Monday, December 29, 2008

ద్వాదశోధ్యాయము

శౌనకాదులు, సూతునిచే సరస్వతీదేవి పూర్వ కథా వృత్తాంతమును వినగోరగా వారికి సూతుడిట్లు తెల్పిరి.

సరస్వతి గంగాదేవితో, మాతా! పూర్వము పితామహడు బ్రహ్మ, విద్యారూపియగు పరాశక్తిని మనస్సున తలంచి పదివేల సంవత్సరములు తపమాచరింపగా, పరాశక్తి సుందర రూపముతో కన్యగా అవతరించినది. ఆమెయే నేను. నా సౌందర్యమునకు విచలితుడయిన బ్రహ్మ మనమున కామావేశము గల్గి నన్ను పట్టుకొని రమించగోరెను. మాయోమోహమున బ్రహ్మ పరాశక్తిగా నన్ను గుర్తించలేకపోయెను. కన్యగానున్న నేను బ్రహ్మతో నీ తపోబలమున రూపదాల్చిన నేను ధర్మపరముగా నీ పుత్రికను. అట్టి నాపై నీకు మోహము తగదని నివారించిననూ బ్రహ్మ వినకపోవుటతో, బ్రహ్మయొక్క బలాత్కారమును తప్పించుకొనుటకు నేను లేడి రూపము దాల్చి పారిపోజూచితిని. కాని బ్రహ్మ కూడ మగలేడి రూపమున నన్ను వెంబడించెను.


పరాశక్తి నవ్వుచూ శంకరునితో స్వామీ బ్రహ్మ స్థతి చూడుడు, నన్ను పదివేల సంవత్సరములు ప్రార్థించగా నేను కన్య రూపమున దర్శనమిచ్చితిని. కానీ మీ మాయోవశుడమున బ్రహ్మ నా సౌందర్యమునకు విచలుడై ఇట్లు ప్రవర్తించుచున్నాడు. కనుకమీరు బ్రహ్మకు తగిన శిక్షనొసగుడు. తరువాత ఆ కన్యనతనికి ప్రసాదింపుడు. మనసా రమించిన స్త్రీ ఆ పురుషునిదే యగును. లేనిచో ధర్మ విరుద్ధమగును. బ్రహ్మ ఏందరనో స్త్రీ పురుషులను సృష్ఠి చేయుచున్నాడు. ఒకరిచేతనే సృష్ఠించబడుట వలన ధర్మముగ వారు సోదరీసోదరును. కాని మీ మాయా ప్రభావమున ఒకరిపై ఒకరు మనసుపడినవారు సతీ, పతులగుదురు.

పరాశక్తి భావము గ్రహించిన శివుడు వెంటనే కిరాతరూపము దాల్చి విల్లున బాణము సంధించి మగలేడి రూపమునున్న బ్రహ్మను వెంబడింటచెను. ఇది గమనించిన బ్రహ్మ, కిరాతరూపమునున్న శివుని గర్తించి లజ్జితిడై తలదించుకొని నిల్చుండిపోయెను. శివుడు కోపించి, బ్రహ్మా! నీవు ధర్మమును తప్పితివి. స్త్రీని బలాత్కరించి రమించుట దోషము. ఏకోదరి సోదరి, అన్న భార్య, తండ్రి చెల్లెలు, తల్లి చెల్లెలు, కోడలు, గురుపత్ని, తన కుమార్తె, మితృని భార్య, వీరు గౌరవింపబడువారు. రతికి వర్జితులు. పూర్వము నీవు చేసిన తప్పునకు ఒక శిరము కోల్పోతివి. ఇపుడు మిగిలిన నాల్గుశిరములను ఈ బాణముతో తృంచివేతునని బాణమును లాగి వదలబోవగా, పార్వతీదేవి శివును ప్రార్థించి బ్రహ్మదేవుని క్షమింపవేడెను. బ్రహ్మ విచార వదనముతో శంకరుని చరణములపై వ్రాలి రక్షింప వేడెను.

అర్ధనారీశ్వరముగా, శివ శక్త్యాత్మకమైన నేను మీలో లీనమైతిని. బ్రహ్మ ప్రార్థనపై కన్యగా అవతరించిన తన రూపమైన నన్ను పార్వతి ప్రశ్నించి పుత్రీ! నాగ్రూపముగా నీలోనున్న నేను నాశక్తిని ఉపసంహరించుకొంటిని. బ్రహ్మ మూడువేదములను అవగతము చేసికొనుటకు 10 వేల సంవత్కరములు తపము చేసిన పుణ్యాత్ముడు. అతని నాల్కపై విద్యారూపమున నేనుందును. ఇపుడు నిన్ను మా పుత్రికగా స్వీగరించినందున నీవు బ్రహ్మను వరించుట ధర్మవిరుద్ధముకాదు. శంకరా! మీరు భక్త సులభులు, బ్రహ్మమీ భక్తుడు గాన మన్నించి అతను కోరిన కన్యను మన పుత్రిగా బ్రహ్మ కొసంగుదుము అనగా, శివుడు ప్రసన్నుడై బ్రహ్మా ఈమెను మా పుత్రికగా నీ కొసంగుచున్నందున ధర్మలోపముగాదు. దేవతలలో ఇది సమంజసమే. భూదేవి, లక్ష్మి ఇద్దరునూ విష్ణువు భార్యలే. భూమినుండి వెలువడిన జానకిని రాముడుగా అవతరించిన విష్ణుమూర్తి పరిణయమాడెనుగదా! కౌసల్య పుతృనిగా జానకిని చేపట్టి ధర్మలోపముగాకుండ జేసెను. కశ్యపుడు, దక్షుడు, పులోముడు, అత్రి, అంగారసుడు, వారందరు నూ ఔరస పుత్రులేగదా! పినతండ్రి కుమార్తెలగు శచీదేవి, అశ్వని ఆదిగాగల తారలను గ్రహించిరి. నా ఆజ్ఞననుసరించి కుక్షిభేదము వలన వీనిలో ధర్మలోపము కలుగ లేదు. కనుక ఈ కన్యను గ్రహించమని ఆదేశింపగా నేను శాస్త్ర విధిగా బ్రహ్మను వివాహమాడితిని. వేదవిద్యగా నన్ను బ్రహ్మ జిహ్వాగ్రమున నిల్పుకొని ఆదరించెను. శంకరుడు నాతో, సరస్వతీ మొదట బ్రహ్మ నిన్ను వెంబడించి ధర్మ విరుద్ధమగు దోషి అయ్యెను. భార్యలు భర్తల దోషములను నివారింపవలెను. స్త్రీలకు భర్తలే ప్రత్యక్ష దేవతలు. కనుక నీవు బ్రహ్మ అపచారమును తుడిచివేయుటకు భూమిపై నదీరూపమున ప్రవహించి మహనీయుల స్నానస్పర్శవలన నీవును, నీలో స్నానమాడినందున పాపులును పవిత్రులగుదురు.

భూమిపై ఆర్యావర్తిము, అందు కురుక్షేత్రము పవిత్రభూములు. అక్కడ నీతీరమున యజ్ఞములు, తపస్సు చేసినవారు నీలో స్నానము, ఆచమనముల వలన నీవు పాప పరిహారము జేయుదువు. నా ప్రియపత్ని ఆకాశ గంగ పృధ్విపైనున్నది. నీవు ఆమెను కలిసి పూజించి నీ పతియొక్క మంచి కొరకు ఒక అంశమున నదిగా ప్రవహించుము. నీ సవతులు గాయత్రి, సావిత్రులు కూడా ఒక అంశతో నదులై ప్రవహింతురు. అని అంతర్ధానము చెందగా నేను కురక్షేత్రములో నదిగా అవతరించి నీకొరకు నీరీక్షించుచుంటిని. నీవు ఇక్కడ నాపతి, ప్రజాపతి క్షేత్రమునకు వచ్చినది తెలిసికొని ఒక అంశను కురక్షేత్రమున వదలి భూమియందు అంతర్థానమై ఇక్కడ వెలిసితిని. నా పతి అనేక మార్లు ఇక్కడ దశ సహస్ర అశ్వమేధయాగములు సల్పిరి. నీవిక్కడకు వచ్చి ప్రవహించుచు ఆయజ్ఞ సాఫల్యతనిచ్చితివి. ఇక్కడనుండి నీతే జేరి ప్రవహించుచు సముద్రమును చేరుదము. విష్ణుప్రియ కాళింది కూడ ఇక్కడ నీతో చేరినది అనెను.

అపుడు గంగ, హే బ్రహ్మప్రియే! కురుక్షేత్రములో బ్రాహ్మణులు యజ్ఞ, తపోధనులు, వారి మహిమ గొప్పదని వింటిననగా, సరస్వతి, హే గంగే బ్రాహ్మణుల మహిమ వినుడు. వింధ్య, హిమవత్పర్వతముల మధ్య భూమి ఆర్యావర్తము. అందు కురుక్షేత్రము విశేష్ము. సూర్యుని పుత్రి యమున, విష్ణుమూర్తిని తన భర్తగా పొందుటకు కురుక్షేత్రమున ఘోర తపమాచరించి శరీరము సుష్కించి అస్తి పంజరము మిగిలినది. అది చూచి అచటి బ్రాహ్మణులు ఆశ్చర్యపడిరి. జనులు తండోపతండములుగా వచ్చి చూడనారంభించిరి. యమున తపమునకు సంతసించి విష్ణుభగవానుడు ప్రత్యక్షమై హేపావనీ! నీతపమునకు మెచ్చి నిన్ను భార్యగా స్వీకరించి నీకు నా హృదయ స్థానమిత్తును. ఇంకను వరము కోరుమనగా యమున ఇక్కడ నాకు రక్షణ నిచ్చిన బ్రాహ్మణోత్తములకు ఉత్తమ గతి కల్గించుడమి కోరెను. విష్ణుమూర్తి, యమునా నీవు కన్యగా ఇక్కడ తపమాచరించి సుష్కించి కుబ్జగా మారిన ఈ ప్రదేశము "కన్యాకుబ్జ" మను పేరు తపో భూమిగా ఖ్యాతి చెందును. నీకు తూర్పున గంగ యున్నది. నీకును గంగకును మధ్యనున్న భూమి వేదభూమిగా ప్రసిద్ధిచెంది అందు చేయు తపో యజ్ఞములు అత్యంత ఫలదాయకములగును. నీవు గంగతో కలిసి తీరవాసులను పావనులను జేయుడు అని తెల్పెను. ఇక్కడ చేయు యజ్ఞ హవిస్సులు గొన్న దేవతలు సద్యః ఫలితమిత్తులు. దుర్లభమైన మానవ జన్మనెత్తియు మనో, వాక్కులు పాపాచరణకు లాగగా, అతి ప్రయత్నముచే నిరోధించి తపోయజ్ఞములచే నా తీరభూమియందు నాల్గు వర్ణములవారునూ పాప రహితులై అభీష్ట సిద్ధులగుచుండిరి.

ఇట్లు సరస్వతీదేవి గంగకు వివరించిన పుణ్యకథను విన్నవారు ఈశ్వ కటాక్షమున ముక్తులై కైలాసవాసులగుదురు.

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

No comments:

Post a Comment