Wednesday, September 20, 2017

పంచక్రోశీ కాశీ యాత్ర - మహాత్మ్యము - ఆరవ భాగము

యాత్రానియమములు
  1. పాదరక్షలు ఉపయోగించకుండ పాదయాత్రతో పంచ క్రోశీ యాత్రను చేయుట సర్వోత్తమము.
  2. మార్గమధ్యమందుగాని, మజిలీలయందుగాని మల, మూత్ర విసర్జన, తినుట, జలాదుల పానము మున్నగు పనులన్నియు పంచక్రోశ మార్గపు రోడ్డునకు ఎడమ వైపుననే చేసికొని, పాద ప్రక్షాళన ఆచమనములు చేయవలెను. మజిలీకి తరువాతి మజిలీకి మధ్య కూర్చుండరాదు. ఒక వేళ కూర్చున్నచో ఆ దోష పరిహారముగ కనీసము ఒక రూపాయిని ఆ కూర్చున్న ప్రదేశమునందుంచుట ఆచారముగ నున్నది.
  3. యాత్రా ప్రారంభమునకు ముందురోజునందును, యాత్రాదినములలో మజిలీలందును హవిషాన్నమును గాని ఫలాదికములను గాని తినవలెను. ఉల్లి, పప్పులు, నూనె, ఉప్పు, కారము, దుష్టాహారము భుజింపరాదు. ఉప్పునకు బదులు సైంధవ లవణము, కారమునకు బదులు మిరియముల పొడి వాడుకొనవలెను.
  4. పరాన్నమును భుజింపరాదు. ప్రతిగ్రహము నిషిద్ధము. ఇతరుల వస్తువులను తీసికొనరాదు. పరభార్యా సల్లాపములు చేయరాదు. బ్రహ్మ చర్యమును పాటింపవలెను. దుష్ట సాంగత్యమును వీడి సత్సంగముతో కాలమును గడుపవలెను. నేలపై శయనించవలెను.
  5. విశ్రాంతి సమయములందు పురాణ పఠన, భజన, స్తోత్ర పారాయణాదులతో సత్కాలక్షేపము చేయ వలెను.
  6. యథాశక్తిగా దానముల నీయవలెను.
  7. మజిలీలయందు అక్కడి తీర్థములందు స్నానమును చేసి, పితృతర్పణములు వీలున్నచో పిండప్రదానములు, అభిషేకాది అర్చనలు యధానుకూలముగ అవశ్యము ఆచరింపవలెను.
  8. పంచక్రోశీ మార్గమందు రోడ్డునకు కుడివైపున దేవతా గణములుందురు. యాత్రికులు రోడ్డునకు ఎడమ వైపున నడచుచూ, రోడ్డును దాటి, కుడివైపున గల దేవతా గణములను దర్శించి, ఆర్ద్రాక్షతలు, గంగాజలము, బిల్వదళములు దక్షిణలు, నివేదనలు (పంచదార గుండ్లు మున్నగునవి) సమర్పించవలెను. దేవతా గణములను దర్శించిన పిమ్మట మరల ఎడమవైపున తాము విడిచిన ప్రదేశమును కలుపుకొనుచు యాత్రను కొనసాగించవలెను. యాత్రా మార్గమును కొంచెము కూడ విడువ రాదు. వ్యర్థ సంభాషణలు చేయరాదు.
      పంచక్రోశాత్మకాయ, మహాలింగాయ, జ్యోతిర్లింగ స్వరూపాయ, కాశీ విశ్వేశ్వరాయ, శ్రీ శివాయనమః
అని పల్కుచు యాత్రను కొనసాగించవలెను. మజిలీలయందు పంచక్రోశీ రోడ్డునకు ఎడమవైపునందున్న ధర్మశాలలందు మాత్రమే బస చేయవలెను.

No comments:

Post a Comment