ. పు.)
అశక్తులు గుఱ్ఱపుబండిపై గాని, లేక పల్లకీపై(డోలీ) గాని యాత్ర చేయుట వలన దోషముండదు. శక్తి యున్నవారు పై విధముగా చేయుట సముచితము కాదు.

శ్లో॥ గోయానే గోవధః ప్రోక్తో హయ యానే తు నిష్ఫలమ్
నరయానే తదర్ధస్స్యాత్ పద్భ్యాం తచ్చ చతుర్గుణః ॥ (కూ.పు.)
శక్తి యుండి ఎడ్ల బండిపై యాత్ర చేయుట వలన గోహత్యా పాపము కల్గును. గుఱ్ఱపు బండి యాత్ర నిష్ఫలము. పల్లకీలో (డోలీ) యాత్ర వలన అర్ధ ఫలము. పాదయాత్ర వలన నాలుగు రెట్లు ఫలము లభించును.

శ్లో॥ పద్భ్యామ్ పాదుకా శూన్యా భ్యామ్ ॥ (వి.పు.)
పాదయాత్ర చేయువారు పాదరక్షలు (చెప్పులు) ధరింపరాదు.

శ్లో॥ యానమర్ధఫలం హన్తి తదర్థం ఛత్రపాదుకే
వాణిజ్యం త్రీస్తద్భాగాన్ సర్వం హన్తి ప్రతిగ్రహః ॥
వాహనముపై యాత్ర వలన సగము ఫలము నశించును. గొడుగు, పాదరక్షలు ధరించి యాత్ర చేయుట వలన దాని కంటె సగము ఫలము నశించును. యాత్రలో వాణిజ్యము వలన మూడుభాగములు, యాత్రలో ప్రతిగ్రహము వలన ఫలమంతయు నశించును.

గమనిక : పాదరక్షలు లేకుండ నడవలేని వారు పాదములకు వస్త్రములను కట్టుకొని యాత్ర చేయవచ్చును. నడచుటకు శక్తియుండియు మోటరు, ఆటోలు, ఆదిగా గల వాహనములనెక్కి, యాత్రలు చేయుట నిష్ఫలము. శరీరము కష్టపడుట వలననే పాపమునకు ప్రాయశ్చిత్తము. సమర్ధులై యుండియు వాహనములపై యాత్రలు చేయుట వలన తీర్థ మర్యాదకు భంగము కల్గును. ఇతర యాత్రికులు మనలను అనుసరించుట వలన మనకా పాపము సంక్రమించును. మనకు నియమానుసారము యాత్రలు చేయుటకు శక్తిలేనప్పుడు మన గోత్ర నామములతో మనకు ప్రతినిధిగా మఱొకరిని పంపి పంచక్రోశయాత్రను చేయింప వచ్చును. స్వర్గవాసులైన మన పితరుల నిమిత్తముగా సైతము ప్రతినిధిద్వారా యాత్రలు చేయించవచ్చును. అయితే ఆ ప్రతినిధులు యాత్రా నియమములను పాటించవలెను.

పాదయాత్ర చేయలేని అసమర్ధులు యథావిధిగ ఆజ్ఞామంత్ర, సంకల్పాదులు గావించి, అస్సీఘాటు దగ్గర ఆటో మున్నగు వాహనములపై నెక్కి యాత్రను ప్రారంభించవలెను. అనంతరము దుర్గా మందిరమునకు వెళ్లి దుర్గాదేవిని దర్శించవలెను. అక్కడినుండి మరల అస్సీఘాటునకు వచ్చి, పంచక్రోశీ మార్గములోని దేవతాగణములను యధావిధిగా దర్శించుచూ యవ వినాయకుని వరకు వచ్చి, యవ వినాయకుని యవలతో పూజించవలెను. ఆ పిమ్మట అక్కడనుండి గంగానదిలో పడవనెక్కి "విష్ణవేనమః" యని యవలు చల్లుకొనుచు, గంగా తీరమందలి దేవతా మూర్తులను స్మరించుచూ, అస్సీ ఘాటు వరకు రావలెను. అప్పుడు పంచక్రోశీ కాశీ ప్రదక్షిణయగును. పాదయాత్రను చేయలేని వారు మాత్రమే ఈ వాహన యాత్రను చేయవలెను.

No comments:

Post a Comment