Sunday, December 28, 2008

నవమాధ్యాయము

గౌరీదేవి 12 సంవత్సరముల తపస్సును నిత్య హరంపాప తీర్థస్నాన, కేదారేశ్వర పూజలతో పూర్తిచేసిన సోవమారయుక్త శ్రావణ పూర్ణిమ పుణ్య దినమున పరమేశ్వరుడు ప్రీతి చేంది కేదార లింగము నుండి ప్రత్యక్షమై పార్వతిని వరము కోరనమగా, దైవి స్వామీ మానవులు కలియుగము మూఢులై కోట్ల కొలది బ్రాహ్మహత్యాపాతకములు, కోట్ల కొలది అగమ్యాగమన పాతకములు చేయుదురు. వారికి తరుణోపాయము కోరుచున్నానని వేడగా స్వామీ ప్రీతితో, కాశిలోగాని, వెలుపల గాని మానవులాచరించు ఎట్టి పాపములయినను మణిక్రణిక స్నానము, విశ్వేశ్వరాది లింగదర్శన పూజనలవలన నశించును కాని, నా స్వరూపమయిన కాశీతీర్థ, క్షేత్ర, లింగముల నింద, అపరాధములు కేవలము ప్రాచీన మణికర్ణిక/హరంపాప తీర్థము/ రేతోదక తీర్థము ముఖ్యముగా నీచే నిత్యము 12 వర్శములు స్నాన పుణ్యమబ్బినందున నీపేర గౌరీకుండమను తీర్థ స్నాన కేదార లింగ దర్శన పూజనల వలన మాత్రమే ఉపశమించునట్లు వరమొసంగెను. స్వామి ఆలింగమున అంతర్థాన మయిన వెంటనే గౌరీదైవి కూడ స్వామి వారితో కైలాసము చేరెను.

ఇక నౌగమేయుడు గౌరీదేవి శాపమున మనుష్యయోనిలో బ్రాహ్మడుగా జన్మించి క్షేమకవి నామముతో పూర్వ జన్మ స్మృతిగల్గి తాను శంకరుని ద్వార వినిన నూరు కథలను బృహత్కథామంజరి నామముతో గ్రంథమును రచించి, తనపేర క్షేమేశ్వర నానముతో కాశీలోని కేదారునికి ఉత్తరమున లింగ ప్రతిష్ఠచేసి నిత్యమూ పరమేశ్వరుని ఆ లింగమున సేవించుచు, వ్యాసుని పురాణములు, స్మృతులు, శాస్త్రములను అవహేళన చేయుచు వ్యాసుని నిందించగా, వ్యాసుడు చింతా క్రాంతుడై కృంగుచుండెను.

కాశీ హరంపాపతీర్థమున నిత్య స్నానము, కేదార పూజలతో 12 సంవత్సరముల శివసేవకు సంతసించిన పరమేశ్వరుడు క్షేమేశ్వర లింగమునుండి కోటి సూర్వ ప్రభలతో, కోటి చంద్రుల చల్లదనముతో ప్రత్యక్షమై నేటినుండి 9వ రోజున శ్రావణ పంచము సోమవార పరవడి తిథియందు నీవు మరల మాలోకము చేరుదువు. ఈలోగా మణికర్ణికకు వెళ్ళి స్నానము చేసి అక్కడనే యున్న తెల్లని వ్యాస విగ్రహమును అవమానించి వ్యాసునితో సహా ఆనాడు కేదారనాధుని ముందుగల తీర్థస్నానము, కేదార అర్చనము చేయుమని ఆనతిచ్చెను.

క్షేమకవి స్వామి ఆజ్ఞనిర్వర్తించుటకు వెళ్ళి ణమికర్ణికా స్నానము చేసి వ్యాసవిగ్రహము చూచి ఎవరీ లంబోదరుడు, చక్రాకారముగ పెద్ద గర్భము ధరించి యున్నాడని నిందించ వ్రెలితో పొట్టను పొడవగా అందుండి వ్యాసుడు ఉద్భవించి క్షేమకవి చేతిని గట్టిగా పట్టుకొని, చకార కుక్షి యని నన్ను నిందించి నాపొట్టలో ప్రేలు గుచ్చిన నీ గొప్పతనాన్ని పరీక్షించదలచినాను, నీ కవిత్వ పటిమతో అనుష్టప్ ఛందస్సులో 32 అక్షరములతో నేను చెప్పు కథను ఒక శ్లోకములో చెప్పమని కథను ఇట్లు చెప్పెను.

ఒకరాజుగారి మహలు జీర్ణించి దానిలో ఒక గోడ కూలినది. దాని క్రింద ఉన్న ఒక కుక్క చనిపోయి అదే సమయమున రాజుగారికి కొడుకు పుట్టినాడు. అతని పేరు కూష్మాండఖండము. దీనిని 32 అక్షరములతో "చ"కారము ఉపయోగించక శ్లోకము చెప్పినచో నీవు గొప్ప కవివని అంగీకరింతుననెను. దానికి క్షేమకవి నవ్వి

రాజద్వారీ గలద్వారీ పతద్భిత్తౌ మృతేసుని,
రాజపుత్రస్య పుత్రో ऽ భూ నామ్నా కూష్మాండ ఖండకః

యని చెప్పి మహాత్మా మీరు చెప్పిన దానికి ఒక క కారము ఎక్కువ కలిపి కూడా అనుష్టుప్ ఛందస్సుకు ఒక అక్షరము తక్కువగానే పూర్తిచేసితిననెను. అపుడు వ్యాసుడు పూర్వ స్మృతి గల్గి నిన్ను శివగణాధ్యక్షుడు నౌగమేయునిగా గుర్తించితిని, శివానుగ్రహమున గొప్ప కవివని అంగీకరించితిని, నేను కూడా గౌరీదేవి శాపమున బ్రాహ్మణ జన్మనెత్తిన విష్ణుమూర్తిని, నన్ను అవమానించుటతో నీ శాపము తీరినది, కాని శివాజ్ఞచే నేను ఈ మన్వంతరమంతయూ గడిచినంతవరకూ కాశీకావల యుండవలయును అని చెప్పి ఇద్దరును గౌరీ కుండ స్నానము, కేదారేశ్వర దర్శనమునకు బయలుదేరిరి.

ఆనాడు సోమవార యుక్త శ్రావణ పౌర్ణమి. ఇద్దరును ప్రాచీన మణికర్ణికలో స్నానమాడి కేదారేశ్వరుని పూజించి ప్రదోషకాల పూజవరకు ఏకాంతమనస్కులై ధ్యాననిమగ్నులైరి. పరమాత్మ ప్రసన్నుడై కోటి సూర్యకాంతి, కోటి చంద్రుల చల్లదనముతో నంది, భృంగి గణములతోడను, గణపతి, కుమారస్వాములు ఎలుక, నెమలి వాహనములపై ప్రక్కన నిలువగా వంగిమాగధుల విజయ ఘోషల మధ్య గౌరీసమేతుడై లింగమునుండి ఉద్భవించెను. అమృతమయ వాక్కులతో క్షేమకవి, వ్యాసమహర్షులను ప్రేమతో మీ ఈప్సితార్థములను కోరుడని ఆజ్ఞాపించెను. వారిద్దరునూ అశ్రువూరిత నయనములతో అవాక్కయి ఇట్టి మహాదర్శన భాగ్యమబ్బిన తర్వాత మాకింకేమి కావలయును, మమ్ములను ముక్తులను చేయుడనిరి. స్వామి కరుణించి క్షేమకవి మాత్రమే యిపుడు ముక్తుడగును కాని వ్యాసుడు ఈ మన్వంతరమంతయూ వేద, శాస్త్ర, పూరాణ, ఇతిహాసములు రచించి లోకోద్ధరణ తర్వాత ముక్తుడగునని చెప్పగా, వ్యాస మహర్షి స్వామీ క్షేమకవి వ్రాసిన బృహత్కథామంజరిలో క్రితం నూరు కల్పముల రహస్యములు మీచే అమ్మవారికి చెప్పబడిన కథలు విన్నవారు వెంటనే ముక్తులగుదురు, మిమ్ముచేరుదురు కనుక యిక నేను ఈ కల్పాంతము వరకు ఇక్కడనే ఉండి లోకోద్ధరణ కొఱకు వ్రాయవలసిన దేమున్నదని తెల్పగా పరమాత్మ ఆశ్చర్యముతో క్షేమకవి వ్రాసిన అట్టి ప్రశంశా పూర్వక గ్రంథమును వినగోరెను. వ్యాసులు, క్షేమకవి ద్వారానే వినుడని వేడగా స్వామి అతనినే వినిపింపమనెను. అపుడు దేనిని వినినంత మాత్రమున ముక్తులయ్యెదరో, ఏ రహస్యము లేశమాత్రము చెవిన పడిననూ శివధామము ప్రాప్తమగునో, సద్గురు మంత్రోపదేశము వలె ఏది పాశుపత జ్ఞానమొసగునో, వేదశాస్త్ర, పురాణ, ఇతిహాస, తంత్ర, స్మృతి, ధర్మశాస్త్ర, ఆయుర్వేద, జ్యోతిష, శబ్ద, తర్క, మీమాంస, యోగములను, నూరు కల్పముల దేవతీర్థ, క్షేత్ర, లింగ మహాత్మ్యముల సమ్మిళిత సర్వస్వమును లక్షశ్లోకములలో వినిపించెను.

సుకుమార పుష్ప వృష్ఠి వలె సాగిన కవితా మాధుర్యమును, తత్కాల మూక్తి ప్రద రహస్య సారమును ఆనందపూర్వకముగా విన్న శివుడు క్షేమకవికి, పుష్ప దంతుడు, పుష్వ జీహ్వుడు, పుష్పాశ్యుడు అను నామముల నొసగి, ఇంతటి మహత్వ పూర్ణ విషయములను ఇపుడు వినిపించుట అనుచితము, నాచే కల్పింపబడిన లోకవ్యవహారము భంగమగును, సృష్టి, స్థితి, లయములకు తావుండదు గనుక వెంటనే దీనిని నష్టపరుచుము అని చెప్పి, నీటిలో ఆ గ్రంథమును వేయింటి లయము చేసెను. నేటినుండి నీ నామము నౌగమేయుడు కాదు, పుష్పదంతునిగా శివగణ నాయకుడవు కమ్మని దీవెంచెను. వ్యాసునితో స్వామి, నీవు వ్రాయు పురాణములే వేదవాక్కులుగా శిరోధాల్యములగనును, ప్రమాణములగును గాన నీరచనలు సాగించమని చెప్పు సమయమున కైలాసము నుండి దివ్య విమానము వచ్చి వాలినది. నౌగమేయుడు మానవరూపము వదలి దివ్య దేహధారియై, వీభూది, రుద్రాక్షలతో, త్రిశూల, త్రినేత్ర ధారియై శివాంశను బొంది రుద్ర సారూప్యముక్తుడై శివపార్వతులను స్తుతించెను. ఆ స్తుతిని నిత్య పారాయణ చేయువారి యిష్ట కామ్యములు నెఱవేరి అంతమున శివపద ప్రాప్తి కల్గునట్లు శివుడు వరమొసగెను. వెంటనే ఆ విమానమెక్కి పుష్పదంతుడు కైలాసమేగెను. గౌరీ కేదారేశ్వరుడు ఎట్లు లింగమునుండి ఉద్భవించెనో అటులనే గణసహితముగ లింగమున అంతర్థానము చెందెను. గౌరీదేవి, నౌగమేయుల శివాపరాధమును నిర్మూలించిన గౌరీ కుండ మహాత్మ్యమును తెల్పు ఈ కథ విన్న వారు కాశీ క్షేత్రమును దర్శించిన ఫలము పొంది ముక్తులగుదురు.

No comments:

Post a Comment