మరల వామదేవుని కోరికపై సనత్కుమారులు చెప్పదొడంగిరి.
వారి ముగ్గురి తరఫున బ్రహ్మ దేవుడు మహాదేవుని ప్రార్థించి, స్వామీ మేము మాకార్యములు చేసి అలసిపోతిమి, ఇక మీ సన్నిధానములో ఇక్కడ ఉన్న బ్రహ్మలవలె మీ సేవచేసికొనెదమనగా, పరమాత్మ చిరునగవుతో రుద్రుని వంకచూచి వీరు మాయా మోహితులయిరి. నీవు వీరికి మంచి మార్గము తెలుపలేదా యని కనుసైగ చేసిరి. మహాకైలాసమున సంభాషణ అంతయు పశ్యంతి యనగా మనోభాషను కనుసైగలద్వారా వ్యక్త పరచుటే కాని వైఖరి యనగా శబ్దమూలమున జరుగదు.
అపుడు రుద్రుడు నవ్వుచూ, మహాత్మా మీరు సర్వజ్ఞులు. వీరికి తగిన చికిత్స చేయుడనగా పరమాత్మ బ్రహ్మతో ఇట్లనిరి. మీరు అతి కష్టతరమగు పనులు చేసి చాలా పుణ్యము సంపాదించితిరి. దుర్లభమగు బ్రహ్మ, విష్ణు పదములు సాధారణ పుణ్య కార్యములకు లభ్యము కావు. పృధ్విలోని సామాన్యులకిట్టిది దుర్లభము. మీర మరల మీలోకములకు వెళ్లి పూర్వము వలె సృష్ఠి, స్థితి కార్యములు నిర్వర్తించుచు నాపై భక్తి గల్గి నన్ను సేవించిన యడల అంతమున నా లోకము జేరగలరు. పరిపక్వము గాని ఫలము క్రింద పడదు. మధ్యకాలములో నాసన్నిధానము దుర్లభము. మీరు భక్తితో నన్ను సేవించని యడల మరల భూలోకమున నరజన్మపొందుదురు.
మీరు మొదటి జన్మలో భూలోకమున బ్రాహ్మణ, క్షత్రియులు. వేద, పురాణ, ఆగమములలో శివజ్ఞాన రహస్యము నెఱిగిన నా భక్తుజు శివవిజ్ఞుడు అనువాడు హిమాలయములలోని కేదార పర్వతమందు తపశ్చర్యలో నిమగ్నుడై యుండెను. నరనారాయణుల పేరుగల పర్వత రాజు, జ్ఞన సిద్ధి యను మంత్రి, నా భక్తుడు శివవిజ్ఞానుని చాలా కాలము సేవింపగా అతడు ప్రసన్నుడై వారిని అనుగ్రహించెను. తపమాచరించు శివవిజ్ఞానుడు పరమేశ్వరునకు నమస్కరించి హేప్రభూ మీ వృషభమూపుర రూప దర్శనము మాత్రమే చేయుచుంటిని, నాపై కరుణించి మీ లింగరూప దర్శన మిప్పింపుడని వేడగా పరమాత్మ ఆకాశవాణి రూపమున భక్తా మానవ శరీరులకు ఇక్కడ లింగరూప దర్శనము దుర్లభము. గాన నీవు కాశీ క్షేత్రమునకు వెళ్లి కాశీలో నేను పంచదశ కళలతో శోభిల్లు కేదారలింగ సాన్నిధ్యమున నీరూపముగా యున్న రేతోదక, హరంపాప, గౌరీకుండములలో ప్రదక్షిణ పూర్వక స్నానమాచరించి వచ్చిన యడల నీకిక్కడ లింగరూప దర్శనము లభ్యమగునని తెల్పెను. అది వినివ నరనారాయణ, జ్ఞానసిద్ధులిద్దరునూ సంతసించి మనముకూడా శివవిజ్ఞానుని నిత్యమూ సేవించు కొనుచు కాశీ దర్శించెదమని తలంచి త్రోవలో గురు శుశ్రూషలో వారు కుశలు, సమిధలు, ఫల పుష్పాదులు సేకరించుచు, గురుపాద సేవనము చేయుచు వారి వాహనములు, చతురంగబలమును వదలి గురు ఆజ్ఞపై పాదచరులై మార్గమధ్యమున ఒక అరణ్యమును చేరిరి. అందు ఒక తటాకము ఒడ్డున ఒక పెద్ద వటవృక్షము చూచి శివవిజ్ఞానునితో సహా ఆ వటవృక్షము నీడన విశ్రమించిరి. ఆవృక్షముపై శివనిందాపరాధమున బ్రహ్మరాక్షస రూపమున ఒకడు నివశించుచుండెను. అర్ధరాత్రి సమయమున రాక్షసుడు వట వృక్షమునుండి క్రిందకు దిగి వటవృక్షము క్రింద నిద్రించు శివయోగిని భక్షింపబోగా, వటవృక్షము చుట్టును శివయోగికి రక్షణగా కావలి యున్న రాజు, మంత్రులు ఆ రాక్షసుని గమనించి నిలువరించి కాటుక కొండవలె ఉన్నవానిని ప్రశ్నించిరి. అతడిట్లు చెప్పదొడంగెను. నేను బ్రహ్మరాక్షసుడను. ఈ వటవృక్షమునాశ్రయించి రాత్రి నిద్రించువారిని భక్షించుచుంటిని. అదృష్టము వలన నేడు యితడు నాకు ఆహారమయినాడు.మీరు వృక్షఛాయకు దూరముగా యున్నందున మిమ్ము వదలివేయుదును. మీరు నన్ను అడ్డగించినచో మీరు, మీసేనతో సహా నాకు ఆహారమగుదురు. నా ప్రళయ భయంకర రూపము చూడుడని అతడు అగ్ని పర్వతమువలె మహాకాయుడై వికటాట్టహాసము చేయగా రాజు,మంత్రి భయభ్రాంతులై, మనమూ మనసైన్యమూ వీనినేమియూ చేయలేమని తలంచి ఉపాయముగా వానితో, శివయోగి బ్రాహ్మణోత్తముడు, నీవునూ బ్రాహ్మణుడవు గనుక దయతలచి శివయోగిని విడిచి పెట్టమని బ్రతిమాలిరి.
బ్రహ్మరాక్షసుడు తనకు అట్టి పాపభీతి లేదని, శివయోగిని వదల వలసిన మీరిద్దరునూ నాకు ఆహారము కావలయునని తెలుపగా, రాజు,మంత్రి ఆోలోచించుకొని బ్రాహ్మణుడు, సర్వవిద్యాపారంగతుడు అగు గురువును బ్రతికించుకొనుటకు క్షణభంగురమగు తమ తనువులు త్యాగము చేయతలచిరి. వారు రాక్షసునితో తమను ఆహారముగా తీసుకొని శివయోగిని వదిలి పెట్టమనియు, రాక్షసుని మాటలు ఎట్లు విశ్వసించ గలమనియు తెల్పిరి. దానికి రాక్షసుడు వారిద్దరినీ చెట్టునీడకు రమ్మనియు, వారిని తన నోటియందు పెట్టుకొని మింగుటకు ముందుగా శివయోగిని లేపి చెట్టు నీడనుండి వెలుపలకు వెళ్ళమనియు, చెట్టునీడలో నున్నవారిని మాత్రమే తాను భక్షించుట తన నియమమనియు తెల్పెను. వారు సమ్మతించి చెట్టు క్రిందకు రాగా, రాక్షసుడు అతని నోటిని కొండ గుహయంతచేసి వారిని తన నోటిలో పెట్టుకొనగనే రాజు, మంత్రి బిగ్గరగా కేకలు వేసి శివయోగిని నిద్రనుండి లేపిరి. అతడు కలత నిద్రలో లేచి, రాక్షసుని నోటిలో వారిని చూచి వారిద్వారా విషయమంతయు విని, ఏకాగ్రచిత్తుడై పరమాత్మను ధ్యానము చేసి, రాఙసుని గట్టిగా గదమాయించగా, రాక్షసుని శరీరమంతయూ అగ్నిలో నున్నట్లు బాధింపగా రాక్షసుడు రాజును, మంత్రిని నోటినుండి క్రిందకు ఉమిసి తనను కాపాడవలసినదిగా శివయోగిని ప్రార్థించెను.
Good work,
ReplyDeleteKeep posting....