బ్రహ్మ, విష్ణు, రుద్రులు వారు నియోగింపబడిన కార్య నిర్వహణకు వెళ్లిన తరువాతి పార్వతి, లక్ష్మి, సరస్వతులు వినోదముగా విహరించుటకు మంధర పర్వతమున కేగిరి. వారు ఆనందముగా విహరించుచు సంభాషించుకొను సమయమున లక్ష్మీదేవి పార్వతిని వేళాకోళముచేయుచు, తాను తన భర్త సర్వజ్ఞులమనయూ కనుకనే విష్ణువుకు పాలనా బాధ్యత నొసంగబడినదనియూ, మహా కైలాసమందు విష్ణుమూర్తికి సాదర సత్కారములు లభించిన వనియును, విష్ణుమూర్తియే బ్రహ్మ, రుద్రులకు కూడ అట్టి సత్కారములు లభింపజేసి నారనియూ, కనుక తాను, విష్ణుమూర్తి గొప్ప వారమని డాంబికముగా పల్కుగా, గౌరీదైవి కినుక వహించి, మన భర్తలు రాగోనే వారికీ విషయము తెల్పి వారి చేతనే ఎపరు గొప్పవారో చెప్పించెదనని, సర స్వతి సాక్షిగా యిది వారి పంతమనియూ పల్కి వారి పురములకు చేరిరి. లక్ష్మీదేవి విష్ణుమూర్తికీ విషయము తెల్పిన వెంటనే ఆయన కోపించి, రుద్రుడే సర్వజ్ఞుడనియూ లక్ష్మీదేవి పార్వతిని అవమానించుట తప్పిదమనియూ తెల్పి, తన భార్య పంతము నెగ్గుటకొక ఉపాయము తెల్పుదునని లక్ష్మితో ఇట్లు తెల్పెను. శివగణములలో శ్రేష్టుడగు నౌగమేయుడు శివునకు అంతరంగ భక్తుడు. శివ పార్వతుల ఏకాంతములో ఏమి సంభాషణ జరుగునో అతి అంతయూ నీకు చెప్పమని నౌగమేయుని ప్రార్థించి అతనిని ఒప్పించి, అట్లు విషయములను తెలిసి కొన్న నీవు పార్వతి ఏవిషయము చెప్పిననూ అది నీకు ముందగనే తెలిసినట్లు చెప్పుచూ కొంతకాలము నీమాట నెగ్గించు కొనవచ్చును. పార్వతి కోపించి ఏమి చేయునో, తదువరి ఏమగునో వేచి చూడమని లక్ష్మితో విష్ణుమూర్తి తెల్పెను.
రుద్రుడు పార్వతితో మహాకైలాసముందు జరిగిన వృత్తాంతమంతయూ తెల్పుచూ మాయా మోహితులయిన బ్రహ్మ, విష్ణువులు తన మాట లెక్కచేయక మహా కైలాసమేగి శంకరుని వద్ద భంగపడిన విషయము చెప్పి, నా మాటను ఎవరూనూ ఉల్లంఘింపరాదు. నావలననే వారిద్దరికినీ మరల పదవులు దొరికినవని విన్న పార్వతీదేవి నవ్వుచూ తనకు లక్ష్మికి జరిగిన సంభాషణ, వారి పంతములు రుద్రునకు తెల్పి, మరెవ్వరికినీ తెలియని
అత్యంత గుప్త మగు కథలు తనకు వినిపింపమని భర్తను కోరెను. శివుడు పూర్వ కల్పమందలి ఒక కథను మరేదేవతకును తెలియని దానిని పార్వతికి వినిపించెను. లక్ష్మి, పార్వతులు మరల విహారమునకు వారి చెలికత్తెలతో మేరు పర్వతమునకు వెళ్లినపుడు పార్వతి లక్ష్మి తో తమ పంతములను జ్ఞాపకము చేసి, మధ్యవర్తి సరస్వతిలేని కారణమున తమ చెలికత్తెలను పంపి సరస్వతిని రప్పించిరి. అపుడు పార్వతి, లక్ష్మితో శివుని మించిన పరమార్థమువేరు లేదనియు, బ్రహ్మ, విష్ణువు మొదలగు దేవతలు శివుని ద్వారానే ఉత్పన్నమయిరనియూ కనుక లౌకిక రీతిగా మనము బంధువులమనియు, సరస్వతి నాకు వదినగారు, నీకు అత్తగారి వరసలనియు (రుద్రయామళము ననుసరించి సరస్వతినుండి విష్ణువు, పార్వతులు ఉద్భవించిరి. విష్ణు నీభి కమలమునుండి బ్రహ్మ ఉద్భవించుటచే పార్వతికి అన్నగారి భార్య సరస్వతి. విష్ణు కుమారుని భార్య యగుటచే సరస్వతి లక్ష్మికి అత్తగారు.) కనుక సరస్వతి మన ఇద్దరికిని న్యాయముగా మంచి చెప్పునని వినిన లక్ష్మి వెంటనే అంగీకరించి పార్వతి చెప్పిన రహస్య కథను నౌగమేయుని ద్వారా విని యున్నందున, పార్వతి ఆరంభించిన వెంటనే మిగిలిన వృత్తాంతమంతయు లక్ష్మి చెప్పసాగెను. ఉమ ఆశ్చర్యముతో లక్ష్మికి ఈ కథ ఎట్లు తెలిసియుండును. సరే ఈనాటికి వదలివేసి రేపు మరొక విశేష కథను వినిపించెదనని నిశ్చయించి ఇండ్లకు చేరిరి.
మరుదినము పార్వతి శివుని వద్దనుండి చాల కల్పములవెనుక జరిగినది, మరెవ్వరికినీ తెలియని రహస్యకథను విని, దానిని లక్ష్మికి వినిపింపగా ఆకథయూ గౌరి కన్న ముందుగనే లక్ష్మి పూర్తిచేసినది. ఇట్లు వంద కథలు చెప్పిననూ గౌరీదైవి గెలువలేక పోయినది.
ఇక చేయునది లేక పార్వతి తన ఓటమినంగీకరించి ఖిన్నురాలై ఇంటికి చేరుసరికి, రుద్రుడు పార్వతి ముఖము చిన్నబోవుట గమనించి ప్రియా నీకు గల్గిన కష్టమేమి? నీమాట నెగ్గనట్లు నీకోరిక తీరనట్లు చింతా క్రాంతురాలవుగ కన్పట్టుచున్నావు. విషయము తెల్పినచో నేను నీమాట నెగ్గించెదనని తెల్పగా, పార్వతి శివుని శంకించి, మీరే సర్వజ్ఞులని భ్రమ పడినాను. కాని విష్ణువే సర్వజ్ఞుడు. లక్ష్మియే సర్వజ్ఞురాలు. కానిచో మీరు ఏకాంతములో నాకు చెప్పిన నూరు రహస్యమగు కథలు లక్ష్మికెట్లు తెలియును. మీమనసులో నున్నవి గ్రహించు నంతటి శక్తిమంతులు వారే. కనుక మీరు నన్నెట్లు నెగ్గింపజేతురని పరుషముగ మాట్లాడెను.
శివుడు అమ్మవారు సహజ స్త్రీ బుద్ధి ప్రకటించుచున్నదని గ్రహించి ఆమెకెట్లు అవమానము జరిగియుండునని దివ్యదృష్టితో దర్శించి, నౌగమేయుని దుశ్చర్య గ్రహించి, ఆనాటి రాత్రి నౌగమేయుని వేరు పనిపై దూరముగా పంపించి, గౌరిని శాంతపరచి రేపు నీజయము నిశ్చయమని నచ్చచెప్పి, ఊరడించి, ఒక రహస్య కథను వినిపించి మరురోజు లక్ష్మి, సరస్వతులతో మేరు పర్వతమునకు పంపెను. ఆ దినము పార్వతి ఆరంభించిన కథ లక్ష్మికి తెలియక పోగా రేపు చెప్పెదనని బింకములు పలికెను. ఇదే విధముగా నౌగమేయుని దూరముగా పంపి ఆ మరుదినము శివుడు పార్వతికి 108 కథలు చెప్పి పంపెను. గౌరీదేవి సరస్వతిని సాక్షిగా పెట్టుకొని చెప్పిన ఆ 108 కథలలో ఒక్కటియూ లక్ష్మికి తెలియనందున, లక్ష్మి తన తప్పును ఒప్పుకొని, శివుడే సర్వజ్ఞుడనియు, విధాత బ్రహ్మ, విష్ణువుల కన్న అధికుడనియూ తాను ఓడి, పార్వతి గెల్పు ఖాయమనియు తానే ఒప్పుకొనెను.
అపుడు పార్వతి చింతించి, వేదనిరూపణముగ ఉపనిషత్తులచే కొనియాడ బడిన పరమాత్మ, ఆది మధ్యాంత రహితుడు, సర్వం సహాద్రష్ట తన పతియేనని గ్రహించి, లక్ష్మితో మొదటి నూరు కథలు నీవెట్లు చెప్ప గల్గితివి, తరువాత ఎట్లు చెప్పలేకపోతివనియు, నిజము చెప్పనిచో తన పరాశక్తి అంశతో శిక్షింతుననియు, దీని వలన మన ముగ్గురితో భేద భావము పొడసూపుట తప్పదనియు పల్కెను. లక్ష్మి భయముచే తాని నిజము చెప్పలేననియూ, తనను శిక్షించి మనలోని సామరస్యమును త్రుంచవద్దనియు వేడుకొనెను. అపుడు గౌరి శాంతించి తన భర్త ద్వారానే విషయము తెలిసికొన నిశ్చయించి వారు వారి పురములకు చేరిరి. ఈ పుణ్య కథను తెలిసి కొనిన వారు భక్తిపూర్వకముగ శివ పార్వతులను సేవించి ముక్తులగుదురు.
sir in few systems the letters are not coming properly.can you please take care of that.this is grand daughter of APPESWARA SASTRY GARU
ReplyDeleteఇది యూనీకోడ్ లో టైపుచెయ్యబడినది. యూనీకోడ్ వాడే అన్ని కంప్యూటర్లలోను సరిగా వస్తుంది (రావాలి). నేను విండోస్ విస్టా లో గౌతమి ఫాంటు వాడుతున్నాను.
ReplyDelete