మహర్షులారా! కేదారేశ్వరమహాత్మ్యము వినినవారి పాపములు హరింపబడును. బదరికాశ్రమమను పేర హిమాలయ పర్వతములందు విష్ణుమూర్తి నర, నారాయణులము పర్వతముల రూపమున శివధ్యాన పరాయణులై యున్నారు. పరమాత్మ తనను దర్శించిన వారికి ముక్తి నొసగుటకు కైలాసము నుండి నందీశ్వరుని కోరికపై కేదార పర్వతముపై దిగియుండిరి.
పితృ, మాతృ ఘాతకులకు, శివ భక్తి లేనివారికి అచట లింగరూప దర్శనము కాదు. ఒకపరి పరమాత్మ మాయవలన బ్రహ్మదేవునకు తానే గొప్పవాడనను అహంకారము కల్గెను. అదే సమయమున అసురులచే పరాజితులయిన దేవతలు బ్రహ్మదేవునితో సహా పరమశివుని వద్దకు వెళ్ళి విన్నవించుకొనుటుకు బ్రహ్మదేవుని వద్దకు వచ్చిరి. వారందరి హృదయములలో ఆత్మలింగ జ్యోతిని దర్శించిన బ్రహ్మదేవుడు అశ్చర్య చకితుడై వారికట్టి పవిత్రత ఎట్లు కల్గెనని వారిని ప్రశ్నించిరి.
వారు బ్రహ్మదేవునికి శివ రహస్యమునిట్లు వినిపించిరి. పరమశివుని రేతస్సును అగ్నిదేవుడు గ్రహించు సమయమున, అందలి అణుమాత్ర కణము కేదార పర్వతముపై పడి అక్కడ రేతోదక తీర్థమను జలాశయమేర్పడినది. అందలి తీర్థము పానము చేసిన వారి పాపహరమగుటచే వారి హృదయములందు ఆత్మలింగ దర్శనమగును. ఆ తీర్థపానము జన్మరాహిత్యమొసగును. దానిని హరంపాప తీర్థమని కూడ పిలుతురు. ఈ మర్మము శివనింద జేసినవారికి చెప్పరాదు. కాని బ్రహ్మదైవుడు అహంకారపూరితుడై శివునికన్న తాను గొప్పయని తలచి శివనింద జేసినను అతడు సృష్టికర్త యగుటచే వారీ రహస్యమునాతనికి తెల్పినవెంటనే బ్రహ్మదేవునకు జ్ఞానోదయమై మిక్కిలి విచారించి, దేవతలతో కలసి కేదార పర్వతమునకు వెళ్ళి తన తప్పును మన్నింపమని శివుని వేడకొనుటకు, రేతోదక తీర్థపానము చేయుటకును దేవతలను వెంటబెట్టుకొని బయలు దేరెను.
శివనిందజేసిన బ్రహ్మదేవునకు దర్శనమిచ్చుటకు నిరాకరించిన పరమాత్మ అంతర్థానము చెంది ఆ ప్రదేశమున మేతమేయుచున్న ఆవుల మందలో వృషభరూపడై కలిసి పోయెను. బ్రహ్మ ఈ విషయము గ్రహించి శివుని ప్రార్థించుచు వెళ్ళి మందలోని వృషభమును పట్టుకొనబోగా శివుడు భూమిలోనికి చొచ్చుకొనిపోవుచుండెను. బ్రహ్మకు వృషభ మూపురము మాత్రమే చిక్కి అదియునూ శిలారూపము బొందెను. బ్రహ్మ ఎంత వేడిననూ శివుడు దర్శనమివ్వనందున, శివరేతోదక తీర్థమయినను పానము చేతమని బ్రహ్మరేతోదక తీర్థ జలాశయమున దిగబోగా, శివదూషకుని రేతోదక తీర్థము ముట్టనివ్వమని శివ కింకరులు శూలముతో బ్రహ్మ శిరమును ఖండించిరి. ఆ శిరము పడిన స్థలమే బదరికా క్షేత్రమందలి బ్రహ్మకపాలము. అచట పితృదేవతలకు పిండ ప్రదానము అనంత ఫలప్రదము.
విష్ణుమూర్తితో కలసి దేవతలందరును కైలాసమందు శివుని ప్రార్థించి సృష్ఠి నిమిత్తము బ్రహ్మను బ్రతికింపగోరిరి. కేదార పర్వతమందు తన దర్శనము లింగరూపమున దుర్లభమనియు అత్యంత పుణ్యాత్ములకు తన అనుగ్రహమున అట్టి లింగరూపదర్శనమగుచో వారిని తనలో లీనము చేసికొని, పునరావృత్తి రహిత కైవల్యపదమిత్తునని వచించి శివుడు బ్రహ్మదేవునకు మరొక తలనతికించి బ్రతికించెను.
“కేదార తీర్థం పీత్వా పునర్జన్మ నవిద్యతే"
బ్రహ్మదేవుడు శివలింగ దర్శనం కోరగా ఇకపై కేదారమందు లింగదర్శనము దుర్లభమని తెల్పి, శివనింద దోషనివారణ కొరకు కాశీకి వెళ్ళి పది అశ్వమేథయాగములు చేసి అచట జ్యోతిర్లింగ దర్శనము చేసికొని మరల సృష్ఠి ఆరంభింపమని పరమాత్మ బ్రహ్మను ఊరడించి పంపెను.
గౌరీదేవి స్నాననిమిత్తము తప్తకుండమను వేడినీటి కుండములు సృష్టించబడినవి. కేదార పర్వతము క్రిందను, బదరీ క్షేత్రమందును ఈ కుండములందలి నీరు పసుపు కుంకుమల పరిమళ భరితముగ నుండును. కైలాసమునుండి పంచధారలుగ అవతరించిన రుద్రగంగ పాపనాశిని. రుద్రప్రయాగయను తీర్థము మధుశ్రవ, క్షీరవాహ, మందాకిని, శోణితోదక మరియు రుద్రగంగల పంచనద క్షేత్రము విశిష్ఠమయినది. పది అశ్వమేథ యాగములు చేసి గంగలో స్నానమాడిన బ్రహ్మకు పరమేశ్వరుడు కాశీలో జ్యోతిర్లింగమూగా దర్శనమొసగిరి. ఆ విధముగా కాశీలోని శివలింగ దర్శనము ముక్తి ప్రదము.
సూతమహర్షి దక్షిణ కైలాసాదియాత్రలు చేయుచూ ముక్తి ప్రద పంచనద తీర్థము, అలకానందలను దర్శించి అచట తపోనిధి వేదవ్యాస మహర్షిని దర్శించిరి. శివ జ్ఞానపరాయణులగు అనవద్య, నాథ శర్మ యను దంపతులను దర్శించి నమస్కరించి వేదవ్యాస గురుదేవులతో కాశీకి పయనమయిరి. మార్గమధ్యమున సూతమహర్షి వ్యాసునికి నమస్కరించి అనవధ్య, నాథ శర్మల వృత్తాంతము తెలుప వేడుకొనెను. ఆ వృత్తాంతమును యథాతథముగ సూతుడు మహర్షులకు తెల్పెను.
బ్రహ్మవైవర్త పురాణమందు కాశీ క్షేత్ర వైభము మూడు ఖండములుగా వివరించబడెను. దానిని శంకరుడు పార్వతికి చెప్పినట్లుగా వారి అనుమతి పై సనత్కుమారుడు వామదైవునికిని, దానిని నాథశ్రమ తనపత్ని అనవద్యకును, వ్యాసమహర్షి సూతునకును వివరించిన కథాంసము బ్రహ్మవైవర్త పురాణమున ఉల్లేఖింపడడినది. అందు మొదటి ఖండము విశ్వశ ఖండమునందు కాశీలో నిత్యయాత్ర విధానము దాని మహిమ తెల్ప బడినది. రెండవది ఓంకార ఖండమునందు ఓంకారేశ్వర మరియు ఇతర దేవతల మహాత్యము మరియు యాత్రల మహిమ తెల్పబడినది. మూడవది కాశీ కేదార ఖండమందు శివాపురాధులకు కూడా ముక్తి గల్గు మహిమలు తెల్పబడినది.
కాశీ కేదార ఖండ మహిమను ప్రచారము చేయుట కొరకు సూతుడు ఇట్లు చెప్ప దొడగెను. కాశి యందు రెండు మణికర్ణికలు గలవు. ప్రాచీన మణికర్ణిక కేదారేశ్వరుని ఎదుటను, నవీన మణికర్ణిక శ్రీ విశ్వేశ్వరుని ఎదుటను గలవు. నవీన మణికర్ణిక విష్ణు మూర్తి చక్రతీర్థమును ప్రశంశించి పరమేశ్వరుడు తల ఊపగా స్వామి కర్ణ కుండలము నుండి జారిన మణిపడుటచే ఆ చక్రతీర్థము మణికర్ణికగా పిలువబడుచున్నది. ప్రాచీన మణికర్ణిక కేదారేశ్వరుని ఎదుట గల గౌరీ కుండమందు గౌరీదేవి ఆనందముగా జలక్రీడ సల్పు సమయమున గౌరీదేవి చెవి కమ్మనుండి జారిన మణులు పడుటచే గౌరీకుండము ప్రాచీన లేక ఆది మణికర్ణికయై కేదారఘట్ట స్నానసంకల్పమున "ఆది మణికర్ణికాతీర్థే" యని విఖ్యాతమయినది.
కేవలం శంకరునికి మాత్రమే తెలిసిన గుహ్యాతి గుహ్యమయిన ఈ రహస్యం తల్లి గర్భం లోనే జ్ఞానం పొందిన వామదేవమునికి సనత్కుమారుడు వివరించిరి. వామదేవుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దిక్పాలకులను దర్శించి భువికేతెంచి మేరుపర్వతాది గిరులను దర్శించి హిమాలయములకేతెంచిన సమయమున మనోగామి యగు సనత్కుమార మహర్షిని దర్శించి నమస్కరించెను. కార్తికేయ అంశతో సదా 5 సంవత్సరముల బాలుని వలె తేజోరూపి అయిన బ్రహ్మమానస పుత్రుడు సనత్కుమారుని వామదేవుడు కౌగలిచుకొని స్వామీ ఎక్కడ నుండి తమరి రాక యని అడుగగా, వారు కాశీ క్షేత్రము నుండి హిమాలయములందలి కేదార మందు శివిలింగ దల్శనమునకు వచ్చినట్లు తెల్పి ఇద్దరునూ కాశీ క్షేత్ర వైభవమును ముచ్చటించుకొను సమయమున రాజర్షి సత్తముడు గర్భ జ్ఞాని, పర్వతరాజు హిమవంతుడు కేదార పర్వతముపై తపోదీక్షలోనుండి వారిని దర్శించి, శివ మాయా మోహితుడై, వామదేవ సనత్కుమారులు కాశీ క్షేత్ర తీర్థ వైభవమును ప్రశంశించుట విని, వారితో ముని సత్తములారా "యదృశ్యం తన్నస్య" మను వేదవిజ్ఞానము ననుసరించి సృష్ఠిలోని ఈక్షేత్రములు, తీర్థము లన్నియూ జడములు, విశ్వనాథాది, కేదారాది లింగములన్నియూ పాషాణములు గదా! తత్వజ్ఞులైన మీకిట్టి భక్తి కల్గుట ఎట్లని ప్రశ్నించెను.
సనత్కుమారులు హిమనంతుని వారించి శివజ్ఞాన పరాయణులగు మీరిట్లు వచింపతగదు. తీర్థక్షేత్ర, లింగమూర్తి స్వరూపములన్నియూ శివజ్ఞాన రూపమగు బ్రహ్మజ్ఞానదాయకములని తెల్పి ముగ్గురునూ శివదర్శనార్ధము వెళ్ళగా, అందు హిమవంతునకు అక్కడి తీర్థ, క్షేత్ర, శివదర్శనములు లభించలేదు. వామదేవ, సనత్కుమారులు తీర్థమందు స్నానమాడి పరమ భక్తి భానమున శివదర్శనము చేసికొనిరి. హింమవంతుడు ఆశ్చర్యచకితుడై తన తప్పిదమును గ్రహించి శివుని ప్రార్ధించి దర్శన మర్ధించిననూ అతని కనులకు ఏమియు గోచరించనందువలన సనత్కుమారుని ప్రార్ధించి తనకు శివదర్శన భాగ్యము కల్పింప వేడెను.
సనత్కుమారులు ఏకాగ్రమనస్కులై పర్వత రాజును మన్నించి వారికి దృష్ఠినిచ్చి దర్శన మివ్వనమి శివుని ప్రార్ధించగా పరమాత్మ ఆకాశవాణి రూపమున, రాజును వెంటనే కాశీక్షేత్రమునకు వెళ్ళి అక్కడ తన రూపమగు తీర్థస్నానము, క్షేత్ర దర్శనము, విశ్వేశ్వర కేదారాది సర్వలింగములను దర్శించి, ప్రాచీన మణికర్ణికలో స్నానమాడి పాప ప్రక్షాళన తర్వాత యిక్కడకు వచ్చినచో తన దర్శనమగునని తెల్పెను. కాశీ నింద బాపుకొనుటకు కాశీ రహశ్యము తెలిసికొనవలెను. కాశీ క్షేత్ర నింద, ప్రాచీన మణికర్ణికా స్నానముతో కాశీ కేదార దర్శనముతో ప్రక్షాళనమగును. కోట్ల జన్మలలో తీర్థక్షేత్ర స్నాన దర్శన శివపూజలతో కాదు. శివలింగనింద, వేద, శాస్త్ర, యతి, శివమంత్ర నింద, శివభక్తులనింద, ధర్మ నింద, గురునింద, విభూది, రుద్రాక్ష, శైవసాంప్రదాయనింద, మాతృ, పితృ, శివ పార్షదుల నింద ఇవన్నియూ ప్రాణులను నరకములో పడవేయునవి. పుణ్యక్షయములు. ఈరాజు అజ్ఞానిగా తీర్థ, క్షేత్ర, కాశీ విశ్వేశ్వర కేదారేశ్వరుల నిందవలన కోటి కల్పములవరకును తీరని పాపమాచరించినను, క్రితం జన్మలలో అనేక పుణ్యములు చేసిన ప్రభావమున మిమ్ములను దర్శించు భాగ్యము గల్గినది. వామదేవ, సనత్కుమారులు మీరిద్దరునూ శివజ్ఞానులు, నా ప్రియతములుగాన రాజుకు శివజ్ఞన ధర్మ సూక్ష్మముల నెఱింగించి వానిని కాపాడుడు
క్రితం గౌరీదేవియే ఒకపరి నా ప్రభావనిందజేసిన కారణమున గౌరీకుండమను ప్రాచీన మణికర్ణికను సృష్టించి అందు స్నానమాడి నాప్రదక్షిణ, నమస్కార పూజలు చేయ ఆజ్ఞాపించి పాప ప్రక్షాళనము గావించితిని గనుక ఈ రాజును వెంటనే కాశీ వెళ్ళి తీర్థ స్నాన, క్షేత్ర నమస్కార, శ్రీవిశ్వేశ్వర, కేదార లింగముల దర్శనమునకుముందుగా నవీన, ప్రాజీన మణికర్ణికలకు ముమ్మారు ప్రదక్షిణ నమస్కారములు చేసి స్నానమాడి పాప ప్రక్షాళన తదుపరి మాకు ప్రదక్షిణ నమస్కార పూజాదికములు నిర్వర్తించి, పునీతుడయినట్లు తెలిసికొనుటకు మరల యిక్కడకు వచ్చినచో నా దర్శన మగునని ఆకాశవాణి రూపమున శంకరుడు పల్కెను.
వామదేవ సనత్కుమారులు పరమాత్మతో స్వామీ, భూమిపైగల కాశీక్షేత్రమునకు మీరింతటి శక్తి నిచ్చిన రహస్యమును మేము తెలిసికొన వచ్చునా యని ప్రార్ధింపగా శంకరులిట్లు సెలవిచ్చిరి.
ప్రప్రథమ పద్మకల్పమునందు నందీశ్వరుడు మమ్ము కాశీకి రావలసినదిగా ప్రార్థించగా కాశీచేరిన మాకు కాశీపై మక్కువగల్గి, క్షేత్ర, తీర్థ, లింగ, ప్రతిమలతో మా షోడశ కళలలోని పంచదశ కళలను ప్రతిష్ఠించి వానిని మహత్వ పూర్ణము గావించితిమి. గౌరీదేవి నాయడల గావించిన తప్పునకు పరిహారముగా కేదారేశ్వరుని ఎదుట కుండమును ఏర్పరచి అందు హరంపాప తీర్థమును నింపి, స్నానమాడజేసి 12 సంవత్సరములు తపము చేసి పాపహరము గావించుకొన నియమించితిని. గౌరీదేవి స్నానమాడు సియమున ఆ కుండమున ఆమె కర్ణ భూషణము నుండి మణులు రాలగా ఆకుండము గౌరీ కుండము, ప్రాచీన మణికర్ణికలుగా పెరొందినది. కేదార పర్వతమందలి రేతోదక తీర్థము (హరంపాప తీర్థము) కాశీలోని కేదారతీర్థములు సమానములు. ఎంతటి పాపాత్ములకయినను కాశీలోని హరంపాప తీర్థస్నానము ముక్తి ప్రదములు. ఈ రహస్యమును గంగాదేవి జహ్ను ఋషికి తెల్పి అతనిని పాపహరుని జేసినది. దివోదాసు రాజర్షి, ద్విజాధముడు వాష్కళుడు, నౌగమేయుడను గణరాజులు కాశీని నిందించి, హరం పాపతీర్థ స్నానముతో ముక్తులయిరి. గనుక వామదేవ, సనత్కుమార, హిమవంతులు వెంటనే కాశీ క్షేత్రము దర్శించి, తీర్థ స్నానములాచరించి సర్వదేవతలను ప్రార్ధించి పాపహరులయిరి.
ఈ శంకర, సనత్కుమార సంవాదరూప కాశీ రహశ్యము విన్నవారు ముక్తులగుట నిశ్చయము.
No comments:
Post a Comment