Monday, December 8, 2008

చతుర్ధాధ్యాయము

అనవద్య నాథశర్మను ఈ విధంగా ప్రార్థించినది. స్వామీ మీరు సర్వజ్ఞులు. కాశీలోని గౌరీ కుండము, ప్రాచీన మణికర్ణికను గురించి తెల్పుచూ గౌరీదేవి చేసిన శివాపరాధమునకు ప్రాయశ్చిత్తముగా శివుడు కేదారేశ్వరును ఎదుట కుండమునేర్పరచి, అందు హరంపాప తీర్థమును నింపి, గౌరీదేవిని ఆ కుండమునకు ప్రదక్షిణచేసి స్నానము చేసి 12 సంవత్సరములు తపము చేయనియమించి నట్లు తెప్పిరి కదా? గౌరీదేవి చేసిన అంతటి అపరాధమేమి? యని తెలియగోరెను. అంత నాథశర్మ ఈవిధముగా చెప్ప దొడగెను.
ఈ ప్రశ్న మొదట వామదేవుడు సనత్కుమారునడుగగా శంకరునిచే తనకు చెప్పబడిన విధముగా సనత్కుమారులు వామదేవునికిట్లు విశదపరచిరి. ఒకపరి బ్రహ్మ, విష్ణు, రుద్రులు పరమేశ్వరునిచే తమకు నియమింప బడిన కార్యములను గురించి ముచ్చటించకొను సమయమున, బ్రహ్మ ఈ సృష్ఠి కార్యము ఎంతకాలమిట్లు చేయవలెను. క్షణకాలము కూడ విరామము లేని ఈ కార్యమెందుకు చేయవలెను. మహా కైలాసమునకు వెళ్ళి ఏకాంత మనస్కుడనయి శంకరుని గూర్చి తపమాచరించెదను. ఈ సృష్ఠిని శంకరుడు మరెవరినయిననూ నియమించునని తన మనోభావము వ్యక్తపరచగా అది వినిన విష్ణుమూరితి కూడ తనకునూ అట్లే తోచుచున్నదనియూ, అసంఖ్యాక కోట్లజీవరాసిని పరిపాలించుట తనకునూ కష్టతరముగాయున్నదనియు, ఎన్నిపర్యాయములు అసురులను దునుమాడిననూ శంకరుని వరముల వలన వారు బలవంతులై పుట్టుచున్నారు, నేను తప్ప వారినెవరు సంహరించగలరు? శంకరుడు నిశ్చింతగా కైలాసమందు ఉన్నారు. హే రుద్రా మీరునూ నాతో రండు, కైలాసములో మనము కూడా సుఖముగా ఉండెదమని విష్ణుమూర్తి పలుకకా రుద్రుడు నవ్వి మీరిద్దరునూ పరమేశ్వరుని మాయలో చిక్కినారు. నిర్భయముగా ఇట్లు మాట్లాడతగదు. తనతో కలిసి యున్నందుకు నేనుకూడా మీతో కైలాసము వచ్చి వేడుక చూడదలచినాను. మనభాగ్యము బాగున్న మరల శంకరుడు మనలను మన పలులలో నియమించెదరని పలుకగా, ముగ్గురును అలౌకిక జ్యోతిః పుంజ బ్రహ్మాండమగు, సచ్చిదానంద మయ అగోచరమహా కైలాము చేరిరి.
యోగులు తపస్సుచే పొందదగినది, సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య ముక్తులు చేరునదియగు మహాకైలాసము, మహామేరువు వలె, మణి ద్వీపమువలె 14 ఆవరణలతో, అనంత కోటి బ్రహ్మాండములకు ఆధారభూతమగు, ఆధార రహిత ద్వీపమువలె నుండును. అందు వెలుపరి వృత్తము మహోదకము. వరుసగా కేంద్ర బిందువు వరకు స్వర్ణభూమి, రజితశాల, ప్రవాళ శిఖరము, పద్మరాగ శిఖరము, వైఢూర్య శిఖరము, పుష్పరాగ శిఖరము, గోమేధక శిఖరము, ఇంద్రనీల శిఖరము, గరుత్మాన్ శిఖరము, మరకతమయ శిఖరము, ముక్తామయ శిఖరము, స్ఫటిక శిఖరము, కేంద్రమగు పరమేశ్వర స్థానము బంగారు శిఖరము. ఈ బంగారు శిఖరము లక్షయోజనముల విస్తీర్ణము గల్గినది. అందు లక్షయోజనముల ఎత్తుగల శిఖరమున శంకరులు ఆశీనులగుదురు. వేదపరిభాషలో దానిని మహాకైలాసమందురు. దానికి నాలుగు దిక్కులలో 50 వేల యోజనముల విస్తీర్ణముగల రజత శిఖరములు, అష్టకోణములందు మణిమయ మండపములు, తూర్పున గణపతి, ఆగ్నేయమున భృంగి రిటుడు, దక్షిణమున మహాకాళుడు, నైఋుతిన వీరభద్రుడు, పశ్చిమమున మహాశాస్త (హరిహర సుత అయ్యప్ప), వాయువ్యమున సంకటహర దుర్గాదేవి, ఉత్తరమున కుమారస్వామి, ఈశాన్య కోణఅధిపతి శైల గణనాయకుడు. వీరి ద్వారరక్షక కింకరులు లెక్కకు అందనంతమంది. వీని మధ్య 50 వేల యోజనముల నగరము 10 వేల కోట్ల యోజన శిఖరము ముత్యమయమయినది కలదు. వాని మధ్య 20 వేల కోట్ల యోజనముల ఎత్తు శృంగము, పద్మరాగ మణిమయము. దీనికి నాల్గు దిక్కులందు వైఢూర్యముల శృంగములు. వీనియందు తారతమ్య క్రమమున సాలోక్యాది ముక్తినందినవారు, శివగణములై వారికి కావలసిన గృహములు, చావడులు, భోగ్య పదార్ధములు, అప్సరసాది కన్యలు, కల్పవృక్షము, కామధేనువు,చింతామణి ఇత్యాది సర్వసౌకర్యములతో శివధర్మ పరాయణులు, శివభక్తులు, ఆరాధకులు వారి అర్హత క్రమమున సారూప్య, సామీప్యనుల నంది సాక్ష్య, సాయుజ్యములను పొందుదురు. తదుపరి వాని మధ్య నలభైవేల యోజనముల ఎత్తుగల పుష్పరాగ మణిమయ శిఖరములు పదికోట్లు గలవు. వానియందు గంధర్వ, యక్ష, కిన్నెర, గరుడ, నాగ గణములు శివభక్తులగువారు ఉందురు. నాని మధ్యన మరొక కోటిన్నొక్క గోమేధిక మణిమయ శిఖరములు. వానియందు పదవీచ్యుతులయిన ఇంద్రులు నివసింతురు. వాని తరువాత పదిలక్షల ఒక్క ఇంద్రనీలమణి శిఖరములు 70 వేల యోజనముల ఎత్తున గలవు. వానిపై చతుర్ముఖ బ్రహ్మలు శంకర ధ్యాన నిమగ్నులైయుందురు. వానిపై గరుత్మంతమణులతో మెఱయు నీల శిఖరములు ఒక లక్ష ఒకటి. వీనియందు తమ పదవీకాలము సమాప్తమయిన విష్ణువులు నిరంతర శివధ్యాన నిరతులై సాయుజ్య మపేక్షించి యుందురు. వీనిపై 10 వేల ఒక్క మౌక్తికమయ శిఖరములు 80వేల యోజనముల ఎత్తున గలవు. వానియందు రుద్రులు పాశుపతులై గురుసేవా పరాయణులై సారూప్య ముక్తులై లోకానుగ్రహకారులై యుందురు. వీరు దేదీప్య మాన తేజోమూర్తులై శివాజ్ఞలను నెరవేర్తురు. దీని మధ్య స్పటికాకృతితో వెలుగు వెయ్యున్నొక్క శిఖరములు 90 వేల యోజనముల ఎత్తున ప్రకాశించుచుండును. వానిపై నంది, భృంగి, మహాకాళ, వారభద్రాది శంకర అపర మూర్తులు సచ్చిదానందు సార్ష్య, సాయుజ్య ముక్తి ప్రాప్తులై శంకర ఆజ్ఞానుసారము లోకములకు కర్తుత్వ, అకర్తుత్వ, అన్యధా కర్తుత్వ శక్తిమంతులై మహాకైలాస రక్షకులై యుందురు. వాని మధ్య అత్యద్భుతమగు బంగారు మయమగు నూట ఒక్క శిఖరములు, నూట ఒక్క యోజనముల ఎత్తున ప్రకాశించుచుండును. ఇందు పార్వతీ పరమేశ్వరుల శక్తులు, కార్తికేయ వినాయకులు నిత్యము మహేశ్వర జగదంబలను సేవిస్తూ అంతఃపుర నివాసులై ఉందురు. వీని మధ్య 11 శిఖరముల జ్యోత్ర్మయ లక్షయోజనముల ఎత్తు గల ధామము నందు పరమాత్మ అనుగ్రహ పాత్రులు, మహిమాన్వితులు ప్రతిష్ఠితులై యుందురు. వారిమధ్యగల దివ్య సింహాసనమున పార్వతీ పరమేశ్వరులు ఆనందముగ నుందురు. వేదాంతులు, సంపూర్ణ బ్రహ్మజ్ఞాన నిరతులు, సృష్ఠి, స్థితి, సంహార, తిరోధానముల జరుపు బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వరుల కార్యములము ఎరుగుదురు.
మహాగైలాసమువలె భూకైలాసమునకు రుద్రుడు ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తి దాయకుడై పరిపాలించుచుండును. ప్రళయ కాలమున భూకైలాసము అలౌకిక మహాకైలాసమున అంతర్భూతమగుచుండును. జంబూద్వీప వాసులకు భూకైలాసముననే మహాకైలాసమునందువలె పరమేశ్వరుని నిగ్రహ, అనుగ్రహముల శాశ్వత స్థానము గలదు.
బ్రహ్మ, విష్ణు, రుద్రులు వారి ప్రభావముతో తమ విషయము విన్నవించుకొనుటకు మహా కైలాసము చేరిరి. శైలాది శివకింకరులు శంకరుని అనుజ్ఞ తీసుకొని వీరిని పరమాత్మవద్దకు చేర్చిరి. జ్యోతి ప్రకాశమానమగు సింహాసనమునుండి ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తుల కనుసన్నల ననుసరించి అనేక కోటి బ్రహ్మాండములను సృష్ఠి, స్థితి, లయములచే నడిపించు అనేక కోటి బ్రహ్మ, విష్ణు, రుద్రులను చూచి వీరు చకితులై, నిశ్చేష్టులైరి. నంది, కార్తికేయ, గణేశులకు తప్ప స్వామి సమ్ముఖమున మరొకరికి మౌఖిక సంభాషణ దొరుకదు. అనోక కోటి బ్రహ్మ, విష్ణు, రుద్రులకును శివగణముల కనుసైగల ఆజ్ఞలు మాత్రమే చూచిన ఈ ముగ్గురును ఆశ్చర్యముతో, మనకు ఎవ్వరు గతి? మన విన్నపమాలకించి వారెవరు? అని పదే పదే సాష్టాంగనమస్కారములు చేసి నిశ్చేష్టులై నిలిచిరి. మహాకైలాసము యొక్క అనుపమ వైభవమును విన్నవారు ముక్తులగుదురు. ధర్మార్థ కామ్యమోక్షములు వారికి కరతలామలకములగును.

No comments:

Post a Comment