Wednesday, December 10, 2008

ప్రకాశిక

ప్రపంచ దేశము లన్నింటికిని ఆధ్యాత్మిక కేంద్రముగా పేరెన్నికగన్న భారత దేశములోని తీర్థ, క్షేత్రములలో తలమానికయినది కాశీ మహా క్షేత్రము. వేద, శాస్త్ర, ఇతిహాస, పురాణములలోని తీర్థ, క్షేత్ర మహాత్మ్యములు తెలిసిన వారిలో, కొందరు మాత్రమే అతి ప్రయాసలకోర్చి, ఆర్థిక స్తోమతు, ప్రయాణ సొకర్యములు, భోజన వసతి లేని దూరప్రాంత తీర్థ, క్షేత్ర, దర్శనములకు సాహసించెడివారి. 4, 5 దశాబ్దముల క్రితము వరకు "కాశీకి వెళ్ళిన వారు కాటికి వెళ్ళిన వారితో సమానము" అను నానుడి యుండెడిది. భారతదేశ స్వాతంత్య్రము తరువాత కూడ దూరప్రాంతముల నుండి నాలుగయిదు అంచెలుగ ప్రయాణించవలసిన కాశీ క్షేత్రమునకు క్రమక్రమముగ సవారి రైలుమార్గమేర్పడినది. ఆర్థక వసతులు మెఱుగైనవి. వార్తా పత్రికలు దూరశ్రవణ, దూరదర్శన యంత్రములద్వారాను, సాధు సజ్జనుల ఆధ్యాత్మిక ప్రసంగముల ద్వారాను తీర్థ, క్షేత్ర మహాత్మ్యములు విస్తృతమై హిందూ మతములోని సర్వజాతుల వారును ఇపుడు అశేష ప్రజానీకము కాశీ క్షేత్రమును దర్శించుచున్నారు.

బదరీ కేదార యాత్ర చేయువారు హిమాలయ కేదారేశ్వరుని దర్శింతురు. అక్కడి కేదారేశ్వరుని గుఱించి వేద విహిత, శాస్త్ర సమ్మత మయిన అష్టాదశ పురాణములలోని గాధలు మాత్రమే గ్రాహ్యములు. అనేక తీర్థ, క్షేత్ర మహాత్మ్యములునూ అట్టివే.

హిందూ ధర్మ సిధ్ధాంతముననుసరించి అపౌరుషేయములగు వేదములను మహర్షులు తపోశక్తిచే మనోనేత్రమున దర్శించిన మన దేవతలు 33 కోట్లని నిర్ణయించిరి. అందు ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్ట వసువులు, అశ్వనీ దేవతలు మొత్తం 33 మంది. మానవ సముదాయము ఎందరు దేవతలను వివిధ నామ రూపములతో భావించి పూజించు చుండిరో వారందరును పై 33 దేవతల కోట్ల అంశారూపములు. వీరందరు భౌతిక జగత్తునందు ఆయా పరిస్థితుల ననుసరించి, ఆయా క్షేత్రములందు ఉద్భవించియున్నారు.

పైవిధముగనే, మహర్షులచే మానవ జాతికి అందించబడిన వేద గర్భిత ఉపనిషత్తులు మొత్తము 1180. అందు ప్రధానమయినవి శ్రీరామ చంద్రునిచే శ్రీమదాంజనేయునకు ఉపదేశింపబడిన 108 ఉపనిషత్తులు మాత్రమే అందుబాడులోనుండి ప్రచారమగుచున్నవి. అట్టి ఉపనిషత్తులలో కాశీ మహాత్మ్యము వర్ణింప బడియున్నదనిన కాశీ క్షేత్రము వేదముల కన్న ముందుగా యుండి యుండవలెననుట నిర్వివాదాంశము. కాశీక్షేత్ర మహాత్మ్యము విపులముగ శ్రీ వేదవ్యాస మహర్షిచే స్కాంతపురాణమున కాశీ ఖండముగా తెలుపబడినది. అటులనే కాశీలోని శ్రీ గౌరీకేదారేశ్వర మహాత్మ్యము గూడ బ్రహ్మ వైవర్త పురాణమందరి కాశీ కేదార రహస్యమందు విపులముగ వివరింపబడినది.

“కాశ్వాన్మరణాన్ముక్తిః", “అరుణాచల స్మరణాన్ముక్తిః", "శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే" అటులనే "కేదారజలం పీత్వా పునర్జన్మ నవిద్యతే" యనునది నానుడి. కాని హిమాలయ కేదారము దర్శించువారు, అట్టి జలమెక్కడగలదని తెలిసికొని, సేవించి, తీసికొని వచ్చుచున్నారు ? అనునది ప్రశ్నార్థకమే. అట్టి జలమును శ్రీకేదారేశ్వరుడు కాశీలో గుప్త తీర్థముగా నేర్పరచియున్నాడు. శ్రీ కాశీ కేదారేశ్వరునికెదురుగా గల గౌరీ కుండము, కేదారఘట్ట స్నానము, ప్రాచీన మణికర్ణిక /గౌరీకుండ/ హరంపాప/ రేతోదక/ మధుశ్రవ/ మాంధాత/ కేదార/ నీలకంఠ/ హంతీర్థ మను నవతీర్థ స్నాన ఫలితమొసగును. కాశీలోని గంగ పశ్చిమ తీరమున గల 64 ఘట్టములలో ఇంతటి మహత్తర పుణ్యప్రద స్నానమింకొకటి లేదు.

శ్రీ కాశీ గౌరీ కేదారేశ్వర లింగము శుద్ధోదక స్నానానంతరము, బియ్యము, పెసర పప్పులతో వండిన పులగము గుమ్మరించినట్లు రెండు రంగుల మిశ్రితముగ ఈ కలియుగమున కన్పించుచున్నది. ద్వాపరయుగమున వెండి లింగముగను, త్రేతాయుగమున స్వర్ణలింగముగను, కృతయుగమున నవరత్న మణిమయ లింగముగను కన్పట్టునని, దివ్వ దృష్టిగల ఋషిపుంగవులును, గౌరీదేవి శాపమునకు గురియయిన సాక్షాత్ విష్ణుమూర్తి వ్యాస మహర్షిగా ఉద్భవించి, "వ్యాసాయ విష్ణురూపాయ, వ్యాసరూపాయ విష్ణవే,” కల్పాంతము వరకు నాల్గు యుగములయందును శ్రీ కాశీ గౌరీ కేదారేశ్వరుని దర్శించు కొనుచు, బ్రహ్మవైవర్త పురాణమందు కాశీ మూల రహస్యాంతర్ఘత కాశీ కేదార మహాత్మ్యమందు వ్రాసి యున్నారు. ఇట్టి అద్భుతము మరే ఇతర లింగ, మూర్తి రూపములకును కల్గునట్లు వేద, శాస్త్ర , ఇతిహాస,పురాణములందు గన్పట్టదు.

స్కందపూరాణాంతర్గత కాశీ ఖండమున, అసి వరుణ మధ్యగల కాశీ క్షేత్రమును పరమేశ్వర రూపముగ భావించి, శిఖాది కంఠ పర్యంతము ఓంకార ఖండముగను, కంఠాది నాభి పర్యంతము విశ్వేశ ఖండముగను, నాభినుండి పాద పర్యంతము కేదార ఖండముగను తలంచిరి. పై మూడు ఖండములందు కేదార ఖండమందలి శ్రీగౌరీ కేదార విశేష మహాత్మ్యమును వేదవ్యాస మహర్షి ప్రత్యేకముగ బ్రహ్మ వైవర్త పురాణమందు పేర్కొనిరి.

ప్రప్రథమమున మహా కైలాసము నుండి నర నారాయణ రూప విష్ణుమూర్తి ననుగ్రహించుటకై నందీశ్వరుని కోరికపై హిమాలయ పర్వత శ్రేణిలోని బదరీ కేదార పర్వతమునకు దిగి వచ్చిన సదాశివుడు, మాంథాత చక్రవర్తి తపోదీక్షకు తృప్తుడై అతని కోరికపై తన షోడశ కళలలోని ఒక్క కళను మాత్రము హిమాలయ కేదారమందు వదలి పంచదశ కళాత్మకుడై శ్రీ కాశీ కేదారమందు అన్నమయ లింగరూపుడుగ, హరిహరాత్మక, శివశక్త్యాత్మక, భావనా పూర్వక రెండు భాగములుగ స్వయంభువై వెలసి యున్నాడు. శ్రీ గౌరీ కేదారేశ్వర దర్శన, పూజన, స్తోత్రములచే శివ, పార్వతి, విష్ణు, లక్ష్మి, అన్నపూర్ణలను పంచదేవతలను అర్చించిన సద్యః ఫలితము ప్రాప్తించును.

శ్రీ కాశీ కేదార ఆవిర్భావము బ్రహ్మవైవర్త పురాణమందలి కాశీ మూల రహస్యమను 19, 20, 21 అధ్యాయములందు కొన్ని శ్లోకములుగా వర్ణింపబడినది.

సంస్కృతమూలము:

తస్మిన్ కాలే తతః పూర్వం చిరకాలాద్హిమాచలే । తపస్సన్ సంస్థితస్తత్ర మాంథాతానామ భూపతిః ॥
సూర్యాన్వయశ్చిరం రాజ్యం కృత్వా పుత్రాస్తరాజ్యధుః । సార్వభౌమ మహాయోగి సర్వయజ్వాऽదానవాన్॥
పంచాశత్కన్య కోయేన దత్తా సౌభరియోగినే। యోనిర్భేద్యపితుః కుక్షిం నిర్గతస్తన్మృతిం వినా॥
యస్యగాయా పురాణేషు ప్రథితా దేవ సంస్కృతా ।ససర్వభోగ వితః కేదారేశం సమాశ్రయత్॥
ధ్యాత్వా తత్ర చిరందేవం యుగానాం ఖతమర్పయత్ ।త్వల్లింగ దర్శనం భూయాత్ మమా ऽ త్త్రేతినిరంతరమ్॥
తదాహభగవాన్ శంభుః శ్రీమత్కేదారనాయకః ।రాజర్షితం నభోవాణ్యా ప్రేమ్ణా భక్త శిరోమణిమ్॥
ఇతితేః సహకేదార స్థాన మాప ఋషిః పునః ।ఉషస్యన్నం చాపమాస ముగ్దదా లీయుతం క్షణాత్॥
శృణుభక్తా ऽ త్రమే లింగరూపం యుగ చతుష్టయే । ముద్గదా ల్యాత్మికం లింగం భవిష్యతి శుభ ప్రదమ్॥
త్వయా ऽऽ తిథ్యా యార్ధభాగ కృతయారేశయాయుతమ్ ।భాగద్వయాత్మకం లింగం సత్యం హరిహరాత్మకమ్॥
శివ శక్త్యాత్మక మపి నాత్రకార్య విచారణా । భగమన్నేన పూర్ణత్వాదన్న పూర్ణా ऽ త్ర తిష్ఠతు॥
అన్నపూర్ణాత్మకం లింగం మద్భాగేన సుసంయుతమ్ । తస్మాదన్నాన్నపూర్ణాహి కేదారేమయి తిష్ఠతి॥
అన్నపూర్ణా ససహితం మల్లింగం యస్తుసేవతే । తస్యాన్నపూర్ణా సతతం గృహమాశ్రియ్య తిష్ఠతి॥

తెలుగు అనువాదము
పూర్వము సత్య యుగమున మాంథాతయను సార్వభౌముడు సర్వయజ్ఞయాగములు, దానములు చేసినవాడు, తనతండ్రి మృతిచెందకయే అతని ఉదరము చీల్చుకొని బయల్పడినవాడు, సౌరభియను యోగి పుంగవునకు తన 50 మంది కుమార్తెలను వివాహము చేసి, సర్వభోగవిరక్తుడై, రాజ్యభారము పుత్రులకప్పగించి, హిమాలయ పర్వతములందు వంద యుగములకాలము కేదారేశ్వరుడు సంతసించి ఆకాశవాణి రూపమున అతనిని కాశీకి వెళ్ళి తపమాచరింప నాదేశించెను. మాంథాత కాశీ చేరి ఒకధనుర్మాంసాంత మకర సంక్రాంతి పుణ్యదినమున ఉషఃకాల పూజానంతరము నివేదనకు బియ్యము, పెసరపప్పుతో చేసిన పులగన్నమును రెండుగా మధ్యలో గీతగీచి ఒక భాగము కేదారేశ్వరునకు, రెండవది తనకుగా తలంచి నివేదింపగా, శంకరుడు అతిథి రూపమున దర్శనమిచ్చి, మాంథాత చకితుడై ఆశ్చర్యముగ ప్రణమిల్లి ప్రార్థింపగా పరమేశ్వరుడతనికి తన నిజరూపము ప్రకటింపజేసి ఆపులగాన్నమునందు అంతర్హితుడాయెను. హిమాలయ కేదార పాషాణ లింగము వలె కన్పట్టు శ్రీకాశీ గౌరీకేదార లింగము నాల్గు యుగములయందు రూపాంతరము చెందుననియు, రెండు భాగములుగ నున్న యది హరిహరాత్మకము, శివ శక్త్యాత్మకము గను, అన్నలింగమయినందున అన్నపూర్ణ సదాయిందు వసించి యుండునని, అన్నపూర్ణ సహిత కేదారేశ్వరునిగా తనను పూజించిన వారింట అన్నమునకు లోటుండదని మాంథాత పరమాత్మచే వరము పొందెను. ధర్మార్థకామమోక్షములు కరతలామలకములై మనోవాంఛితములు నెఱవేరును.


తుషారాద్రిం సమారూప్యా కేదారం వీక్ష్యే యత్ఫలమ్।
తత్ఫలం సప్త గుణితం కాశ్యాం కేదార దర్శనే ॥
(స్కందపురాణము)
హిమాలయ కేదార దర్శనమునకు 7 రెట్లు అధిక ఫలము కాశీ కేదార దర్శనము. విశ్వేశ్వరునకన్న అధిక ప్రాధాన్యము కేదారేశ్వరునకు గలదు. కేదార ఖండమందు దేహత్యాగము సంభవించెనేని, వారొనరించిన పాపములకు కాలభైరవ దండన లేకయే శివసాయుజ్యము తథ్యము. ఇట్టి సుకృతము పంచక్రోశాత్మక కాశీయందు మరెక్కడను లేదు.

శ్రీ కాశీ కేదార మహాత్మ్యమును సంస్కృతమూలము, హిందీ భాషానువాదము నుండి గ్రహించి తెలుగు భక్త జనావళికి తేటతెల్లమొనరించుటకు ఈ గ్రంథరచన నా పూర్వజన్మ సుకృతమున శ్రీకేదారేశ్వరుడు నాకొసంగిన వరముగా భావింతును.

బుధజన విధేయుడు
జానపాటి బాలనరస అప్పేశ్వర శాస్త్రి
సనాతన ధర్మ ప్రచారక
కాశీ వాసి

1 comment:

  1. రామయణ మహా భారతాలను విన్న వాళ్ళకు విన్న పుణ్యం .. పారాయణం చేసినవారికి పారాయణ పుణ్యం .. అలా ఏదో విధంగా పుణ్యాన్ని మూట గట్టుకునే ప్రాప్తాన్ని ఆ దేవుడు మనకు కలిగించారని నేను తలుస్తాను. అలాగే కాస్తంత వెసలు బాటు చేసుకుని తమరు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నాను.

    వ్రాసేవారికి వ్రాసిన పుణ్యం, కృతించిన వారికి కృతఙ్ఞ్తతతో చక్రవర్తి సాస్టాంగ నమస్కరిస్తూ ధన్యవాదములు తెలియజేయ సాహసిస్తున్నాడు, అన్యధా అనుమతించండి.

    అయ్యా, అంతే కాకుండా.. వీలుగా ఉండేందుకు నాకు అవకాశమిప్పించిన యడల, ఇక్కడ ప్రచురించిన ప్రతులను కొంచం చక్కగా తీర్చి దిద్ద ప్రయత్నం చేస్తానని మనవి.

    ఇట్లు
    భవదీయుడు

    ReplyDelete