Wednesday, December 3, 2008

ప్రథమాధ్యాయము



శ్రీ గణేశాయ నమః

బ్రహ్మవైవర్త పురాణాంతర్గత
కాశీ మూల రహస్యమందలి
శ్రీ కాశీ కేదార ఖండ మహాత్మ్యము


ప్రథమాధ్యాయము
విఘ్నాంధకారమును దూరము చేయు సూర్యుని వంటి వాడు, విఘ్నాటవిని దాహము చేయు అగ్నిరూపుడు, విఘ్నరూప సర్పకులనాశకుడు గరుడుని వంటివాడు, విఘ్నరూప గజహంతక సింహము వంటివాడు, విఘ్నరూప పర్వతములను ఛేదించు వజ్రమువంటివాడు, విఘ్నసాగరమును ఆచమనము జేయు అగస్త్యుని వంటివాడు, విఘ్నరూప ప్రచండ గండ శిలలను కైతము ఎగరద్రోలు శక్తి సంపన్నుడు వాయువుతో సమానుడగు గణపతి కర్వదా రక్షకుడై యుండుగాక!
చతుర్ముఖుడుగాకున్ననూ బ్రహ్మ సమానుడు, రెండు బాహువులుగలవాడైననూ విష్ణు సమానుడు, మూడవ నేత్రము లేకున్ననూ శంకరునితో సమానుడగు గురుదేవులు వేదవ్యాసమహనీయునకు ప్రణామములు.
బ్రహ్మదేవుడు మహర్షుల కోరికపై వారికి తపోభూమిని నిర్ణయించుట కొరకు ఒక మనోమయ చక్రమును సృష్ఠించి వదలగా, భూతలమున అది పడిన చోటు నైమిశారణ్యముగా తపోభూమి అయినది.
“ఏతన్మనోమయం చక్రం మయా సృష్టం విశృజ్యతే ।
యత్రాస్థశీర్యతే నేమిః, సదేశ స్తపః శుభమ్ ।।"
శౌనకాది మహర్షులు నైమిశారణ్యమున విశ్వజిత్ యను సత్రయాగమారంభించి, చాలకాలము శివంచాక్షరీ మంత్ర జప, పారాయణ, హవనములతో, శివాగమ రహస్యము, శృతా శాస్త్ర విచారము జరుపుచుండిరి.
అందు శౌనకుడు, అత్రి, భరద్వాజుడు, వశిష్ఠ, గాలవ, శాతాతప, పర్వత, నారద, జైమిని, పైల, మేధాతిథి, కణ్వ, గార్గ్య ఆదిగాగల, కొందరు రాళ్లు తినేవారు, పుణ్యతప, క్రతు, కాదుడు, ఎండుటాకులు తినువారు, పచ్చి గడ్డి తినువారు, నక్త దీక్షతో రాత్రి మాత్రమే భుజించువారు, తిల భక్షకులు, ఱాతిని పిండిచేసుకొని భుజించువారు, ఆకులపై నిద్రించు జాబాలి, సూర్య రశ్మి ఆహారము గ జీవించువారు, పొగ, జలము, వాయు భక్షకులు, వాయు నిరోధకులు, దీర్ఘరోములు, తృణబిందు భక్షక పతంజలి, వ్యాఘ్రపాద, భస్మ సాయి రోమశుడు, కౌశిక, క్షుప, పక్షమున కొకమారు శ్వాసవదలు సుశర్మ, మాసములకొకమారు శ్వాసవదలు బ్రహ్మశర్మ, ఆరునెలలకు శ్వాసవదలు ఋభు, ఆరు సంపత్సరములకు శ్వాసవదలు హరీతుడు, 12 సంవత్సరములకు శ్వాస వదలు ఉపకాశలుడు, ఇట్టి కోట్ల కొలది దూరదర్శులు ఋషులు సర్వాంగములయందు వీభుది ధరించి, నుదుట త్రిపుండ్రములు ధరించి, రుద్రాక్షమాలలు ధరించి, శివ జ్ఞాన రహస్యమును విచారించుచుండిరి.
ఆ సమయమున, సర్వదర్శి, వ్యాస భగవానుని శిష్యుడు, బుద్ధిశాని, రోమహర్షణుని పుత్రుడునగు సూతుమహర్షి అచట కేతెంచిరి.
శౌనకాదులు సూతుని అర్ఘ్య పాద్యాది సేవలతో పూజించి ఉన్నతాసీనుని గావించి, శివ జ్ఞాన రహస్యముల నెఱిగింప వేడిరి. సూతమహర్షి శౌనకాదులకు సర్వదుఃఖ హరమగు కేదారేశ్వర మహాత్మ్యమును వినిపింప దొడగిరి. అష్టాదశపురాణములలో పది పురాణములు శివమహాత్మ్య వర్ణనములు. నాలుగు లక్షల పురాణములు, లక్ష ఉపపురాణములు, ఉప స్మృతి సమేత స్మృతులు 95,000, నాలుగు లక్షల జ్యోతిషగ్రంధములు, భారత ఇతిహాసములు ఒక లక్ష ఇరువదిఅయిదు వేలు, చతుర్వేదముల గ్రంధసంఖ్య ఒక లక్ష, మంత్రశాఖలు నాలుగు లక్షలు. పరమేశ్వరుని రహస్యము ప్రళయకాల జలమందు కుశాగ్రమునుండి పడు ఒక నీటిబొట్టంతయును గూడ తెలియజాలరు. పురాణ, ఇతిహాసములలో తీర్థ క్షేత్రముల ప్రసంశ కాశీ క్షేత్రమున లింగముల మహిమ, ఋషులు, దేవతలు, మహిమాన్వితులు, నదులు, పర్వతములు, వృక్షముల ప్రసంశ, ఋషులు వక్కాణించి యున్నారు. ఇవి తొమ్మిది లక్షలు గలవు. అన్ని గ్రంథములలోను కాశీ వర్ణనము గలదు. కాశీ ప్రాధాన్యత కేవలము శివునకు మాత్రమే తెలియును. ప్రతి కల్పమందును, మన్వంతరమందును, వ్యాసమహర్షి వేదవిభజనము చేయగా మిగిలినవి శృతులు. ధర్మశాస్త్రములు, పురాణములు శృతి, స్మృతల నాశ్రయించి యుండును. పరమేశ్వరుడు స్వయముగ వేదములను, ఆగమములను కల్పించెను. శంకరుని డమరుక నాదమునుండి 14 సూత్రములు ఉత్పన్నమయినవి అవి
1.అ, ఇ, ఉణ్
2.ఋ, లుక్
3.ఎ, ఓ, ఇ
4.ఏ, ఔ, చ్
5.హ, య, వ, ర, ట్
6.ల, ణ్
7.ఙ, మ, డ , ణ, న, మ్
8.జ్ఞ, భ, జ
9.ఘ, ట, ఘష్
10.జ, బ, గ, డ, దశ్
11.ఘ, ఫ, ఛ, ఠ, థ, చ, ట, తప్
12.క, ప, యు
13.శ, ష, స, ర
14.హల్

వీనినుండి శబ్దములు పుట్టినవి. నా గురుదేవులు వేదవ్యాసుని చరణ సేవచే నాకు వారితో కాశీ దర్శనము, తర్వాత కేదార దర్శనము కొరకు హిమాలయములు దర్శించి కేదారేశ్వరుని అద్భుత వైభవము అనుభవించితిని.
సనత్కుమార, వామదేవ సంవాద రూపమగు అద్భుత శివ రహస్యమును వ్యాస భగవానుని ద్వారా విని యుంటిని.
ప్రథమాధ్యాయము సమాప్తము

No comments:

Post a Comment