నాథశర్మ భార్య అనవద్యకు కాశీ రహస్యమును, కేదార వైభవము, సోమనాథ, వైద్యనాథ, తారకేశ, హటకేశ, మహాకాళ, త్రిభువననాథ, త్ర్యంబకేశ, శ్రీశైల, విరూపాక్ష, గోకర్ణేశ్వర, శ్రీకాళహస్తీస్వర, శోణాచల, ఏకామ్రనాథ, వృద్ధాచల, సిభానాయక, జంబునాథ, మాతృభూతేశ్వర, వాతపురీశ, హాలాశ్వేశ, బృహివతీశ, పాపనాశ, మహేశ, రామేశ్వర, విద్యారణ్యేశ్వర, వాల్మీకినాథ, మృతఘణేశ, ఛాయాననేశ, శ్వేతారణ్యేశ, వైద్యనాథ, బ్రహ్మేశ్వర, మయూరనాథ, శ్రీవాంఛేశ్వర, అర్జుననాథ, కుంభేశ్వర, పంచనదేశ్వరాది లింగముల మహాత్మ్యమును, వింధ్యపర్వత, అమరకంటక, మేరు, హిమాచలాది పర్వతములపైగల శివలింగములు, వన, పర్వత, నదీతట, సముద్రగర్భములందలి లింగముల విశేషములు వినిపించిన తర్వాత గంగ, నౌగమేయ, శివగణ, ధర్మజ్ఞుడు, మహాత్ముడు దివోదాసు, వాల్కలుడు మొదలగువారి శివనిందపాపమెట్లు నివారణ అయినది, సనత్కుమార, వామదేవ, హిమవంతులు కాశీ వెళ్ళి ఏమి చేసిరి అను వృత్తాంతముల నిట్లు చెప్ప దొడంగెను.
వారు మువ్వురునూ కాశీకి చేరి పంచక్రోశాత్మక దివ్యలింగ దర్శనము చేసికొని వినయముగా వంగి వంగి నమస్కరించి, హే ప్రభో మీ లింగ భూమిపై కాలుమోపుటెట్లు? క్షమింపుడని వేడుకొని, మణికర్ణికలో స్నానము విధి విధానముగా, సంకల్పపూర్వకముగ జేసి, విశ్వేశ్వర దర్శన పూజనలు, ఢుంఢిరాజ, వేణీ మాధవ, దండపాణి, కాలభైరవ, ఓంకారాది 42 ముక్తి లింగములను, ద్వాదశాదిత్య, ఛప్పన్న (56) వినాయకులను, 64 యోగినీ దేవతలను, మహావిష్ణు, జ్ఞానవాపి, దుర్గాదేవి, పంచక్రోశ మందలి సర్వదేవతలు, తీర్థములు, వాని పాలకులు (పంచక్రోశము వెలుపలి ఒక యోజన పర్యంత భూమిని స్వర్గభూని యని స్కందపురాణ వచనము) అందరకు నమస్కరించి ప్రాచీన మణికర్ణికలో విధి విధానముగా స్నానమాడి కాశీ కేదారేశుని దర్శించి పూజించి, వీరందరి మహిమలను సనత్కుమారుని వలన విన్న రాజర్షి హిమవంతుడు బ్రాహ్మణులకు యధావిధి దక్షిణల నొసంగి కేదారేశ్వరునికి నమస్కరించు సమయమున హిమవంతుని శరీరము నుండి ఒక కౄర భయానక రూపము వెలుపలకు వచ్చినది. దుఃఖించుచున్న ఆరూపమును చూచి సనత్కుమారులు ఆశ్చర్య చకితులై వానిని ప్రశ్నింపగా అతడు, నేను పాప పురుషుడను, కాలభైరవుని కేవకుడను. నాకు కోట్లకొలది సేవకులు గలరు. కాశీలోగాని, కాశీ వెలుపలగాని, కాశీక్షేత్రమందలి తీర్థములను, లింగములను నిందించవారు నాకు భోక్తలు. వారి నావహించి కష్టములు కల్గింతును. శంకరుని ఆజ్ఞ వలన ఉద్భవించిన ప్రాచీన మణికర్ణిక గుప్తముగా యుండెడిది. విష్ణుమూర్తిచే నిర్మింపబడిన నవీన మణికర్ణికకునూ శంకరులు పాపహర ప్రభావము ప్రసాదించిన తరువాత మాకు జీవనము దుర్భరమై పాపుల సంఖ్య తగ్గుచున్నది. ఈ రాజు చేసిన కాశీ క్షేత్రనింద, తీర్థస్నాన, దేవ దర్శనములతో పరిహారమయిన కారణమున ఇతనిని వదలి వెలువడితినని ఆఘోర రూప మహాకాయ పాపపురుషుడు సనత్కుమారునకు తెల్పెను.
మానవులపై శంకరునికి గల అపార దయ వలన ప్రధమమున ప్రాచీన మణికర్ణిక, తదుపరి నవీన మణికర్ణికకు తోడు అసి, వరుణ, సరస్వతి, యమున, గంగ, ధూతపాప, కిరణ లు కార్తీక మాసమున అతి ప్రాముఖ్యముగాను, జ్యేష్ఠ శుద్ధ ప్రతిపత్తు మొదలు దశమి వరకు దశాశ్వమేథ ఘట్టమున దశపాప హరముగను, మాఘమాసమున శూలటంకేశ్వరుని ఎదుట గల ప్రయాగ స్నానములను పాపహరముగా జేసెను. విశ్వేశ్వర, కేదార అంతర్గృహములందు జేసిన పాపములు పై వానివలన నష్టము కావు. పంచక్రోశ ప్రదక్షిణము వలన సర్వపాప హరమగును.
పాపపురుషుడు అదృశ్యుడైన తర్వాత సనత్కుమారుడు కేదార, విశ్వనాథ రూప శంకరుని పరిపరి విధముల స్తుతించగా పరమాత్మ ప్రసన్నుడై మరల ఆకాశవాణి రూపమున మునులారా హిమవంతుని ఒక్క నిమిషము కనులు మూసుకొని నన్ను ప్రార్థింపమనుడు అతనికి నాదర్శనమిత్తుననెను. వెంటనే రాజు కనులు మూసుకొనగా కేదార పర్వతమందలి హరంపాప తీర్థము కేదారలింగ దర్శనములైనవి, వీనిని జ్ఞానదృష్ఠితో చూచిన మునులు శంకరుని స్తుతించి నమస్కరించిరి. ఈరహస్య కేదార మహాత్మ్యము తెలిసినవారు శంకరుని వలన కూడా నివృత్తి జేయలేని ఘోరపాపముల నుండి కూడ నివృత్తులై కాశీవాసఫలమంది బ్రహ్మనిష్ఠులతో ప్రశంశింపబడుచు శివధామ ప్రాప్తి నొందుదురు.
No comments:
Post a Comment