శౌనకాదులు సూత మహర్షిని, వ్యాస శిష్యుడవగు తత్వజ్ఞాన నిధివగు మహాత్మా పరమేశ్వరుడు సంతసించి వరములొసగిన అట్టి పుష్పదంత స్తుతిని వినిపింపుడనిరి. సూతుడు ఆ స్తుతి సారమిట్లు చెప్పదొడగెను.
హే పరమేశ్వరా! అనంతమగు నీ మహిమను తెలియనివారు చేయు నీస్తుతి అయోగ్యమయినచో బ్రహ్మాదులు చేయు స్తుతియు అనర్హమే యగును. ఎందుకనగా నీ మహిమ అగమ్యము. నీ స్తుతి ఎవరు చేసిననూ వారి బుద్ధి కందినంత మాత్రమే చేయగలరు. నేనును అట్టి వాడనే కదా! శబ్ద వేగమనోవేగములకందని గుహ్యంతమము నీ మహిమ. వేదములే నేతి, నేతి యని గర్హించి నిశ్చయించలేకపోయినవి. అట్టి నీ స్తుతిని నాకు తెలిసనంతలో చేసినాగాత్రము శుద్ధి పరచుకొనుచుంటిని.
సత్వరజస్తమో గుణములకు సృష్టి, స్థితి, లయములకు నియమింపబడిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులచే స్తుతింపబడిన నీ ఐశ్వర్యము వేదప్రతిపాదితము. వేదత్రయమార్గము, కాపిల మార్గము, వాశిష్ఠాది యోగ శాస్త్రమార్గము, పాంచరాత్రాది వైష్ణవ సిద్ధాంతమార్గములని భిన్న మార్గములన్నియూ నదీ జలములకు సముద్రము గమ్యమైనట్లు నిన్ను బొందునవే యగును. అగ్ని స్ంభము వంటి నీ తేజో రూపమయిన మహిమను ఆద్యంతమును తెలిసి కొనుటకు బ్రహ్మ ఊర్ధ్వముగను, విష్ణువు అధో ముఖముగను వెళ్లి సాధ్య పడక తిరిగి వచ్చి నిన్ను ప్రార్ధించి తెలిసిగొనగల్గిరి. బాణాసురుడు నీయనుగ్రహమువలన ముల్లోకములను ఆక్రమించి ఇంద్రుని జయించెను, కాని రావణాసురుడు నీసేవచే భుజబలమును సంపాదించియు నీ నివాసమైన కైలాసమును పెకలింపబూని పరాభవింపబడి పాతాళమునకు చేరెను గాన నీసేవయందు వినమ్రుడైనవాడు సర్వోన్నతిని బొందును. క్షీరసాగరమధనమున హాలాహలముద్భవింపగా ఆర్తజనరక్షణకు నీవు దానిని గ్రహింప, నీ కంఠము నీలమయిననూ అదియూ శోభాయమానమయినది. తిరుగులేని మన్మధబాణములు నిన్ను సోకి, అతని ఆహుతికి కారణమయినవి. నీ మహిమను ఏదియూ తిరస్కరింపజాలదు. సంధ్యాసమయమున లోకములను బాధింప బూనిన రాక్షస సంహారమునకై నీవు నాట్యము చేయు సమయమున, పాదతాడమనుచే భూమియు, బాహు సంచాలనమున ఆకాశము, జడల తాకిడికి స్వర్గమును కంపించుచున్నవి. తృణ సమానమగు త్రిపురములను దహింపగోరిన నీకు భూమి రథముగాను, బ్రహ్మ సారధిగాను, మేరువు ధనుస్సుగాను, సూర్య చంద్రులు రథ చక్రములుగాను, విష్ణువు బాణముగాను నేర్పడిరి. ఇవి నీ కవసరము లేకున్ననూ వారి సేవనీకు తోడ్పడినది. విష్ణుమూర్తి నీ పాదపూజకు సహస్రకమలములు తేగా వాని భక్తి పరీక్షింపగోరి నీవు ఒక పద్మమును తిరోహితము జేయ విష్ణువు తన నేత్రమునే పద్మముగ సమర్పింప నీవు అతని భక్తికి మెచ్చి సుదర్శన చక్రము నొసగితివి. యాగ క్రియ యందు ఆహుతులు భస్మమయినను దీక్షితులు నానిని నీకు సమర్పించిన కారణమున ఫలమును బొందుచున్నారు. కాని దక్ష ప్రజాపతి తన యాగమునకు నిన్ను ఆహ్వానిచని కారణమున శిరమును గోల్పోయెను.
బ్రాహ్మ తాను సృజించిన సంధ్యయనెడి స్త్రీ సౌందర్యమును మోహించి వెంబడించగా, నామె సిగ్గుతో లేడి రూపము బొందెను. బ్రహ్మ మగలేడి రూపము దాల్చి వెంబడించగా నీవు కోపించి పినాకమున బాణము సంధించి విడువగా, బ్రహ్మ సిగ్గుపడి మృగశిరా నక్షత్రరూపము దాల్చెను. అంత నీ బాణము ఆర్ద్రా నక్షత్రముగా వెన్నంటియే యున్నది.
మదనాంతకా! నీవు శ్మశానవాసివయి పిశాచ సహచరముతో చితాభస్మము పూసుకొని కపాలమాల ధరించి, అమంగళ ద్రవ్యములతోనున్ననూ, భక్తులకు మంగళ ప్రదాతము. నిన్ను సూర్య చంద్రులుగను, పంచ భూతములుగను, అ కార ఉ కార మ కారములుగను, వేద త్రయముగను, అవస్థా త్రయముగను, త్రిలోకములు, త్రిమూర్తులుగను భావించుచున్నారు. ఈ స్తవరాజ పఠన శ్రవణములు సర్వ కామ్యార్ధ ఫలదాయకములు.
No comments:
Post a Comment