Saturday, December 13, 2008

షష్టమాధ్యాయము

నీవెవడవు? ఎందులకు నీకీ దుర్గతి సంభవించినదని శివయోగి ప్రశ్నించగా బ్రహ్మరాక్షసుడు ఇట్లు తన కథను తెల్పెను. నేను పూర్వ జన్మలో బ్రాహ్మణుడను. శివభక్తుడను. కాని మ్లేచ్ఛపాషండ సాంప్రదాయులు నన్ను ప్రలోభపెట్టి భ్రష్టుడను చేసినారు. వారి మతానుసారముగ నన్ను ముద్రాంకితుని జేసి, వారి ప్రాంతమునకు నన్ను రాజును చేసి, అధికారము, ధనము, పరస్త్రీ లోలత్వము, మత్తు పానీయములతో నన్ను వశపరచుకొని శివదూషణ, శివారాధకుల వధ, వేదనింద, సర్వదేవతా నిందలు నాచే చేయించిరి. వారి మతానుసారము గురు తల్ప గమనము అనింద్యమని, సుకర్మయని బోధించి నన్ను వశపరచుకొనుటచేత, అత్యాచారములు, ధనమదముచే చెప్పనలవికాని దుష్కర్మలు చేసి, వేలకొలది శివాలయములు ధ్వంసముచేసి, శివలింగములను పెకలించి, కాశీనగరమందలి అన్ని ఆలయములను కూల్చి, ఎదిరించిన వారిని చంపివేసితిని. నన్ను వశపరచుకొన్న ఒక రాజుకు మత్తుమందులో విషము పెట్టించి చంపి, వారి రాణులము వశపరచుకొంటిని. సాధు కజ్జనులు భయకంపితులై రాజ్యము విడచి పరదేశములకు పోయిరి.

నా కర్మ పరిపక్వమయినందున, ఒకరోజు నేను వేటకు వెళ్ళి కారడవిలో చిక్కుకొని ఒక మదగజముచే చంపబడితిని, యమ భటులు నన్ను కౄరముగా బాధించుచు యముని వద్దకు తీసికొని వెళ్ళగా చిత్రగుప్తుడు నా దుశ్చర్యలు వర్ణించుటకు సిగ్గుపడెను. యముని ఆజ్ఞమేరకు ప్రత్యేక నరకములలో 10 కోట్ల కల్పములు శిక్షించిరి. తదుపరి 45 కోట్ల సంవత్కరములు వివిధ నరకముల తరువాత స్వేదజ, అండజ, కుక్క, నక్క, పంది జన్మలనెత్తి వంద, వంద జన్మల ననుభవించి ఇప్పుడు బ్రహ్మరాక్షసుడనైతిని. పదివేల సంవత్సరములనుండి అన్న పానీయములు లేక క్షోభించితిని. ఒకరోజు నా అదృష్టవశాత్తు ఒక శివభక్తుడు నా కంటపడగా అతనిని భక్షింపబోతిని. అతడు నాకు నీతులు బోధించి నన్ను భక్షించినందున నీ ఆకలి తీరదు. నన్ను వదిలిపెట్టినచో నీకు తరుణోపాయముపదేశించెదనని చెప్పి, నన్ను ఈ చెట్టు పై మాత్రమే నివశించి, దీనినీడన విశ్రమించిన వారిని మాత్రమే భక్షించి క్షుదార్తి తీర్చుకొనుచుండిన యడల కొద్దికాలమునకే నీకు విముక్తి కల్గునని తెల్పిన అతని సంభాషణతో ఆనాడు నాకు ఆకలి నశించినది. పూర్వజన్మలో రాత్రిసమయమున శివాలయముధ్వంస మొనర్చుటకు శివుని వద్ద దీపము వెలిగించిన పుణ్యమొక్కటి నీకు మంచి చేయగలదని తెల్పెను. ఆదినము అతనిని వదలి వందసంవత్సరములు ఆకలితో అలమటించుచుంటిని. ఈరోజు మిమ్ము చూడగనే భక్షింప ఆశించితిని గాని మీ తేజస్సు నన్ను నిలువరించినది. హేమహానుభావా! ఈరాజు, మంత్రులతో సహా నన్నుకూడ ఉద్ధరింప సమర్ధులు అని పదేపదే ప్రార్థించి నమస్కరించెను.

శివజ్ఞాని, ఆత్మజ్ఞానముతో గమనించి రాక్షసుని ఉద్ధరించు ఉపాయము కేవలము కాశీ కేదార హరంపాప తీర్థ స్నాన పానములు, కేదారేశ్వర దర్శనము మాత్రమే నని నిశ్చయించి వెనువెంటనే రాజు, మంత్రి, వారి బలగము, బ్రహ్మరాక్షసునితో సహా కాశీ క్షేత్రము చేరెను. త్రోవలో రాక్షసునితో శివజ్ఞాని ఇట్లు చెప్పదొడంగెను.

ఎంతటి శివాపరాధివయినను ఒక్క రాత్రి శివుని వద్ద దీపము వెలిగించిన పుణ్యమున నన్ను చూడగనే నీ పూర్వజన్మల స్ఫురణ గల్గినది. తనను దూషించిన వారిని, తనకు అపకారము చేసిన వారిని కూడా శంకరుడు, క్షమించి ముక్తులను చేయును. రావణాసురుడు, దక్షుడు మొదలగు ఎందరనో తరింపజేసిన స్వామి నిన్నుకూడ కరుణించునట్లు చెసెదనని తెల్పుచు, కాశీ క్షేత్ర పంచక్రోశము వెలుపలి దేవభూమిని ప్రవేశింపగనే శివగణములు బ్రహ్మరాక్షసుని అడ్డగించి కాశీక్షేత్రమున ప్రవేశింప అనుమతింపకుండిరి. శివజ్ఞాని తాను మరల వచ్చువరకు రాక్షసుని అక్కడనే వేచి యుండమని చెప్పి తాను రాజు, మంత్రి, సేనతో సహా పంచక్రోశమునందు అడుగిడి దేహలీవినాయకునికి నమస్కరించి జ్యోతిర్లింగాత్మక క్షేత్రమున అడుగిడుచున్నందుకు మన్నింపవేడి వూజాదికములు సల్పి ముందుగా మణికర్ణికా స్నానము, విశ్వేశ్వర దర్శనము, తరువాత కేదారేశ్వర దర్శన పూజలు, పరం పాప తీర్థ స్నానము చేసి, రాజు, మంత్రి అక్కడి బ్రాహ్మణ సమూహమునకు భూరి దక్షిణలిచ్చిన తరువాతి, శివయోగి హరంపాప తీర్థము/ రేతోదక తీర్థము/ గౌరీకుండ తీర్థమును కొంత తీసికొని వెళ్ళి పంచ క్రోశమునకు వెలుపల వేచియున్న రాక్షసునిపై చిలుకరింపగా అతని శరీరమునుండి నల్లని దట్టమైన ధూళి వెలువడి నలుదిశల ఆకాశము వరకు ఆక్రమించెను. అది చూచి క్షేత్రపాలకుడు కాలభైరవుడు, శివగణములు ఆశ్చర్యపడి ఈ ధూళి ఏమని శివయోగి నడుగగా, జన్మ జన్మాంతరములలో ఆ రాక్షసుడు చేసిన పాపము లన్నియూ వారికి చెప్పి, హరం పాప తీర్థము చల్లిన కారణముగా ఆ పాపములన్నియు ఈ రూపమున బయటపడినట్లు చెప్పిరి. కొంతసేపటికి ఆ ధూమము అదృశ్యమవగానే రాక్షసరూపము నుండి సుందరాకారుడుగా మారి శివయోగికి నమస్కరించి కృతజ్ఞతలు తెలుపగా మరల శివయోగి వానిని తీసికొని క్షేత్రములోనికి వెళ్లి విధి విధానముగా తీర్థ స్నానములు, లింగ దర్శనములు, కేదార, హరం పాప దర్శనపూజలు చేయించినతోడనే శివ గణములతో కైలాసమునుండి విమానము దిగి వానిని కైలాసమునకు సంతోషముగా తీసికొని వెళ్ళిరి. అతడో వాల్కలుడు అని శివయోగి తెల్పగా అందరునూ ఆనందవరవశులైరి.

ఇక శివజ్ఞానుని పరగతి వినుడని వామదేవునికి సనత్కుమారులిట్లు తెల్పదొడంగిరి. నర నారాయణులను రాజు, బ్రాహ్మణ మంత్రులను శిష్యులుగా స్వీకరించి, వారికి మంత్రోపదేశము చేసి, వారి గురు సేవకు మెచ్చి తనకొరకు రాక్షసునకు ఆహారముగా వాని నోటిలోనికి వెళ్ళి త్యాగము చేసిన వారికి సద్గతి కల్పింపనెంచి, ఏకాగ్ర మనసుతో శంకరుని ప్రాంర్థించి, దివ్యదృష్టితో రాజు, మంత్రుల భవిష్యత్తు చూచి సంతోషించి మీరు మరు జన్మలో విష్ణువు, బ్రహ్మలు అగుదురనియూ, అంతదనుక వెళ్లి రాజ్య భారము వహించి ప్రజారంజకముగా రాజ్యము చేయుడని ఆశీర్వదించి, వారితో కాశీ కేదారేశ్వరుని దర్శించి శివయోగి శ్రావణ పౌర్ణమి సోమవారం కలిసి వచ్చిన పుణ్యదినమున గౌరీ తీర్థములో స్నానము చేసి, కేదారేశ్వరుని ధ్యానములో ఒక్క క్షణమాత్రము సమాధి నిష్ఠ పొంది బ్రహ్మ రంధ్రము ద్వారా ప్రాణము శివైక్యముజేసి, జన్మరాహిత్య కైవల్యము బొందిరి. ఇక రాజు, మంత్రి గురుధ్యానముతో వారి పార్ధివ శరీరమును గంగలో నిమజ్జనము చేసిరి.

గురు వాజ్ఞ ధిక్కరించ కూడదను సదాచారముతో వారి కాశీక్షేత్ర, తీర్థ, లింగముల నన్నిటిని దర్శించి, పూజించి వారి రాజ్యము చేరి, సదా గురు స్తుతి చేయుచూ కాశీ కేదార మహాత్మ్యమును రాజ్యమున వాడ వాడల ప్రచారము చేయుచు జనరంజకముగా పాలన చేసి దేహాంతమున మరు జన్మగా, వారే ఈ కథారంభమునగల బ్రహ్మ, విష్ణువులైరి. శంకరుని ద్వారా వారి పూర్వ జన్మ వృత్తాంతమంతయూ విన్న బ్రహ్మ విష్ణువులు శివాజ్ఞను నెరవేర్చుటకు మరల వెళ్ళి సృష్టి స్థితులు నిర్వర్తించ సందేహించి వారి కక్కడే స్థానము కల్పింపగోరిరి. శంకరుడు కోపించి గౌరీదేవితో వీరిద్దరికినీ తగు చికిత్సచేయమని తెల్పగా గౌరీదేవి ఒక పెట్టెను వారిముందుర ఉంచి దానిని తెరువమని వారిని ఆజ్ఞాపింపగా వారు దానిని తెరచి చూడగా దానియందు ఎందరో బ్రహ్మలు, విష్ణువులు కన్పించిరి. అమ్మవారు ఈ బ్రహ్మ, విష్ణువులను కూడా దానిలో బంధించి వేరొకరిని సృష్ఠి స్థితులకు నియమింతునని తెల్పగా, వారు భయభ్రాంతులై శంకరుని ఆజ్ఞను శిరసావహించి మరల వెళ్లి వారి పనులు చేసికొందుమనియూ, వారి అపరాధములు క్షమించి పదవికాలానంతరము కైలాస ప్రాప్తి కల్పింపమనియు వేడిరి. పరాశక్తి వెంటనే ఒక రుద్రుని సృష్టించి, కల్పారంభముజేసి వారినా కల్పమునకు సృష్టి, స్థితి, లయకారకులుగా వెళ్ళమని నియమించెను.


సనత్కుమారుడు వామదేవునకు వినిపించిన ఈ పురాణమును నాథశర్మ భార్య అనవద్యకు, వ్యాసమహర్షి సూత పౌరాణికునకు, సూతుడు శౌనకాదులకు తెల్పగా శౌనకాది మహామునులు సూతుని ప్రార్థించి, అంతటి పవిత్ర తీర్థమును గురించి చెప్పమని వేడుకొనిరి. సూతుడు ఈ విధముగా చెప్ప దొడంగెను.

శంకరుడు గౌరీదేవి పాపహరణము కొరకు కుండము సృష్టించినది శ్రావణ పౌర్ణిమ. 12 సంవత్సరముల తపము ముగించి ఆ కుండమందు గౌరీదేవి స్నానమాడినది శ్రావణ పౌర్ణిమ, సోమవారము. శిజ్ఞానయోగి అంతిమ కాలమున స్నానమాడినది శ్రావణ పౌర్ణమి సోమవారము. గౌరీదేవి తపము ముగించి శంకరుని ప్రార్ధించి తన పేర గౌరీకుండముగా వెలసిన హరంపాప తీర్థము, రేతోదక తీర్థమునకు సర్వపాప హమమహత్తును ప్రసాదించమని వేడగా, ప్రతి శ్రావణ పౌర్ణిమ ప్రత్యేకముగా సోమవారముకూడా కలిసిన యోగమందు గౌరీకుండ స్నానము జన్మ జన్మాంతరపాపహరమగునని వరము ప్రసాదించెను. కలుక వాల్కలుడు, గౌరి, గంగ, నౌగమేయుడు, శివవిజ్ఞానమయుడు అందరును శ్రావణపౌర్ణమి, సోమవారయుక్త యోగకారక దినమున గౌరీకుండ స్నానముచే సర్వపాపహరులయి ముక్తులయిరి. ఈ కథను శివభక్తిపూర్వకముగ వినినవారందరునూ నిస్సంకోచముగ ముక్తులగుదురు.

No comments:

Post a Comment